పంచభూత లింగ క్షేత్రాలు చూడాలనే ఉద్దేశంతో కొనసాగుతున్న మా ప్రయాణం, అన్ని కధలు చేరినట్టే ఒక రోజు మా కధ కూడా కంచి చేరుకుంది... కంచికి వెళ్ళే ముందు మాములాగానే ఓసారి కాంచీపురం గురించి తెలుసుకోవటం మొదలుపెట్టా. కంచి ఒక పుణ్యక్షేత్రం అని, పట్టుచీరలకు పెట్టింది పేరని తెలుసు గాని, “A City of Thousand Temples” అని, భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సాంస్కృతిక నగరంగా దానికెంతో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నదని తెలుసుకుని ఆశ్చర్యపడ్డా... ఈ విషయం ఇప్పటివరకు తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడ్డా....
కాంచీపురం ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలకు చిరునామా. భారతీయ హిందూ సంస్కృతిలో చెప్పబడిన అందరి దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో.... అవేవి సాధారణమైన గుడులు కాదు, ఎంతో గొప్ప చరిత్ర, అంతే గొప్పగా మలచిన శిల్ప కళా సౌందర్యం వాటి సొంతం. వీటిలో చెప్పుకోదగ్గవి, ఏకామ్రేశ్వరస్వామి దేవాలయం, కామాక్షి దేవాలయం, వరదరాజ స్వామి దేవాలయం, ఉలగళంద పెరుమాళ్ (వామన మూర్తి) దేవాలయం, కుమారస్వామి దేవాలయం, వైకుంఠ పెరుమాళ్ దేవాలయం, కైలాసనాథ్ దేవాలయం...... ఇవి కొన్ని మాత్రమే, ఇంకా మేము చూడనివి ఇంకెన్నో.... ఏకామ్రేశ్వరస్వామి దేవాలయం ఉన్న ప్రాంతాన్ని శివకంచి అని, వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు, ఈ రెండు ప్రాంతాల మధ్య కామక్షి అమ్మ వారి ఆలయం.
ఇన్ని గొప్ప దేవాలయాలు ఉన్నాయని తెలుసుకుని ఎంతో ఉత్సాహం తో మొదలయ్యింది మా ప్రయాణం. తెల్లవారుజామున కంచి చేరుకోగానే నగర వీధుల్లో ఉన్న ఎన్నో ఆలయ గంటల పలకరింపులు. కాని ఊరు మాత్రం కొంచెం నిరుత్సాహ పరచింది, ఒకప్పుడు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న, గొప్ప దేవాలయాలకు పుట్టినిల్లైన కంచి మాత్రం చాలా సాధారణంగా ఉంది., అసలే కొత్త ప్రాంతం కదా దగ్గరగా ఉంటుంది అని బస్టాండ్ కి దగ్గరలో ఒక హోటల్ లో రూమ్ (రూమ్ ఉంది కాని కరెంటు లేదు, వాటర్ ట్యాప్ ఉంది గాని అది మూసుకోవట్లేదు, ఇవన్నీ వేరే సంగతనుకోండి) తీసుకుని ఫ్రెష్ అయ్యి మా అసలు బాట పట్టాం....
మొట్టమొదటిగా చూసింది, ఏకామ్రేశ్వరస్వామి దేవాలయం.... దేవాలయానికి సమీపించగానే 54 అడుగుల ఎత్తున్న ఆలయ రాజగోపురం స్వాగతం పలికింది. భారతదేశం లో ఉన్న అత్యంత ఎత్తైన ఆలయ గోపురాలలో ఇది కుడా ఒకటి. ఈ ఆలయం ద్రావిడ శైలి లో చెక్కిన శిల్ప కళా సౌందర్యంతో చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ స్వామి వారు ఏకామ్రేశ్వరుడిగా దర్శమిస్తారు. ఇక్కడ శివలింగం మాములుగా గా ఉండే లింగంలా కాకుండా, పైన సన్నగా కిందకు వెళ్లేకొద్ది కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఈ లింగాన్నే పంచ భూత లింగాల్లో ఒకటైన పృధ్వీలింగం అని కుడా పిలుస్తారు. అందుకే ఈ సైకత లింగానికి పూజలు తప్ప అభిషేకాలు ఉండవు. ఈ ఆలయం లో, 3500 సంవత్సరాల అతి పురాతనమైన మామిడి వృక్షం ఉందేదని, అక్కడే పార్వతీ దేవి ఈ సైకత లింగాన్ని చేసుకుని పరమేశ్వరుడిని ప్రార్ధించిందని స్థల పురాణం చెబుతుంది. నాలుగు కొమ్మలతో ఉండే ఈ మామిడి వృక్షానికి, ఒక్కొక్క కొమ్మ మామిడి పండ్లు ఒక్కో రుచితో ఉండేవట. పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. ఒకప్పటి ఆ మామిడి వృక్ష కాండం అద్దాల పెట్టెలో బధ్రపరచబడి ఆలయ మొదటి ద్వారం లో పెట్టబడి ఉంది.
ఆ ఆలయం విశేషాలు చూసుకుని, తలుచుకుంటూ కామాక్షి అమ్మవారి ఆలయం కి వెళ్ళే దారిలో పడ్డాం. స్వామి వారి దేవాలయానికి ఇంచుమించు ఒక కిలోమీటర్ దూరం లో అమ్మ వారి ఆలయం.. ఇక్కడి అమ్మ వారు పద్మాసనం మీద కొలుపు తీరి ఉంటారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపం నయన మనోహరంగా ఉంటుంది. ఈ కామాక్షి అమ్మ వారి దేవాలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠంగా చెప్పబడుతుంది. అమ్మ వారిని దర్శించి బయటికి రాగానే చూడ చక్కని ఆది శంకరుల ఆలయం దర్శనమిస్తుంది. అమ్మవారి గర్భగుడి గోపురం, ఆది శంకరుల ఆలయ గోపురం, బంగారం తో ధగ ధగ లాడుతూ దర్శనమిస్తాయి. ఒక చిత్రమైన విషయం ఏంటంటే కాంచీపురం లో కామాక్షి అమ్మవారి దేవాలయం చుట్టూ ఎన్నో శివాలయాలు ఉన్నాకాని ఏ శివాలయం లోనూ అమ్మవారు ఉండరు. కామాక్షి అమ్మవారే కాంచీపురం లో ఉన్న అన్ని శివాలయాలకి అమ్మవారు.
అమ్మవారి ఆలయానికి ఏకామ్రేశ్వరస్వామి ఆలయానికి మధ్యలో స్కందుడు – కుమార స్వామిగా కుమార కొట్టం దేవాలయం లో కోలువుతీరి ఉన్నాడు. ఆలయ పై ప్రాంగణం చుట్టూరా చెక్కిన నెమలి బొమ్మలు అలరిస్తాయి. ఆలయం లోపల ముగ్ధ మనోహరంగా బాల మురుగన్ చూడచక్కని రూపం లో దర్శమిస్తాడు. ఈ దారిలోనే ఉన్న ఆది కామాక్షి, కచ్చబేశ్వరర్ ఆలయాలని దర్శించుకుని ఉలగళంద పెరుమాళ్ ఆలయం దారి పట్టాం.
కాంచీపురం లో శ్రీ మహా విష్ణువు కొలువుదీరిన సుప్రసిద్ధ ఆలయాలలో శ్రీఉలగళంద పెరుమాళ్ ఆలయం కి ఒక విశిష్ట స్థానం ఉంది. ఇక్కడ శ్రీ మహా విష్ణువు వామన మూర్తి గా దర్శనం ఇస్తాడు. చూడటానికి గుడి చిన్నది గానే ఉన్నా, లోపలి వెళ్ళే సరికి ఆశ్చర్యపడకుండా ఉండలేం. శ్రీ మహా విష్ణువు 30 అడుగుల వామన మూర్తి గా దర్శనం ఇస్తాడు. విగ్రహం చూడటానికి చాలా చిత్రంగా ఉంది, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, వినని విధంగా... వామన మూర్తి తన రెండు చేతులు భూమికి సమాంతరంగా చాపి ఎడమ చేత్తో రెండు వేళ్ళు చూపిస్తూ, కుడి చేతితో ఒక వేలు చూపిస్తూ, తన ఎడమ కాలు కుడా భూమికి, తన ఎడమ చేతికి సమాంతరంగా చాపి, కుడి కాలి పాదం బలి చక్రవర్తి తలపై మోపుతూ ఉండే ఆ రూపాన్ని చూసి మాటలు రాక నివ్వెరపోవటం మా వంతయ్యింది. ఎడమ చేత్తో చూపిస్తున్న రెండు వేళ్ళు, తను అడిగిన మూడు అడుగులులో, రెండు అడుగులు భూమి తో పాటు విశ్వమంతా ఆక్రమించుకుంటే, ఇక మిగిలిన ఒక అడుగు ఎక్కడా? అని తన కుడి చేతి ఒక వేలు చూపిస్తూ అడుగుతున్నట్టు ఉండే ఆ రూపాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు.
ఆశ్చర్యం లో నిండిన అనుభూతితో బయటికి వచ్చి కైలాసనాథర్ ఆలయానికి వెళ్ళటానికి ఆటో ఎక్కాం. కైలాసనాథర్ ఆలయం కొంచెం ఊరికి దూరం గా ఉంది. చుట్టుపక్కల పెద్దగా ఏమి లేకపోయినా, ఎంతో నిండుగా ఉంది ఆ ఆలయం. శిల్ప సౌందర్యాన్ని రాశిగా పోస్తే , అది కైలాసనాథర్ దేవాలయం అంటే అతిశయోక్తి కాదేమో. ఆలయం పైనా, చుట్టూ, అంతా సున్నపు రాయి, ఇసుక రాయి తో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉన్నాయి. ఆలయం చుట్టుపక్కల శివలీలలు, శివుని వివిధ స్వరూపాలు అద్భుతంగా మలచబడి ఉన్నాయి. ఇక్కడి శివలింగం చాల పెద్దగా ఉంది. ఇంకో విశేషమేంటంటే, శివలింగం పక్కన ఉండే బిలం లో కి వెళ్ళి బయటకి వస్తే మరుజన్మ ఉండదట. ఈ బిలం లోకి పాకుతూ సులభంగానే వెళ్ళవచ్చు కాని బయటకి రావటం కొంచెం కష్టం.
మన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఞానికి కళా వైభవానికి కలికితురాయి ఈ కైలాసనాథర్ దేవాలయం. రాజరాజ చోళుడు ఈ కైలాసనాథార్ దేవాలయం దర్శించి, ముగ్ధుడై, తంజావూరులో బృహధీశ్వరాలయం నిర్మించారని ప్రతీతి. 1400 సంవత్సరాల క్రింతం నాటి ఈ ఆలయం ఇప్పుడు పురావస్తుశాఖ వారి ఆధీనంలో ఉంది.
ఊరికి కొంచెం దూరం లో ఇంచుమించు ఒక నాలుగు కిలోమీటర్ల దూరం లో ఉంది వరదరాజ స్వామి ఆలయం. శ్రీమహావిష్ణువు కొలువుదీరిన సుప్రసిద్ధ ఆలయాలలో శ్రీవరదరాజ పెరుమాళ్ ఆలయానికి విశిష్టస్థానం ఉంది. దీనినే విష్ణు కంచి అని కూడా అంటారు. పరమపవిత్రమైన 108 దివ్యదేశాలలో, ఈ వరదరాజ స్వామి ఆలయం కూడా ఒకటి. ఆలయ గోపురం దాటి లోపలికి వెళ్ళగానే ఎడమవైపు నూరు కాళ్ళ మంటపం దర్శనమిస్తుంది. ఆనాటి శిల్పకళా వైచిత్రికి ఈ మంటపం గొప్ప తార్కాణం. దీని కళా సౌందర్యాన్ని మాటల్లో వివరించటం కష్టమే.... ఏకశిల తో చేసిన రాతి గొలుసులు చాలా ఆకర్షణీయంగానూ, ప్రతీ స్తంభానికి నాలుగు వైపులా పైనుంచి కింద వరకు అద్భుతం గా చెక్కిన శిల్పాలు, అందరి దేవతల అపురూపమైన శిల్పాలు ఎంతో రమణీయంగానూ ఉన్నాయి.
అవి చూసుకుంటూ గుడిలోపలికి వెళ్తే కుడివైపు శ్రీమహలక్ష్మి పేరుందేవి తాయారుగా దర్శనమిస్తుంది. అమ్మ వారి ఆలయం దాటాక మెట్లు ఎక్కి వెళ్తే నిలువెత్తు శ్రీమహావిష్ణువు వరదరాజ స్వామి గా కొలువుదీరి చతుర్భుజాలతో శంఖుచక్రాలు ధరించి అభయ హస్తంతో నయనానందకరంగా దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న మరో విశేషం ఆలయ పైకప్పు పీఠంపై సుందరంగా బంగారు, వెండి బల్లులు ఆకర్షణీయం గా ఉన్నాయి. ఈ బల్లుల పక్కనే వేరే పీఠంపై సూర్య, చంద్రుల రూపాలు అంతే మనోహరంగా ఉన్నాయి. స్వామి వారిని దర్శించుకుని బల్లులను స్పృశించి అమితానందంతో భారమైన హృదయాలతో బయటికి వచ్చాం.
కళ్ళు చెదిరిపోయే శిల్పకళా వైభవాన్ని, ముగ్ధ మనోహరమైన స్వామి వారి రూపాన్ని తలుచుకుంటూ వడి వడిగా అడుగులు వేశాం వైకుంఠ పెరుమాళ్ దేవాలయం వైపు. అత్యంత పురాతన శ్రీ మహావిష్ణువు ఆలయాలలో ఇదీ ఒకటి. ఆలయ ప్రాంగణం లోకి ప్రవేశించగానే చల్లని గాలి తోడై ఒక కొత్త అనుభూతి కలిగించింది. ఈ ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న స్ధంభాలు, గోడలపై కొలువుదీరిన శిల్పాలు నయనమనోహరంగా ఉన్నాయి. కాని చాలా శిల్పాలు శిధిలావస్థలో ఉండటం కొంచెం బాధ కలిగించింది. మరో విశేషమేంటంటే ఇక్కడ ఉన్న శిల్పాలు చోళులు మరియు పల్లవుల యుద్ధగాధని కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి.
No comments:
Post a Comment