దేవాలయమున చేయకూడని 32 దోషములు. ~ దైవదర్శనం

దేవాలయమున చేయకూడని 32 దోషములు.

పూర్వము భగవద్రామానుజులు పరమపదించు సమయమున శిష్యులు దరి చేరి తాము సుకరముగా తరించు మార్గము సెలవివ్వమని వేడుకొనిరి.

అప్పుడు భగవద్రామానుజులు
శ్రీభాష్యము - భగవద్విషయాది గ్రంథ కాలక్షేపము చేయమని చెప్పి, ఒకవేళ చేయలేని పక్షమున అంతటి ఫలమును ఇచ్చునది అయినది

  "శ్రీశస్థలేష్వన్వహం కైంకర్యం " అనిరి.

అనగా అర్థం, పెరుమాళ్ళు వేంచేసి ఉన్న దివ్య క్షేత్రములలో శక్తి కొలది కైంకర్యము చేయుట అని.

ఆలయమున మన శక్తి కొలది చేయు కైంకర్యములు - ప్రదక్షిణలు చేయుట, ఆలయ ప్రాంగణము తుడుచుట, నీటితో కడిగి కళ్ళాపి చల్లి ముగ్గులు వేయుట, దీపారాధన చేయుట, పూమాలికలు అల్లి స్వామికి సమర్పించుట, ఉత్సవ సమయాలలో తోచిన సహాయము చేయుట ఇత్యాదివి.

ఆలయానికి వెళ్ళినపుడు కొన్ని అపచారములు జరగకుండా జాగ్రత్తపడాలి.

వరాహ పురాణములో ఆలయములో చేయకూడని ముప్పైరెండు కార్యములు తెలుపబడి ఉన్నవి :

1. యానైర్వా పాదుకైర్వాపి  గమనం భగవద్గృహం ।
    దేవోత్సవాత్ అసేవా చ  అప్రణామ స్తదగ్రతః ॥

2. ఏక హస్త ప్రణామశ్చ  పురస్స్వాత్మ ప్రదక్షిణమ్ ।
   ఉచ్ఛిష్టే  చైవ చాశౌచే   భగవద్ వన్దనాదికమ్  ॥

3. పాద ప్రసరణం చాగ్రే   తథా పర్యంక బన్ధనమ్ ।
   శయనమ్ భోజనం చైవ   మిథ్యో  భాషణ మేవచ ॥

4. ఉచ్ఛైర్ భాషా వృధా జల్పో  రోదనం చైవ విగ్రహః ।
   నిగ్రహానుగ్రహౌ చైవ  స్త్రీషు సాకూతభాషణమ్ ॥

5. అశ్లీల కథనమ్ చైవ అప్యథో వాయువిసర్జనమ్ ।
   కమ్బలావరణమ్ చైవ పరనిన్దా పరస్తుతి: ॥

6. శక్తౌ గౌణోపచారశ్చ అప్యనివేదిత భక్షణమ్ ।
   తత్తత్కాలోద్భవానామ్ చ  ఫలాదీనామ్ అనర్పణమ్ ॥

7. వినియుక్తావశిష్టస్య ప్రదానం వ్యంజనాదిషు ।
   పృష్టీకృత్యాసనం చైవ  పరేషామభివాదనమ్ ॥

8. గురౌ మౌనం నిజస్తొత్రమ్ దేవతా నిన్దనమ్ తథా ।
   అపచారాస్తథా విష్ణో: ద్వాత్రింశత్ త్పరికీర్తితాః ॥         

అనువాదము:

1. ఏదైనా వాహనమునెక్కి , పాదుకలను ధరించి ఆలయమునకు వెళ్ళుట .

2. ఉత్సవము జరుగుచున్నచో సేవించక తిరిగి వచ్చుట.

3. భగవంతునికి నమస్కరించకుండుట.

4. ఒక చేతితో నమస్కరించుట.

5. భగవంతుని ఎదుట ఆత్మ ప్రదక్షిణము చేయుట.

6. ఎంగిలి చేతితో ఆశౌచముతో నమస్కరించుట.

7. పెరుమాళ్ళకెదురుగా వీపుకు, మోకాళ్ళకు బట్ట చుట్టుకుని ఊగుచూ కూర్చుండుట.

8. ఆలయములో భగవంతుని ఎదురుగా పడుకొనుట.

9. భగవంతుని ఎదురు మండపములో విస్తరి పరుచుకుని భుజించుట.

10. ఆలయమున లౌకిక విషయముల గురించి ఒకరితోనొకరు మాట్లాడుకొనుట.

11. గట్టిగా అనవసర మాటలు మాట్లాడుట.

12. లౌకిక విషయములపై ప్రసంగములు చేయుట.

13. గట్టిగా ఏడ్చుట .

14. ఒకరితోనొకరు పోట్లాడుట.

15. నిగ్రహము కోల్పోయి పక్కవారిని బెదిరించటం వంటి దాష్టిక చేష్టలు చేయుట.

16. ఒకరికి "నీకు ఈ ఉపకారము చేస్తాను", అని ప్రతిజ్ఞ చేయుట.

17. స్త్రీలతో భావగర్భితముగా పరిహాసము ఆడుట.

18. ఆడరాని మాటలాడుట.

19. అపాన వాయువు విడుచుట. (ఆ అవసరము వస్తే ముందుగానే బయటికి వెళ్ళాలి.)

20. కంబళి - శాలువ మొదలగు వానితో శరీరమంతయు కప్పుకొనుట. చలి అధికముగా ఉన్నచో  పై వస్త్రమును యజ్ఞోపవీతము వలే కప్పుకుని కుడిచేయి బయటకు ఉంచవలెను.

21. సన్నిధిలో ఇతరులను నిందించుట.

22. ఇతరులను పొగుడుట.

23. శక్తి ఉన్నా భగవంతునికి అల్పముగా సమర్పించుట.

24. పెరుమాళ్ళకు ఆరగింపు కాని పదార్థములు సన్నిధిలో కుర్చుని భుజించుట.

25. ఆయా సమయాలలో తన ఇంటిలో గానీ తోటలో గానీ పండిన పండ్లను, కూరలను, పూచిన పూలను పెరుమాళ్ళకు సమర్పించకుండా తాను ఉపయోగించుకొనుట.

26. తాను ఉపయోగించగా మిగిలిన పుష్పాలను, ఫలాలను పెరుమాళ్ళకు వినియోగించుట.

27. పెరుమాళ్ళవైపు వీపు పెట్టి కూర్చొనుట.

28. సన్నిధిలో పెరుమాళ్ళ ఎదుట ఇతరులకు నమస్కరించుట.

29. తన ఆచార్యుల ప్రసంగము వచ్చినపుడు వారిని ప్రశంసిన్చకుండుట.   

30. ఎట్టి సందర్భములలో అయినను తనను తాను పొగడుకొనుట.

31. భగవంతుని నిందించుట.

32. కాళ్ళు చాపుకుని కూర్చొనుట.

ఈ తప్పులను దేవాలయములో చేసినచో సంపాదించుకున్నపుణ్యము హరించుకుపోతాయని వరాహ పురాణములో చెప్పబడియున్నది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List