స్వామిమలై ~ దైవదర్శనం

స్వామిమలై






 * స్వామిమలై.. 


తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుంభకోణం సమీపంలో స్వామిమలై ప్రసిద్ది చెందిన దేవాలయం. స్వామి మలై అంటే దేవుని పర్వతం అని అర్థం. తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి వారికి ఉన్న ఆరు ముఖ్యమైన క్షేత్రాలలో ఇది నాలుగవది. ఈ ఆలయానికి ఒక గొప్ప విశేషం ఉంది. సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తన కుమారుని తెలివితేటలకు మురిసిపోయి పుత్రోత్సాహం పొందిన స్థలమింది. సుబ్రహ్మణ్వేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పిన పవిత్ర ప్రదేశమిది. మరి ఇంత అద్వితీయమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం ఒకసారి సృష్టకర్త అయిన బ్రహ్మగారు కైలాసానికి వెళుతూ.. ఆయనకి దోవలో కుమారస్వామి కనబడ్డాడు. కనబడ్డవాడు వూరుకొనక, ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని అడిగాడు. పాపం దేవలకు కూడా తెలియని ప్రశ్నతో బ్రహ్మతో పాటు ఇతర దేవుళ్ళను అయోమయంలో పడేశాడు. 


బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పకపోయే సరికి ఆయన్ని బందీ చేశాడు. సృష్టికే మూలకర్త అయిన బ్రహ్మ దేవుడు బందీ అయ్యే సరికి సృష్టి ఆగిపోయింది. దాంతో దేవతలందరూ ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి పరిస్థితి విన్నవించారు. అందరూ కలసి కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు. అందుకు కుమారస్వామి ఇలా అన్నాడు, బ్రహ్మదేవున్ని ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు. అందుకే బందీని చేశానని సమాధానం చెప్పి, ఇందులో తన తప్పు ఏమి లేదని చెప్పాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు కుమారస్వామిని ఇలా ప్రశ్నించాడు. ఆయనకి తెలియదని బందీని చేశావు సరే మరి నీకు తెలుసా అని అడుగగా నేను చెప్తాను అన్నాడు . అయితే నేను ప్రణవ మంత్రార్థాన్ని బోధిస్తున్నాను కనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రద్దలున్న శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడు.  తర్వాతేముంది కుమారుడు గురువయ్యాడు, తండ్రి శిష్యుడయ్యాడు. తండ్రి అత్యంత భక్తి శ్రద్దలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్థాన్ని విని పులకరించిపోయాడు. 


ఈ క్షేత్రం గురించి మరో పురాణ కథనం కూడా ఉంది. భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు. భృగు మహర్షి ఒకసారి తపస్సు ప్రారంభించడానికి ముందు తన తపస్సుని ఆటంక పరచిన వారికి అంతకు ముందున్న జ్ఝానమంతా నశిస్తుందనే వరం పొంది తీవ్ర తపస్సు ప్రారంభించాడు. ఆ తపోశక్తి ఊర్థ్వలోకాలకి వ్యాపించగా , ఆ వేడిమిని భరించలేని దేవదేవుళ్ళు ఆ పరమేశ్వరుని శరణు కోరారు. అప్పుడు ఈశ్వరుడు ఆతపశ్శక్తి దేవలోకాలకి వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తలమీద అడ్డంగా పెట్టాడు. దాంతో పరమశివునంత వారికి కూడా జ్ఝానం నశించింది. తన పూర్వ జ్ఝానాన్ని తిరిగి పొందటానికి ఆయన జ్ఝాన స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవోపాసన పొందాడు. ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి. ఆ స్వామికి స్వామియై,నాథుడై ఉపదేశించాడు కనుక ఇక్కడ కుమార స్వామికి స్వామి నాథుడనే పేరు వచ్చింది. ఈ స్థలానికి స్వామిమలై అనే పేరు వచ్చింది. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కార్త వీర్యార్జునుడు కట్టించాడు. గర్భగుడి బయట మనం ఆయన విగ్రహాన్ని దర్శించవచ్చు. 


ఈ చిన్న కొండపైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లు అరవై తమిళ సంవత్సరాలకి ప్రతీకలని, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు. ప్రతి మెట్టు దగ్గర గోడపై ఆ సంవత్సరం పేరును తమిళంలో వ్రాసి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కే నడక దారిలో 32 మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూస్తే అక్కడ కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది అలాగే ఈ గుడికి క్రింది భాగంలో శివపార్వతులు మంటపాలున్నాయి.అక్కడ వీరిని మీనాక్షి,సుందరేశ్వర్, మీనాక్షి. పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుండి పుణ్యక్షేత్రమైన తిరువిదైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడు.ఆయన కులదైవమైన మీనాక్షి సుందరేశ్వరుని ఆరాధించడానికి ఈ మంటపాలనేర్పరచాడు ఈ ఆలయంలో ద్వజ స్థంభం వద్ద ఉన్న వినాయకుడి ఆలయం కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమారతరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు ఉన్నాయి. కొంగు ప్రాంతం నుండి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చే సరికి ఆయనికి కన్నులు కనిపించడం వల్ల ఈ వినాయకున్ని నేత్ర వినాయగర్ అని పిలుస్తారు.


పురాణ కథనం ప్రకారం ఈ దేవుని సన్నిధికి వచ్చి నిశ్చల భక్తితో పూజించే వారి పాపాలన్నీ సూర్యుని ముందు పొగమంచులాగా కరిగిపోతాయి, ఈ దేవాలయంలో వివాహం చేసుకన్న వారికి సత్ప్రవర్తన, సత్సంతానం కలుగుతాయంటారు. ఈ స్వామి దర్శనార్థం అనేక మంది భక్తులు సందర్శిస్తుంటారు. దేశ, విదేశాల నుండి కూడా భక్తులు ఆ ఆలయానికి వస్తుంటారు. భక్తులు కోర్కెలు తీరిన తర్వాత స్వామి వారికి పాలకావడి, పూల కావడి వంటి ముడుపులు చెల్లిస్తుంటారు సాయంత్రంలో స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటే ఆ సమయంలో అభిషేకం చేస్తారు. పసుపు అభిషేకం చేసిన తర్వాత స్వామి కన్నులు, ముక్కు, నోరు, తుడుస్తారు. అప్పుడు స్వామి వారి సౌందర్యం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, ఆ అపురూప సౌందర్యం వర్ణించడానికి మాటలు చాలవు. 60అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ వుంటుంది.పండుగలు, ఉత్సవాలు ఈ ఆలయం స్వామిమలై సమీపంలో ఉండటంవలన, కుంబకోణం టౌన్షిప్ కు పెద్ద సంఖ్యలో యాత్రికులు వొస్తున్నారు. అనేక ప్రసిద్ధ పండుగలు స్వామిమలై లో జరుగుతాయి. వాటిలో ఆలయ రథోత్సవం ఏప్రిల్ నెలలో మరియు స్కంద షష్టి పండుగ అక్టోబర్ లో మరియు విసాకం పండుగ మే నెలలో మరియు పండుని ఉత్తిరం పండుగ మార్చ్ నెలలో జరుగుతాయి.


స్వామిమలై ఎలా చేరుకోవాలి ?


రోడ్డు లేదా బస్సు మార్గం :

ట్రిచీ, కుంభకోణం, చెన్నై, మధురై, తంజావూర్ వంటి పట్టణాల నుండి స్వామిమలై కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుపుతుంటారు. రైలు మార్గం : స్వామిమలై కు 8 km ల దూరంలో కుంభకోణం రైల్వే స్టాట్యూన్ కలదు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని ప్రధాన పట్టణాల నుండి కూడా రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ బయట ఆటో రిక్షాల సదుపాయం కలదు.

వాయు మార్గం : 85 km ల దూరంలో ట్రిచి విమానాశ్రయం కలదు. ట్రిచీ నుండి టాక్సీ లేదా క్యాబ్ లలో స్వామిమలై చేరుకోవచ్చు.🙏

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List