వాతాపి గణపతి. ~ దైవదర్శనం

వాతాపి గణపతి.



 * వాతాపి గణపతి..


'వాతాపి గణపతిం భజేహం' అనేది వాతాపి ప్రస్తుతం బాదామ కర్ణాటక పట్టణంలోని వినాయక విగ్రహం మీద సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు గారు చేసిన కీర్తన. ' వాతాపిలోని గణపతిని ( విగ్రహాన్ని) అహం (నేను) భజే( భజిస్తున్నాను)' అని దీని అర్థం.  ఈ గణపతి విగ్రహం వయసు దాదాపు 1460 సంవత్సరాలు.


వాతాపి లేక బాదామి అనేది పశ్చిమ చాళుక్య రాజుల రాజధాని. ఈ గణపతి విగ్రహం బాదామీ గుహాలయాలలో కనిపిస్తుంది. ఇవి హిందూ, జైన, బౌద్ధులకు చెందిన గుహాలయాల సముదాయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలోని బాదామి ప్రాంతంలో ఉన్నాయి. ఈ గుహలు భారతీయ శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ గుహాలయాలు బాదామీ చాళుక్య నిర్మాణశైలిలో 6వ శతాబ్దం కాలంనాటివి.


కర్ణాటక సంగీతానికి జన్మస్థలం వాతాపే. అందుకే మొదటి కర్ణాటక సంగీత  విద్వాంసులు అక్కడి వినాయకుడి మీదనే ముందుగా కీర్తనలు కట్టారు. ఈ బాదామి పేరు మీదుగానే పశ్చిమ చాళుక్య రాజులను బాదామి చాళుక్యులు అంటారు.  ఇక్కడ వాతాపి అనే రాక్షసుడిని తిని జీర్ణం చేసుకున్న అగస్త్య మహర్షి విగ్రహం కూడా ఒకటి  ఉంది. రామాయణం లోనూ, విష్ణు పురాణం లోనూ, భాగవతంలోనూ ఈ వాతాపి, ఇల్వలుడు అనే రాక్షస సోదరుల గాథ ఉంది. ఆ కథాక్రమం ఇది.  


ప్రహ్లాదుని తమ్ముడైన హ్లాదుడు, దమని అనే రాక్షస దంపతులకు వాతాపి, ఇల్వలుడు అని ఇద్దరు కుమారులు. (వారు సింహిక, విప్రచిత్తి దంపతుల కుమారులనే కథనం కూడా ఉంది) వారికి  మృత సంజీవనీ విద్య తెలుసట. వాతాపి మేకగా మారితే ఇల్వలుడు దానిని చంపి అగస్త్య మహర్షి కి కూరగా వండి పెడతాడు. అగస్త్య మహర్షి ఆ మాంసం తిన్నాక ఇల్వలుడు మృత సంజీవనీ మంత్రం చదివితే  వాతాపి ఆ ఋషి కడుపు చించుకుని బయటకు వస్తే ఆ రాక్షసులు ఇరువురూ ఆ ఋషి మాంసం తినాలని వాళ్ళ పథకం. అయితే అది కనిపెట్టిన అగస్త్య మహర్షి ఇల్వలుడు వండిపెట్టిన మాంసాన్ని తినగానే పొట్ట సవరించుకుంటూ ' జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ' అంటాడు. దాంతో కడుపులోని వాతాపి కడుపులోనే జీర్ణం అయిపోతాడు. తరువాత అగస్త్యుడు ఇల్వలుడిని తన కంటి చిచ్చుతో భస్మం చేసి  చంపేస్తాడు. మంత్రశక్తులు ఉన్నందువలన అగస్త్యుడిని రాక్షసులు ఎదుటపడి జయించలేరు. అందుకే మోసంతో జయించాలని చూసి కూడా భంగపడ్డారు. చిన్న పిల్లలు  పాలు తాగాక వాళ్ళ పొట్ట మీద రుద్దుతూ ' జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం '  అని తల్లులు అంటారు. అంటే అగస్త్యుడి కడుపులోని వాతాపిలాగే మా అబ్బాయి కడుపులోని పాలు కూడా జీర్ణం కావాలని భావం. వాతాపి ( బాదామి) లో ఈ అగస్త్య మహర్షి విగ్రహం ఉన్నప్పటికీ ఈ గాథ జరిగింది తమిళనాడులోని కొన్నూర్ ( ప్రస్తుత చెన్నై లోని విల్లివాక్కమ్) అని చరిత్రకారులు తేల్చారు. ఇక్కడ అగస్త్య మహర్షి నిర్మించిన ఒక అతి ప్రాచీనమైన ఆలయం ఉంది. ఆత్మరక్షణ కోసమే అయినప్పటికీ ఈ రాక్షస సోదరులను చంపిన పాపం నుంచి విముక్తి పొందటం కోసం శివుడిని గురించి అగస్త్యుడు ఇక్కడ ఘోరతపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై అగస్త్యుడికి పాపవిముక్తి కలిగించాడట. ఇదీ దీని వెనుక గాథ.


ఓం గం గణపతయే నమః 🙏🙏

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List