కర్నాటక రాష్ట్రంలో గల 'ఉడిపి' నుండి 120 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇది మంగుళూరు నుండి 75 కి.మీ. దూరంలో ఉన్నది. నేత్రావతి నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'మంజునాథేశ్వరాలయం'. క్రీ.పూ. 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది.ఈ ఆలయంలో అసత్యం పలికే విపత్తు కలుగుతుందనే నమ్మకం వలన కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూలవిరాట్ ను జైనులు ప్రతిష్ఠించారు. 800 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతుంది.
ధర్మస్థల... పేరులోనే ధర్మాన్ని నింపుకున్న ఈ యాత్రాస్థలానికి దేశ వ్యాప్తంగా ఎంతో పేరుంది. కర్నాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో మంగళూరు నౌకాశ్రయ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామమే ధర్మస్థల. పడమటి కనుమల పర్వతాలు, దట్టమైన అడవుల మార్గం ద్వారా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ 48 వ నెంబరు జాతీయ రహదారిలో ప్రయాణం చేసి షిరాలీ జంక్షన్ మీదుగా ధర్మస్థల చేరుకోవాలి.
మంగళూరు నుంచి సకలేశ్‌పూర్, హసన్‌ల మీదుగా బెంగళూరు వెళ్లే మార్గంలో ఉన్న చిన్న గ్రామం ధర్మస్థలలో మంజునాథ ఆలయం ఉంది. మన దేశంలోని ఎన్నో ప్రముఖ క్షేత్రాలకు లేని, భిన్నమైన ప్రత్యేకతలు ధర్మస్థలకు ఉన్నాయి. జైనమత కుటుంబీకుల ఆధ్వర్యంలోని ఈ శైవ క్షేత్రంలో పూజారులు, అర్చకులు, వైష్ణవులు అంటే ఆశ్చర్యపోవడం మన వంతే అవుతుంది. శైవ మతానికి, వైష్ణవ మతం ఆమడదూరంలో ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రెండు మతాలు ఒకటేనని, మతాలు ధర్మాలు వేరైనా దైవం ఒక్కటేనని ధర్మస్థల చెబుతోంది. కర్నాటక దేవాదాయ శాఖకు ఎలాంటి సంబంధం లేకుండా కేవలం ఓ జైన మత కుటుంబం ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు. 15వ శతాబ్దంలో 'కుడమ' అనే గ్రామంలో మంజునాథస్వామి ఆలయాన్ని ఆ ఊరిలోని హెగ్డే కుటుంబీకులు ఏర్పాటు చేశారు. ధర్మస్థలకు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో నేత్రావళీ నది పేరుతో ఓ చిన్నవాగు ఉంది. భక్తులు ముందుగా ఈ నదిలో స్నానం చేసి ఆ తర్వాత మంజునాథ దర్శనానికి రావడం ఇక్కడివారి ఆచారం.
గత ఐదు శతాబ్దాలుగా మంజునాథ ఆలయ నిర్వహణ బాధ్యతల్ని దేవరాజ హెగ్డే కుటుంబీకులు నిర్వహిస్తున్నారు. భక్తుల ద్వారా వచ్చే కోట్ల రూపాయల ఆదాయంతో దేవాలయాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేస్తూ వచ్చారు.
ఈ ఆలయమూ, దీనికి సంబంధించిన యావదాస్తులు హెగ్డే కుటుంబీకుల స్వంతం. కర్నాటక ప్రభుత్వానికి లేదా మరెవరికీ ఈ ఆలయంపై వీసమెత్తు అధికారం, హక్కు లేవు. అయినా హెగ్డే కుటుంబీకులు ఈ ఆలయ ఆస్తులు, ఆదాయాన్ని స్వంతానికి వాడుకోవడం, వారసత్వంగా పంచుకోవడం నిషిద్ధం. ఆలయానికి వివిధ రూపాలలో సమకూరిన ఆదాయంతో దేవాలయ నిర్వహణ, భక్తులకు సౌకర్యాలు మాత్రమే కాదు, సమీపంలోని ఉజ్రీ పట్టణంలో పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్నారు. డెంటల్, ఇంజనీరింగ్ కళాశాలలను సైతం శ్రీ మంజునాథ దేవాలయ ట్రస్టు ఎంతో సమర్దవంతంగా నిర్వహిస్తోంది. ఏడాదికి ఒక్కసారి ధర్మస్థలలో సర్వధర్మ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. దేశంలోని సర్వమతాల ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొంటారు.
No comments:
Post a Comment