నీటిని చూస్తేనే తెలీని ఆనందం ప్రతీ అణువులోనూ ప్రసరిస్తుంది. మనిషికీ నీటికీ మధ్య ఉన్న కెమిస్ట్ర్రీ ఇది. అదే నీరు దివి నుంచి భువికి దిగివచ్చినట్లు మేఘాల మీదుగా జాలువారినట్లు... ఆకాశంలోంచి ఒక్క ఉదుటన ఉరకలు పెట్టినట్లు వయ్యారంగా నడిచొస్తే ఎలా ఉంటుంది. శరీరమంతా మధురానుభూతులు గిలిగింతలు పెట్టి కళ్లు వెయ్యి ఓల్టుల వెలుగులతో నిండిపోతాయి. కళ్లల్లోనే విద్యుద్దీపాలు మెరిసిపోతాయి. అలా వయ్యారాలు పోతూ ఉరికే నీటినే జలపాతాలు అంటారు. ప్రకృతి మనకందించిన అరుదైన అద్భుతాల్లో జలపాతాలు అత్యంత కీలకమైనవి. ఆ జలపాతాల సోయగాలను ఒక్క సారి వీక్షించి వస్తే జన్మ జన్మల అలసట కూడా మాయమైపోతుంది. మరి సిటీ లైఫ్ లో పడి నవ్వడం కూడా మర్చిపోయిన మనం ఒక్క సారి జలపాతాల్లోకి ఉరుకుదాం.పదండి...
.
ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అలా జలపాతాల దగ్గరకెళ్లి .. నీరు చేసే అద్భుతాన్ని చూస్తే...అదో రిలీఫ్. అలాంటిలాంటి రిలీఫ్ కాదు. జలపాతాలన్నీ ప్రకృతి సిద్ధమైనవే ... కాకపోతే ఒక్కో జలపాతానిదీ ఒక్కో ప్రత్యేకత. ఒక్కో జలపాతానిదీ ఒక్కో అందం. వాటిని చూసి తరించాలే కానీ మాటలతో వర్ణించడం కష్టం. మన దేశంలోనూ జలపాతాల సవ్వడి చేసే ప్రాంతాలకు లోటు లేదు. అవన్నీ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెంది జనాల మతులు పోగొడుతున్నాయి. ఇలాంటి జలపాతాలే మన రాష్ట్రంలో కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రసిద్ధి చెందివని ఉన్నాయి మరికొన్ని అంతగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండానూ ఉన్నాయి మరికొన్ని కేవలం ఆ చుట్టూ ప్రక్కల ప్రజలను మాత్రమే అలరిస్తున్నాయి. మరి మనం తెలుగు గడ్డ మీద పుట్టి , మన చుట్టూ ప్రక్కల ఉన్న జలపాతాల అందాలను తెలుసుకొనకపోతే ఈ జీవితం వృధా...!!
.
మనసు ప్రశాంతతను కోరుకున్నప్పుడు.. బాధపెట్టే సంఘటనలు ఎదురైనప్పుడు.. లైఫ్ రోటీన్‌గా అనిపించినప్పుడు.. ఏం చేయాలా అని చాలామంది మథనపడుతుంటారు. కొంతమందైతే, ఏ సినిమాకో లేదా విండో షాపింగ్‌కో వెళుతుంటారు. కానీ చాలామంది అందమైన ప్రకృతి ఒడిలో కొన్ని గంటలపాటు సేదతీరితే బాగుండు అనుకుంటారు. ఇలా వెళ్లడంలోని ఆనందం, ఆహ్లాదమే వేరు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పచ్చపచ్చని ప్రకృతిలో.. గలగల పారే సెలయేరును చూస్తే మనసు పులకరించిపోతుంది! దాంతో, తిరిగివచ్చిన తర్వాత ఎలాంటి ఒత్తిడి, బాధలు మనసును ఇబ్బంది పెట్టకపోగా.. ఎంతో హుషారుగా పనిలో నిమగమైపోతాం. అది సరేగాని ఇలాంటి రమణీయమైన అందాలు, జలపాతాలు ఎక్కడున్నాయా అని అనుకుంటున్నారా? అంతగా ఆలోచించకండి.. మన దగ్గర ప్రాంతంలోనే ఓసారి చూడండి. .
అందమైన జలపాతాలకు నెలవైన కడప జిల్లాలో ప్రకృతి అందాలకు కొదవే లేదు. ఎత్తైన కొండలు, లోతైన జలపాతాలు.. ఇక అడవుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కారణం, అడవుల జిల్లాగా పిలుచుకోవడమే దీనికి నిదర్శనం. వీటితో పాటు దర్శనీయ, రమణీయ స్థలాలు చాలా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగన్న దేవునికడప ఆలయం కొలువైంది కడపలోనే. అంతేకాదు, జిల్లాలోనే ఎత్తైన జలపాతం కూడా ఇక్కడే ఉంది. అదే పాలకొండ జలపాతం.(కడప పట్టణం పుట్లంపల్లె గ్రామం సమీపంలో గల పాలకొండల పర్వతశ్రేణి) అలాగే లంకమల జలపాతం (జి.వి. సత్రం నల్లమలలోని లంకమల్లేశ్వర స్వామి), తౌలాంతపూరం జలపాతం (చెన్నూర చెక్కర కర్మగారం దగ్గర), గుండాలకోన జలపాతం కూడా. కడప పర్యటనకు వెళ్లేవారు తప్పకుండా సందర్శించేవి ఇవే. వీటితో పాటు జిల్లాలో అడవుల మధ్య మరుగునపడున్న జలపాతాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి.
Enjoy!!
ReplyDelete