~ దైవదర్శనం


 * శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం..


మన దేశంలో ఎన్నో మహిమలు గల ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని దేవాలయాలు అక్కడ ఎలా వెలిసాయనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలా ఎన్నో మహిమలు గల ఆలయాలలో ఈ మత్మ్యాద్రి- లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మత్మ్యాద్రి దేవాలయం ఉంది. మొదట్లో ఈ ఆలయాన్ని వేములకొండ గుట్టగా పిలిచేవారు. అయితే స్వామి వారు వెలిసిన గుట్ట చేప రూపంలో దర్శనం ఇవ్వడం, గుట్ట మీదకు వెళ్తుంటే సగ భాగం వద్ద శిలద్వారానికి చేప శిల్పం చెక్కి ఉండడంతో మత్స్యగిరిగుట్టకు ఆ పేరొచ్చింది.  కాగా నామాలగుండం, విష్ణుగుండం, మాలగుండం పేర్లు కలిగిన మూడు గుండాల కలయికతో కొలను ఏర్పడింది. కొలనులో నీరు ఏ కాలంలోనైనా అదే స్థాయిలో ఉండటం, కొలనులోని చేపలన్నీ ఒకే పరిమాణంలో ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. 


🔅 వైష్ణవ నామాల చేపలు..


ఈ పుష్కరిణిలో ఉండేవన్నీ ఒకే రకమైన చేపలు.ఒకే పరిమాణంలో చిన్న డాల్ఫిన్లలా కోనేరులో ఈదుతూ కనువిందుచేస్తాయి. వాటి తలలపై విష్ణునామాన్ని పోలిన మూడేసి మీసాల్లాంటివి ఉండడంతో వాటిని విష్ణునామాల చేపలు అంటారు స్థానికులు. నిటి గుండంలో ఉండే చేపల రకం పేరు మార్పుడుగాళ్ళు. వాటిని పట్టుకొని తినే ప్రయత్నం చేసేవాళ్ళంతా చచ్చిపోతారనే కథ ప్రచారంలో ఉంది. వేములకొండంటే వేయిమునుల కొండ అని అర్థం. ప్రస్తుతం అదే  వేములకొండ అని పేరు వచ్చింది..


శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి సన్నిధి నుంచి జలగా ప్రవహిస్తున్న నీటితో పుష్కరిణి గుండంగా ఏర్పడింది. 

అది మూడు భాగాలుగా ఏర్పడడంతో సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనీ, లక్ష్మి, పార్వతి, సరస్వతి అనీ, త్రినేత్రాలనీ... ఇలా రకరకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటుంటారు.ఇంకా స్వామివారు కూడా మత్స్య రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంగా ఖ్యాతికెక్కింది. స్వామి వారి ఆలయం ముందున్న కొలనులోని నీటిని పంట చేలలో చల్లుకుంటే పంటలను ఆశిస్తున్న చీడపీడలు దూరమై దిగుబడి పెరుగుతుందని నమ్మకం. వ్యాపార సంస్థలలో ఆ నీటిని చల్లితే వ్యాపారాలు అభివృద్ధిలో నడుస్తాయని ప్రతీతి. అందుకే భక్తులు కొలనులోని నీటిని తీసుకెళ్తారు. అనారోగ్యం పాలైన వారు స్వామివారి ఆలయ సన్నిధిలో నిద్ర చేస్తే స్వామివారు కలలోకి వచ్చి ఆయా రుగ్మతలను నయం చేస్తారని నమ్మకం. దీంతో భక్తులు గుట్టపై నిద్ర చేస్తారు. ఈ విగ్రహం ఒక సాలగ్రామం. తల నరసింహుడిగా, శరీరమంతా చేప రూపంలో ఉంటుంది. మనకు దర్శనంలో స్పష్టముగా అలాగే కనిపిస్తుంది. 


🔅 స్థల పురాణం..


విములు అనే ఋషులు తపస్సు చేసుకోడానికి ప్రశాంతమైన స్థలం కోసం వెతుకుతూ, ఈ కొండ మీదకు వచ్చారని, అక్కడి జలపాతాలు అవీ చూసి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారట. కొంత కాలానికి దుష్ట శక్తులేవో వచ్చి తపో భంగం చేసేవిట. ఋషులు విష్ణువును ప్రార్థిస్తే ఆయన మత్స్య నారసింహుడిగా వచ్చి ఆ దుష్ట శక్తులను సంహరించాడట. అప్పుడు ఋషులు  విష్ణుమూర్తిని ఇక్కడే ఉండమని ప్రార్థిస్తే అక్కడి కొలనులో సాలగ్రామ రూపంగా వెలిసాడని, ఇప్పటికీ ఋషులు సూక్ష్మ రూపంలో అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటారని కథనం. విములు అనే ఋషులు తపస్సు చేస్తుంటారు కనుక ఈ కొండకు వేములకొండ అనే పేరు ఉంది.


🔅 మరొక స్థల పురాణం..


వైకుంఠంలొ  శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో  పాల సముద్రంలో ఆదిశేషుడిపై శయనించే సమయంలో అక్కడికి విచ్చేసిన నారదుడు మహాలక్ష్మితో " అమ్మ ఎంత సంపాదన వున్నా భర్త పాదసేవే తప్పదు కదమ్మా ఇంతకి  శ్రీహరి నిద్రలో ఉన్నారా లేదా నటిస్తున్నాడ, నాకేందుకులే మళ్లీ వస్తా అని వెనుదిరిగాడు. మహాలక్ష్మి పాదములు కొంచెం గట్టిగా నొక్కడంతొ, ఆది గమనించిన మహావిష్ణువు నారాదుల వారు కలహాభొజనుడు కడుపు నింపుకోని వెళ్ళినటునాడని తనూ ఒక వైపు తిరిగి పడుకోవడంతొ తన చేతికున్న ఉంగరం సముద్రంలో పడుతూ వుంటే అక్కడే సంచరిస్తున్న చేప అంగుళీకంని మింగడం కోసం పైకి ఎగురువుతుంది. శ్రీహరి ఉంగరం జారీ పోతుందని తన వేళ్ళను ఆడిస్తువుంటే చేపకు తాకి  నుదుట ముాడు వేళ్ళు, మూడునామలుగా మారాయి అని ఒక కథనం.


ఇక్కడికి ఎక్కువగా భక్తులు భూత, ప్రేత భయాలున్నవారిని, మతి స్థిమితం లేనివారిని తీసుకు వచ్చి దర్శనం చేయిస్తే తగ్గుతాయని నమ్ముతారట. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి. కొండ ఎక్కేటప్పుడు 100 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది.


శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాల్లో, శని, ఆదివారాల్లో పంచమి, సప్తమి, దశమి తిథుల్లో కొండప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతుంది. ఏటా జ్యేష్ఠశుద్ధ త్రయోదశి నుంచి బహుళ విదియ వరకు అయిదు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ధనుర్మాసంలో తిరుప్పావై ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలూ జరుపుతారు.

 

హైదరాబాద్‌ నుంచి 85, భువనగిరి నుంచి 36, నల్గొండ నుంచి 55కి.మీ. 

















Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List