శ్రీ నాగకోటీశ్వరాలయం. ~ దైవదర్శనం

శ్రీ నాగకోటీశ్వరాలయం.






 * శ్రీ నాగకోటీశ్వరాలయం..


'నాగకోటీశ్వరం దృష్టా నాగదోషా వినశ్యతి' అని శాస్త్రం చెబుతోంది. నాగాభరణంతో ఉన్న కోటి శివలింగ ప్రతిమల్ని ఒకేచోట దర్శించుకుంటే నాగదోషం పోతుందని దాని అర్థం. అలాంటి ఆలయమే నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట దగ్గర్లో ఉన్న నాగ కోటీశ్వరాలయం. జాతకంలో నాగ, కాలసర్ప, కుజదోషాలున్న భక్తుల కోసమే ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించడం విశేషం. సాధారణంగా ప్రతీ ఆలయంలోనూ మూల విగ్రహం ఒకటి ఉంటుంది. కానీ ఇందులో కోటి పార్థివ లింగాలను నాగప్రతిమతో చేసిన కోటి సర్పాల ప్రతిమలు ఉన్నాయి. కాబట్టే దీనికి నాగకోటి ఆలయమని పేరు పెట్టారు. 



హైదరాబాద్ లో ఉండే జ్యోతిష్కులు గౌరీభట్ల దివ్వజ్ఞాన సిద్ధాంతి దగ్గరికి కాలసర్ప దోషం ఉన్న భక్తులు ఎక్కువగా వచ్చేవారు. పరిహారం కోసం వాళ్లను చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికో, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ఆలయానికో వెళ్లమని ఆయన సూచించేవారు. కానీ, అందరూ అంతదూరం వెళ్లలేరు. అంత ఖర్చూ పెట్టుకోలేరు. కొందరికి రెండు మూడు రోజులు కేటాయించే తీరికా ఉండదు. అలాంటి వారికోసం రాజధానికి దగ్గర్లోనే ఒక ఆలయాన్ని నిర్మిస్తే బావుంటుందని ఆయనకు అనిపించింది. అప్పుడు చాలా గ్రంథాలను తిరగేసి, ఎందరో పండితులనూ పీఠాధిపతులనూ సంప్రదించి, వారి సలహాల మేరకు నాగకోటి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు దివ్యజ్ఞాన సిద్ధాంతి. కానీ, ఆలయ నిర్మాణమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, ఆయన ఒక్కరివల్లా సాధ్యం కాలేదు. 


సరిగ్గా అదే సమయంలో ఆయనకు 'సురేంద్రపురి' వ్యవస్థాపకులు కుందా సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. నాగకోటి ఆలయ నిర్మాణ ఆలోచనను ఆయనతో చెప్పారు. 'సురేంద్రపురి' ప్రాంగణంలో అప్పటికే అనేక దేవతాలయాలు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేకమైన ఆలయమూ ఉంటే బాగుంటుందని కుందా సత్యనారాయణ కూడా అంగీకరించడంతో సురేంద్రపురికి అనుబంధంగానే నైరుతి భాగంలో నాగకోటి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.


మూల విగ్రహాలను శిల్పకారులు చక్కగా చెక్కుతారు. కానీ నాగకోటి ఆలయంలో ప్రతిష్టించడానికి కావలసింది అలాంటి రాతి విగ్రహం కాదు. ఏకంగా కోటి సర్ప శివలింగాలు అవీ పుట్టమన్నుతో చేసినవై ఉండాలి. 

మరి వాటిని తయారుచేయడమంటే మామూలు విషయం కాదు. అందుకే దీని కోసం ఒక ఆలోచన చేశారు. 


కాలసర్పదోషం ఉన్న వాళ్లే 40 రోజులు దీక్ష చేపట్టి, ఒక్కో భక్తుడూ మట్టితో చేసిన 108 సర్ప లింగాల్ని తీసుకురావాలని నియమం పెట్టారు. పార్థివ నామ సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి అనగా నాగ పంచమినాడే ఆలయ శంకుస్థాపన జరిగింది. ఆ రోజు కొందరు భక్తులతో పార్థివ సర్ప లింగాల నమూనాలను తయారు చేయించారు. అలా రాజధానితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఆలయ నిర్మాణం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సుమారు లక్ష మంది భక్తులు శివలింగాల్ని స్వయంగా చేసి తెచ్చారు. 2009 అక్టోబర్ 31న ప్రతిష్టాపనా మహోత్సవం జరిగింది.


శివలింగమే ఆలయం..


ఈ ఆలయాన్ని పెద్ద కొండపై ఏర్పాటు చేశారు. పానపట్టంతో ఉన్న శివలింగంపై అయిదు పడగల నాగాభరణం ఉన్నట్టు నిర్మించిన ఈ ఆలయం ఎత్తు 101 అడుగులు. ఈ శివలింగాకారం లోపల సిమెంటుతో చేసిన దేవతల విగ్రహాలు ఏర్పాటుచేశారు. వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వెళితే నాగకోటి శివ లింగాలకూ ప్రదక్షిణ అవుతుంది. అలా సర్పసహితంగా ఉన్న కోటి లింగాల దర్శనమూ ప్రదక్షిణమూ జరుగుతాయన్నమాట.


ఆలయ తూర్పు ద్వారంగుండా వెళ్లగానే మొదట గణపతి, గరుత్మంతుడు దర్శనమిస్తారు. తర్వాత లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, బ్రహ్మసరస్వతులు, వల్లీసమేత సుబ్రహ్మణ్య స్వామి, రాహు కేతువులతో కొలువైన నాగేశ్వరుడు కనిపిస్తారు. జాతకంలో కాలసర్పదోషమూ, నాగదోషాలూ ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు. విఘ్నాలూ సమస్యలతో పెళ్లిళ్లు ఆగిపోయినవాళ్లూ, సంతానం కలగనివారూ కూడా ఆలయానికి వస్తుంటారు.


ఆలయంలో సర్పసూక్తం, సుబ్రహ్మణ్యస్వామి అష్టాక్షరితో నెలకొకరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

నాగపంచమికి (శ్రావణ మాసంలో), నాగులచవితికీ (కార్తీకమాసంలో) ఇక్కడ విశేష ఉత్సవం జరుగుతుంది.

ఆలయం నలువైపులా ఎటుచూసినా కొండాకోనలూ ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకుల్ని ఎంతో ఆకట్టుకుంటుంది.



హైదరాబాద్ నుంచి నాగకోటీశ్వరాలయం కేవలం 55 కి.మీ. దూరంలో ఉంది. నాగకోటిని దర్శించుకున్నాక కిలోమీటర్ దూరంలో ఉన్న యాదగిరిగుట్టకు కూడా వెళ్ళి రావచ్చు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List