స్వయంభుగా వెలసిన శ్రీ నెమలి వేణుగోపాలస్వామి. ~ దైవదర్శనం

స్వయంభుగా వెలసిన శ్రీ నెమలి వేణుగోపాలస్వామి.

* గోపాలుని దర్శనం ‘సర్వైశ్వర దాయకం సర్వరోగ నివారిణి’ ...
* తెలుగు రాష్ట్రలలో ఉన్న ఏకైక కృష్ణాలయం ...
* భూగర్భమునుండి సాక్షాత్కరించిన కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు...
.
.
శ్రీ కృష్ణుడికి ... నెమలికి విడదీయరాని సంబంధముంది. నెమలి పింఛం ధరించడమంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. చేతిలో వెన్న ముద్దలేని బాల కృష్ణుడు కనిపిస్తాడేమో గానీ, తలపై నెమలి పింఛంలేని కృష్ణుడు మాత్రం కనిపించడు. ఈ సృష్టిలో సంయోగం చేత సంతానాన్ని పొందని పక్షి నెమలి మాత్రమే. ఈ పవిత్రతే శ్రీ కృష్ణుడు నెమలి పింఛం ధరించడానికి కారణమైందని చెబుతుంటారు. అలాంటిది నెమలి అనే ఊళ్లో శ్రీ కృష్ణుడు ఆవిర్భవించడమనేది సహజంగానే విశిష్టతను సంతరించుకున్నదిగా అనిపిస్తుంది.
.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక కృష్ణాలయం, పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం, నిత్యం భక్తుల రాకతో పులకించే గ్రామం, సందర్శకులతో సందడిగా ఉండే ప్రదేశం, భక్తుల విరాళాలతో దినదినాభివృద్ది చెందుతున్న దేవస్థానం, లక్షలాది మంది భక్తులు ఇలవేల్పుగా కొలిచే కృష్ణాజిల్లా గంపలగూడెం మండలంలోని ‘నెమలి’ గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం.
.
నెమలి వేణుగోపాలస్వామిని కొలిచే భక్తులు నవ్యాంద్రప్రదేశ్ ,తెలంగాణా రాష్ట్రాలలో లక్షలాది మంది ఉన్నారు. తాము కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా స్వామివారిని ఆరాదించే భక్తజనం నెమలి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎప్పటి నుంచో అభిలాషిస్తున్నారు. పాలక ప్రభుత్వాలు నెమలి పుణ్యక్షేత్రం స్వామి వారి దర్శనం ‘సర్వైశ్వర దాయకం సర్వరోగ నివారిణి’ అనే భావంతో వస్తున్నా భక్తులకు ఆలయ అధికారులు వసతి కలిపిస్తున్నా, రాకపోకలకు నానా ఇక్కట్లు పడుతున్నారు. మానసిక ప్రశాంతత లేనివారు, అంతుచిక్కని వ్యాధుల బారిన పడినవారు, సంతానలేమితో బాధపడేవారు స్వామిని దర్శించి తమ మొక్కుబడులను తీర్చుకుంటారు.సోమవారం, శుక్రవారంల్లో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భక్తుల భూరి విరాళాలుతో ఆలయ ప్రాంగణంలో ఎన్నో కట్టడాలు నిర్మించారు. పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.
.
“కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం. ద్వాపరయుగంలో రాక్షస సంహారానికి, రాక్షసత్వం భరతం పట్టడానికి అవతరించిన శ్రీ మహావిష్ణువు. దశావతారాల్లో కృష్ణావతారం బహుళ ప్రచారమైంది. అటు శృంగారంతో పాటు అఖండ చతురతతో రాజనీతి యోగనిష్టగా భారత యుద్ధంలో పాల్గొన్న అవతారమూర్తి గీతాగోవిందుడు.”
.
*స్వయంభువుగా స్వామివారు ఎలా వెలిశారు :..
1953 మార్చి 23 న (శ్రీరామనవమి నాడు) వేణుగోపాలస్వామి నెమలిలో స్వయంభుగా వెలిశారు. స్వామివారి విగ్రహం నెమలి గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య అనే షావుకారు తన పొలంలోని సారవంతమైన మట్టి కోసం తవ్వుతుండగా మొదటిసారి గడ్డపలుగు ఉపయోగించగా వెంటనే ఖంగుమని శబ్దం వచ్చింది. ఆ వింత ధ్వని అర్ధం కాక కొంచెం పక్కగానే గడ్డపలుగు వేయగా అదే శబ్దం వచ్చింది. ఆ ధ్వని ఆలోచించుతూనే అతడు ఆ రెండు ఘతాముల మధ్య మరల పలుగు ప్రయోగించగా ఆ చోట బ్రహ్మాండమైన మిరుమిట్లుతో ఒక మెరుపు వెలువడింది. ఆ కాంతి తీవ్రతకు అతను మూర్చ పోయాడు అది చూసిన మిగిలిన వారు ఆందోళనతో అతని ముఖం పై చల్లని నీళ్ళు చల్లి కొద్ది సేపు సపర్యలు చేసారు. ఆతను కొంచెం తేరుకొని తనకు ఏమి కనిపించడంలేదని అన్నాడు. అపుడు మిగిలినవారంతా ఆప్రాంతంలో త్రవ్వి చూడగా ఒక విగ్రహం దానిచెంతనే ప్రాచీన శంఖము, పాచిక లభ్యమయినది. ఆరోజు పరమ పవిత్రమైన శ్రీరామనవమి (23-3-1953) ఆవిషయం తెలిసిన షావుకారు నవమి వేడుకల నిర్వహణలో ఉన్న ఆతను ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించి హుటాహుటీన తన అనుచరులతో కలిసి విగ్రహం లభ్యమైన దివ్యస్తలానికి చేరుకున్నాడు. ఆ విగ్రహమును పరిశీలించి శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తి అని గ్రహించారు.
.
కటారు వెంకటేశ్వర్లు ఉపయోగించిన గునపము వలన శ్రీస్వామివారి వేణువుకు కుడి, ఎడమలవైపుల తగిలి చిటికిన వ్రేలు భిన్నమయింది. గ్రామ పెద్దలు పెనుగొలను చెందిన అర్చకుడు నందలి క్రిష్ణమచార్యులుని వెంటనే రప్పించి స్వామివారి విగ్రహం చూపించగా మూడు అడుగుల ఎత్తు, ఉత్తరాభి ముఖముగా వ్యత్యస్థ పదముల నడుము, శిరస్సులు చక్కని ఓంపులతో మురళిని మ్రోగించుచూ, త్రిభంగిమతో దివ్య సుందరమైన చక్రములతో పాదముల కడ ఇరువైపులా విన్ద్యమారాలు వీచు గోపికా స్త్రీలు గోవులతో కూడి అలరారుచు ఉన్న ఆ ఏక శీల విగ్రహమును చూసి శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహంగా గ్రహించారు.
.
స్వామివారు భూగర్భమునుండి సాక్షాత్కరించిన తీరుకు గ్రామ ప్రజలు భక్తీ పారవశ్యంతో ఆశ్చర్యపోయారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారిని ప్రతిస్థదలచి ఉరేగించ బయలుదేరగా స్వామివారు భక్తునికి ఆవహించి “నేను దర్శనమిచ్చిన చోటనే తనను ప్రతిష్టించాలని ఆదేశించారు” . స్వామి ఆదేశమును వెంటనే అమలుచేయదలచాగా ఉత్తరాభి ముఖమున వెలసిన స్వామివారిని తూర్పు ముఖముగా ఉంచడంతో ఆకస్మికంగా గాలివానతో కూడిన పెను తుఫాను విరుచుకుపడింది. వేసిన పందిళ్ళు చిన్నభిన్నమయ్యాయి. పొరపాటును గ్రహించిన వారు స్వామివారిని యధావిధిగా ఉత్తరాభి ముఖముచేయగా కొద్ది క్షణములలొనే తుఫాను శాంతించింది. వెంటనే గ్రామ పురోహితులతో పూజలు నిర్వహించారు.
.
1957 ఫిబ్రవరి 6న శాస్రోక్తంగా నల్లనయ్య విగ్రహాన్ని వేదపండితుల ఆద్వర్యంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచి స్వామివారి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా వేణుగోపాలస్వామి నిలిసారు. నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలు వేలంపాటలు ద్వారా ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తుంది. ఆ మొత్తం దేవస్థానం నిర్వహణకే సరిపోతుంది. ఉత్సవాలు, వేడుకలు ప్రసాదాలు సిబ్బంది జీతభత్యాలు తదితర వ్యయాలు ఆలయానికి వచ్చే ఆదాయం ద్వారా ఖర్చు చేస్తున్నారు.
.
నెమలి పుణ్యక్షేత్రం పర్యటక కేంద్రంగా రూపాంతరం చేసేందుకు రవాణా వసతి ప్రదాన అడ్డంకిగా మారింది. వేలల్లో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తెలంగాణా సరిహద్దున ఉన్న నెమలికి ఆ రాష్ట్రంలోనే భక్తులు అధికం. ప్యాకేజి టూర్ కు జిల్లాలో ఇతర దేవాలయల నుంచి నెమలి గ్రామం దూరంగా వుండడం కూడా సమస్యగా ఉంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు రెండేళ్ళ క్రితం ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా దూరప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. ఇదే తరహాలో జిల్లాలో విజయవాడ కనకదుర్గ, వేదాద్రిలోని నరసింహ స్వామి, పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ ఆలయాల మీదుగా నెమలికి వచ్చేందుకు రవాణా సౌకర్యం ఉంటే ఉపయుక్తంగా ఉంటుంది.
.
నెమలి వేణుగోపాలస్వామి ఆలయానికి ప్రముఖుల సందర్శన కొదవలేదు. రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిదులు అధికారులు ప్రముఖులు తరచూ స్వామివారి సేవకు వస్తుంటారు. స్థానిక నాయకులు అధికారులు వారందరికీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దలని తద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయని వినతులు అందజేస్తున్నారు. హామీలు ఇస్తున్నారే తప్ప అవి అమలుకు చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు ఆలయాన్ని సందర్శించిన మంత్రులు, ఎంపిలు ఎమ్మెల్యేలు వివిధ శాఖల రాష్ట్ర స్థాయి అధికారులు పర్యటక కేంద్రం చేయలన్నారే తప్ప చేయలేదు.
.
కన్నుల పండువగా స్వామివారి తిరుకళ్యాణం:...
ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆరు రోజులపాటు నిర్వహించే స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ప్రతి నెలా పూర్ణిమ నాడు మాస కళ్యాణం, గోశాలలో నిత్యం గోపూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయంలో ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వైఖాసన ఆగమనం పద్దతిలో స్వామివారు పూజలందుకునే ఈ ఆలయంలో భక్తుల అన్నప్రాసనలు, వాహన పూజలు, వివాహాలు తదితర శుభకార్యాలు స్వామివారి సన్నిధిలో అధికంగా నిర్వహిస్తారు. శ్రీ కృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, ముక్కోటి, ధనుర్మాసోత్సవం, ఉగాది, శ్రీరామనవమి విశేషంగా నిర్వహిస్తారు.
.
నెమలి పుణ్యక్షేత్రానికి ఇలా చేరుకోవాలి:...
నెమలి పుణ్యక్షేత్రానికి తెలంగాణా రాష్ట్రంలోని మధిర నుంచి నెమలి గ్రామానికి చేరుకోవాలి. ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారు రైలు లేదా బస్సు మర్గాన మధిర చేరుకొని అక్కడినుంచి నెమలి పోవు బస్సు ఎక్కాలి. సాధారణ రోజుల్లో కుడా తిరువూరు, మధిర డిపోల నుంచి నుంచి నెమలికి బస్సులు తిరుగుతాయి. స్వామివారి తిరుకళ్యాణం రోజున మధిర, తిరువూరు డిపోల నుంచి బస్సులు ఉచితంగా తిరుగుతాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List