శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. ~ దైవదర్శనం

శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం.



* శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం..

* అభాగ్యుల ఆరోగ్యక్షేత్రం చెరువుగట్టు ఆలయం..


దేవుడంటే ఓ నమ్మకం. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ఓ విశ్వాసం. సిరిమంతులు కావాలని.. ఉద్యోగాల్లో పదోన్నతులు రావాలని..  ఆలయాలకు వెళ్లి మొక్కుతుంటారు. అనుకున్నది నెరవేరితే కానుకల రూపంలో.. కట్నాల రూపంలో మొక్కులు తీర్చుకుంటారు. కానీ.. సిరిసంపదలు కాకుండా ఆరోగ్యం బాగుండాలని కోరేవాడైతే.? 

అలాంటివారికీ ఉందో క్షేత్రం. అదే చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిగా పిలిచే ఈ ఆలయం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులో ఉన్నది. 


🔅 ఆలయ విశిష్టత..


ఆసుపత్రులు.. ఆరోగ్యకేంద్రాలు తిరిగినా చేకూరని ఆరోగ్యం ఇక్కడ ఒక్క నిద్ర చేస్తే నయమవుతుందని భక్తుల నమ్మకం.


🔅 స్థల పురాణం..


త్రేతాయుగంలో జమదగ్ని మహర్షి కొడుకైన పరశురాముడు ప్రతిష్టించిన 108 శివలింగాల్లో ఆఖరిది చెరువుగట్టు లింగం. అతనికి శివుడు ప్రత్యక్షమై ఈక్షేత్రం సుప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటిగా ప్రకాశిస్తుందని ఇక్కడకు వచ్చే భక్తుల మొక్కులు నెరవేర్చుతానని చెప్పి అదృశ్య మయ్యాడట. అప్పట్నుంచి ఇది సుప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతున్నది. 


🔅 ఆలయాల కేంద్రం :..

 

చెరువుగట్టు క్షేత్ర పరిధిలో కొండ కింద శ్రీ పార్వతీ అమ్మవారు కొలువుదీరారు. పరివార దేవతలుగా మల్లిఖార్జున స్వామి.. సుబ్రహ్మణ్యస్వామి.. భద్రకాళీ వీరభద్రస్వామి కొలువై ఉన్నారు. గట్టుమీద స్వామివారికి పరివార దేవతలుగా విఘ్నేశ్వరస్వామి.. ఆంజనేయస్వామి.. ఎల్లమ్మ తల్లి ఉన్నారు. క్షేత్రపాలకుడుగా కాలభైరవ స్వామి కొలువుదీరారు. 


🔅 ఆరోగ్యక్షేత్రం:.. 


దేవాలయ ప్రాంగణంలో అనారోగ్యంతో ఉన్న భక్తులు సంచరిస్తే వారికున్న రోగాలు మటుమాయం అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే దేవాలయ ప్రాంగణంలో మండల.. అర్ధమండల దీక్ష తీసుకొని స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే తమ ఆరోగ్యం చక్కబడుతుండడం వల్ల ఈ ఆలయాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తుంటారు. స్వామివారి దర్శనానంతరం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఆపరేషన్ బండ ఉంటుంది. కడుపులో గడ్డలున్నవాళ్లు ఈ బండపై పడుకుంటే ఆ గడ్డలు కరిగిపోతాయంటారు. 


🔅 అమావాస్య జాతర :.. 


చెరువుగట్టు ఆలయంలో ప్రతి నెలా అమావాస్య ముందు రోజు చతుర్దశి రోజు రుద్రహోమం చేయడం ఆనవాయితీ. 

ప్రతీ అమావాస్య రోజు స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించి తదనంతరం స్వామివారిని వాహనసేవలో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ గావిస్తారు. ఈ రోజున సుమారుగా లక్ష మంది భక్తులు హాజరవుతుంటారట. ఇక్కడ నిద్ర చేసినవారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే కొందరు 11 అమావాస్యలు.. 9 అమావాస్యలు.. 7 అమావాస్యలు నిద్ర చేస్తుంటారు.


🔅 కడెను కట్టుట :.. 


చెరువుగట్టు ఆలయంలో ఉన్న మరో విశిష్టమైన నమ్మకం భక్తులకు సంతాన ప్రాప్తి. కోరుకున్నట్టుగా సంతానం కలిగితే కోడెను కట్టే ఆచారం ఇక్కడ ఉన్నది. స్వామివారి ఆశీస్సులతో సంతానం కలిగినందు వల్ల ప్రతిరోజు ఈ దేవాలయంలో కోడెను కట్టి వారి మొక్కులను చెల్లించి అదే రోజు అమ్మవారికి పల్లకిసేవ లేదా వాహన సేవ చేయించడం ఇక్కడ సంప్రదాయం. ఇంకా ప్రతీనెలా పౌర్ణమి రోజు అమ్మవారి దేవాలయంలో చండీ హోమం నిర్వహిస్తారు. 


🔅 మూడుగుండ్లు :.. 


శివుడు భూలోకాన చెరువుగట్టు సమీపాన అతి ఎత్తయిన మూడు గుండ్లపై వెలసి.. తనను మూడుగుండ్లు ఎక్కి దర్శించే భక్తులకు సమస్త కోరికలు తీర్చుతాడని భక్తుల నమ్మకం. పగలనక.. రాత్రనక భక్తులు మూడు గుండ్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. మూడుగుండ్ల దర్శనం వల్ల పాపభీతి.. కష్టాలు.. కల్మషాలు.. మానసిక క్షీణతలు పోతాయి. గుట్టపైన పుష్కరిణి ఉంటుంది. దీంట్లో స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని భక్తలు నమ్మకం. గుట్టపై స్వామివారి పాదాలు ఉంటాయి. కోరికలు నెరవేరాలని భక్తులు తలపై పాదుకలు పెట్టుకొని తడిబట్టలతో 11, 21, 41 ప్రదక్షిణలు చేస్తారు. ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయి ఆశలు వదులుకున్న వాళ్లకు కూడా ఇక్కడ నిద్ర చేస్తే ఆరోగ్యం బాగవుతుంది. ఇది నిరూపితం కూడా. 


ఈ ప్రాంతం చెరువు గట్టున ఉండటంతో చెర్వుగట్టుగా అవతరించింది. ఇక్కడి శివలింగంపై జడల మాదిరిగా రేఖలు ఉండటం, ఈ లింగాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని ప్రజలు నమ్ముతుండటంతోపాటు… కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో… పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధికెక్కింది.

యుగాల నాటి చరిత్ర ఉన్న ఈ దేవాలయం… అతిపురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. 


రెండు బండల మధ్యన ఉన్న చిన్నపాటి సందులోనుంచి భక్తులు వెళ్లాల్సి ఉంటుంది. కల్మషం లేకుండా శివనామాన్ని జపిస్తూ వెళ్తే భారీకాయులు సైతం ఆ బండల మధ్య నుంచి బయటికి వస్తారని… దుర్బుద్ధితో వచ్చేవారు అందులోనే ఇరుక్కు పోతారని భక్తులు చెబుతారు.


ఈ క్షేత్రం నల్లగొండ పట్టణానికి 15 కి.మీ. దూరంలో కలదు. 

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List