మిత్రులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ~ దైవదర్శనం

మిత్రులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

* తొలికాంతి.. సంక్రాంతి...
* సకల శుభాల శోభ మకర సంక్రాంతి ...
ఆరుబయట చలిమంటలు.. వాకిళ్లలో ముగ్గులు.. వాటిపై గొబ్బెమ్మలతో ఆడపిల్లల ఆనందం.. ఆకాశంలో పతంగులతో అబ్బాయిల ఉత్సాహం.. గంగిరెద్దుల ఆటలను చూసి పిల్లల కేకలు.. ఈ సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. మరోవైపు వంటింట్లోంచి నోరూరించే వంటల ఘుమఘుమలు.. బోగిపండ్లు.. బొమ్మలు కొలువులు! మొత్తంగా ఇవి సంక్రాంతి తెచ్చే ఆనందాల కాంతులు.
తెలుగు వారి పెద్దపండుగైన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కొత్త అల్లుళ్ల రాకలు, బంధువుల సందడితో వాతావరణం పేరుకు తగ్గట్లే పెద్ద గానే ఉంటుంది.పల్లెల్లో అయితే చెప్పనక్కర్లే దు. పండుగకు వారం రోజుల ముందే పిండివంటల తయారీ మొదలెట్టి పూర్తిచేశారు. పట్టణాల బాట పట్టినవారు సైతం సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చేస్తున్నారు. గంగిరెద్దులవారు, బుడబుడకల సందడి..యువత ఆటలు, కేరింతల సవ్వడి.. పల్లె, పట్నం తేడా లేకుండా కనిపిస్తోంది.
.
సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
.
ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.
.
నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. [బుడబుక్కలవాళ్లు], పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండీ మొదలై, ఆ తరువాతసింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయనము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.
.
"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు - తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు.మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.
.
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు.
.
రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త దాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి దాన్యమ్ ఇస్తాము. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List