ఈ సాయంత్రం భక్తులకు దర్శనమివ్వనున్నమకర జ్యోతి. ~ దైవదర్శనం

ఈ సాయంత్రం భక్తులకు దర్శనమివ్వనున్నమకర జ్యోతి.

* మకర జ్యోతి రహస్యం..! అయ్యప్ప స్వామి జీవితం పుట్టుక రహస్యాలు ...
* భక్తులతో కిటకిటలాడుతున్న శబరిమల ...
* ఒళ్ళంతా కళ్ళుచేసుకొని మకరజ్యోతి కొసం ఎదురుచూపులు...
* పొన్నాంబళంమేడు కొండల్లో భక్తులకు మకర జ్యోతి దర్శనం ...
* అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిమల :...
.
భూతనాథ సదానంద సర్వ భూత దయాపర! రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః
.
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల భక్తులతో కిటకిటలాడుతోంది. జ్యోతి రూపంలో దర్శనమీయనున్న అయ్యప్పను దర్శించు కునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో శబరిమల చేరుకున్నారు. అయ్యప్ప నామస్మరణతో శబరి కొండలు మారుమ్రోగుతున్నాయి. ఈరోజు సాయంత్రం పొన్నాంబళంమేడు కొండల్లో మకరజ్యోతి భక్తులకు దర్శనమివ్వనుంది. ఇప్పటికే ఇరుముడులు ఎత్తుకుని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనం కోసం శబరిమల వచ్చారు. మకర జ్యోతి దర్శనం తర్వాతే భక్తులు మాలలు తీసివేస్తారు.
.
పురాణ గాథ :...
పూర్వం 'మహిషి' అనే రాక్షసి దేవతలపై పగ బట్టి బ్రహ్మ దేవుని గురించి ఘోర తపస్సు చేసింది. తస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మను శివకేశవుల కుమారుడు తప్ప తనను మరెవరూ జయించకుండా చూడాలనీ, ఆ కుమారుడు సాధారణ మానవుడిగా భూలోకంలో 12 ఏళ్ళు రాజుకు సేవ చేయాలనే షరతుతో వరం కోరగా బ్రహ్మ అనుగ్రహిస్తాడు. శివ, కేశవులిద్దరూ పురుషులే గనుక వారికి సంతానం కలగదనీ, ఇక తనకు ఎదురే లేదని మహిషి భావించి దేవతలను వేధించటం మొదలు పెడుతుంది.
.
ఆ తరవాత కొన్నాళ్ళకు దేవదానవులు క్షీరసాగరాన్ని మధనం చేపట్టి, అమృతాన్ని సాధిస్తారు. అయితే పంపకాల గొడవ రావటంతో విష్ణువు మోహిని రూపంలో వస్తాడు. ఆయన అందానికి శివుడు మోహితుడైన కారణంగా వారిద్దరి తేజస్సు నుంచి ఒక బాలకుడు అవతరిస్తాడు.వారు ఆ బాలుడిని అక్కడే వదిలి పోగా, ఆ సమయంలో పంపా సరోవర తీరాన వేటకు వచ్చిన పందళ దేశపు రాజైన రాజశేఖరుడికి చెట్టుపొదల మధ్య మెడలో గొప్ప మణిమాలతో ఉన్న ఈ బాలకుడు దర్శనమిస్తాడు. సంతానం లేక శివుడిని ఆరాధిస్తున్న ఆ రాజు భగవంతుడే ఆ బాలుడిని ప్రసాదించాడని భావించి ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్లి రాణికి ఇస్తాడు. ఆ బాలుడికి 'మణికంఠుడు' అని పేరుపెట్టిన ఆ దంపతులు అతనిని అలారుముద్దుగా పెంచుతారు.
.
అయితే.. ఆ తర్వాత మహారాణి గర్భం ధరించి ఏడాది తిరిగే సరికి మగబిడ్డను కంటుంది. ఎంతో వినయం, విధేయత కలిగిన మణికంఠుని కొందరు ``అయ్యా'' అనీ, మరికొందరు ``అప్పా'' అని, ఇంకొందరు ఈ రెండు కలిపి ``అయ్యప్ప'' అని పిలిచేవారు. ఈ సమయంలో మంత్రి, రాణి బంధువులు రాణికి లేనిపోని విషయాలు నూరి పోస్తారు. రాబోయే రోజుల్లో వయసులో పెద్దవాడైన మణికంఠుడికే రాజు పట్టం కడతాడనీ, నీ కుమారుడికి ఏమీ దక్కదని వారు రాణికి చెప్పి మణికంఠుడిని అడ్డు తొలగించుకోమని చెబుతారు. దీంతో రాణి తలనొప్పి నటించి తన వైద్యానికి పులిపాలు కావాలని వైద్యులతో చెప్పించగా మణికంఠుడు పులిపాలకై అడవికి బయలుదేరతాడు. అదేసమయంలో ఆ సమయంలోనే నారదుడు మహిషికి కనిపించి అడవికి బయలుదేరిన అయ్యప్ప చేతిలో నీ జీవితం ముగియబోతోందని చెబుతాడు. దీంతో మహిషి పెద్ద గేదె రూపంలో అయ్యప్ప మీద దాడికి దిగగా స్వామి దాన్ని అనాయాసంగా వధిస్తాడు. ఆ యుద్ధం చూసేందుకు ఇంద్రుడి మొదలు యావత్తు దేవగణం తరలివస్తారు.
.
మహిషి మరణానంతరం అయ్యప్ప స్వామి తాను అడవికి వచ్చిన కారణం గురించి దేవేంద్రుడితో చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు ఇతర దేవతలు పులుల సమూహంగా మారగా స్వామి పులి రూపాన ఉన్న ఇంద్రుని మీదెక్కి తన రాజ్యం చేరాడు. అయ్యప్ప రాకను చూసిన మంత్రి, రాణి బంధువులు స్వామి పాదాలపై పడి శరణు కోరగా స్వామి వారిని క్షమిస్తాడు. అనంతరం స్వామి తండ్రికి తన అవతారం త్వరలో ముగియనుందనీ, తమ్ముడికి పట్టం కట్టమని చెబుతాడు. తన ఆభరణాలు తండ్రికి ఇచ్చి ఏటా మకర సంక్రాంతి రోజు వీటిని తనకు సమర్పించమనీ, ఆ రోజు సాయంత్రం తాను జ్యోతి రూపాన ఆ కొండమీద అందరికీ దర్శనమిస్తానని చెబుతాడు. అనంతరం అందరూ చూస్తుండగా స్వామి తన ఖడ్గాన్ని విసురుతాడు. ఆ ఖడ్గం పడిన శబరి కొండపై అయ్యప్ప స్వామి కూర్చొని యోగమార్గంలో పరమాత్మలో లీనమై పోతాడు. నాటి నుంచి రాజ కుటుంబీకులు, లెక్కకు మించిన సంఖ్యలో భక్తులు సంక్రాంతినాడు స్వామి అవతారం చాలించిన చోట నిర్మితమైన ఆలయాన స్వామిని దర్శించి, ఆ రోజు సాయం వేళ జ్యోతి స్వరూపుడైన అయ్యప్పను దర్శించటం ఆనవాయితీగా మారింది.
.
శబరిమలై వనయాత్రలో ఎదురయ్యే క్షేత్రములు :...
శబరి గీరిశుని దర్శించుటకు వనయాత్ర చేస్తారు భక్తులు. సాక్షాత్‌ స్వామి అయ్యప్ప నడిచి వెళ్ళిన పూంగావనం, అదె పెరియపాడి - ఎరుమేలి మార్గం. కొట్టాయం నుండి తిరువల్లా మార్గాన 78 కి.మీ. కొట్టాయం నుండి రప్పళ్ళి మార్గము 54 కి.మీ. దూరంలోనూ, కొట్టాయం నుండి మణిమాల మార్గాన 52 కి.మీ. దూరంలోను చెంగనూరు నుండి చెంగచాశ్చేరి మణిమాల మార్గాన 66 కి.మీ దూరంలో చెంగన్నూరు నుండి పత్తనంతిట్ట మార్గాన 63 కి.మీ దూరంలోనూ, తిరువనంతపురం నుండి పునలూరు, కొన్ని మార్గాన 176 కి.మీ. దూరాన కలదు. ఇక్కడ నుండి భక్తాదులు కాలినడక నడుస్తారు.
.
ఈ మార్గంలో ఎదురయ్యే క్షేత్రాలు:
1) కోట్టెయిప్పడి : ఇక్కడే వావరుస్వామి వెలిసినది
2) కాళైకట్ట ప్రాచీన శివాలయం వుంది.
3) ఆళుదానది: స్వామి మహిషిని వధించిన స్థలం
4) ఆళుదామేడు 5 కి.మీ ఎత్తయిన గుండ్రాళ్ళతో కూడిన కొండ
5) కల్‌ ఇడుంకుండ్రు వధించిన మహిషిని పైకి విసిరేయగ కింద పడిన స్థలం
6) ఇంచిప్పారకోట్ల శిధిలమయిన కోట కలదు. ఇక్కడే స్వామి ఉదయనుడు అనే బందిపోటుని హతమార్చారు.
7) కరిమలైతోడు: నిటారైన కరిమల శిఖరం ప్రారంభం
8) కరిమలై ఉచ్చి ప్రాచీనమైన దివ్య బావి కలదు
9) వరియాన వట్టం ఇచ్చట ఏనుగులు దప్పిక తీర్చుకుంటాయి
10) శిరియానవట్టం: ఇచ్చట భక్తులు వంటలు చేసుకుని విశ్రమిస్తారు.
11) పావన పంబానది: అనేక ఔషధమూలికల సారముతో ప్రవహించు పంబానదిని దక్షిణ గంగాయని కూడా అంటారు. ఆ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ స్నానమాచరించారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నుండి భక్తాదులు కాలినడక నడుస్తారు.
12) నీలిమల.. ఈ నీలిమల ఎక్కడం చాలా కఠినం. రామాయణంలో దీన్ని మాతంగవనం అంటారు.
13) అప్పాచ్చిమేడు ఇక్కడ నుంచి శబరిపీఠం చేరుకుంటారు. దుర్దేవతల కోసం బియ్యపు ఉండలను విసురుతారు.
14) శబరిపీఠం ఇందులోనే పందళ్‌ రాజవంశీయులు విద్యాభ్యాసం నేర్చుకొన్నారు.
15) శరంగుత్తి యాత్రలో దీక్షాదండముగా భద్రపరిచి తెచ్చిన శరములను ఇక్కడే వున్న ఠాణి వృక్షములో గుచ్చుతారు.
16) పదినెట్టాంపడి ఇదే ముక్తికి సోపానం. దీనిని అధిరోహించిన వేళ ఎత్తిన ఇరుముడి వుండవలెను.
17) సన్నిధానం.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List