కొండ గర్భములో దేదీప్యమానమైన వెలుగులలో శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. ~ దైవదర్శనం

కొండ గర్భములో దేదీప్యమానమైన వెలుగులలో శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం.

కృష్ణానదీ తీరానికి అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లా, నల్గొండ జిల్లాలలో ఐదు నారసింహ క్షేత్రాలు విలసిల్లినాయి. మంగళగిరి, వాడపల్లి, కేతవరం, గుంటూరు జిల్లాలో, కృష్ణాజిల్లాలో వేదాద్రి. నల్గొండ జిల్లాలో మట్టపల్లి క్షేత్రాలలో ప్రబలమైనదిగా వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామిని మహిమ వేన్నోళ్లున్నా వర్ణించవీలుకానిది- విజయవాడ-హైదరాబాద్ రహదారిలో ‘చిల్లకల్లు’ కూడలి నుండి పడమరగా 10 కిలోమీటర్లు దూరంలో వేదాద్రి క్షేత్రమున్నది.
బ్రహ్మదేవుని వద్ద వుండిన వేదములను సోమకాసురుడను రాక్షసుడు తస్కరించి సముద్రమునందు దాయగా, బ్రహ్మదేవుడు తన జనకుడైన శ్రీమన్నారాయణుని వేదములను అనుగ్రహింపమని ప్రార్థించాడు. భక్తవత్సలుడైన మహావిష్ణువు మత్స్యావతారము దాల్చి రక్కసుని పరిమార్చుట వలన వేద పురుషులు జ్వాలా నరసింహమూర్తిగా అలరారాడు. ఋష్యశృంగాది మహర్షులు, మనువు ప్రార్థనలతో యోగానంద నృసింహస్వామి స్వరూపుడైనాడు.
వేద శిఖరమున జ్వాలా నృసింహాకృతితోను, కృష్ణానది గర్భమున సాలగ్రామ రూపంతోను, వౌనిచంద్రుడు ఋష్యశృంగునిచే ప్రతిష్టింపబడిన యోగమూర్తిగాను, క్షేత్రపాలకునిగా యోగనంద లక్ష్మీ నరసింహస్వామిగాను పంచనారసింహ (జ్వాల, సాలగ్రామ, వీర, యోగానంద, లక్ష్మీనృసింహమూర్తులు) క్షేత్రమైన వేదాద్రి యావదాంధ్ర దేశమునుండి భక్తులనాకర్షించుచూ పవిత్ర పుణ్యక్షేత్రముగా అలరారుచున్నది.
ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరముల క్రిందట రెడ్డిరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. తదాదిగా సర్వతోముఖాభివృద్ధి చెందుతూ వస్తోంది. కవిత్రయములో ఒకరైన ఎఱ్ఱాప్రగడ, కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి, వాగ్గేయకారుడు, శ్రీ నారాయణ యతీంద్రులు, ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని తమ కవితాధారతో పునీతము చేసినవారే. ఎఱ్ఱాప్రగడస్వామి వారి పేరిట స్తోత్ర దండకము రచించగా, శ్రీనాథ కవి ‘కాశీఖండము’లో స్వామివారిని ప్రస్తుతించెను. శ్రీ నారాయణతీర్థులు ఒకపరి తన అత్తవారి ఇల్లు వేదగిరికెదురుగా ‘‘గింజుపల్లి’’ గ్రామమునకు వెళ్ళి తిరిగి వచ్చునపుడు, కృష్ణలో ‘రావిరాల’ గ్రామమువద్ద దాటుచుండగా ఆ నీటిలో మునగటం తటస్థించింది. ఇక అప్పుడు అంతటి నారాయణ తీర్థులు మానసికంగా తత్‌క్షణమే సన్యసించగా జీవన్ముక్తులయ్యారు. వెనువెంటనే తీర్థులు ఆశువుగా కవితాధారతో వేదగిరీశుని ‘‘వేదాద్రి శిఖర నారసింహా కలయాయతే’’ అను స్తుతించి స్వామి అనుగ్రహాన్ని పొంది, లోకోద్ధరణగా సంస్కృతంలో శ్రీకృష్ణ లీలా తరంగిణి తరంగ కీర్తనలు రచించి స్వామివారి కృపకు పాత్రులైనారు. వేదాద్రి క్షేత్రము పౌరాణికముగా, చారిత్రికంగా, సాహిత్యపరంగా అలరారిన విశిష్ఠ క్షేత్రము. కృష్ణవేణి తరంగనాదంతో, ప్రకృతి సహజ సౌందర్యాలను వికసింపజేసే పునీత స్థలము. కృష్ణానదీ స్నానానికి కూడా అనువైన ప్రదేశము.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List