నేడు అన్నపూర్ణ దేవి జయంతి. ~ దైవదర్శనం

నేడు అన్నపూర్ణ దేవి జయంతి.


అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తులు చెప్పాయి. అంటే అన్నమే పరబ్రహ్మమని తెలుసుకోమని అర్థం. 

అన్నమే బ్రాహ్మీ స్వరూపాన్ని దాల్చినప్పుడు అన్నపూర్ణగా సాక్షాత్కరిస్తుంది. జగత్తు అంతటికీ అన్నమిచ్చి పోషించే తల్లి అన్నపూర్ణ , ఆమె కొలువైన యుగయుగాల క్షేత్రం వారణాశి. ఆ క్షేత్రంలో అన్నపూర్ణయే స్వయంగా జీవులందరికీ దివ్యాన్న పాయసాలు వండి వడ్డిస్తుందని కాశీఖండం వివరించింది. కాగా అన్నపూర్ణాదేవికి ఆవాసమైన మరో ముఖ్యక్షేత్రం కర్ణాటకలోని హోరనాడు, ఆ క్షేత్రదేవిని దర్శించినవారికి అన్నపానీయాలకు లోటుండదని ప్రసిద్ధి...


*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*

*యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః*


అన్నం నుంచే సకల జీవరాశులూ పుడుతున్నాయి, అటువంటి అన్నం వర్షం వల్ల పెరుగుతోంది , వర్షాలు యజ్ఞాల వల్ల కురుస్తాయి, యజ్ఞమంటే మానవుడు చేయవలసిన మంచికర్మలే అంటాడు గీతాచార్యుడు. అన్నం పట్ల నిరాదరణ పనికిరాదు, జీవునికి ప్రాణహేతువు, మృత్యుకారణం కూడా అన్నమే. అటువంటి అన్నాన్ని దైవస్వరూపంగా భావిస్తే అమృతం అవుతుంది, అన్నంలో అమృతరసం ఉంది, అన్నదానం కంటే గొప్పదానం లేదనీ శాస్త్రాలు చెపుతున్నాయి!.


తల్లి అన్నపూర్ణ పార్వతీ దేవి స్వరూపం, భూమిపై ఆహారం, నీటి కొరత ఏర్పడినప్పుడు పార్వతి దేవి అన్నపూర్ణా దేవి రూపంలో అవతరించి ప్రజలకు కష్టాలను తొలగించింది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతినీ జరుపుకుంటారు. ఒకొనొక సమయంలో భూమిపై ఆహార కొరత ఏర్పడిందని, అప్పుడు జీవులు ఆహారం కోసం అల్లల్లాడుతున్న సమయంలో పార్వతీమాత ప్రజల కష్టాలను తీర్చడానికి అన్నపూర్ణగా అవతరించిందనీ,  ఈ రోజున అన్నపూర్ణ తల్లిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల కుటుంబంలో ఎప్పుడూ ఆహారం, నీరు , డబ్బుకు లోటు ఉండదని నమ్మకం. అన్నపూర్ణ జయంతి జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం ఆహారం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే. మనం ఆహారం నుండి జీవితాన్ని పొందుతాము, కనుక మనం ఎప్పుడూ ఆహారాన్ని అగౌరవపరచకూడదు లేదా వృధా చేయకూడదు.


అన్నపూర్ణ జయంతి రోజున వంటగదిని శుభ్రం చేసి అగ్నిని, ఆహారాన్ని పూజించాలి. దీనితో ఆకలి అన్నవారికి అన్నదానం చేయాలి, ఇలా చేస్తే అన్నపూర్ణ మాత చాలా సంతోషిస్తుందని.. తమపై అన్నపూర్ణ కరుణ చూపించి ప్రత్యేకంగా ఆశీర్వదిస్తుందని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణ జయంతిని జరుపుకోవడం వలన కుటుంబంలో సంతోషము ఉంటుంది, ఇల్లు సిరి సంపదతో నిండి ఉంటుందనీ పురాణ కథనం..


* పూజా విధానం:


అన్నపూర్ణ జయంతి రోజున పూజా స్థలాన్ని, వంటగదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం గంగాజలంతో శుద్ధిచేసుకోవాలి. వంట చేసుకొనే పొయ్యిని పసుపు, కుంకుమ, అక్షతం, పువ్వులు మొదలైన వాటితో పూజించాలి. 

ఒక నూలు దారం తీసుకుని దానికి 17 ముడులు వేయాలి, ఆ దారానికి చందనం, కుంకుమ పూసి, అన్నపూర్ణ తల్లి చిత్రపటం ముందు ఉంచి అక్షతలతో పూజ చేయాలి, అనంతరం అన్నపూర్ణాదేవి కథ చదువుకోవాలి. 

అనంతరం అమ్మని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ.. పూజ చేసే సమయంలో ఏమైనా తప్పులు దొర్లితే.. క్షమించమని అమ్మని కోరుతూ.. తమ కుటుంబంపై సదా తల్లి కరుణ చూపమని ప్రార్ధించాలి. అనంతరం స్త్రీ, పురుషులు తోరణం కట్టుకోవాలి, పూజ చేసిన తర్వాత పేదవారికీ అన్నదానం చేయాలి..


అన్నపూర్ణ దేవి కథ:


పురాణాల ప్రకారం!!...

ఒకప్పుడు భూమిపై ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించేవారు. తమను ఆదుకుని ఆకలి తీర్చమని ప్రజలు బ్రహ్మ, విష్ణువులను ప్రార్థించారు. దీంతో బ్రహ్మ , విష్ణువులు శివుడిని యోగ నిద్ర నుండి మేల్కొలిపి..  

మొత్తం సమస్య గురించి శివుడికి తెలియజేస్తారు, సమస్యను పరిష్కరించడానికి, శివుడు స్వయంగా భూమిని పరిశీలించాడు. అప్పుడు పార్వతీమాత అన్నపూర్ణ రూపాన్ని ధరించి భూమిపై దర్శనమిచ్చింది. ఆ తర్వాత శివుడు బిచ్చగాడి రూపంలో వచ్చి అన్నపూర్ణాదేవిని దగ్గర అన్నం తీసుకుని, ఆ అన్నాన్ని ఆకలితో ఉన్న ప్రజలకు పంచాడు. అనంతరం భూమిపై ఆహారం, నీటి సంక్షోభం ముగిసింది, మాత పార్వతి అన్నపూర్ణగా దర్శనమిచ్చిన రోజు.. మార్గశిర మాసం పౌర్ణమి. అప్పటి నుండి ఈ రోజును అన్నపూర్ణ మాత అవతారదినోత్సవంగా జరుపుకుంటారు.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List