హిందువుల పరమ పవిత్ర గ్రంథం భగవద్గీత. ~ దైవదర్శనం

హిందువుల పరమ పవిత్ర గ్రంథం భగవద్గీత.


* శ్రీ మహావిష్ణువు ముఖ కమలం నుంచి వెలువడిన సిద్ధాంత గ్రంథం భగవద్గీత ...
* భగవద్గీత ఎలా ఆవిర్భావించింది ..??

భగవద్గీత భారతదేశ సాహిత్యంలో తలమానికంగా నిలిచి, ప్రపంచ సాహిత్యంలో ఎంతో ఉన్నతమైనదిగా గుర్తింపు సంపాదించుకున్నది. మహాభారత గ్రంథంలో అంతర్భాగమై స్వతంత్ర గ్రంథంగా యుగయుగాల నుంచి చెలామణిలో ఉంది. మహాభారత యుద్ధ ప్రారంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ”శరీరం, ఆత్మ వేర్వేరు అంశాలు. శరీరానికి పుట్టుట- గిట్టుట (జనన మరణాలు) అనేవి ఉంటాయి. ఆత్మకు మరణం లేదు. ఈ సృష్టికి ఆది- అంతము నేనే. నీవు నిమిత్తమాత్రుడవు” అనే అర్థంలో హితబోధ చేశాడు. అదే భగవద్గీత.
.
క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దంలో భగవద్గీతను మొదటిసారిగా వ్యాఖ్యానించింది ఆదిశంకరా చార్యులు. ఇందులో ఆద్యంతంతో పాటు మాయా వాదాన్ని ప్రచారం చేయగా, పదో శతాబ్దంలో శ్రీరామానుజాచార్యులు విశిష్టాద్వైతంతో పాటు పరిణామవాదాన్ని ప్రచారం చేశాడు. స్వామి వివేకానందుడి నుంచి నేటి వరకు ఎంతో మంది తాత్వికులకు స్ఫూర్తి నిచ్చింది భారత ఉపనిషత్‌లు, భగవద్గీత మాత్రమే. అందుకే భగవద్గీత భారత తాత్వికతకు హృదయం వంటిది అని చెప్పవచ్చు.
.
భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
.
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథ సారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.
.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవనమార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మ స్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు ఇవి:
సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్
శ్రీకృష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడు గోవులనుండి అర్జునుడనెడి దూడను నిమిత్తముగా చేసికొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును.
ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని ముఖ కమలమునుండి ప్రభవించింది. (మహాభారతం - భీష్మ పర్వం)
నేను గీతను ఆశ్రయించి ఉండును. గీత నా నివాసము. గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లే (వరాహ పురాణం)
నిరాశ, సందేహములు నన్ను చుట్టుముట్టినపుడు, ఆశాకిరణములు గోచరించనపుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకము ఒకటి కనిపిస్తుంది. ఆ దుఃఖంలో కూడా నాలో చిరునవ్వులుదయిస్తాయి. భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినమూ దానినుండి క్రొత్త అర్ధాలు గ్రహించి ఆనందిస్తారు. (మహాత్మా గాంధీ)
.
(భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఎందరో పండితులు, సామాన్యులు, ఔత్సాహికులు కూడా అర్ధాలు, అంతరార్ధాలు, సందేశాలు, విశేషాలు వివరించారు. కనుక "భగవద్గీత సారం" అన్నవిషయం ఇది వ్రాసేవారికి "అర్ధమయినంత, తోచినంత" అని గ్రహించాలి)
కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యంవైపు నడిపించడం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన, వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు.
ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును.
మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి.
కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నాయి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి. బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు. అనంతము, తేజోమయము, సర్వవ్యాప్తము, కాల స్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వ రూపాన్ని చూసి అర్జునుడు తరించాడు.
ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List