“హోలీ” ~ దైవదర్శనం

“హోలీ”

మీ జీవితం వర్ణశోభితం కావాలని ...
మిత్రులందరికి హోలీ శుభాకాంక్షలు...
కాముని పున్నమి రోజే “హోలీ” ...
ఆనందకరమైన హోలీ .. శ్రీ కృష్ణరాసలీలల కేళి ...

.
.
ఈ రోజు హొలీ పండుగ. మన భారతదేశం వివిధరకాల ఆచారాలు, సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా
పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది. ఒకరిపై ఒకరు పిచికారీలతో రంగులు చిమ్ముకుంటూ సరదాగా ఆడి పాడుకుంటారు. హొలీ అంటే కామదహనం.
.
హోలీ పండగ వసంతాగమనాన్ని తెలియజేస్తుంది. ఈ పండగను మనదేశంలో పలురాష్ట్రాలలోని ప్రజలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసు కుంటారు. ముఖ్యంగా, నగరాలలో వివిధ ప్రాంతాల నుండి ఉద్యోగ ధర్మంగా వచ్చిన ప్రజలు ఉంటారు. అందరూ కలిసి మెలిసి మెలుగుతూ సంఘీభావంతో, ఆనందంతో, జరుపుకోవడం కనిపిస్తుంది.హోలీ పండగ ఈనాటిది కాదు. దక్షయజ్ఞంలో అవమానానికి గురైన సతీదేవి హిమవంతునికి పుత్రికయై జన్మించి, శివుడినే పతిగా పొందగోరి, అనునిత్యమూ ఆయననే పూజిస్తూ, సపర్యలు చేస్తూ ఉండేది.
.
లోకకళ్యాణార్థం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయదలచిన దేవతలు మన్మథుని సహాయం కోరగా, అతడు శివుడిపై పూలబాణాన్ని కురిపిస్తాడు.ఈ విషయాన్ని దివ్య దృష్టితో చూసిన పరమేశ్వరుడు కోపగించి, తన మూడవ నేత్రాన్ని తెరచి, మన్మధుడిని భస్మం చేస్తాడు.రతీదేవి రోదించగా, జాలిపడిన పార్వతీ దేవి కోరిక మేరకు మన్మధుడు ఆ శరీర రూపంతో, సజీవుడయ్యేట్లుగా వరాన్ని ప్రసాదిస్తాడు.ఆరోజు ''ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. అదే కాముని పున్నమిగా జరుపుతున్నాం.
.
పూర్వం రఘుమహారాజు కాలంలో 'దాండ అనే ఒక రాక్షసి ఉండేదట! అది లోక కంటకురాలై, రాజ్యంలోని శిశువులను పట్టుకొని తినేస్తూ ఉండేదట! ప్రజలంతా వెళ్లి రాజుగారికి మొర పెట్టుకోగా, ఆయన వెళ్లి మునీశ్వరులను ప్రార్థిం చాడట. ఆమె ఒక బాలగ్రహం అనీ, ఆమెకి మంట అంటే భయం అనీ, ఆమె మరణం మంటల వల్లనే జరుగుతుందని చెప్పారట.రాజుగారి ఆజ్ఞమేరకు ఊరినిండా మంటలు వెయ్యగా, భయంతో కేకలు వేస్తూ, ఆ రాక్షసి మరణించిందట. ఆరోజున మంటలో పిడకలువేసి, ప్రజ్వలింపజేసి, ప్రదక్షిణం చెయ్యాలని ధర్మసింధువు, నిర్ణయ సింధువుల్లో హేమాద్రి పండితుడు తెలియజేశాడు.
.
ఇంకొక కథ ప్రకారం, హిరణ్యకశిపుని సోదరి, హోలిక అనీ, ఆమె ''ప్రహ్లాదుడి వల్లనే తన అన్నగారు చనిపోయేరనే కోపంతో, ప్రహ్లాదుడిని మంటల్లో తోయించిందని, కానీ, ఆమంటలు పిల్ల వాడిని ఏమీ చేయక, ఆ హోళికనే దహించి వేశా యని, అంటూ చెడుపై మంచి సాధించిన గుర్తుగా ఈ హోళీని జరుపుకుంటారు. వేరే కథ ఏమి టంటే, ఎంత చెప్పినా హారి భక్తి మానని ప్రహ్లాదు డిని హిరణ్య కశిపుడే మంటల్లో పడేయించితే, అతడి మేనత్తయైన హోలిక పిల్లవాడిని ఒళ్లో పెట్టుకొని మంటల్లో కూర్చుందని, అష్టసిద్ధులూ ఉన్న ఆమెను మంటలు ఏవీ చెయ్యవు కాబట్టి, పిల్లవాడు క్షేమంగా అగ్ని నుండి బైటపడ్డాడని, పండగ చేసుకున్నారట!
.
ఇవన్నీ ఇలా ఉండగా, ద్వాపరయుగంలో తన నెచ్చెలియైన రాధ తనకంటే తెల్లగా ఉందని, తాను నల్లగా ఉన్నానని, అలిగి, తన తల్లియైన యశో దమ్మ వద్ద వాపోయేడట, చిన్నికృష్ణుడు. అయితే ఒక పని చెయ్యి, రాధ శరీరం నిండా రంగులు పూసెయ్యి అని సలహా ఇచ్చి నవ్వుకుందట యశోద! తల్లి సలహా ప్రకారం రాధను పట్టుకొని, రంగునీళ్లను కుమ్మరించాడట కృష్ణుడు. మరిరాధ ఊరుకుంటుందా? తానూ కన్నయ్యపై వసంతాన్ని జల్లింది. అలా మొదలైన ఈ వేడుక, స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, తెలిసినవారు, తెలియని వారు అందరూ ఒకరిపై ఒకరు రంగులు జల్లు కొంటూ, రంగుల్ని పూసుకుంటూ వేడుక చేసుకునే స్థాయికి చేరింది.
.
ఈ 'కామ దహనాన్ని కొన్ని చోట్ల చలిమంటలుగా వ్యవహరిస్తారు. ఇంకా, కొన్నాళ్లకు పండగ వస్తుం దనగానే, కట్టెలు, పిడకలు దుంగలు, చెత్త, చెదారం పోగు చేసి ఉంచుతారు. పిల్లలు, పెద్దలు, అందరూ సంతోషంతో కేరింతలు కొడుతూ, మంట చుట్టూ తిరుగుతూ ఆనందిస్తారు.కాముని పున్నమిగా, డోలికోత్సవంగా ఫాల్గుణోత్సవంగా పిలుస్తూ జరుపుకుంటారు. కామదహనం పేరుతో చేసే ఉత్సవంలో ఎంతో ఆధ్యాతికత దాగి ఉంది. ''కామాన్ని అంటే కోరికని, దహించివేసి (పోగొ ట్టుకొని) అందరూ సోదరభావంతో, వాత్సల్య, అభిమానాలతో, కులాతీత, మతాతీత, జీవితాన్ని గడపడమే, మానవజన్మకు చరితార్థం అనేది ఆంతర్యం. కొన్ని ప్రాంతాల్లో ఈసీజన్‌కి అను గుణంగా పండిన పంటలతో, అంటే శనగపప్పు, గోధుమలు వగైరాలతో, బొబ్బట్లు చేసి మంటల్లో వేస్తారు.
.
ప్రకృతి ప్రసాదించినవి ప్రకృతికి సమర్పించడమే ఇందులోని సందేశం. పితృ దేవతలను సంతృప్తి పరచి, హోలికా భూమికి నమస్కరిస్తే, సర్వ దుఃఖాలు తొలగుతాయని, శుభం కలుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈ పండగ ఉత్తర భారతంలో చాలా ప్రాచుర్యం పొంది, క్రమక్రమంగా అన్ని ప్రాంతాలకూ విస్తరించి, రంగుల పండుగగా ఆచరింపబడు తోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాయలసీమల్లోనూ వైభవోపేతంగా జరుపబడు తోంది. సంస్కృతీ సాంప్రదాయాల మేళవింపుగా, భిన్నత్వంలో ఏకత్వం గోచరిస్తూ సర్వ మానవ సౌభ్రాతృత్వానికి దారితీస్తోంది.
.
మహారాష్ట్రలో హోళిక దిష్టిబొమ్మను మంటలో వేసి, దహనం చేస్తారు. ప్రొద్దున్న నుండి రాత్రి వరకూ మంటలను వేసి మహిళలు ప్రత్యేకంగా తీపి పిండివంటలను చేసి నైవేద్యం సమర్పిస్తారు. మణిపూర్‌లో, వారంరోజుల పాటు ఈ ఉత్సవాలు జరిపి, చివరిరోజున కృష్ణుడి ఆలయం వరకూ ఊరేగింపుతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, వెళ్లి పండగ చేస్తారు. ఇలా వయో భేదాలు మరచి, కులమతాలకు అతీతంగా సుఖసంతోషాలతో జీవితాలు సాగాలనే ఆకాంక్షతో జరుపుకునే సంబరం ఈ పండగ...

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List