విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం మండలానికి చెందిన బలిఘట్టం గ్రామము బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయానికి చారిత్రాత్మకతను తెచ్చిపెట్టింది. లోక కళ్యాణార్ధం తలపెట్టిన యజ్ఞానికి శివారాధన నిమిత్తం బలిచక్రవర్తి బ్రహ్మను ప్రార్ధించి శివలింగాన్ని భూవికి రప్పించారు. కృతయుగంలో జరిగిన ఈసంఘటనతో ఈ ప్రాంతానికి చరిత్రలో స్థానం లభించింది. అందుకే ఈప్రాంత బలిఘట్టంగా పేరుగాంచింది.
హిందూ మహారాజు శివునికి నిత్యం పూజలు చేసేవాడని, ఒక సందర్భంలో శివార్చనకు నీరు లేకపోవడంతో విష్ణుమూర్తి కోసం తపస్సు చేయగా వరాహావతారంలో దర్శనం ఇచ్చిన ఆయన నీటిని సమకూర్చడంతో ఈ ప్రాంతంలో ప్రవహించే నదికి వరాహానది అని పేరువచ్చింది. ఈనది ఉత్తర దిక్కుగా ప్రవహించడంతో ఉత్తరవాహినిగానూ, ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది.
బ్రహ్మచే ప్రతిష్టింపబడిన ఈశివలింగానికి ప్రతీ ఏటా మహాశివరాత్రి పర్వదినాన్న పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. జిల్లాలోని దూర ప్రాంతాల నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని పునీతులవుతారు. ఉత్తర వాహినిలో స్నానం ఆచరించడం సర్వ పాప పరిహారంగా భక్తులు భావిస్తారు. బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది. రాతి స్తంభాలు , పై కప్పులు సైతం రాతితోనే నిర్మించారు. వేల సంవత్సరాల క్రితమే ఈదేవాలయం పూర్తి స్థాయిలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతుంటారు.
దేవాలయానికి గల ఆస్తులతోనే నిత్య ధూప,దీప,నైవేధ్యాలను సమకూర్చుతున్నారు. శివరాత్రి పర్వదినం రోజున వచ్చే వేలాది మంది భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించుకుంటారు. మహాశివరాత్రి మూడు రోజుల పాటు ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే రుద్రాభిషేకాలు, ఏకవారాభిషేకాలు కూడానిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
No comments:
Post a Comment