భూలోకంలో పెళ్లిళ్లు నిర్ణయించే దేవుడు.. ఇడగుంజి వినాయకుడు. ~ దైవదర్శనం

భూలోకంలో పెళ్లిళ్లు నిర్ణయించే దేవుడు.. ఇడగుంజి వినాయకుడు.






 * భూలోకంలో పెళ్లిళ్లు నిర్ణయించే దేవుడు.. ఇడగుంజి వినాయకుడు..


అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు. మనదేశపు పశ్చిమతీరాన వెలసిన గణపతి ఆలయాలలో, ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ఒకటి. ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉంది. కర్నాటకలోనే పుట్టి, ఆ రాష్ట్రంలోనే సంగమించే శరావతి అనే నది, ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలోసంగమిస్తుంది. స్థలపురాణం అది ద్వాపరయుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు రుషులంతా వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం వారు శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని రుషులు నిర్ణయించుకున్నారు. కానీ అదేం చిత్రమో! యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఏవో ఒక ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో రుషులకు పాలుపోక నారదుని శరణు వేడారు. అంతట నారదుడు, గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే, ఎటువంటి విఘ్నాలూ లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. సలహాను ఇవ్వడమే కాదు, తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడ్కొని వచ్చాడు. గణేశుడు అక్కడకు రావడంతోనే యాగానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటిదేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగింది. తమ విఘ్నాలన్నీ తొలగించిన గణేశుని రుషులందరూ వేనోళ్లతో స్తుతించారు. వారి భక్తికి మెచ్చిన గణేశుడు, ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోర్కెలను తీరుస్తానని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభువుగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి.


భిన్నమైన రూపం..

ఇక్కడి మూలవిరాట్టైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.


పెళ్లి పెద్ద..

కర్నాటకలోని బంధి అనే జాతివారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే, దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇలా వైభవోపేతమైన స్థలపురాణానికి తోడుగా, చిత్రవిచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List