కలియుగ సీత మన శారాదమ్మ. ~ దైవదర్శనం

కలియుగ సీత మన శారాదమ్మ.





* కలియుగ సీత మన శారాదమ్మ..

* డిసెంబర్ 22 గురువారం శ్రీ శారదా దేవి జయంతి..


మనం ఎలాంటి కష్టనష్టాలను అనుభవించకుండా, అపోహలు అపనిందలు భరించకుండా, నిరాశా నిస్పృహలు ఎదుర్కోకుండా జీవితం ప్రశాంతంగా సాగిపోవాలని ఆశిస్తాం. అలా ఆశించడం సహజమే కానీ అది సాధ్యమేనా అని ఒక్కసారి ఆలోచించాలి.


శిల్పి చేతిలో ఉలి దెబ్బలు తగలకుండా రాయి అందరితో ఆరాధింపబడే దేవుని ప్రతిమగా మలచబడడం సాధ్యం కాదనీ, కమ్మరి కొలిమిలో కరగకుండా బంగారం అందమైన హారంగా మారి దేవుని మెడలో స్థానం దక్కించుకోవడం అసాధ్యమనీ మనకు తెలుసు. కానీ మనం మాత్రం ఎలాంటి బాధలకూ, కష్టాలకూ గురికాకుండా ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఆశించడం ఎంతవరకు సమంజసం?


సమాజంలో ఎవరితోనూ మనఃస్పర్థలు లేకుండా సహజీవనం సాగించాలన్నా, ఉన్నత ఆశయాలు సాధించాలన్నా సహనం చాలా ముఖ్యం. సహనం యొక్క ప్రాధాన్యత గురించి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: 'జె సయె సే రయ్, జె నా సయె సే నాశ్ హయె - సహనం ఉన్నవారు మనుగడ సాగిస్తారు, లేనివారు నశిస్తారు'.


'సహనానికి మించిన సుగుణం లేదు' అని అంటారు. శ్రీ శారదాదేవి. అరుదైన ఈ సుగుణాన్ని అలవరచుకోవడం అంత సులభమైన పనికాదని యోగి వేమన నొక్కివక్కాణించారు:


బహుళకావ్యములను పరికింపగావచ్చు, బహుళశబ్దచయము బలుకవచ్చు.

సహన మొక్కటబ్బ చాల కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ


'చాలా కావ్యాలను చదువవచ్చు, అనేక మాటలు నేర్చుకోవచ్చు. కానీ సహనం అలవరచుకోవడం చాలా కష్టం.


అత్యంత కష్టతరమైన ఈ సహన గుణానికి ప్రతిరూపాలు సీతామాత, శారదామాత. పతితో సహజీవనమే పరమ ధర్మమని తలచి శ్రీరాముని వెంట పయనమైంది సీతామాత. పతిదేవుని సేవయే పరమ కర్తవ్యమని భావించి శ్రీరామకృష్ణుల సన్నిధికి చేరింది శారదామాత. వీరి జీవన ప్రయాణమంతా కష్టాల కడలిలోనే సాగింది. కష్టాలను ఎదుర్కోవడంలో అద్భుతమైన సహన శక్తిని ప్రదర్శించారు. అందువల్లనే వీరిద్దరూ ఆచంద్రార్కం మనకు ఆదర్శప్రాయులు, ఆరాధ్యనీయులు అయ్యారు.


శారదామాత శ్రీరామకృష్ణులకు సేవ చేయడం కోసం దక్షిణేశ్వరంలోని నహబత్ లో నివసించింది. సీతాదేవి అరణ్యంలో శ్రీరాముని సన్నిధిలో 13 ఏళ్ళు నివసిస్తే, శారదాదేవి నహబత్లో 13 ఏళ్ళు నివసించి పతి సేవలో తరించింది. శారదాదేవి నివసించిన నహబత్ కాళ్ళు పూర్తిగా చాచుకోవడానికి కూడా కష్టంగా ఉండేంత చిన్న గది. ఈ గదిలోనే శ్రీరామకృష్ణులకూ, వారి శిష్యులకూ, భక్తులకూ భోజనాది సదుపాయాలను సమకూర్చడం, అందులోనే నిద్రపోవడం. నహబత్లో శారదమ్మ అసౌకర్యాలన్నింటినీ ఓర్చుకొని ఎలా జీవనాన్ని కొనసాగించిందో మన ఊహకు అందని విషయం.


పర్ణశాలలో శ్రీరాముని సన్నిధిలో ఉండే భాగ్యానికి నోచుకుంది సీతమ్మ. కానీ శారదమ్మ నహబత్లో నివసిస్తు న్నప్పటికీ శ్రీరామకృష్ణుల దర్శన భాగ్యం అరుదుగా లభించేది. శ్రీరామకృష్ణులు నివసించే గది నహబత్కు 75 అడుగుల దూరంలోనే ఉండేది. కానీ శ్రీరామకృష్ణులు నిరంతరం భక్తుల సాంగత్యంలో భగవన్నామ సంకీర్తనాదులతో భావపరవశులై ఉండేవారు. శ్రీరామకృష్ణులను నహబత్ వసారా చుట్టూ కట్టిన వెదురు తడికల కన్నం నుండి దర్శించి ఆనందించేవారు శారదమ్మ. ఇన్ని కష్టాల్ని భరిస్తున్నప్పటికీ నహబత్లో గురుదేవుల సేవలో రోజులు గడుపుతున్నప్పుడు శారదమ్మ 'నా హృదయంలో ఆనంద కలశం ఉన్నట్లు అనుభూతి కలిగేది' అని అనేవారు. ఎనలేని కష్టాలను అనుభవిస్తూ కూడా ఆనందంగా జీవించారంటే అమ్మలోని సహనశక్తి ఎంత మహత్తరమైనదో వర్ణనాతీతం.


శారదమ్మ ఒకసారి కాలినడకన జయరాంబాటి నుండి గంగా స్నానానికై వెళుతున్న మిగిలిన గ్రామ స్త్రీలతో కలకత్తా బయలుదేరింది. మార్గమధ్యంలో బందిపోటు దొంగలకు నిలయమైన ఒక ప్రాంతం ఉంది. ఆ దొంగల బారి నుండి తప్పించుకోవాలంటే చీకటి పడే లోపే ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళాలి. శారదాదేవితో ఉన్న బృందమంతా వేగంగా నడుస్తూ ముందుకు వెళ్ళిపోయింది. శారదాదేవి మాత్రం వెనకబడి పోయింది. అంతలో చీకటి పడింది. ఒంటరిగా ఉన్న శారదా దేవిని ఒక బందిపోటు దొంగ సమీపించి 'ఎవరది? ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు' అంటూ గర్జించాడు. శారదాదేవి ఆ దొంగను ఉద్దేశించి 'తండ్రీ! నేను దక్షిణేశ్వరంలో ఉన్న మీ అల్లుణ్ణి చూడడానికి వెళుతున్నాను. నన్ను అక్కడికి చేరేలా చూడండి' అని మృదుమధుర శైలిలో చెప్పింది. శారదమ్మ సరళ స్వభావానికి కఠిన హృదయుడైన బందిపోటు దొంగ కరిగి పోయాడు. తన ఇంటికి తీసుకువెళ్ళి శారదమ్మను కన్న బిడ్డలా ఆదరించాడు.


మన జీవిత పరమార్థాన్ని సాధించేందుకు కొంతైనా సహనాన్ని ప్రసాదించమని అనంత సహన సంపదకు నిలయమైన శారదమ్మను మనసారా ప్రార్థిద్దాం.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List