ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.
రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి "ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి. వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం(పాల సముద్రం చిలకండి) జరపండి" అని చెబుతాడు. "ఆ మథనానికి కవ్వంగా మందరగిరి ని వాడండి. త్రాడు గా వాసుకి ని వినియోగించండి. ఆ మథన సమయం లో అమృతం పుడుతుంది. దానిని మీరు ఆరగించి, క్లేశాలు వారికి మిగల్చండి" అని విష్ణువు సెలవిస్తాడు.
ఆమాటలు విని, దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకువస్తుంటే బలి చక్రవర్తి వారిని వారిస్తాడు. ఆ తరువాత అలా కాలం వెళ్లబుచ్చుతున్న సమయం లో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు.
మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై క్రింద పడబోతే శ్రీ మహా విష్ణువు గరుడారూఢుడై వచ్చి, మందరగిరిని క్షీర సాగరము లో వదిలాడు. వాసుకి ని ప్రార్థించి వాసుకి కి అమృతం లో భాగమిస్తామని చెప్పి, ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మంధరగిరి క్రిందనిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరి తో మథనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చింది. ఆరొద కు ఎన్నో జీవరాశులు మరణించాయి.
అలా చిలుకుతుండగా ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసం లో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి, క్షీరసాగర మథనం జరుపుతుండగా వచ్చినదానిని అగ్రతాంబూలం గా స్వీకరించుమని ప్రార్థించగా శివుడు హాలాహలం అని గ్రహించి పార్వతి తో సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠం లో ఉంచుకొన్నాడు. గరళాన్ని కంఠం లో ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. కాని, గరళం శివుని లో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. శివుని కఠిన యొక్క మెడ నీలం గా మారడం తల తిరగడం వలన పరమశివుడు కొద్దిసేపు పార్వతీ దేవి ఒడిలో పడుకున్నట్లుగా ఇక్కడ విగ్రహం ఉంటుంది.
No comments:
Post a Comment