శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం. ~ దైవదర్శనం

శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం.



శ్రీ మహావిష్ణువు వెలసిన ఆలయాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు చెన్నకేశవస్వామిగా వెలసిన మొట్టమొదటి ఆలయంగా ఇది ప్రసిద్ధిగాంచింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఎలా వెలిసాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


" కృతయుగే గజారణ్యే,

త్రేతాయాం మాధవీపురీ 

ద్వాపరే స్వర్గసోపానం,

కలౌ మారికాపురీ "


ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు, కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపరయుగంలో స్వర్గసోపానంగా పిలుచేవారని అర్థం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు మార్కండేయ మహర్షులవారు రచించిన ‘గజారణ్య సంహిత’ ద్వారా మనకు తెలుస్తోంది.


🔆 స్థల పురాణం..


కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండి, ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట. ఈ గజారణ్యంలో అనేక మంది మునిపుంగవులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేస్తుండేవారట. ప్రస్తుతం ‘గుండ్లకమ్మ’ అని పిలువబడుతున్న గుండికానదీ తీరంలో శ్రీ మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండేవారట. ఈ ‘గుండ్లకమ్మ’ నది పుట్టుక వెనుక ఓ ఆసక్తి కరమైన కథ ఉంది.


🔅 కుండల నుంచి కారిన నీరు..


పూర్వం నంది మండలంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని హైహయుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒక రోజు వేటకువెళ్ళిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. వారు మహర్షిని ప్రార్థించి, రెండు కుండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తుండగా, ఆ కుండలు గుండ్ల బ్రహ్మేశ్వరం అనే చోట పైకెగిరి పగిలిపోయాయి. ఆ కుండల నుండి జాలువారిన జలమే ఈ నది జలం అనేది ఇక్కడి కథనం. ఆ గుండికానదే వాడుకలో “గుండ్లకమ్మ” గా రూపాంతరం చెందింది.


ఆనాటి గుండికానది తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను ‘కేశి’ అను రాక్షసుడు బాధలు పెట్ట సాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి విష్ణువును గూర్చి ఘోర తపస్సు చేసాడు. మహర్షి తపస్సును మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై, రాక్షసునిపై అనేకమైన ఆయుధాలను ప్రయోగించాడు. అయినప్పటికి ఎలాంటి ఫలితం కనిపించలేదు. చివరకు ఆ రాక్షసునికి పాముతో చావు ఉందని దివ్యదృష్టితో తెలుసుకొని విష్ణుమూర్తి, రాక్షసుని చంపమంటూ ఆదిశేషుని ఆజ్ఞాపించాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించిన ఆదిశేషుడు, తన విషజ్వాలలతో కేశి రాక్షసుని అంతo చేసాడు.


అప్పుడు ప్రసన్నులైన స్వామి, మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. అప్పుడు మహర్షి, స్వామిని ఇక్కడ అర్చామూర్తిగా వెలియమని కోరడంతో, స్వామివారు చెన్నకేశవ పేరుతో ఇక్కడ వెలశారని ప్రతీతి.

ద్వాపరయుగంలో స్వామిని ఇక్కడి ఋషులు మాధవనామంతో పిలుచుకుంటూ, యజ్ఞయాగాదులు చేసేవారట. 

ఆ యాగాలకు దేవతలందరూ వస్తూ పోతుండటం వల్ల, ఈ చోటు స్వర్గాదిలోకాలకు సోపానం వంటిదని చెప్పుకునే వారట.


ఈ కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై, తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా, తన భర్త మారికయ్య, బంధువులతో చెప్పి, ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి ‘మారికాపురం’ అనే పేరు ఏర్పడిందనీ, కాలక్రమేన అదే ‘మార్కాపురంగా’ మారిందని చెబుతుంటారు. అలాగే మార్కపురానికి పక్కనున్న ‘చెన్నరాయుడుపల్లె’కు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు.

ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని  సోమప్రభాపురం అని కూడా పిలిచేవారు అంటారు..


స్వామి వారి మూల విరాట్టు చుట్టూ మకర తోరణం ఉంది. ఈ తోరణం పై దశావతారాలున్నాయి. సాధారణంగా స్వామివారి కుడి చేతిలో సుదర్శన చక్రం  ఉంటుంది. ఇక్కడి స్వామి వారి ఎడమ చేతిలో సుదర్శన చక్రం ఉంది.  పలనాటి బ్రహ్మన్న, శ్రీకృష్ణ దేవరాయలు ఆలయ అభివృద్ధి కృషి సల్పినంనందున ఈ క్షేత్ర చరిత్ర ప్రసిద్ధి గాంచింది.

ఆలయంలో శ్రీ చెన్నకేశ్వస్వామి మూల విరాట్టు శంఖు, చక్ర, కౌముదిలతో పాటు ఆదిశేషుని ఆయుధంగా ధరించి వుండడం ఇక్కడి ప్రత్యేకత. 


మూల విరాట్టుకు ఇరువైపులా శ్రీదేవి, భూదేవి విగ్రహాలు, కుడివైపు మార్కండేయు మహర్షి, ఎడమవైపు మారికా మారకులు అనే దంపతులు విగ్రహాలు దేవాలయ చరిత్రకు గుర్తులుగా నిలిచి వున్నాయి. ప్రతి ధనుర్మాసంలో సూర్య కిరణాలు మూలవిరాట్టు పాదాలు నుండి శిరస్సు వరకు వ్యాపించడాన్ని చూడగలము. ప్రధానాలయంకు ఎడమ భాగంలో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారి సన్నిధి కలదు. ఆలయములో  శ్రీ గోదాదేవి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ రంగనాయక మూర్తులు దర్శించగలము. ఈ ఆలయంలోని మధ్య మంటపంలోని రెండు స్తంభాలను శిల్పులైన ఇరువురు అన్నదమ్ములు ఒకరి శిల్పాన్ని మరొకరు చూడకుండా మలిచారు. చివరకు రెండూ ఒకే రీతిగా తయారయ్యాయి.


ఒంగోలు పట్టణంకు 96 కీ.మీ దూరాన మార్కాపురం అను పట్టణం  కలదు.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List