మార్గశిర శుద్ధ పూర్ణిమ ~ దైవదర్శనం

మార్గశిర శుద్ధ పూర్ణిమ


 * నేడు మార్గశిర శుద్ధ పూర్ణిమ..

* ఈరోజు రొట్టెలు కొరికి కుక్కలకు వేయండి..


మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు చంద్రపూజ చేయాలని నీలమత పురాణం, చంద్ర వ్రతం చేయాలని హేమాద్రి పండితుడు చెబుతున్నారు. నాడు ఆగ్నేయ పురాణాన్ని దానం చేస్తే సర్వ క్రతు ఫలం కలుగుతుందని పురాణోక్తి. ఇటువంటి ప్రసిద్ధి గల ఈ మార్గశిర పూర్ణిమను తెలుగు దేశంలో కోరల పూర్ణిమ అంటారు. కోరల పున్నమి అంటే, కోరల అమ్మవారి పున్నమి. ఈ కోరల అమ్మవారు యముని వద్ద ప్రధాన లేఖకుడైన చిత్రగుప్తుని సోదరి. ఆమె కోటి పుర్రెల నోము పడుతుందట. కానీ, ఏటా ఒక పుర్రె లోటు వస్తుందట. అందుచేత మళ్లీ సంవత్సరం మళ్లీ ఆ నోము పడుతుందట. అప్పుడు ఇట్లాగే నోము అసంపూర్తి. ఏటేటా ఇదే వరస. ఇది పురాణ కథనం. కానీ, నిష్టతో 33 పున్నాల నోము పట్టే వారు కూడా ఈ పున్నమి నాడు ఏమీ చేయరు. అది ఒక కట్టుబాటు.  మహా మార్గశీర్ష అనే పేరు గల ఈ పున్నమి నాడు నరక పూర్ణిమ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. నరక అనే పదం యమ సంబంధమైనది.


వైద్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ మొదలు మార్గశిర పూర్ణిమ వరకు గల 30 దినాలను యమదంష్ట్రలు అంటారు. అంటే ఈ రోజులలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడని భావం. ఈ రోజులు చాలా అనారోగ్యకరాలైనవి. ఈ దినాలలో మరణిస్తే జాస్తీ. మార్గశిర పూర్ణిమతో యమదంష్ట్ర దినాలు తుదముట్టుతాయి.


మార్గశిర పూర్ణిమ రోజున ఆంధ్ర ప్రాంతాలలో అతి ప్రాచీన కాలం నుంచి 'రొట్టెలు కొరికి కుక్కలకు వేయుట' అనే ఆచారం ఒకటి పరంపరగా వస్తోంది. ఇలా రొట్టెలు కొరికి వేయడం ద్వారా యముని కోరల్లో ఉండే విషం పోతుందని విశ్వాసం.


మార్గశిర పూర్ణిమను వ్రత గ్రంథాలు నరకపూర్ణిమ అనీ, తెలుగు వారు కోరల పూర్ణిమ అని భీతి గొలిపే నామాలతో వ్యవహరిస్తుంటే, మహారాష్ట్రులు ఈనాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటున్నారు.


దత్తాత్రేయుల వారు మార్గశిర శుక్ల చతుర్దశి నాడు అవతరించినా, ఆయన జయంతిని మాత్రం మార్గశిర పూర్ణిమ నాడే జరుపుకోవడం విశేషం. దత్తాత్రేయుని కథ వినదగినది.


కలహ కారకుడైన నారద ముని తన భక్తి ప్రపత్తుల చేత విష్ణుమూర్తిని ప్రసన్నుడిని చేసుకున్నాడు. విష్ణువు ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. 'నీ సత్వ (నిజ) రూపం చూడాలని ఉంది' అని నారదుడు కోరాడు. అందుకు విష్ణువు- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకటిగా చేయగలిగితే నీవు కోరింది చూడగలుగుతావని చెప్పాడు.


దీంతో నారదుడు భూలోకానికి వచ్చాడు. ఎలా అయినా త్రిమూర్తులను ఒకటిగా చేయాలని సంకల్పించాడు. ఈ క్రమంలో నారదుడు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమంలో లేడు. ఆయన భార్య అనసూయ ప్రాతివత్యానికి పేరుమోసిన స్త్రీ రత్నం. నారదుడికి ఆమె ఆతిథ్యం ఇచ్చింది. అంతట నారదుడు వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ అతను లక్ష్మితో| ముల్లోకాల్లోనూ అనసూయ వంటి పతివ్రత లేదని చెప్పాడు.

తన భర్తను భూలోకానికి పంపి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షింప చేస్తానని లక్ష్మీదేవి నారదుడితో అంది. ఆపై నారదుడు కైలాసాని, సత్యలోకానికి వెళ్లి పార్వతి, సరస్వతిలతో కూడా అనసూయ పాతివ్రత్యం గురించి చెబితే.. తమ భర్తలను పంపి పరీక్షిస్తామని చెప్పింది.


భార్యల ఆలోచనల ఫలితంగా త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలు ధరించి అత్రి ఆశ్రమానికి వచ్చారు. తమకు ఆకలిగా ఉందని, అనసూయ విగత వస్త్రయై తమకు అన్నం పెట్టాలని కోరారు. ఈ వింత కోరికకు అనసూయకు ఆశ్చర్యం వేసింది. తన భర్తతో ఆలోచన చేసింది. అత్రి గొప్ప ఆత్మజ్ఞాని. యోగి. కాగా, అతనికి అంతా తెలిసిపోయింది. వచ్చిన బ్రాహ్మణ పిల్లలు పరీక్షార్థం వచ్చిన త్రిమూర్తులనే సంగతి గ్రహించాడు.


అప్పుడు ఆయన భార్యకు మంత్రోదకం ఇచ్చాడు. ఆ ఉదకాన్ని వచ్చిన వారి మీద చల్లి ఆ మీద వారికి అన్నం వడ్డించాలని చెప్పాడు. మగని ఆజ్ఞ ప్రకారం అనసూయ వారిపై మంత్రోదకం చల్లింది. తోడనే ఆ బ్రాహ్మలు ముగ్గురూ పసిపిల్లలు అయిపోయారు. అప్పుడు అనసూయ వారికి తన స్తన్యం ఇచ్చి వారి ఆకలి తీర్చింది.


ఇంతలో హఠాత్తుగా నారదుడు అక్కడికి వచ్చాడు. త్రిమూర్తులు చిన్నారి శిశువులై అక్కడ ఆడుతూ ఉండగా చూసి ఆనందించాడు. ఆ ఆనందంతో అక్కడి నుంచి వెళ్లి విషయాన్ని త్రిమూర్తుల భార్యలకు చెప్పాడు. అత్రి ఆశ్రమానికి తమను తీసుకువెళ్లాలని వారు కోరారు. దీంతో వారిని వెంటబెట్టుకుని వచ్చిన నారదుడు అల్లంత దూరంలో దాగి, అత్రి ఆశ్రమానికి వారికి దారి చూపించాడు. అక్కడ తమ భర్తలు బాలురై ఆడుతూ ఉండటం త్రిమూర్తుల భార్యలు చూశారు.


దీంతో వారికి గర్వభంగమైపోయింది. కాగా, వారు అనసూయ పాదాల మీద సాష్టాంగపడి అక్కడ శిశువులై ఆడుతూ ఉన్న ముగ్గురూ తమ భర్తలైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులని, దయచేసి తమ పతుల్ని తమకు ఈయవలసిందని కోరారు.


అప్పుడు అనసూయ భర్త ఆజ్ఞ మీదట ఆ శిశువుల మీద తిరిగి మంత్రోదకాన్ని చల్లింది. తిరిగి ఆ శిశువులు విధి, నీలకంఠ, నీలవర్ణ రూపాలు ధరించారు.


నిజరూపధారులైన త్రిమూర్తులు అప్పుడు అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. అందుమీద ఆమె, ఆమె భర్త అత్రి త్రిమూర్తులు తమకు పుత్రుడిగా పుట్టాలని కోరారు. వారి కోరిక మీదనే ముని దంపతులకు కుమారుడు పుట్టాడు. అతనే దత్తాత్రేయుడు. అతనికి ఆరు చేతులు, మూడు తలలు. నడిమి శిరస్సు విష్ణువుది. దానికి కుడిది శివుడిది. దానికి ఎడమది బ్రహ్మ శిరము.


స్థలాంతరంలో దత్తాత్రేయుని ఉత్పత్తి విధానం మరోలా ఉంది.


శిశువులు తిరిగి త్రిమూర్తులుగా మారే తరుణంలో నారదుడు హఠాత్తుగా అక్కడికి వచ్చి, త్రిమూర్తుల్ని దర్శించి, 'మీరు ముగ్గురూ ఒక్కచోట ఉన్నారు. కాబట్టి మీ నిజరూపం నాకు చూపాలని' కోరాడు. నారదుని కోరికపై త్రిమూర్తులు ముగ్గురూ కలిసి దత్తాత్రేయ రూపాన్ని పొందారు. దత్తాత్రేయుడు గొప్ప సన్యాసి. అతను పుట్టిన వారం బుధవారం. తిథి మార్గశిర శుక్ల చతుర్దశి. నక్షత్రం కృత్తిక. దత్తాత్రేయ దేవాలయాల్లో ఈనాడు కీర్తనలు సాగుతాయి. ఈ దేవత పట్ల మహారాష్ట్రులు అతిశయోక్తమైన భక్తి కలిగి ఉంటారు. దత్తాత్రయుడు ఉగ్ర దేవత అని గర్గ సంహిత అని చెబుతోంది. కాబట్టే దేశంలో దత్తాత్రేయ ఆలయాలు తక్కువగా ఉన్నాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List