వినాయకుడి గరిక కధ.. ~ దైవదర్శనం

వినాయకుడి గరిక కధ..

!గణపతికి గరిక పూజ చేయడం వలన  శని బాధలు తొలగును..!!

ణపతికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు.

శనిభగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి.

గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది.

దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి.

గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి.

గరికతో చేసిన అంజనాన్ని ప్రతిరోజూ ధరిస్తే అన్ని పనులు నెరవేరుతాయి. ఇంకా గరిక రసం తాగితే దేహంలోని సమస్త వ్యాధులు నయం అవుతాయి.

గరిక పూజ ప్రత్యేకత

వినాయకుడు మనకున్న దేవతలలో అయోనిజుడు. పార్వతి రూపు దిద్దిన పిండిబొమ్మ. ఆయన జన్మ సహజ ప్రక్రియలో జరగలేదు. ఆయన ఆవిర్భావం కోసం దేవతల అభ్యర్థనలే తప్ప యజ్ఞయాగాలు జరిగిన దాఖలాలులేవు. అందుకే పార్వతి చేతిలో ప్రాణ పోసుకున్న పిల్లవాడిని లోకం పార్వతీసుతుడు అని పిలిచింది.

శివుని చేతిలో మరణం పొంది తిరిగి ఏనుగుతలతో ప్రాణాలు తెచ్చుకున్నాక గజాననుడు అయ్యాడు. శివుడి కుమారుడు కుమారస్వామితో పోటీపడి గణాధిపత్యం దక్కించుకున్నాక గణనాథుడు, గణేశుడు, గణపతి అని పేరు తెచ్చుకున్నాడు.


పెద్ద పొట్ట ఉన్నందున లంబోదరుడని, విఘ్నాలకు అధిపతి అయినందున విఘ్ననాయకుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఈ పేరే వినాయకుడిగా మారింది.


ఈయనకు 21 రకాల పత్రులతో పూజ చేసినా.. వాటిలోకెల్లా అత్యవసరమైనది, అతిముఖ్యమైనది, వినాయకుడికి ఎంతగానో నచ్చినది దూర్వార పత్రం. దాన్నే తెలుగులో గరిక అంటారు.


ఏమిటి ఈ గరిక ప్రత్యేకత

పూర్వం సంయమిని పురంలో ఒక మహౌత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు మోహించిపోయాడు. అంతా చూస్తుండగా ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు.


అవమానంతో బైటికి వచ్చిన యముని రేతస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు పుడతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు హాహాకారాలు చేశాయి.

దేవతలంతా శ్రీమన్నారాయణుని వద్దకు పరుగుతీశారు. ఆయన వారినందరినీ తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడు


ఒకనాడు శివుడు హాలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హానీ జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు.


ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కాని ఉపశమనం పూర్తిస్థాయిలో కలుగలేదు.


బ్రహ్మ... సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహూకరించాడు. వారిని వాటేసుకుంటే శరీరతాపం తగ్గుతుందని భావించారు. కానీ ఫలితం పూర్తిస్థాయిలో సిద్ధించలేదు కాని ఆయన..

సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా,

బుద్ధితో కూడా బుద్ధి వినాయకుడిగా

పేరు తెచ్చుకున్నాడు.


విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తిస్థాయిలో రాలేదు.


కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికీ ఇదే చికిత్సగా పనికివస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుడిని ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాళబద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు.


ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80 వేల మంది ఋషులు అక్కడికి వచ్చారు. ఒకొక్కరు 21 గరిక పోచల చొప్పున 16 లక్షల 80 వేల గరికపోచలు అందజేశారు. వాటితో ఆయనకి తాపోపశమనం కలుగుతుంది.


ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించే వారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా గరికపోచలతో స్వామికి పూజ చేస్తున్నాం.


గడ్డిపోచే కదా అని తేలికగా తీసేయకండి...గణేశుని మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెబుతున్నారు.


గరిక వక్రతుండ మహాకాయుడిని ఎలా మెప్పించిందో చెప్పేందుకు ఉదంతం ఉంది.

అది శివపార్వతుల పెళ్ళి జరిగే రోజు. పెళ్ళికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తాడని భావించి హిమవంతుడు హడావుడి పడ్డాడు. జగం మెచ్చిన, జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మందీ మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు.


తీరా చూస్తే శివుడు గట్టిగా పదిమంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. పదిమంది ప్రమదులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుని చూసి హిమవంతుడు నీరసపడ్డాడు. ఇలాంటి వాడినా పర్వతరాజు కూతురు పార్వతి పెళ్ళి చేసుకుంటోంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడ్డాడు.

కడుపులో బాధ ఆపుకోలేక బైటికే అనేశాడు. పెళ్ళి కొడుకు హంగూ ఆర్భాటం ఇంతేనా ఎంత మంది వచ్చిపడతారో అని భూమ్యాకాశాలు బద్దలయ్యేలా ఏర్పాట్లు చేశాను అన్నాడు.

హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు మంది సంగతి ఏముందిలే కాని ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి..ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురావురంటున్నాడు అని వినాయకుడిని చూపించాడు.

ఈ పిచికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి కనక...ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్ళకు పురమాయించాడు. పెళ్ళి వారి కోసమని వండిన అన్న మంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు.


విస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, ఉప్పులు, పప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా పరచిన తాటాకులు, పందిరికి కట్టిన మామాడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతీదీ తినేశాడు. అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానాగోల చేశాడు.


దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబోయ్ ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు అప్పుడు శివుడు కలుగజేసుకుని ఇంత చిన్నపిల్లవాడికే అన్నం పెట్టలేకపోయావు..ఇంకో పదిమందిని తీసుకువస్తే ఏం చేసే వాడివి అని ప్రశ్నించాడు.


తన అహంకారానికి సిగ్గుపడి ముప్పుతప్పే మార్గం చూపమని వేడుకుంటాడు. ఆయనకు గరికపోచ పెట్టండి అంటాడు శివుడు. అన్ని తిన్నా ఆవురావురన్న వాడికి గడ్డిపోచ ఒక లెక్కా అని హిమవంతుడు అనుమానించాడు.

అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్టే చేశాడు. నిజంగానే వినాయకుడు ఠక్కున ఆకలి గోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ వినాయకుడికి ఒక్క గరికను కాని ఇరవై ఒక్క గడ్డిపోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు.

అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్టు గరికపోచకు ఎలా ఆగిపోయాడు వెనకటికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బారువుల కొద్దీ బంగారాన్ని, ధనాన్ని, ధనేతరాన్ని త్రాసులో వేసి విఫలమవుతే రుక్మిణి తులసి దళం ఒకటి వేసి తులతూచలేదా భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు.

తులసిదళానికి అంత అమోఘమైన శక్తి ఉందని తెలిసి కూడా హిమవంతుడు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అప్పటికి ఇంకా ఆ ఉదంతం జరిగి ఉండకపోవచ్చునని కొందరు ఠక్కున సమాధానం చెబుతారు. కానీ దీనికీ ఒక కారణం ఉంది.

వెనకటికి తులసీదేవి ఇంకా పెళ్ళి చేసుకోని రోజులలో వినాయకుడిని చూసి వెూహించి వివాహం చేసుకోమని కోరుతుంది. అప్పటికి ఇంకా వినాయకుడికి పెళ్ళిమీద గాలి మళ్ళలేదు. అదే చెప్పి ఆమె కోరికను కాదన్నాడు.

అందుకు అలిగిన తులసి నీకు మంచి ప్రవర్తన లేని అమ్మాయితో పెళ్ళవుగాక అని శపించింది. దీనికి ప్రతిగా రాక్షసుని పెళ్ళి చేసుకుని మొక్కగా పడిఉండమని శపించాడు. అది విని తులసి బోరున విలపించింది.

దానికి వినాయకుడు జాలిపడి విష్ణుమూర్తితో వివాహమవుతుందని, ఆయనకు అత్యంత ప్రీతి పాత్రురాలిగా ఉంటావని వరమిస్తాడు. తాను వివాహానికి అంగీకరించనందున తన పూజకు తులసి పనికిరాదని అంటాడు.

అయితే తులసి పట్ల చివరిలో ప్రసన్నుడైనందున ఒక్క వినాయకచవితి నాడు తన పూజలో వినియోగించ వచ్చునని వరమిస్తాడు. అందుకని తులసిని సాధారణ రోజులలో వినాయకపూజలో వినియోగించరు. ఒక్క వినాయకచవితినాడు మాత్రమే ఉపయోగిస్తారు.స్వస్తి..!!

లోకా సమస్తా సుఖినోభవంతు..!
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List