తిరుప్పావై – తిరువెంబావై. ~ దైవదర్శనం

తిరుప్పావై – తిరువెంబావై.

కాంబోడియాను సందర్శించినవారు ఇప్పటికి అక్కడ శిథిలమైన శివ, విష్ణు మరియు అంబిక దేవాలయాలను చూడవచ్చు. అక్కడి అడవులలో ఎక్కువగా శివాలయాలు ఉంటాయి. వీటి వల్ల మనకు తెలిసేదేమంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతి, నాగరికత ఆగ్నేయ ఆసియా వరకు వ్యాపించి ఉన్నది. ఇంకా అక్కడ ఉన్న 800లకు పైగా సంస్కృతంలో ఉన్న రాతి శాసనాలు దీన్ని దృఢపరుస్తున్నాయి. ఎంతో మంది ఫ్రెంచి శాస్త్రవేత్తలు ఆ దేవాలయాల గోడలపై దీన్ని కనుగొని ప్రపంచానికి అందించారు. వాటిని పరిశీలించిన తరువాత అవి అన్నీ భారతదేశంలో లభించిన శాసనలకంటే పురాతనమైనవి అని తెలిసింది. వాణిజ్యం వర్తకం కోసం మనదేశంనుండి స్వంత ఓడలలో ప్రయాణం చేసి ప్రపంచంలోని చాలా దేశాలలో వ్యాపారం చేసారు. అక్కడ మన సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించారు. సియామ్ (థాయిలాండ్)లో లభించిన ఒక శాసనం సారాంశం ఇదే.

పాశ్చాత్య శాస్త్రవేత్తలు వారి పరీశోధనలో భాగంగా అక్కడి ప్రజలు మూలాలు, ఆహారవ్యవహారాలు వారి సాంప్రదాయలను క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. అక్కడ ఏటా జరిగే ఒక ఉత్సవం గురించి ఒక పరిశోధకుడు ఇలా వ్రాసాడు. ఆ ఉత్సవంలో ధనవంతులు పేదవారు, రాజు సామాన్యుడు అనే తేడాలేకుండా పాల్గొంటారు. ఈ సంవత్సరోత్సవములో పెద్ద ఊయలనొకదానిని ఏర్పాటుచేస్తారు. మనదేవాలయాలలో ఉండే దక్షిణామూర్తి లాగా అలంకరించుకొని ఒక వ్యక్తి ఈశాన్యం వైపు నుండి వచ్చి ఆ ఊయలలో కూర్చుంటాడు. నేలకి కాళ్ళు తగిలించకుండా ముందుకు వెనక్కు ఊయల ఊగుతాడు. అప్పుడు కొంతమంది కొన్ని శ్లోకాలను చదువుతారు. ఇవి “త్రెంబావాయ్” అనే పదంతో ముగుస్తాయి. ఈ ఉత్సవం పది రోజులపాటు జరిగి పున్నమి నాడు ముగుస్తుంది. సియామ్ రాజు తన మందిమార్బలంతో తన సమస్త ఆయుధ సామాగ్రితో ఈ ఉత్సవానికి హాజరవుతాడు. ప్రస్తుతం యుద్ధవిమానాలు కూడా పాల్గొంటాయి.

ఈ సియామ్ ఉత్సవం మన దక్షిణ భారతంలో జరిగే ఊంజల్ సేవను పోలి ఉంటుంది. ఇది ఇరవై రోజులపాటు జరిగి మార్గళి (ధనుర్మాసం)లో తిరువత్తిరై (ఆరుద్ర దర్శనం)తో ముగుస్తుంది. ఈ ఉత్సవ సమయంలో శివుణ్ణి ఊయలలో పెట్టి దేవస్తాన ఒడువర్ తిరువెంబావై చదువుతారు. కావున సియామ్ లో జరిగే ఉత్సవం మన దక్షిణ దేశంనుండి ఖండాంతరాలు దాటి వెళ్ళింది అనునది స్పష్టం. వారు పఠించేది కూడా తిరువెంబావై అనునది నిజం. కావున పరిశోధకులను ఆ ఉత్సవానికి పంపి అది తిరువెంబావై అని నిర్ధారించుకుని వాళ్ళకు దాని అర్థం తెలిసో లేదో దాని గురించి ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవడం ఉత్తమం.

ఉత్తరాయణానికి ముందు వచ్చే మార్గళి మాసం(ధనుర్మాసం) దేవతలకు ఉషఃకాలం. ఎందుకంటే మానవ సంవత్సరం దేవతలకి ఒక్కరోజుతో సమానం. కాబట్టి ఈ నెలలో సూర్యోదయాత్పూర్వం దేవతలకు మానవులకు కూడా ఉషఃకాలం. అందుకే మనకు చాలా పవిత్రమైనది ఈ మాసం. ఈనాటికి మలబారు ప్రాంతంలో ఈ నెలరోజులూ ఆడపిల్లలు గుంపులుగా తెల్లవారుజామునే దగ్గరున్న నదికి లేదా చెరువుకి వెళ్ళి స్నానంచేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ పాటలు పాడుతారు. మాణిక్యవాచకర్ తిరువణ్ణామలైలో తిరువెంబావై పాడేటప్పుడు అక్కడి సరస్సులో ఆడపిల్లలు స్నానంచేసేవారని చెప్పుకున్నారు. సంగం కాలంనాటి సాహిత్యంలో కూడా తెల్లవారుజామున కన్నెపిల్లలు ఆడవారు స్నానం చెసి పాటలు పాడేవారని తెలుస్తుంది. భాగవతంలో కూడా ఈ మాసంలో గోపికలందరూ కలిసి యమునలో స్నానం చేసి శ్రీకృష్ణున్ని భర్తగా పొందాలని ఆదిపరాశక్తిని కాత్యాయిని రూపంలో కొలిచారు. కాబట్టి ఈ మాసంలో తెల్లవారిజామునే స్నానంచేసి భగవంతుణ్ణి కొలుస్తూ పాటలు పాడేవారని తెలుస్తుంది. అది తిరుప్పావై కావచ్చు తిరువెంబావై కావచ్చు వారి వారి ఆచారం అనుసారం పఠిస్తారు. మాణిక్యవాచకర్ ఆ దేవదేవుని మేల్కొల్పడానికి తిరుప్పళ్ళియళుచ్చి ఇచ్చారు. మార్గళి మాసంలో దేవాలయాలలో జరిగే పూజకు తిరుపక్షి అని పేరు. అది వాడుకలో తిరుప్పళ్ళియళుచ్చికి మారుపేరు.

కాబట్టి తెల్లవారుజామున స్నానం చేసి, పాటలు పాడుడం అనే ఈ పురాతన సంప్రదాయాన్ని మనం వదిలిపెట్టకూడదు. కాబట్టి ఒక ప్రదేశంలోని ఆడపిల్లలందరూ కలిసి, తిరుప్పావై కాని తిరువెంబావై కాని పాడుతూ రెండు మూడు వీధులైనా వెళ్ళిరావాలి. ఈ పద్దతి వల్ల మనలో ఉన్న దుర్గుణాలను వదిలివేసి, అందరిలోనూ భక్తి భావాలను పెంపొందించవచ్చు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List