January 2019 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

మహిమాన్వితమైన రామ నామ మంత్రం..!


* రాముడికన్నరామనామమే గొప్పది ..
* హనుమంతుడిని రాముడు ఎందుకు చంపబోయడు .??
* రామ నామ జపం లోను అంతులేని విజ్ఞానం ...
.
.
రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యానగరానికి విచ్చేసిన రాముడు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నాడు. ప్రతిరోజూ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు సామాన్యప్రజానీకంతో సహా పెద్దలు, మునులు విచ్చేసి ధార్మిక విషయాల మీద చర్చలు చేయడం నిత్యకృత్యం.
.
ఓ రోజు అలాగే సభ జరుగుతోంది. ఆ సభకు నారద, వశిష్ట, విశ్వామిత్రులు కూడా విచ్చేశారు. ముందుగా నారద మహర్షి సభలో ఒక సందేహం లాంటి ప్రశ్నను సంధించాడు. భగవంతుడు గొప్పవాడా, భగవంతుడి నామం గొప్పదా అన్నదే ఆ సందేహం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం అందరూ మల్లగుల్లాలు పడ్డారు. ఎన్నో తర్జన భర్జనలు చేశారు. ఆఖరికి వశిష్ట విశ్వామిత్రులకు కూడా సరైన సమాధానం ఇదీ అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పడం సాధ్యం కాలేదు. దాంతో అందరూ కలసి నారదుణ్ణే అడిగారు, ‘ఆ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పండి మహర్షీ!’ అని.
.
‘‘రాముని కన్నా, రామనామమే గొప్పది. ఇందులో సందేహించవలసిన పనిలేదు.’’ అని చెప్పాడు నారదుడు. ‘‘కావాలంటే నిరూపిస్తాను’’ అంటూ హనుమను పిలిచి, ‘‘హనుమా! సభానంతరం నువ్వు ఒక్క విశ్వామిత్రుడికి తప్ప సభలోని అందరికీ నమస్కారం చేయి’’ అని చెవిలో చెప్పాడు.
.
సరేనన్నాడు హనుమ.
సభముగిశాక నారదుడు చెప్పినట్లుగానే హనుమ సభలోని పెద్దలందరికీ భక్తి గౌరవాలతో వినయంగా నమస్కరించాడు. విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయనకు నమస్కరించ కుండానే వెనుదిరిగాడు.
.
కాసేపయ్యాక నారదుడు విశ్వామిత్రుని వద్దకెళ్లి, ‘‘చూశావా విశ్వామిత్రా, ఆ హనుమకు ఎంత పొగరో! అందరికీ నమస్కరించి, నిన్ను మాత్రం విస్మరించాడు.’‘ అన్నాడు రెచ్చగొడుతున్నట్లుగా.
.
విశ్వామిత్రుడు కోపంతో మండిపడ్డాడు. రాముడి వద్దకెళ్లి, ‘‘రామా! మదాంధుడైన ఆ హనుమను రేపు సూర్యాస్తమయంలోగా సంహరించు! ఇది నా ఆజ్ఞ.’’ అన్నాడు.
.
ఆ మాటలకు నిర్ఘాంతపోయాడు రాముడు. ‘‘ఎంతటి విపత్కర పరిస్థితి! నాకు ఎంతో ఇష్టుడైన హనుమను నా చేతులతో నేను చంపుకోవడమా!? అదీ నిష్కారణంగా! చంపనంటే గురువాజ్ఞ మీరినట్లవుతుంది. ఇప్పుడేమిటి దారి?’’ అంటూ తలపట్టుకు కూర్చున్నాడు.
.
ఈలోగా హనుమను రాముడు చంపబోతున్నాడనే వార్త క్షణాలలో రాజ్యమంతా వ్యాపించింది. ఈ వింత సంఘటన గురించి ప్రజలందరూ కథలు కథలుగా చెప్పుకోసాగారు.
.
హనుమ వెంటనే నారదుడి వద్దకెళ్లాడు. ‘‘మహర్షీ మీ మాట వినే కదా, నేను ఈ పని చేశాను. దానికి ఇంతటి దారుణమైన శిక్షా?’’అని వాపోయాడు.
.
అందుకు నారదుడు ‘‘నీకేం భయం లేదు హనుమా! నేనున్నాను కదా, నువ్వు ఒక పని చెయ్యి, సూర్యోదయానికన్నా ముందే సరయూనదిలో స్నానం చేసి, ‘శ్రీరామ జయరామ జయజయ రామ’ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించకు’’ అని చెప్పాడు.
.
నారదుడు చెప్పిన విధంగానే హనుమ తెల్లారేలోగా సరయూనదిలో స్నానం చేసి, భక్తిశ్రద్ధలతో నారదుడు చెప్పిన మంత్రాన్ని జపించసాగాడు. తెల్లవారగానే ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో నగర ప్రజలంతా గుంపులు గుంపులుగా సరయూనది ఒడ్డుకు చేరుకోసాగారు.
.
రాముడు ఒకసారి తన ప్రేమపూర్వక నయనాలతో తనకెంతో ఆప్తుడు, నమ్మిన బంటు, సఖుడు అయిన హనుమను చూస్తూ, నదిలో నడుము లోతు నీటిలో నిలిచి, రామమంత్రాన్ని తదేక దీక్షతో పఠిస్తున్న హనుమపై బాణాన్ని వదిలాడు. ఆశ్చర్యం! ఆ బాణం హనుమను ఏమీ చెయ్యలేకపోయింది. అలా సంధ్యా సమయం వరకు నిర్విరామంగా బాణాలు వదులుతూనే ఉన్నాడు రాముడు. ఆ బాణాలన్నీ ఒక్కొక్కటిగా నేలరాలిపోతున్నాయి కానీ, హనుమకు మాత్రం కించిత్తు కూడా హాని కలగడంలేదు. ఇలా లాభం లేదనుకుని చివరకు బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు రాముడు. దాంతో ప్రకృతి మొత్తం కంపించిపోసాగింది. ప్రజలంతా హాహాకారాలు చేయసాగారు.
.
ఇంతలో నారదుడు విశ్వామిత్రుని వద్దకెళ్లి, ‘‘మహర్షీ! చూశారా, రామ నామ మహిమ ఎంత గొప్పదో! ఆ మహిమకు రాముడు కూడా తలవంచక తప్పడం లేదు. బ్రహ్మాస్త్రం గనక నిర్వీర్యం అయిపోయిందంటే ఎన్నో ఉత్పాతాలు జరుగుతాయి. అన్నింటికీ మించి అది నీకూ, నీ శిష్యుడికీ కూడా ఎంతో అవమానకరం. హనుమ నీకు నమస్కరించకపోతే ఏమైంది చెప్పు. నీవే ఇక ఈ అస్త్రప్రయోగం చాలించమని నీ శిష్యుడికి చెప్పు’’ అని సలహా ఇచ్చాడు.
.
విశ్వామిత్రుడు ‘‘ఇక ఆపు రామా!’’ అనడంతో రాముడు ధనుర్బాణాలు కిందపడవేసి, హనుమను ప్రేమతో కౌగలించుకున్నాడు.

Share:

కొండ గర్భములో దేదీప్యమానమైన వెలుగులలో శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం.

కృష్ణానదీ తీరానికి అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లా, నల్గొండ జిల్లాలలో ఐదు నారసింహ క్షేత్రాలు విలసిల్లినాయి. మంగళగిరి, వాడపల్లి, కేతవరం, గుంటూరు జిల్లాలో, కృష్ణాజిల్లాలో వేదాద్రి. నల్గొండ జిల్లాలో మట్టపల్లి క్షేత్రాలలో ప్రబలమైనదిగా వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామిని మహిమ వేన్నోళ్లున్నా వర్ణించవీలుకానిది- విజయవాడ-హైదరాబాద్ రహదారిలో ‘చిల్లకల్లు’ కూడలి నుండి పడమరగా 10 కిలోమీటర్లు దూరంలో వేదాద్రి క్షేత్రమున్నది.
బ్రహ్మదేవుని వద్ద వుండిన వేదములను సోమకాసురుడను రాక్షసుడు తస్కరించి సముద్రమునందు దాయగా, బ్రహ్మదేవుడు తన జనకుడైన శ్రీమన్నారాయణుని వేదములను అనుగ్రహింపమని ప్రార్థించాడు. భక్తవత్సలుడైన మహావిష్ణువు మత్స్యావతారము దాల్చి రక్కసుని పరిమార్చుట వలన వేద పురుషులు జ్వాలా నరసింహమూర్తిగా అలరారాడు. ఋష్యశృంగాది మహర్షులు, మనువు ప్రార్థనలతో యోగానంద నృసింహస్వామి స్వరూపుడైనాడు.
వేద శిఖరమున జ్వాలా నృసింహాకృతితోను, కృష్ణానది గర్భమున సాలగ్రామ రూపంతోను, వౌనిచంద్రుడు ఋష్యశృంగునిచే ప్రతిష్టింపబడిన యోగమూర్తిగాను, క్షేత్రపాలకునిగా యోగనంద లక్ష్మీ నరసింహస్వామిగాను పంచనారసింహ (జ్వాల, సాలగ్రామ, వీర, యోగానంద, లక్ష్మీనృసింహమూర్తులు) క్షేత్రమైన వేదాద్రి యావదాంధ్ర దేశమునుండి భక్తులనాకర్షించుచూ పవిత్ర పుణ్యక్షేత్రముగా అలరారుచున్నది.
ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరముల క్రిందట రెడ్డిరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. తదాదిగా సర్వతోముఖాభివృద్ధి చెందుతూ వస్తోంది. కవిత్రయములో ఒకరైన ఎఱ్ఱాప్రగడ, కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి, వాగ్గేయకారుడు, శ్రీ నారాయణ యతీంద్రులు, ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని తమ కవితాధారతో పునీతము చేసినవారే. ఎఱ్ఱాప్రగడస్వామి వారి పేరిట స్తోత్ర దండకము రచించగా, శ్రీనాథ కవి ‘కాశీఖండము’లో స్వామివారిని ప్రస్తుతించెను. శ్రీ నారాయణతీర్థులు ఒకపరి తన అత్తవారి ఇల్లు వేదగిరికెదురుగా ‘‘గింజుపల్లి’’ గ్రామమునకు వెళ్ళి తిరిగి వచ్చునపుడు, కృష్ణలో ‘రావిరాల’ గ్రామమువద్ద దాటుచుండగా ఆ నీటిలో మునగటం తటస్థించింది. ఇక అప్పుడు అంతటి నారాయణ తీర్థులు మానసికంగా తత్‌క్షణమే సన్యసించగా జీవన్ముక్తులయ్యారు. వెనువెంటనే తీర్థులు ఆశువుగా కవితాధారతో వేదగిరీశుని ‘‘వేదాద్రి శిఖర నారసింహా కలయాయతే’’ అను స్తుతించి స్వామి అనుగ్రహాన్ని పొంది, లోకోద్ధరణగా సంస్కృతంలో శ్రీకృష్ణ లీలా తరంగిణి తరంగ కీర్తనలు రచించి స్వామివారి కృపకు పాత్రులైనారు. వేదాద్రి క్షేత్రము పౌరాణికముగా, చారిత్రికంగా, సాహిత్యపరంగా అలరారిన విశిష్ఠ క్షేత్రము. కృష్ణవేణి తరంగనాదంతో, ప్రకృతి సహజ సౌందర్యాలను వికసింపజేసే పునీత స్థలము. కృష్ణానదీ స్నానానికి కూడా అనువైన ప్రదేశము.

Share:

అనంతగిరి అనంతపద్మనాభస్వామి క్షేత్రము.


వికారాబాద్‌ పట్టణానికి అతి సమీపంలో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ప్రముఖ మైనది. ఈ దేవాలయం సుమారు 600 సంవత్సరాల క్రితం అప్పట్లో గోల్కొండ నవాబు నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యంగా ఉండేది. ఇక్కడ రుషులు తపస్సు చేసుకునే వారని, దేవతామూర్తులు సంతరించేవారని పురాణాలు చెబుతున్నాయి. భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ఇక్కడి అనంతపద్మనాభస్వామిని భక్తులు విశ్వసిస్తారు.
శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం సుమారు 1300 సంవత వ్సరాల పైనాటిదని చెబుతారు. విష్ణుపురాణంలో అనంతగిరి చరిత్ర ఉంది. అప్పట్లో అంతా దట్టమైన అడవి, కొండలు గుహలతో నిండి ఉండేది. ఇక్కడ మహామునులు, రుషులు తపస్సు ఆచరించేవారని ప్రతీతి ఉంది. రాక్షసులతో ముసు కుందుడనే రాజర్షి చాలా సంవత్స రాలు యుద్ధం చేసి వారిని ఓడించి తన అలసట తీర్చుకొనుటకు ఆహ్లాదకరమైన, సురక్షిత ప్రదేశమును, ప్రశాంతమైన స్థలాన్ని తెలపాలని దేవేంద్రుని కోరాడని కథనం.
అంతే కాకుండా తన ప్రశాతంతతను భంగం చేసిన వారిని తాను చూసిన వెంటనే తన చూపులకు భస్మమైపోవునట్లు వరం కోరాడు. దాంతో దేవేంద్రుడు ప్రసన్నుడై భూలోకమున అనంతగిరి క్షేత్రమున అలసట తీర్చుకొనుటకు స్థలాన్ని తెలిపి ముచుకుందుడు అడిగిన వరాన్ని ఇచ్చాడని కథనం.
దీంతో ముచుకుందుడు అనంతగిరి క్షేత్రానికి విచ్చేసి నిద్రపోయినట్లు చెబుతారు. ఇలా ఉండగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణ బలరాములు తమ శుత్రువైన కంసుని సంహరించి ద్వారకను పరిపాలిస్తుండంగా కాలయవనుడను రాక్షసుడు దండెత్తి ద్వారకను ముట్టడించి మధురా నగరాన్ని స్వాధీనం చేసుకొని ద్వారక ప్రజలను ఇబ్బందులు గురిచేస్తుండగా శ్రీకృష్ణబలరాములు రాక్షసుని ఎలాగైనా సంహరించాలనే పథకం ప్రకారం రాక్షసునికి భయపడినట్లు నటిస్తు అనంతగిరి కొండ గుహల్లో నిద్రిస్తున్న ముచుకుందుడు ఉన్న ప్రాంతానికి తమ వెంట వచ్చే విధంగా పరుగుతీసి శ్రీ కృష్ణుడు తన ఉత్తరీయాన్ని నిద్రిస్తున్న ముచుకుందునిపై కప్పి అంతర్ధాన మవుతారు. శ్రీకృష్ణబలరాములను వెంటాడుతు వస్తున్న కాలయవనుడు ముచు కుందునే శ్రీకృష్ణునిగా భావించి నిద్రాభంగం కలిగించాడు. దీంతో కోపో ద్రిక్తుడైన ముచుకుందుడు కళ్లు తెరిచి చూడడంతో కాలయవనుడు భస్మం అయ్యాడని అంతలోనే శ్రీకృష్ణబలరాములు ప్రత్యక్షంకాగా ముచుకుందుడు ఆనందంతో వారి పాదాలను కడిగి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. శ్రీకృష్ణుని పాదాలను కడిగిన జలమే జీవనదిగా మారింది.
కలియగం ప్రారంభమున మహా విష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఃఫలం ఫలితంగా సాల గ్రామ రూపంలో అనంతపద్మనా భస్వామిగా అవతరించాడని చెబుతారు.
అనంతపద్మనాభస్వామి దేవాయలం పక్కనే భగీరథ గుండం ఉంది. ఈ గుండంలో స్నాన మాచరిస్తే ఆయురారోగ్యాలతోపాటు కోరిన కోరికలు తీరు తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎక్కడ ఎంత నీటి కరువు వచ్చిన ఈ గుండాలుమాత్రం నీటితో కళకళలాడుతూ ఉంటాయి.
మార్కండేయ తపోవనం
దేవాలయం పక్కనే మార్కండేయుడు తపస్సు చేసిన తపో వనం ఉంది. ఇక్కడ మార్కండుయుడు తపస్సు చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ శివసాక్షాత్కారం పొంది బ్రహ్మదేవుని ఆరాధించినట్లు కథనం ఉంది.
ఎత్తైన కొండల్లో ప్రకృతి రమణీయతకు నిలయం ఈ దేవాలయం. దేవాలయం ప్రాంగణంలో ఆహ్లాదకరంగా చక్కటి వాతావరణంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అనంతగిరిలో అనంతపద్మనాభస్వామి పెద్ద జాతర, చిన్న జాతరగా రెండు సార్లు జాతర జరుగుతుంద
చిన్న జాతర ఆషాఢమాసంలో 5 రోజులపాటు, పెద్ద జాతర కార్తీక మాసంలో 11 రోజులపాటు జరుగుతుంది.

Share:

రామదూత యొక్క జన్మ రహస్యం.

* అంజన, కేసరిల కుమారుడే హనుమంతుడు..
* శివుని అవతారమైన ఆంజనేయుడు..
.
భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది.
.
హనుమాన్ జన్మ కథ, అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. హనుమంతుడు, అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుషకోతి యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో, కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న కోతిని చూసి, ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా, చిన్నపిల్ల అయిన అంజన కోతిపైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది, కోపంతో అంజనను, ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు కోతిగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్నా, ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు.
.
అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి, వెంటనే ఆమె కోతిరూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం 'కేసరి' అని, కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన కోతి ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం కోతి మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన, ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.
.
ఇంకో వైపు దశరధుడు, అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు, అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు, అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు, గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.
.
ఆమె కోతి ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని, కేసరినందనుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను, తన తండ్రిఅయిన కేసరి, తల్లి, అప్సర అంజన యొక్క శక్తి, వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.
.
హనుమాన్, ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు, రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ, మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.

Share:

పరమ శివుడికి సోదరి ఎవరు..?

* శివుని సోదరి యొక్క ఆసక్తికర కథేంటి ..
* పార్వతీదేవి కైలాసం నుంచి శివుడి సోదరిని ఎందుకు పంపించింది ..
.
పురాణాలను , ఏం చూసి ఏది చదివి ఉన్నాము . వాటినే నమ్ముతాం. కానీ.. చాలా ఆసక్తికరంగా ఉంటాయి. .ఆశ్చర్యపరుస్తున్న శ్రీరాముడి సోదరి రహస్య జీవితం.. !! భారతీయ పురాణాలు కూడా అలాంటివే. మనకు చెప్పిన కథలను మాత్రమే నమ్ముతాము. కానీ.. కొన్ని వాస్తవానికి జరిగినా.. వాటిని మనకు వివరించలేదు. అలాంటిదే శివుడి సోదరి జీవితం కూడా ? ఆశ్చర్యంగా ఉందా.. శివుడికి సోదరి ఎవరు అని ? నిజమే.. శివుడికి సోదరి ఉంది. ఆమె ఆసక్తికర కథేంటి ? అలాగే.. ఆమెను పార్వతీదేవి కైలాసం నుంచి ఎందుకు పంపించిందో.. తెలుసుకోండి..
.

శివుడికి సోదరి ఉందని ? ఈ విషయం చాలామందికి తెలియదు. శివుడికి సోదరి ఉందా అంటే.. చాలామంది నమ్మలేకపోతారు.
.
దేవి అసావరి .. శివ పురాణంలో.. శివుడి సోదరి గురించి ప్రస్తావించారు. దేవి అసావరిని శివుడే రూపొందించాడు. అది కూడా.. తన భార్య పార్వతీ దేవిని ఒప్పించి.. ఈమెను సృష్టిస్తాడు.
.
కైలాసం శివపార్వతుల పెళ్లి తర్వాత.. పార్వతి కైలాసానికి వస్తుంది. ఆమె తన కుటుంబాన్ని, అక్కచెల్లెల్లను దూరమవుతున్నానని బాధపడుతుఉంటుంది . కుటుంబానికి దూరం అయిన పార్వతీదేవిని.. శివుడు, శివుడి పరమ భక్తుడు నంది జాగ్రత్తగా చూసుకునేవాళ్లు. అయినా కూడా.. పార్వతీదేవి.. తనకు ఒక తోడు కావాలని అనుకొనేది .
.
పార్వతీదేవి కోరిక ...
కైలాసంలో తనకు సోదరిలా ఉండే.. ఒక తోడు కావాలని.. తన కోరికను శివుడికి వివరించింది. శివుడి ధ్యానంలోకి వెళ్లినప్పుడు తన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడానికి రోజంతా గడపడానికి ఒక తోడు కావాలని కోరుకుంది.కైలాసంలో ఎక్కువమంది మగవాళ్లు ఉంటారు. పార్వతీదేవి మాత్రమే కైలాసంలో ఉండే మహిళ.
.

సరస్వతీ దేవి ...
శివుడు.. సరస్వతీదేవిని సోదరిగా భావిస్తూ.. సరస్వతిదేవితో రోజంతా గడుపుతావా అని.. పార్వతిని అడిగాడు. ఆమెతో కబుర్లు చెబుతూ, కాలక్షేపం చేయమన్నారు.
.
బ్రహ్మ ..
సరస్వతి తన భర్త బ్రహ్మతో కలిసి ఉంటుంది కదా.. ఇక తనకు నచ్చినట్లు.. సరస్వతి దేవి ఎలా గడుపుతుందని అనుకొంటుంది.
.
శివుడి సోదరి జననం ...
పార్వతీ దేవి కోరికను.. శివుడి అంగీకరించి.. ఆమె కోరిక నెరవేర్చడానికి . తన సోదరిని మాత్రమే సృష్టించగలను అని చెప్పి.. ఆమెను జీవితాంతం.. జాగ్రత్తగా చూసుకోవాలని శివుడు..పార్వతికి చెబుతాడు.
.
అంగీకరించిన పార్వతి ..
శివుడు తన సోదరిని సృష్టిస్తాను అన్నందుకు పార్వతి చాలా సంతోషపడింది. మహిళను ఎలా సృష్టించాలి అన్నది తెలీ లేదు. అయితే తన శక్తి, తెలివిని ఉపయోగించి.. మహిళలను.. తన పోలికలతో సృష్టిస్తాడు.
.
అసావరి జననం ...
కాస్త బొద్దుగా, ఆకర్షణీయంగా, పొడవాటి జుట్టు కలిగి, పగిలిన పాదాలు, ఏమీ ధరించని, జంతువు చర్మం కలిగిన మహిళను శివుడు సృష్టిస్తాడు..
.
ఆడపడుచు ...
శివుడు ఆమెను పార్వతి దగ్గరకు తీసుకెళ్లి.. తన సోదరి అని.. దేవి అసావరిని పరిచయం చేస్తాడు. తనకు ఆడపడుచు దొరికిందని.. పార్వతి చాలా సంతోషపడుతుంది. ఆమెకు స్నానం చేయించి.. కొత్త దుస్తులను ఇస్తుంది.
.
కుటుంబం ..
తన వంటగదిలో.. తనకు భోజనం పెట్టమని పార్వతీదేవి.. దేవి అసావరి అడుగుతుంది. వెంటనే పార్వతీదేవి అసావరికి రుచికరమైన భోజనం తయారు చేసి పెడుతుంది. అంతా ఒకేసారి తినేసి.. కైలాసంలో ఉన్న ఆహారం మొత్తం అయిపోయేంత వరకు ఇంకా కావాలని అడుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయలేక అయోమయంలో పడిపోతుంది.. పార్వతి.
.
పగిలిన పాదాలు ..
పార్వతి అసావరి ఆకలి తీర్చడానికి శివుడి సహాయం కోసం బయల్దేరింది. దుర్మార్గంగా.. పార్వతిని బంధించి.. తన పగిలిన పాదాల్లో దాచుకుంటుంది.. దేవి అసావరి. ఇదంతా తెలుసుకున్న శివుడు వచ్చి.. పార్వతికి చికిత్స అందిస్తాడు.
.
అపద్ధం చెప్పిన అసావరి ...
ఆమెపై కిరాతకంగా వ్యవహరించిని అసావరిని.. పార్వతి ఎక్కడ అని శివుడు అడిగాడు. ఆమె ఎక్కడికి వెళ్తుందో తనకేం తెలుసని అసావరి అపద్ధం చెబుతుంది. అబద్ధం చెబుతోందని తెలుసుకున్న శివుడు ఆమెను హెచ్చరిస్తాడు. అందుకు భయపడి.. కాలిని కదిలించడంతో.. పార్వతి పగిలిన పాదాల్లో నుంచి బయటపడుతుంది.
.
తాను ఇచ్చిన మాట తప్పిన పార్వతి ..
చాలా కిరాతకంగా వ్యవహరించిన అసావరి ప్రవర్తన గురించి బాధపడిన పార్వతి.. ఆమెను కైలాసం వదిలివెళ్లమని అడుగుతుంది. అసావరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పినట్టు మాట తీసుకున్నానని.. శివుడు గుర్తు చేస్తాడు.
.
మంచి బుద్ది ...
మాట తప్పినందుకు శివుడిని క్షమాపణ కోరిన పార్వతి.. అసావరితోపాటు.. కైలాసంలో ఉండటం కష్టము అన్ని అంటుంది. అసావరికి మంచి బుద్ధి ప్రసాదించాలని.. శివుడు నిర్ణయించుకుంటాడు. అసావరి చాలా వినయ విధేయతలు కలిగి ఉంటే.. తనకు ఎలాంటి సమస్య ఉండదని, కైలాసంలో ఆమెతో పాటు ఉంటానని చెబుతుంది పార్వతి.
.
సందేశం ..
అయితే పార్వతి అభ్యర్థనను శివుడు తోసిపుచ్చుతారు. ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు.. ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరని.. చెబుతాడు శివుడు. అంటే రక్త సంబంధం కాకుండా.. ఇతర మహిళతో సంతోషంగా ఉండలేరని వివరించారు...
Share:

అశ్వ క్రాంత్ అలయం.


అస్సాం లోని అశ్వ క్రాంత్ హిందూ మతం పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం. గౌహతి బ్రహ్మపుత్ర సమీపంలో ఉన్న ఈ ఆలయం కూడా అత్యద్భుతమైనఅందాన్ని చేరవేస్తుంది. అస్సాంలోని అతిపెద్ద హిందూ మతం దేవాలయం అశ్వ క్రాంత్ ఆలయం శివ సింహుడు శివసాగర్ శివ డోల్ ప్రసిద్ధ అలయాలు 1720 లో అహోం రాజు శివ సింఘా నిర్మించారు. ఆలయ శక్తివంతమైన బ్రహ్మపుత్ర వడ్డన కలదు. ఆ పవిత్ర స్థానంలో రెండు ఆలయాలు ఉన్నాయి. ఒక ఫుట్ కొండ కలదు కొండకు వరోకటి అశ్వ క్రాంత్ అలయం కలదు. దీన్ని పడవల మీద నే చేరుకో గలం .ఇక్కడ విష్ణు మూర్తి తాబేలు పై ,కప్ప పై నీటిలో నీటి పై తేలుతూ పడుకొని ఉండటం విశేషం .సోమవారం అమా వాస్య రోజున విశేషం గా భక్తులు వచ్చి సందర్శిస్తారు .బ్రహ్మ పుత్రా నదీ మధ్య లో పీకాక్ ద్వీపం లో ఉమా నంద శివాలయ ,ఉమా దేవి ఆలయం ఉన్నాయి ఇదో విచిత్రం విశేషం .

Share:

మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం.

కడప జిల్లాలోని సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో పెన్నా నది ఒడ్డున ఇసుకలో కప్పబడి ఉన్న 108 శివాలయాల ఆలయాన్ని వెలికితీశారు, ఈ ఆలయం 1213 వ సంవత్సరానికి చెందినది గా గుర్తించారు. 108 శివాలయాలు గల ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది.

ఈ 108 శివాలయాలు గల దేవాలయాన్ని రక్కసి గంగారయదేవ అనే రాజు మరియు అయన అంగరక్షకుడు అయిన జంటిమనాయకుడు 12వ శతాబ్దంలో నిర్మించారని ఆ తరువాత ముస్లిముల పాలనలో ఇసుకతో పూడ్చి వేసారు.
ఈ పవిత్రమైన యాత్ర స్థలాన్ని శ్రీశైలానికి ఉన్న నాలుగు ద్వారములలో జ్యోతి కూడా ఒక ద్వారము. ఆలంపూర్ , త్రిపురాంతకం మరియు ఉమామహేశ్వరం మిగతా మూడు ద్వారాలు.

ప్రసిద్ద చరిత్రకారుడైన మేక్కేంజి ఈ ఆలయాన్ని 1806వ సంవత్సరంలో దర్శించారు. చరిత్ర పరిశోధకుడైన రోబర్ట్ సీవెల్ 1878 వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని సందర్శించారు.
పురావస్తుశాఖ ఆద్వర్యంలో జరిపిన తవ్వకాల్లో సుమారు 6 దేవాలయాలు ఇంకా చతుర్ముఖ శివలింగం, సూర్యుని విగ్రహం మరియు నాగ శిలలు బయటపడినాయి, వీటిని దశాబ్దాల క్రితమే చెన్నై మ్యూసియంకు తరలించారు.
శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయం ఉత్తర ముఖంగా ఉంటుంది. ఈ ఆలయములోని శిలా శాసనమును బట్టి కాకతీయ రుద్రమ్మ దేవి వెండి రథము, వజ్రపు కిరీటం ఈ ఆలయమునకు బహూకరించినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఆలయం లోపలి భాగం మాత్రం పటిష్టంగా ఉన్నా బయట నుండి మాత్రం ఎప్పుడు కూలుతుందో అన్నట్లుగా అత్యంత దయనీయ స్థితిలో ఎటువంటి అభివృద్ది పనులకు నోచుకోకుండా అధికారుల నిర్లక్ష్యానికి నిలువేత్తు సాక్ష్యంలా నిలిస్తోంది, ఈ ఆలయం చుట్టుపక్కల ఎక్కడా కానీ పురావస్తుశాఖ ఆనవాళ్ళు కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడం గమనార్హం... స్థానిక ప్రజలే ఈ ఆలయ ఆలన పాలన చూస్తున్నారు.
ఎంతో మహిమాన్వితమైన ఈ దివ్య క్షేత్రం ఈ దేవాలయాన్ని పునర్నిర్మిస్తే పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుంది.
ఇక్కడికి చేరుకోవడానికి కడప నుండి సిద్దవటం చేరుకుంటే అక్కడి నుండి జ్యోతి గ్రామానికి ఆటోలు వెళుతుంటాయి.
Share:

శ్రీ అవధూత భక్తయోగ కాశిరెడ్డి నాయన.


కాశినాయనమండల పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న జ్యోతిక్షేత్రం. నిస్వార్ధ సాధువు గా, శిథిలావస్థలో ఉన్న అనేక ఆలయాల పునరుద్ధ్దరణకర్తగా, పలు జిల్లాల ప్రజలకు కాశిరెడ్డినాయన స్థిరపరిచితుడే. వివిధ ప్రాంతాలకు చెందిన కాశినాయన భక్తులు స్వచ్ఛందంగా ధాన్యం చేరవేస్తూ, ఆరాధన ఉత్సవాల ఏర్పాట్లలో సేవ చేస్తున్నారు. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చనిచెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి రమణీయకతతో కనిపించే జ్యోతిక్షేత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుంది. ప్రతి సంవత్సరం జరిగే ఆరాధన ఉత్సవాలకు దాదా పు రెండు లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఎంతమంది వచ్చినా అందరికీ రుచికరమైన రకరకాల వంటలు వండిపెట్టడం విశేషం. చిన్ననాటనే గొప్పయోగి కాగల చిన్నెలు వెల్లడికాగా ప్రాయమున గురూపదేశమయింది. యోగసాధనలో అత్యున్నత స్థాయిని అరదుకున్న అవధూత కాశిరెడ్డి నాయనగా ప్రసిద్ధుడైన మున్నెల్లి కాశిరెడ్డి.
.
నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లె గ్రామానికి చెరదిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతుల కడుపు పంట కాశీవిశ్వేశ్వరుని ప్రసాదమే కాశిరెడ్డి. 1895లో సంక్రాంతి కనుమ పండుగ అయిన జనవరి 15 ఆదివారం నాడు జన్మించిన కాశిరెడ్డిని పుట్టుకతోనే దైవీగుణములు వెన్నంటినవి.
.
తల్లి కాశమ్మ ఒకనాడు తమ పొలంలో పని చేస్తున్న కూలీలకు అన్నం తీసుకుపోతూ కాశిరెడ్డిని చంకన వేసుకుని పోయినది. ఆ బాలుడిని ఒక చెట్టు క్రింద పడుకోబెట్టి కూలీలకు అన్నం పెడుతున్నది. పట్టపగటి ఎండ శిశువు ముఖం మీద పడకుండా ఒక నాగుపాము పడగ విప్పి నీడపట్టినది. కాశిరెడ్డికి ఏ కీడు జరగనందుకు సంతోషంరచిన కాశమ్మ ఊరిపెద్దలకీ వింత చెప్పినది. వారు ఈ పసివాడు గొప్ప సిరిగల వాడవుతాడు లేదా గొప్పయోగి అవుతాడని అన్నారు. కాశిరెడ్డి ముద్దు ముచ్చటలు చూడకురడానే తండ్రి సుబ్బారెడ్డి కన్నుమూసాడు.
.
కాశమ్మ పిల్లలతో పుట్టిల్లు కొత్తపల్లెకు చేరుకున్నది. ఆమె తండ్రి అంబవరం బాలి రెడ్డి బిడ్డను ఆదు కున్నాడు. ఐదేళ్ళ కాశిరెడ్డి వేమూరి రామయ్య వీధి బడిలో గుణంతాలు, శతకాలు, అమరం, రామాయణ భాగవతాలు చదువుకున్నాడు. అక్క కాశమ్మకు మేనమామతో పెండ్లయినది. కాశిరెడ్డి స్వగ్రామం బెడుసుపల్లి భూములు పాలివారడ్లకు అమ్మి కొత్తపల్లిలో భూమి కొని, ఇల్లుకట్టుకుని వ్యవసాయం చేసాడు. కాలగతిలో అమ్మతాతలు, తరువాత కన్నతల్లి చనిపోయారు. వచ్చిన సంబంధాలు వివిధ కారణాల వల్ల నచ్చక కాశిరెడ్డికి పెళ్ళి కాలేదు.
.
యవ్వనంలోనే జిజ్ఞాసువైన కాశిరెడ్డి, కొట్టాల గ్రామవాసి బ్రహ్మవేత్త కొరడా రాఘవరెడ్డి సాంగత్యరతో వేదాంత గ్రంథాలు జీర్ణించుకోవడంతో, ఆయనలో వైరాగ్య బీజాలు పొటమరించాయి. కృష్ణాపురంలో అత్తిరాసు గురవయ్య బ్రహ్మబోధ చేస్తాడని విని ఆయనను ఆశ్రయిరచాడు. గురవయ్య కొన్ని దినాలు కాశిరెడ్డిని పరీక్షించి అతని అర్హతలు గుర్తించి ఒక గురువారంనాడు పంచాక్షరీ, షడక్షరీ మంత్రాలుపదేశించి, హస్తమస్తక యోగం చేసి, తారకయోగము, షణ్ముఖీ ముద్ర సాధించే విధానము చెప్పి అనుదినం తన సాధనానుభవాలు చెప్పమ న్నాడు. కాశిరెడ్డి ఒక్కొక్క మెట్టు యోగం సాధించి గురువుకు తెలియజేశాడు. ఆయన శీఘ్రగతిని గ్రహించిన గురవయ్య నీవు అవధూతవవుతావని దీవించాడు.
.
కాశిరెడ్డి తన పొలం అక్క కాశమ్మకిచ్చి 1965 డిసెంబరులో ఇల్లు విడిచాడు. గ్రామాల్లో పురాణ కాలక్షేపాలు చేస్తూ వరికుంట్లలో శివాలయం జీర్ణోద్ధరణ చేసి, పెద్ద చిన్న అహోబిల క్షేత్రాలలో నరసింహదేవుని అర్చించి, గరుడాద్రి చేరాడు. అక్కడ ఒక పర్ణశాల ఏర్పరచుకుని తపస్సు చేసాడు. అయా చితంగా ఏది లభిస్తే అది తిని, గురువు చెప్పిన సాధనలు చేసి అష్టసిద్ధులను కైవశం చేసుకున్నాడు. తీవ్రసాధనతో ఆయనకు ఒకనాడు నిశ్చల సమాధి ఏర్పడి భగవత్సాక్షాత్కారం లభించినది. దేహం చాలించాలని అనుకున్న కాశిరెడ్డికి తాను చేయవలసిన పనులు జీర్ణదేవాలయోద్ధరణలు, నూతన దేవాలయాల నిర్మాణం, భక్తి జ్ఞాన వైరాగ్యముల ప్రచారం, నిత్యాన్నదాన కార్యమ్రాలు ఉన్నట్లు భగవదాదేశమైనది.
.
భగవదాదేశం నెరవేర్చడానికి కాశిరెడ్డి దేశ సంచారం ప్రారంభిరచాడు. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కాశిరెడ్డి పలు జీర్ణమైన దేవాలయాలను, సమాధులను, కోనేరులను పునరుద్ధరించి, నూతన దేవాలయాలు నిర్మించి, అన్నసత్రాలు నిల్పి నిర్వహించాడు. ఆయన ధనికులకు, దరిద్రులకు, అధికారులకు, రాజకీయ నాయకులకు చేసిన మేలు ఫలితమది. అది ఆయన దయాంతఃకరణం చేత, తపోబలం వల్ల సాధ్యమైనది.
.
గంగనపల్లె వీరారెడ్డి కాశినాయన శిష్యుడు. అతడు గురువుపై అలిగి కాశీకి బయల్దేరాడు. ఆ విషయం నాయనకు తెలిసి ”వాడెక్కడ పోతాడు? మధ్యనుండే తిరిగి వస్తాడు” అన్నారు. ఈ చర్చ మామిళ్ళపల్లిలో జరుగుతుండగా వీరారెడ్డి తిరిగి వచ్చాడు. చుట్టూ మూగిన జనం అడిగితే తాను రైలులో పోతురడగా నాయన వచ్చి తనమూట క్రిందికి దించి, తన రెక్కపట్టి రైలుబండి నుండి క్రిందికి లాగినాడన్నాడు. వీరారెడ్డి కాశినాయనను క్షమార్పణ కోరితే ”నీవు కాశీకి పోతే నిన్నెవరు సమాధిచేస్తారు? నీకు ఐదు దినాలలో మరణమున్నది” అన్నారు. అన్నట్లే వీరారెడ్డి ఐదవనాడు చనిపోతే 1986ఫిబ్రవరి 19న నాయన అతనికి సమాధి కట్టించాడు. గురువుల సమాధి కట్టించవలసిన శిష్యునికి గురువే సమాధి కట్టిరచాల్సి వచ్చింది. అదే దైవలీల!
.
గ్రామంలో కాశినాయన భానుమండలం లక్ష్మీనారాయణ ఆలయాన్ని బాగుచేయిస్తురడగా మొదటిసారి వచ్చిన కోట్ల విజయభాస్కర రెడ్డి గొప్ప భక్తుడయ్యాడు. అప్పుడే నీవు ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రివి అవుతావని నాయన దీవించాడు. కాలాంతరంలో ఆ దీవెన ఫలిరచిరది. కాశిరెడ్డి మహిమలు చూసిన వారు, మేలు పొందినవారు కొందరు ఆయనను నాయన అంటే మరికొందరు తాత అనేవారు.
.
పలు ప్రారతాల్లో పర్యటనలు, ఆనేక ఆలయాల జీర్ణోద్ధరణ, నూతన నిర్మాణాలు 1995 సంవత్స రారతానికి పూర్తయ్యాయి. అన్నపూర్ణ, వినాయక ప్రతిష్ఠల కోసం కాశినాయన 1995 డిసెంబరులో లిరగాల కోన నురడి వచ్చారు. విగ్రహాల ప్రతిష్ఠ అనంతరం తెల్లవారుఝామున కారులో వెళ్ళి కూచున్న ఆయన అక్కడే పరమాత్మలో ఐక్యమయ్యారు. తర్జన భర్జనల అనంతరం భక్తులు ఆయన పార్థివ దేహాన్ని యోగానందాశ్రమంలో విధివిధానోక్తరగా సమాధి చేసారు. సమాధి చెరత నిత్యార్చన, కార్తీక సోమ వారాలు, నాయన ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

గవిపురం కేవ్ టెంపుల్.


బెంగుళూరులో ఉన్న ఈ దేవాలయం బహుళ ప్రాచుర్యం పొందిన ఒక ఆకర్షణ. దీనిని గవిపురం కేవ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు, సూర్యుని కిరణాలు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో గర్భగుడి లో విగ్రహం మీద పడతాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఖచ్చితమైన ప్రణాళికకు ప్రసిద్ధి గాంచింది.
పరమశివుడికి అంకితమైన ఈ గవి గంగాదారేశ్వర ఆలయం, ఇండియన్ రాతి నిర్మాణానికి ఒక పరిపూర్ణ ఉదాహరణ. ఈ ఆలయాన్ని ఒక భారీ రాతి నుండి 9వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయ విశిష్టతఈ ఆలయానికి వేలకొద్ది భక్తులు జనవరి నెలలో వొచ్చే మకర సంక్రాంతి నాడు వొస్తారు. ఆరోజున సూర్యుని కిరణాలు మందిరం లోపల ఉన్న శివలింగం మీద ఒక గంటపాటు పడతాయి. తరువాత ఆలయం ముందు ఉన్న విగ్రహం,నంది కొమ్ముల మధ్య నుండి వెళతాయి. మన ప్రాచీన శిల్పులకు ఖగోళశాస్త్రం మరియు నిర్మాణశాస్త్రంలో చాలా పరిజ్ఞానం గలవారని ఈ దృశ్యం రుజువు చేస్తున్నది.
ఇక్కడ శివుని విగ్రహంతోపాటు, ఈ దేవాలయంలో అరుదుగా కనిపించే అగ్నిదేవుని విగ్రహం కూడా ఉన్నది. నేడు, గవి గంగాధరేశ్వర కేవ్ టెంపుల్, పురావస్తు స్థలాలు చట్టం 1961 మరియు కర్ణాటక పురాతన మరియు చారిత్రక ఆనవాళ్ళు క్రింద రక్షించబడుతున్న ఒక స్మారక చిహ్నం. నగరం లోపల బసవన్నగుడి ప్రాంతంలో ఉన్నది, ఇక్కడకు అన్ని రకాల రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవొచ్చు.

Share:

గ్రిషనేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం.

ఔరంగాబాద్ లో ఎల్లోరా గుహలకు సమీపంలో కలదు. దీని నిర్మాణ కర్త అహిల్యాభాయ్ హోల్కర్. ఏటా వేలాది భక్తులు దీనిని దర్శిస్తారు. ఈ దేవాలయాన్ని సుమారు 400 సంవత్సరాల క్రిందట ఛత్రపతి శివాజి మహారాజ్ పితామహుడు 16వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు చెపుతారు. ఈ జ్యోతిర్లింగం ఔంధా నాగ్ నాధ్ నుండి తేలికగా చేరవచ్చు. రోడ్డు ద్వారా షుమారు 4 గంటల సమయం ప్రయాణించాలి.

Share:

అద్భుత కోపేశ్వర దేవాలయం.


మహారాష్ట్రలోని మరుగున పడ్డ మహనీయ క్షేత్రమిది..ఇక్కడి శిల్పకళారా మమైన కోపేశ్వర మందిరం ప్రతి ఒక్కరూ చూడవలసినది. దీన్ని శిలాహర్‌ వంశానికి చెందిన గండరాది త్యుడు, రెండో భోజుడు క్రీ.శ. 1109-1180 మధ్యలో నిర్మించినట్లు తెలిపే శాసనాలు దొరికాయి.దగ్గర దగ్గర 104 ’పొడవు, 65’ వెడల్పు. 55’ ఎత్తుతో ఉన్న ఈ బృహన్మందిరంలో ప్రధానంగా నాలుగు భాగాలు ఉన్నాయి.
స్వర్గమంటపం, సభామంటపం, అంతరాళ కక్ష్య, గర్భగృహం అడుగడుగునా కళ్లు చెదిరేలా శిల్పసంపద నిక్షిప్తమై ఉంది. స్వర్గ మంటపం గుండ్రంగా 36 వ్యాసంతో ఉంది. చుట్టూ కప్పుకి ఆధారంగా పన్నెండు స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం మీదా రాజవంశీయుల శిల్పాలు అందంగా అమర్చారు. మంటపం మధ్యలో 14 వ్యాసం కలిగిన నల్లని శిల ఉంది. తలపైకెత్తి గోపుర గవాక్షం చూస్తే అద్భుతంగా ఆకాశం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసపు తొలిరోజు (ఉగాదినాడు) ఈ గవాక్షంలోంచి సూర్యకిరణాలు నేరుగా కోపేశ్వర స్వామిని సృ్ఫశిస్తాయి.
ఇంత అద్భుతంగా దేవాలయ గవాక్షాన్ని మలచిన మధ్యయుగాల నాటి ఆలయ నిర్మాతలు ఎంతటి విజ్ఞానవంతులో! దీని తర్వాతది సభామంటపం-యాభై అడుగుల చదరం. లోపలి కక్ష్యలో 12, బయటి కక్ష్యలో 20 స్తంభాలున్నాయి. 20 నుంచీ 25 పొడవుండే ఏకశిలా స్తంభాలివి. వీటికి అనేక పార్శ్యాలు న్నాయి. సభామండపం పై కప్పు మీద విరిసిన పద్మం 3డి పద్ధతిలో ఆవిష్కృతమై అద్భుతంగా ఉంది. ఈ మండపం అంతా ఫలపుష్పాలతో, పూర్ణకుంభాలతో నిండి శిలాహార రాజవంశీయుల కళాభిరుచికి అద్దం పడుతోంది. గాలి వెలుతురుల కోసం ఎక్కడికక్కడ గవాక్షాలు ఉన్నాయి.
20 చదరపు అంతరాళ కక్ష్య దాటి వెళ్లితే గర్భగృహం ఉంది. అందులో దక్షిణాముఖుడైన ఈశ్వరుడు కంచు సర్వభూషణంతో దర్శనమిస్తాడు. ఇంతటి మహోన్నత ఆలయాన్ని మరుగున పడనీయకుండా బ్రతికించుకోవాడానికి పదుగురినీ తీసుకువెళ్లి పరిచయం చేస్తే ఆలయానికి భక్తులు పెరుగుతారు, భక్తుల రాకపోకతో ఆలయన్ని ఆదరించి నిలపాలన్న ఆరాటమూ పెరుగుతుంది.

Share:

ఛత్తీస్గఢ్ ఖజురహో శివాలయం.


ఛత్తీస్గఢ్ రాష్టంలోని కబీర్ థామ్ జిల్లాలో కవాద్ద పట్టణం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఛారు గ్రామంలో కలదు.భోరందేవ్ దేవాలయం, కబీర్ ధాం (22.116N 81.148E) శివాలయం ఒక చాలా పాత హిందూ మతం ఆలయం మంచు పర్వత శ్రేణులు నడుమ ఉన్న ఈ ఆలయం, 11 వ శతాబ్దం 1089 AD కాలంలో నిర్మించబడింది. ఆలయ లో ఫణి నగవంష్ రాజు గోపాల్ దేవ్ మరియు చరిత్ర మరియు పురాతత్వ శాస్త్రం యొక్క ప్రేమికులకు ఒక ప్రత్యేక ఆకర్షణ కలిగి జరిగినది.
పెద్ద పర్వతాలు మరియు దట్టమైన అడవులు, మతపరమైన మరియు శృంగారశిల్పాలు, భోరందేవ్ ఆలయ పరిపూర్ణ సమ్మేళనంగా యొక్క సుందరమైన పరిసరాలు నడుమ నగర్ శైలి లో రాతి రాళ్లపై చెక్కారు. ఆలయంలో శివలింగం అందంగా చెక్కిన మరియు కళాత్మక ఉంది. భోరందేవ్ ఆలయం ఖజురహో ఆలయం తో పోలి ఉంది, మరియు అది కూడా ఛత్తీస్గఢ్ ఖజురహో అంటారు ఎందుకు అని. సహజ అందం నేపథ్యంలో, ఈ ఆలయం కూడా దాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఉంటుంది.
పడమటి దిశా లో తప్ప ఈ టెంపుల్ ను మిగిలిన అన్ని దిక్కులలోను ప్రవెశించవచ్చు. శివలింగం గర్భ గుడిలో వుంటుంది . ఇక్కడ ఇంకా విష్ణు, శివ, గణేశ మూర్తులను టెంపుల్ బయటి గోడలపై అందంగా చేక్కినవి చూడ వచ్చు. ఇక్కడ కల సింహ, ఏనుగుల విగ్రహాలు టెంపుల్ కు మరింత ఆకర్షణ థెచ్చాయి. ఉమా మహేశ్వర నటరాజ్, నరసింహ, కృష్ణ, న్రిత్య గణేశ, కార్తికేయ, చాముండా సప్త మాత్రిక, లక్ష్మి నారాయణ మరియు ఇతర దేముల్ల విగ్రహాలను కూడా ఈ టెంపుల్ లో చూడ వచ్చు. టెంపుల్ గోడలపై రామ కదా లిఖించారు . ఇక్కడ కల శృంగార శిల్పాలు, ప్రపంచం అంతా ప్రసిద్ధి గాంచాయి. ఇవి ఆనాటి ప్రజల జీవన శైలి ని ప్రథిబిమ్బిస్తాయి. ఈ టెంపుల్ లో అనేక పవిత్ర కార్యక్రమాలు భక్తులు నిర్వహిస్తారు.

Share:

ప్రపంచంలోనే ఏకైక పదమూడు అంతస్థుల కైలాష్ నికేతన్ ఆలయం.


ఉత్తరాఖండ్ లో హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్న రిషికేశ్ పూజింపబడిన పుణ్యక్షేత్రం. ఆరాధనాభావం గంగా దాని అత్యద్భుతమైన ఆకర్షణ జోడించడం ద్వారా ప్రవహిస్తుంది. రిషికేశ్ ప్రపంచ యోగ కాపిటల్ మరియు ధ్యానం ఒక అద్భుతమైన ప్రదేశం. తేరా మంజిల్ (పదమూడు అంతస్థుల నిర్మాణం) శివుడు మూడు కళ్ళు హిందూ మత దేవాలయం మరియు దీనిని త్రిమ్బకేస్వర్ అని పిలుస్తారు. ఇతర సాధారణ దేవాలయాలు నుండి అసమాన దాని ఏకైక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆలయ అన్ని హిందూ మతం దేవతలు మరియు దేవుళ్ళ శిల్పాలు ప్రతిష్టించారు. లక్ష్మణ్ జూలా సమీపంలో ఉన్న తేరా మంజిల్ ఆలయం ఈ ఆలయ పదమూడు అంతస్థుల నుండి సూర్యాస్తమయం వీక్షణ అద్భుతం. ఆలయం గంగా నది ఒడ్డున అందమైన మనోహరంగా హిమాలయ శ్రేణులు బ్యాక్డ్రాప్లో ఉన్న. కొంతమంది పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకటిగా ఈ ఆలయ భావిస్తారు. దేవాలయం చుట్టూ అద్భుతమైన సహజ అందం మంది భక్తులు పాటు పర్యాటకులను ఆకర్షిస్తుంది.

Share:

ప్రియురాలికి కోసం కట్టించి ఇచ్చిన అధ్భుతమైన రాణి మందిరం.

నవాబ్ ప్యాలెస్ - అరుంధతి కోట.
“బొమ్మాళీ నిన్ను వదలా ” మర్చిపోయే డైలాగా ఇది..”అరుంధతి” సినిమా 2009 లో వచ్చింది సూపర్ హిట్ అయ్యింది..” అయితే అనుష్క, స్టోరీ, కోడిరామకృష్ణ టేకింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమాకి ..ప్రధాన పాత్ర పోషించిన అరుంధతి కోట కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంది.. అసలిలాంటి “కోట” ఉందా.? ఉంటే ఎక్కడ ఉంది.? ఇప్పుడెలా ఉంది.? అరుంధతి సినిమాని అక్కడే తీసారా, సెట్ వేసారా.. ఇలాంటి డౌట్స్ కి సమాధానం కావాలంటే కచ్చితం గా “కర్నూల్” కి 80 కిలోమీటర్ల దూరం లో ఉన్న “బనగానపల్లి” వెళ్తే అక్కడే కనపడుతుంది ఈ కోట బంగ్లా..
.
బనగానపల్లి కోట యాగంటి వెళ్ళే మార్గంలో ఉంది. ఈ కోట ఒక పెద్ద గట్టు మీద ఉంటుంది. ఇది నవాబుల వేసవి విడిది కానీ అక్కడున్న ప్రజలు దీనిని తన ప్రియురాలికి కోసం కట్టించి ఇచ్చిన కోటగా చెబుతారు. కోట అయితే కాస్త శిధిలమైపోయింది అయినా కూడా ఇప్పటికీ కోట వన్నె తగ్గలేదు. ఈ కోటలో సుమారుగా 9 గదులు మరియు ఒక పెద్ద హాలు కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది. ఇక్కడే "అరుంధతి సినిమా" షూటింగ్ జరిగింది. ఇక్కడ ఆ సినిమా చేయడం వల్లన దీనిని అరుంధతి కోట గా ఇక్కడి ప్రజలు పిలిచుకుంటారు. యాగంటి మార్గంలో గల చిన్న కొండపై 400 ఏళ్ళనాడు బనగానపల్లె నవాబు తన ప్రేయసికోసం నిర్మించిన అందమైన భవంతి సైతం యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంది. తెలుసుకోవాలన్న ఆశక్తికి సమాధానమే ఈ బనగానపల్లి కోట. ఈరోజుకీ అక్కడికి వచ్చి ఆ కోటంతా తిరిగి చూసి కాసేపు గడిపేవాళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పటికీ చెక్కుచెదరని ఈ అద్భుతమైన కోట ఆంధ్రప్రదేశ్ లో చూడదగ్గ మంచి టూరిస్ట్ ప్లేసులలో ఒకటి. బనగానపల్లె మండలంలోని పాతపాడు గ్రామ సమీపంలోని ఈ నవాబు బంగ్లా కలదు.
.
బనగానపల్లె సంస్థానం చరిత్ర:
1601 లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరు కు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తిఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ మేనమామ, ముబారిజ్‌ ఖాన్‌ దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది.
.
అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులు గా కొన్నాళ్ళు, ఆ తరువాత 1724 లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్‌ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్‌ ఆలీ ఖాన్‌ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో మైసూరు రాజు హైదరాలీ సామ్రాజ్య‌ విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. 1783లో హుసేను మరణించాక, అతని కుమారుడు, చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన టిప్పు సుల్తాను వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు హైదరాబాదు లో తలదాచుకున్నారు. మళ్ళీ 1789 లో బనగానపల్లె కు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని చెంచెలిమల జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.
.
1800 తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియా లో ఒక సంస్థానం గా మారిపోయింది. ఆర్ధిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905 లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901 లో బనగానపల్లె సంస్థానం 660 చ కి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి.
.
1948 లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953 లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పడ్డాయి.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

ఉమా నంద స్వామి ఆలయం.


అస్సాం లో గౌహతి లోని బ్రహ్మపుత్ర నదిలో పీకాక్ ఐలాండ్ అనే చిన్న నదీ ద్వీపం మీద ఉన్నది. ఈ ఆలయంలో దైవం గా శివుని ఉమా నంద స్వామి ఆలయం ఉంది . గాదధార్ సింగ్ అహోం రాజవంశం పాలకులు 1694 AD లో అలయాన్ని నిర్మించారు. అసలు ఆలయం ఒక భూకంపం ద్వారా దెబ్బతింన్నది తరువాత స్థానిక వ్యాపారులు దిన్ని పునర్నిర్మించబడింది. ఆలయ గోడలు దేవుళ్ళ మరియు దేవతల యొక్క విగ్రహలు అద్భుతంగా చెక్కబడినవవి. స్వామికి అయిదు ముఖాలు పది చేతులు ఉండటం వింత .అమ్మ వారు ఉమా దేవి .ఇక్కడే రతీ మన్మధుల ఆలయం ఉండటం విశేషం .శివుడు తెరచిన మూడో కన్నుకు మన్మధుడు భాస్మమయిన ప్రదేశం ఇది శివ .పార్వతీ పరిణయం జరిగిన తర్వాతా ఆ దంపతులు మళ్ళీ బ్రతికించారు పార్వతికి ఆనందం కలిగించిన ప్రదేశం కనుక స్వామికి ఉమా నందుడు అని పేరొచ్చింది.

Share:

అష్ట వినాయకుల దర్శనం ... సర్వ పాప హారణం.


* కోరిన కోర్కెలు తీర్చే అష్ట గణేషులు ...
* అష్టవినాయక క్షేత్రాల .. దర్శినం ముక్తిదాయకం ...
.
.ఓం గం గణపతయే నమో నమః
సిద్ధి వినాయక నమో నమః
అష్ట వినాయక నమో నమః
గణపతి బప్పా మోరియా... జగన్మాత పార్వతీదేవి తనయుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలందుకుంటాడు. ఎలాంటి కార్యాన్నయినా ప్రారంభించేముందు స్వామిని పూజించి ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. ఆదిదంపతుల ప్రథమ పుత్రరత్నమైన గణనాధుడికి తొలి పూజ అన్ని విధాలుగా అన్ని శుభాలను చేకూర్చుతుంది.
.
పంచారామ క్షేత్రాలను ఒక్క రోజులో దర్శించుకుంటే ముక్తిదాయకం అని చెబుతారు. అదే కోవలో మహారాష్ట్రలోని అష్టవినాయక క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవడం ఆనవాయితీ. కాకపోతే ఒక్కరోజులో కష్టం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే రెండు రోజుల్లో అన్ని చోట్లకూ వెళ్లొచ్చు.
.
బల్లాలేశ్వరుడు :..
ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా తన మానసిక స్థితిని అచలంగా, దృఢంగా ఉంచుకునే శ్రీ గణేశుని శ్రీ గిరిజాత్మజుడు అని అంటారు.
పుణెకి 100 కిలో మీటర్ల దూరాన పాలి క్షేత్రంలో వెలసిన స్వామి బల్లాలేశ్వరుడు అంటే బాలగణపతి అనుకోవచ్చు. అష్ట క్షేత్రాల్లోనూ ఒక భక్తుడి పేరిట వెలసిన స్వామి ఈయనే. బల్లాల్‌ అనే పరమ భక్తుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన గణపతి అతని పేరుతోనే ఈ గ్రామంలో వెలిశాడని స్థలపురాణం. తూర్పముఖంగా వెలసిన బల్లాలేశ్వరుడి విగ్రహంపై దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు పడటం ఇక్కడి ప్రత్యేకత.
.

వరద వినాయకుడు :...
మహాదాని మరియు వరదానీ దృష్టిద్వారా సర్వుల మనోకామనలను పూర్తి చేసే శక్తిని ప్రాప్తి చేసుకున్న కారణంగా శ్రీ గణేశుని శ్రీ వరద వినాయకుడు అని అంటారు.
మహడ్‌ క్షేత్రంలో స్వామి వరద వినాయకుడు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రుక్మాంగదుడనే మహారాజు వాచక్నవి అనే రుషి దర్శనార్థం ఈ గ్రామానికి వచ్చాడట. రాజు వైభోగాన్ని కళ్లారా చూసిన రుషిపత్ని ముకుంద అతనిపై మనసు పడింది. రాజు అందుకు ఒప్పుకోకుండా అక్కణ్నుంచి వెళ్లిపోగా అదే అదనుగా ఇంద్రుడు రుక్మాంగదుడి రూపంలో ముకుంద దగ్గరికి వచ్చాడట. ఆ ఆ కలయిక వల్ల గృత్సమధుడు అనే పిల్లవాడు పుట్టాడు. పెరిగి పెద్దయ్యాక తన పుట్టుక రహస్యం తెలుసుకున్న ఆ కుర్రవాడు.. అందరి పాపాలూ తొలగిపోవాలని వినాయకుణ్ని ప్రార్థించాడట. ఆ పిల్లవాడి భక్తికి మెచ్చిన గణనాథుడు ప్రత్యక్షమై కోరిన వరాన్ని ఇచ్చి అక్కడే స్వయంభువుగా వెలిసి వరద వినాయకుడిగా సుప్రసిద్ధుడయ్యాడట. ఈ స్వామి ఆలయంలో గర్భగుడిలోని దీపం గత వందేళ్లుగా అఖండంగా వెలుగుతోందని చెబుతారు స్థానికులు.
.

చింతామణి గణపతి :..
ప్రభు చింతనద్వారా అందరి వ్యర్ధ చింతలను సమాప్తము చేసే శక్తి ఉన్న కారణంగా శ్రీ గణేశుని పేరు శ్రీ చింతామణి అయింది.
షోలాపూర్‌ పుణె మార్గంలో ఉండే థేవూర్‌ క్షేత్రంలో స్వామి చింతామణి గణపతిగా పూజలందుకుంటున్నాడు. పూర్వం కపిల మహాముని వద్ద కోరిన కోర్కెలు తీర్చే ‘చింతామణి’ అనే రత్నం ఉండేదట. ఒకసారి ఆ ప్రాంతాన్ని పాలించే అభిజిత మహారాజు కొడుకైన గణరాజు.. కపిల మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. చింతామణి సాయంతో యువరాజుకూ అతని పరివారానికీ అప్పటికప్పుడు విందు సిద్ధం చేశాడట ఆ మహర్షి. ఆ వింతకు ఆశ్చర్యపోయిన యువరాజు కపిలమహామునిని ఏమార్చి చింతామణిని అపహరించాడు. అప్పుడు కపిలుడు వినాయకుని ప్రార్థించి ఆ మణిని తిరిగి పొందాడనీ.. గణరాజును చంపి ఆ మణిని తెచ్చిచ్చిన గణపతి ‘చింతామణి గణపతి’గా ప్రసిద్ధి చెందాడనీ స్థలపురాణం. ఆ యుద్ధం ఒక కబంధ వృక్షం వద్ద జరగడం వల్ల ఈ వూరిని కబంధతీర్థం అని కూడా అంటారు.
.

మయూరేశ్వరుడు :..
మన బుద్ధిని శుద్ధంగా, పవిత్రంగా తయారుచేసే కర్తవ్యము చేసేవారిని మోరేశ్వర్ అని అంటారు.
పుణె జిల్లా బారామతి తాలూకాలోని మోర్‌గావ్‌ గ్రామంలో వెలసిన వినాయకుడు మూషికవాహనంపై కాకుండా మయూరాన్ని ఆసనంగా చేసుకోనివుండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. తన తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనమైన మయూరాన్ని అధిష్ఠించి ఉంటాడు. ఆ కథేంటంటే.. ఒకప్పుడు సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా హింసించేవాడట. దీంతో మునులు దేవతలను వేడుకోగా వినాయకుడు తన తమ్ముడి వాహనాన్ని అధివసించి భువికి దిగివచ్చి ఆ రాక్షసుణ్ని మట్టుబెట్టాడట. అందుకే ఈ గణేశుణ్ని మయూరేశ్వరుడు, మోరేష్‌, మోరేశ్వర్‌ అని పిలుస్తారు. అనురసంహారం గావించిన స్వామి కాబట్టి.. ఈ క్షేత్రంలో వినాయక చవితితోపాటు విజయదశమి వేడుకలను కూడా అత్యంత వైభవంగా జరిపిస్తారు.
.

సిద్ధి వినాయకుడు :..
యోగ తపస్యద్వారా ప్రతి సంకల్పాన్ని సిద్ధింపచేసుకునే శక్తి అనగా సర్వుల మనోకామనలను పూర్తి చేసే శక్తిని ప్రాప్తి చేసుకున్న శ్రీ గణేశున్ని శ్రీ సిద్ధి వినాయకుడు అని అంటారు.
పూర్వం మధుకైటభులనే రాక్షసులతో శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తూ వినాయకుడి సాయం అర్థించాడట. శ్రీహరి అభ్యర్థన మేరకు రణరంగాన ప్రత్యక్షమయ్యాడట గణపతి. ఆ స్వామి దర్శనంతో విష్ణుమూర్తి రెట్టించిన బలం, వేగం, ఉత్సహాలతో రాక్షసులను మట్టుబెట్టాడు. వినాయకుడి వరం వలన కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ధక్షేత్రం అయింది. వినాయకుడి సహకారానికి సంతోషించిన విష్ణుమూర్తి తానే స్వయంగా ఈ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించి గణపతిని ప్రతిష్ఠించాడట. ఈ ఆలయం ఎత్తైన కొండపై ఉంటుంది. స్వయంభువుగా భావించే స్వామి విగ్రహానికి ఇరువైపులా సిద్ధి, బుద్ధి దేవతలున్నారు. మిగతా క్షేత్రాల్లోని విగ్రహాలకు భిన్నంగా ఇక్కడ స్వామి వారి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది.
.

మహాగణపతి :..
ఆత్మలందరి అపరాధాలను స్వయములో ఇముడ్చుకునే శక్తి అనగా క్షమించే మహా శక్తి ఉన్న కారణంగా శ్రీ గణేశుని శ్రీ మహా గణపతి అని అంటారు.
సిద్ధి, బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన రంజన్‌గావ్‌ వినాయకుడు మహాగణపతి. పూర్వం త్రిపురాసురుడు లోకకంటకుడుగా మారితే శివుడు అతడితో యుద్ధానికి దిగి ఓడిపోయాడు. అప్పుడు నారదమహర్షి వినాయకుడే స్వయంగా ప్రసాదించిన సంకటమోచన గణపతి స్తోత్రాన్ని శివుడికి తెలిపి ఆ గణనాథుణ్ని పూజించి అనుగ్రహం పొందమని చెప్పాడట. అప్పుడు హరుడు విఘ్నాధిపతి అయిన తన కుమారుణ్ని తలచుకుని విజృంభించి త్రిపురాసురుణ్ని మట్టుబెట్టాడట. తన విజయానికి కారణమైన వినాయకుడి విగ్రహాన్ని శంకరుడే స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడని గణేశపురాణం చెబుతోంది.
.

విఘ్న వినాయకుడు :...
పరమాత్మ స్మృతిద్వారా భక్తులందరి విఘ్నాలను దూరము చేస్తారు మరియు ఏ కార్యమునైనా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు కనుక శ్రీ గణేశుని విఘ్న వినాశక రూపములో పూజిస్తారు.
ఓఝూర్‌ ప్రాంతంలో ఒకప్పుడు విఘ్నాసురుడనే రాక్షసుడు విధ్వంసం సృష్టించేవాడట. మునుల జపతపాదులకు భంగం కలిగించేవాడట. అతని బాధ భరించలేక మునులు వినాయకుడిని ప్రార్థించగా ఆ స్వామి ప్రత్యక్షమై విఘ్నాసురుడితో యుద్ధానికి దిగాడు. రణం మొదలైన కొద్దిసేపటిలోనే... తాను గణేశుడి మందు నిలబడలేనని గ్రహించిన విఘ్నాసురుడు ఆ స్వామికి లొంగిపోయాడట. తన పేరు మీద విఘ్నేశ్వరుడిగా అక్కడే కొలువుండాలని కోరాడట. అలా వెలిసిన విఘ్నేశ్వరుడికి ఆలయం కట్టించారు అక్కడి మునులు ఇదీ ఓఝూర్‌ స్థలపురాణం.
.

గిరిజాత్మజ వినాయకుడు :..
ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనైనా తన మానసిక స్థితిని అచలంగా, దృఢంగా ఉంచుకునే శ్రీ గణేశుని శ్రీ గిరిజాత్మజుడు అని అంటారు.
గిరిజాత్మజుడంటే పార్వతీదేవి కుమారుడు అని అర్ధం. ఈ స్వామి దర్శనం చాలా కష్టం. ఎత్తైన కొండమీద ఒక గుహలో కొలువై ఉంటాడీ వినాయకుడు. పైకి 238 మెట్లుంటాయి. పిల్లలూ, వయసులో ఉన్నవారూ చురుగ్గా ఎక్కొచ్చుగానీ.. పెద్దవాళ్లకు కష్టమే. అలాంటివారి కోసం డోలీ ఏర్పాట్లు కూడా ఉన్నాయక్కడ. పుత్రుడి కోసం పార్వతీదేవి పన్నెండేళ్లు తపమోనర్చిన ప్రదేశం లేన్యాద్రి పుణ్యక్షేత్రం. అనంతర కాలంలో అమ్మచేతి నలుగుపిండి నుంచి రూపుదిద్దుకున్నాడు బాలగణపతి. తర్వాత కౌమారప్రాయం వచ్చే దాకా తల్లితో కలిసి ఇక్కడే ఉన్నాడని ఐతిహ్యం. నలుగు పిండితో ఒక విగ్రహాన్ని చేస్తే ఎలా ఉంటుందో అలా హెచ్చుతగ్గులతో చిత్రంగా ఉంటుందిక్కడి విగ్రహం.
.
ప్రారంభించిన చోటికే.. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ క్షేత్రాల్లో ఎక్కణ్నుంచి యాత్ర ప్రారంభిస్తామో మళ్లీ అక్కడికి తిరిగిరావాలి. అప్పుడే యాత్ర పూర్తయినట్లు యాత్రామార్గం ఆద్యంతం పచ్చటి ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది.
.
ఎలా చేరుకోవాలి :...
* మహారాష్ట్రలోని పుణె నగరం చేరుకొని అక్కడ నుంచి అష్టవినాయక యాత్ర ప్రారంభించవచ్చు.
* పుణెకుల దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, విమాన, బస్సు సౌకర్యాలున్నాయి.
* ఈ క్షేత్రాలకు కార్లలో వెళ్లలేని వారి కోసం మహారాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముంబై షోలాపూర్‌ నగరాల నుంచి అష్టవినాయక క్షేత్రదర్శనం స్పెషల్‌ ప్యాకేజీ బస్సులు ఉంటాయి. రుసుము కూడా తక్కువే.

Share:

పార్వతిదేవి చౌడేశ్వరి మాతగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం..‘నందవరం’

* భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరీదేవిని విన్నారా?
* సౌభాగ్యాలూ ప్రసాదించే తల్లి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వీరాదిల్లుతుంది...
* అన్నదానికి సంకేతమా అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణె కలిగి వుంటాయి... 
ఈ సృష్టికి మూలం శక్తి. ప్రథమ వేదమైన ఋగ్వేదంలో శక్తి సర్వమహాశక్తుల సమాహారమూర్తిగా అభివర్ణించబడింది. ఆ శక్తిని ఎవరు ఆరాధించినా స్త్రీ మూర్తిగానే ఆరాధిస్తారు. దీనినే ఈ శక్త్యారాధన శాక్తాయంగా చెప్పబడింది. జగదాంబగా పేరుపొందిన ఆదిపరాశక్తి పలు నామాలతో పూజలందుకుంటూ వుంది. ఆ పేర్లలో చాముండి, చాముండేశ్వరి, చౌడేశ్వరి పేర్లు లోకప్రసిద్ధి పొందాయి. పార్వతిమాత చౌడేశ్వరి మాతగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం ‘నందవరం’. రాజుల, నవాబుల ఏలుబడిలో ఒకప్పుడు ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని చౌడేశ్వరి మాత ఆలయం అతి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. చారిత్రక, మరియు పౌరాణిక విశేషాలతో పుణికిపుచ్చుకున్న ఈ ఆలయంలో కొలువుదీరిన చౌడేశ్వరీమాత దర్శనం సర్వపాప హరణంగా, సర్వఐశ్వర్య ప్రదాయకంగా భక్తులు భావిస్తారు. కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతి స్వరూపంగా భాసించే కాశీ విశాలాక్షియే ఒకానొక సందర్భంలో ఆంధ్ర దేశానికి జ్యోతి స్వరూపంగా తరలివచ్చి నందవర పుణ్యక్షేత్రంలో సువర్ణ రూపంలో స్వయంభువుగా వెలిసిందని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది.
.
భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలిచ్చే వీర చౌడేశ్వరీదేవి విన్నారా? తనను కొలిచే కొందరు బ్రాహ్మణుల కోసం సాక్ష్యం చెప్పటానికి ఈ దేవి కాశీనుంచి సొరంగమార్గాన కదిలివచ్చి ఇక్కడ కొలువైనదంటారు. ఆ ప్రదేశమే కర్నూలు జిల్లాలోని నందవరం. ఈ ఊరు కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి 20 కి.మీ. ల దూరంలో, పాణ్యం – బనగానపల్లె రోడ్డులో వున్నది. అతి పురాతనమైన ఈ ఆలయం నిర్మాణకాలం తెలియదని కొందరంటే 4 వేల సంవత్సరాల క్రితం నిర్మింపబడిందని కొందరంటారు. సమయం ఎప్పుడైనా, ఈ దేవి కాశీనుంచి సాక్ష్యం చెప్పటానికి వచ్చి ఇక్కడ వెలసిందని అందరూ అంటారు. ఆ కధేమిటంటే….
.
పూర్వం చంద్రవంశీయ రాజైన నంద భూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూవుండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో వుండేవాళ్ళు. నందభూపాలుడికి దైవభక్తి కూడా మెండు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయస్వామి రోజూ కాశీవెళ్ళి గంగలో స్నానం చెయ్యాలనే ఆయన కోర్కెను తీర్చటానికి పావుకోళ్ళను ప్రసాదించాడు. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వుంచమంటాడు. ఆ రాజు, రోజూ తెల్లవారుఝామునే ఆ పావుకోళ్ళు ధరించి మనోవేగంతో కాశీచేరి గంగలో స్నానమాచరించి, విశ్వనాధుణ్ణి, విశాలాక్షిని, అన్నపూర్ణని దర్శించి తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు.
.
కొంతకాలం ఇలా గడిచాక, నందభూపాలుడి భార్య శశిరేఖ తన భర్త రోజూ తెల్లవారుఝామునే ఎక్కడికో వెళ్ళివస్తూండటం గమనించి భర్తను అడుగుతుంది. తప్పనిసరి పరిస్ధితుల్లో శశిరేఖకు విషయం చెప్తాడు నందభూపాలుడు. ఆవిడ తనని కూడా కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది. ఆవిడ మాట కాదనలేక రాజు ఆ రోజు ఆవిడనికూడా కాశీ తీసుకువెళ్తాడు. తిరిగివచ్చు సమయానికి పావుకోళ్ళు పనిచేయవు. కారణం రాణీ శశిరేఖ బహిష్టుకావటం. తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుందనే భయంతో దిక్కుతోచని రాజు ఆ సమీపంలోనేవున్న ఆలయందగ్గరవున్న బ్రాహ్మణులనుచూసి వారిని తరుణోపాయం చూపించమని వేడుకుంటాడు.
.
అందులో ఋగ్వేద పండితుడయిన ఒక బ్రాహ్మణుడు రాజుకి సహాయంచెయ్యటానికి సంసిధ్ధతను తెలియజేస్తాడు. ఆయన తనతోటి వారిని ఇంకో 500 మంది పండితులనుకలుపుకుని, దోషనివారణార్ధం జపతపాలుచేసి, తమ తపోశక్తి వారికి ధారపోసి వారిని వారి రాజ్యానికి చేరుస్తారు. ప్రత్యుపకారంగా రాజు వారికేసహాయంకావాల్సివచ్చినా తప్పక చేస్తానని, వారు నిస్సంకోచంగా కోరవచ్చునని అనగా, ఆ బ్రాహ్మణులు భవిష్యత్ లో అవసరమైనప్పుడు తప్పక కోరుతామంటారు. రాజూ, రాణీ తమ రాజ్యానికి చేరుకున్నారు. ఆ పాదుకలను, మంత్ర శక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ మందిరంలో వుంచి, తమ రాజ్యంలో సుఖంగా వుండసాగారు.
.
కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువురాగా, నందభూపాలుని సహాయమర్ధించటానికి ఆ బ్రాహ్మణులలో కొందరు బయల్దేరుతారు. వారు నందవరంచేరి, రాజసభకువచ్చి తమరాకకి కారణం చెబుతారు. రాజుకి అంతా తెలిసినా, తన తోటివారికి తెలియదుకనుక, వారికికూడా తెలియజేసే ఉద్దేశ్యంతో తానిచ్చిన వాగ్దానానికి ఋజువేమిటని అడుగుతాడు. బ్రాహ్మణులు రాజు వాగ్దానము చేసింది నిత్యం తాము కొలిచే చాముండేశ్వరీదేవి గుడి ముందు, ఆవిడ తప్ప వేరే సాక్ష్యంలేదనీ, ఆవిడనే నమ్ముకున్న తాము సాక్ష్యమిమ్మని ఆవిడని బతిమాలుతామంటారు. రాజు ఆ దేవదేవి తన రాజ్యానికి వస్తుందని లోలోన సంతోషించి అంగీకరిస్తాడు.
.
వచ్చిన బ్రాహ్మణులలో కొందరు తిరిగి కాశీ వెళ్ళి తమ ఇష్టదైవం చాముండేశ్వరీదేవిని పరిపరివిధాల ప్రార్ధించి, సాక్ష్యం చెప్పటానికి రావలసినదిగా కోరుతారు. ఆ దేవి అలాగే వస్తానని, వారిని ముందు బయల్దేరమని, తేజోరూపంలో తను వారి వెనుకనే వస్తానని, అయితే దోవలో ఎక్కడా వెనుదిరిగి చూడవద్దని చెబుతుంది. మునుపు రాజుకి సహాయంచేసిన మిగతా 500మంది బ్రాహ్మణులనికూడా నందవరం రమ్మని చెబుతుంది. అందరూ సొరంగ మార్గాన నందవరానికి బయల్దేరుతారు. నందవరం చేరుతుండగా అందులో ఒక బ్రాహ్మణునికి అనుమానం వస్తుంది. తమ వెనుక ఏమీ అలికిడి కావటంలేదు, అమ్మవారు తమతో వస్తోందో రావటంలేదోనని సందేహంతో వెనుదిరిగి చూస్తాడు. అక్కడదాకా వచ్చిన అమ్మవారు వెంటనే శిలారూపందాలుస్తుంది. చింతిల్లితున్న బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరీదేవిగా తానక్కడే కొలువైవుండి భక్తులను సంరక్షిస్తూ వుంటానని తెలుపుతుంది.
.
నందభూపాలుడు కాశీనుంచి వచ్చిన ఆ దేవత తమ రాజ్యంలో వెలిసినదని సంతోషంతో గుడి కట్టించి, పూజలుసల్పసాగాడు. అమ్మవారితో కాశీనుంచి కదిలివచ్చిన 500మంది బ్రాహ్మణులు, అమ్మవారి ఆజ్ఞమేరకు అక్కడే వుండి తమ కులదైవమైన ఆ దేవిని పూజించుకోసాగారు. ఆ బ్రాహ్మణ కుటుంబాలను నందవరీకులంటారు. వారు ఇప్పటికీ చౌడేశ్వరీదేవిని తమ కులదేవతగా పూజిస్తారు. ఆ కుటుంబీకులు గర్భగుడిలోకెళ్ళి స్వయంగా దేవిని పూజించుకోవచ్చు. కాశీనుంచి బ్రాహ్మణులు, అమ్మవారు వచ్చిన సొరంగమార్గం ఇంకా వుందంటారు. కానీ అందులోకి ప్రవేశం లేదు. నందవరీక బ్రాహ్మణులకేకాక తొగట వీర క్షత్రియలకుకూడా చౌడేశ్వరీదేవి కులదేవత.
.
అమ్మవారు ముందు చాలా ఉగ్రరూపంలో వుండేది. ఆ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారు. భక్తుల సౌకర్యార్ధం, వారా తల్లి ఉగ్రరూపంచూడలేరని ఆ దేవి విగ్రహంలాంటిదే ఇంకొకటి తయారుచేయించి ప్రతిష్టించారు. అయితే ఈ విగ్రహం అసలు విగ్రహమంత భయంకరంగా వుండదు. అసలు విగ్రహం ఇప్పుడు అమ్మవారువున్న స్ధానానికి సరిగ్గా దిగువ భూగర్భంలో వున్నది. అక్కడికి వెళ్ళే మార్గం వున్నదికానీ ఎవరికీ ప్రవేశంలేదు.
.
ఆలయం ముందు సొరంగ మార్గం వున్నది. పది మెట్లు దిగి వెళ్తే అక్కడ అమ్మవారి పాదాలు వున్నాయి. ఆ మార్గంనుంచే అమ్మవారు, మిగతా బ్రాహ్మణులు, కాశీనుంచి ఇక్కడికి వచ్చారంటారు.
.
అమ్మవారు వీర చౌడేశ్వరీదేవి. వీరత్వానికి తగ్గట్లే రూపం వుంటుంది. ఈ తల్లిని సేవించినవారికి అన్నిరకాల భయాందోళనలు దూరమయి ధైర్యసాహసాలతో విలసిల్లుతారని ప్రతీతి. ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలచిన ఆ దేవి తోజోవంతమైన రూపం చూసినవారి మనసులోని అన్ని భయాందోళనలూ పటాపంచలవుతాయి. ధైర్యసాహసాలేకాదు సకల సౌభాగ్యాలూ ప్రసాదించే తల్లి అన్నదానికి సంకేతమా అన్నట్లు అమ్మవారి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణె వుంటాయి.
.
ఆలయం ప్రక్కనే ఒక చెట్టు వున్నది. విశాలంగా విస్తరించిన ఈ వృక్షం ఆకులు మన గోరింట చెట్టు ఆకులులాగా ఇంకా చిన్నగా వుంటాయి. చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణీయంగా వుండే ఈ చెట్టు కరివె. ఈ వృక్షం కూడా అమ్మవారితోబాటు కాశీనుంచి తరలివచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే అచంచల భక్తితో భక్తులు ఈ వృక్షనికి కూడా పూజలు చేస్తారు. అమ్మవారిముందు శ్రీ చక్రం వున్నది. భక్తులు అక్కడ కుంకుమ పూజ చేయవచ్చు.
.
సేకరణ…
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి
భారతీయ సనాతన హిందూ ధర్మ సంరక్షణ సమితి
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List