మాధవ సరోవరం శ్రీ కృష్ణదేవాలయం. ~ దైవదర్శనం

మాధవ సరోవరం శ్రీ కృష్ణదేవాలయం.


ఉడిపి కర్ణాటక రాష్ట్రంములోని ఒక జిల్లా. మంగుళూరుకు 60 కి.మీ దూరంలో ఉంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని, అద్వితీయ అనుభవాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చే క్షేత్రం ఉడిపి. పశ్చిమ కనుమలలో అందమైన ప్రకృతి వడిలో ఉంది. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడిపిని సందర్శిస్తారు.
ఈ కృష్ణదేవాలయం , విగ్రహం ఏర్పాటు వెనుక ఎన్నో గాధలు ఉన్నాయి. గోపీ చందనం పూతతో ఉన్న ద్వారకలోని శ్రీ కృష్ణవిగ్రహం ఒకటి మిగతా కలపతో పాటు ఒక ఓడలో కలిసిపోయింది. ఆ ఓడ పశ్చిమ తీరం వైపు ప్రయాణిస్తోంది. ఇంతలో తుఫాను రాగా ఆ ఓడ పశ్చిమతీరంలోగల 'మాల్పె' పట్టణం వద్ద చిక్కుకుపోయింది. ఉడిపిలో తపస్సు చేస్తున్న మధ్వాచార్యులు తన దివ్యదృష్టితో ఈ ఓడ గురించి తెలుసుకుని తన వద్ద ఉన్న కాషాయ కండువాను ఊపగా తుఫాను శాంతించింది. ఓడ తీరాన్ని చేరిన తర్వాత విషయం తెలుసుకున్న ఓడ కెప్టెన్‌ మధ్వాచార్యుల వద్దకు వచ్చి సాష్టాంగ పడి ఆయన చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా ఏదైనా కోరుకోమని అడిగాడు. ఆ ఓడలో చందన పూతతో ఉన్న కృష్ణవిగ్రహం ఒకటి ఉంది దానిని ఇమ్మని మధ్వాచార్యులు కోరారు. తర్వాత ఆయన దీన్ని సరస్సులో శుభ్రం చేసి, అభిషేకించిన అనంతరం మఠంలో ప్రతిష్టించారు.
మరో కథనం ప్రకారం, తుఫానులో చిక్కుకున్న ఓడతో పాటు కృష్ణవిగ్రహం కూడా నీళ్లలో మునిగింది. కొన్నేళ్ల తరువాత ఉడిపి వచ్చిన మధ్వాచార్యులు తన దివ్యదృష్టితో సముద్రంలో మునిగిన కృష్ణవిగ్రహాన్ని కనుగుని ఉడిపి తీసుకువచ్చి సంక్రాంతి నాడు ప్రతిష్టించారని చెబుతారు. కృష్ణ విగ్రహానికి అభిషేకం చేయించిన సరస్సును ఇప్పుడు 'మాధవ సరోవరం ' గా పిలుస్తున్నారు. కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టించిన గుడిని ఉడిపి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని మధ్వాచార్యులు 13వ శతాబ్ధంలో లేదా 16వ శతాబ్ధంలో ప్రతిష్టించినట్లు చెబుతారు.
భక్తులు కిటికీ గుండా కృష్ణుణ్ణి దర్శించుకోవడానికి గల కారణాలపై మరో కథనం ఉంది. వాధిరాజు పాలనలో కనకదాస అనే భక్తుడు కృష్ణునికి మహాభక్తుడు. ఎలాగైనా ఉడిపి కృష్ణుణ్ణి దర్శించుకోవాలని అతను తహతహలాడుతుండేవాడు. కాని అతను కడజాతి వాడు కనుక అతన్ని పూజారులు గుడిలోకి అనుమతించలేదు. అప్పుడు అనుగ్రహించిన కృష్ణుడు తన విగ్రహం వెనుక వైపున గోడకు చిన్న కన్నం ఏర్పాటు చేసి వెనుకకు తిరిగి భక్తుడైన కనకదాసకు దర్శనమిచ్చి కరుణించాడు. అప్పటి నుంచి ఆ కిటికీకి 'కనకనకిండి ' అనే పేరు వచ్చింది. అయితే అక్కడ నుంచే కృష్ణుణ్ణి దర్శనం ముగ్ధమనోహరంగా లభిస్తుండడం మరో విశేషం.
ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది.
ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవడు ఉన్నరు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదక్షణం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది.
ఇక్కడ ఉదయం 5 నుంచి ఎన్నో పూజలు, సేవలు మొదలవుతాయి. మధ్య నవమి, రామ నవమి, నృసింహ జయంతి, భాగీరథ జన్మదినం, కృష్ణలీలోత్సవం, గణేష్ చతుర్థి, అనంత చతుర్థి, సుబ్రహ్మణ్య షష్టి, నవరాత్రి, దసరా, హోలి, వసంత పూజ, జాగరణ సేవ, తులసీ పూజ, లక్షదీపోత్సవం, ధనుపూజ ఇంక ఎన్నో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు ఏడు రోజులు సప్తోత్సవం పేర ఉత్సవాలను నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున ఇక్కడ నిర్వహించే చర్నోత్సవ సేవలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొని తరిస్తారు.
ప్రతీ రెండేళ్లకోసారి పర్యోత్సవం నిర్వహిస్తారు. ఈ రెండు ఉత్సవాలను చుడ్డానికి భక్తులు ప్రత్యేకంగా దేశ విదేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ బంగారు రథంలో శ్రీకృష్ణునికి నిర్వహించే ఉత్సవం చూసి తీరాల్సిందే. ఈ రథంలో ఊరేగుతున్న కృష్ణుడు నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చి మరీ ఊరేగుతున్నాడా అన్నంత అనుభూతిని అందిస్తుంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List