సిద్ధ యోగి పుంగవుడు ''మౌన స్వామి''. ~ దైవదర్శనం

సిద్ధ యోగి పుంగవుడు ''మౌన స్వామి''.

ఆంధ్రప్రదేశ్ లోని పూర్వం గుంటూరుజిల్లా ఇప్పటి ప్రకాశంజిల్లాలోని చీరాల వద్దగల నూనెవారిపాలెంలో 1868 వైశాఖశుద్ధ చతుర్ధినాడు అచ్యుతుని బాపనయ్య సీతమ్మల మూడవ కుమారుడుగా జన్మించారు మౌన స్వామి. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు పిచ్చయ్య. బాపనయ్యగారి బంధువులు అచ్యుతుని లక్ష్మీనరసయ్య, సుందరమ్మలు పిచ్చయ్యను దత్తత తీసుకొని శివయ్య అని పేరు మార్చి పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. వయసు రాగానే శివయ్యకు కామేశ్వరమ్మతో వివాహం జరిపించారు.ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. శివయ్యకు నాగభూషణం అనే కుమారుడు, లక్ష్మీనరసమ్మ, సుందరమ్మ అనే కుమార్తెలు కలిగారు. 1903 లో పెద్దకుమార్తెకు ఆ తర్వాత రెండవ కుమార్తెకు, అదే కాలంలో కుమారునకు ఉపనయనం చేశారు.
.
చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక చింతన, దేవి ఉపాసన నిత్యకృత్యాలు శివయ్యకు. అబ్కారీ డిపార్ట్మెంట్లో కొంతకాలం , రాజముండ్రిలో ప్లీడరు గుమస్తాగా కొంతకాలం ,ఒక వ్యాపారస్తుని దగ్గర కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ రోజుల్లోనే ఒక భైరాగితో పరిచయమైంది. అప్పుడు బాహ్య జగత్తునుండి అంతర్జగత్తులోకి ద్రుష్టి మళ్ళింది. 1906 డిసెంబరులో అప్పటిదాకా 12 సంవత్సరాలుగా రాజముండ్రిలో సంసారంతో ఉన్న శివయ్య అన్ని లౌకికబంధాలు తెంచుకొని హిమాలయాల వైపు ప్రయాణించారు . అక్కడ నైమిశారణ్యంలో పర్వత గుహల దగ్గర 'వెంకటాచలం పంతులు' అనే తెలుగు వృద్ధ యోగితో భగవంతుని కృపతో పరిచయం అయింది . వారికి సేవచేసి కొన్ని నెలల పాటు వారి అనుగ్రహాన్ని పొంది ఆకలిదప్పులు లేని, విషజంతువులచే బాధనొందని విద్యను పొందారు. అక్కడ నుండి హిమాలయాలకు ప్రయాణం సాగించారు.
.
హిమాలయాలలో అచ్యుతానందసరస్వతి అనే మహాసిద్ధుని ఆశ్రమం కనిపించింది. ఆ స్వామి దత్తాత్రేయుని సంప్రదాయానికి చెందిన యోగి. దశమహావిద్యల మూలదేవత సిద్దేశ్వరీదేవిని పరశురాముని అనుగ్రహంతో సాక్షత్కరించుకొన్న వాడు. అచ్యుతానందసరస్వతీస్వామి శివయ్యకు సన్యాసదీక్షను ఇచ్చి 'శివచిదానంద సరస్వతి' అని యోగపట్టా ప్రసాదించాడు. ఆ ఆశ్రమంలోనే తపస్సు చేసుకుంటుండే నిఖిలేశ్వరానంద,విశుద్ధానంద ఆ ఆశ్రమానికి వచ్చారు. వారితో కలసి సాధన చేశారు శివచిదానందస్వామి.
.
అచటి నుండి గురువుల ఆజ్ఞతో శివచిదానందస్వామి దేశ సంచారం చేస్తూ దత్తభక్తులైన వాసుదేవానందసరస్వతి కలిశారు. వారిని టెంబేస్వామి' అని కూడా పిలుస్తారు. వారు శివచిదానందస్వామికి యోగరహస్యాలు చెప్పి సిద్ధపురుషులుగా తయారు చేశారు. శివచిదానందస్వామి 'మౌన స్వామి'గా ప్రసిద్ధి నందటానికి రెండు కారణాలు చెపుతారు. ఒకసారి స్వామి కాశ్మీరులో పర్యటన చేస్తుండగా అక్కడి వృద్ధపండితుల విద్వద్గోష్టిలో వివాదాస్పదమైన కొన్ని సందేహాలకు సమాధానం చెప్పి వారి కోపానికి కారణమైనారు. ఈ విషయం తెలిసిన గురువుగారు శివచిదానందను మౌనంగా ఉండమన్నారు. మరొక కారణం ఒకసారి వృద్ధాచల సమీపారణ్యంలో తపస్సు చేస్తుండగా కోపావిష్టులైనారు. తన కోపం కారణంగా ఇతరులకు కష్టం కలగవచ్చునని గ్రహించి స్వచ్ఛందంగా 'మౌనవ్రతం' స్వీకరించారు. అప్పటినుండి సంజ్ఞలద్వారానో, లిఖితపూర్వకంగానో తన అభిప్రాయాలను వెల్లడిస్తుండేవారు. ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడేవారు కాదు. అందువల్లనే వారిని 'మౌన స్వామి' అని సమస్త ప్రజానీకం పిలవడం ప్రారంభించింది. అయితే స్వామి వారు ఒకసారి మాత్రం మాట్లాడారు జిల్లెళ్ళమూడి అమ్మతో ఆమెకు 7 ఏండ్ల వయస్సులో.
.
అమ్మ బాల్యంలో తాతమ్మ మరిడమ్మగారితో కలిసి చీరాల వెళ్ళింది. ఆ సమయంలో మౌన స్వామివారు నూనె పానకాలుగారి తోటలో విడిది చేసి ఉన్నారు.తాతమ్మతో కలసి అమ్మ మౌన స్వామిని చూడటానికి వెళ్ళింది. చూచి అందరు తిరిగి వచ్చారు. మరుసటి రోజు అమ్మ ఒక్కతే వారి వద్దకు వెళ్ళింది. స్వామి వద్ద నుండి అందరూ భోజనాలకు వెళ్ళిన సమయం చూచుకొని దొడ్డి వాకిలిగుండా స్వామివారి వద్దకు వెళ్ళింది. అమ్మను చూచి స్వామి దగ్గరకు పిలిచారు. అమ్మ స్వామిని మౌనమంటే ఏమిటి? అని అడిగింది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండటానికి మౌనం ఆధారం అన్నారు స్వామి. మీరుమన్నవలో వేసిన యంత్రం రాజరాజేశ్వరీ యంత్రమా? రాజ్యలక్ష్మీయంత్రమా? అని అడిగింది నీకాసందేహం ఎందుకొచ్చింది? అన్నారు స్వామి. 
.
ఆ ఊళ్ళో ఒక్కళ్ళు రాజరాజేశ్వరి అనీ, మరొకరు రాజ్యలక్ష్మీ అని అనుకుంటున్నారు అన్నది అమ్మ. రాజరాజేశ్వరీ యంత్రమే అన్నారు స్వామి. మీరు అసలు మాట్లాడతారో మాట్లాడరో అనుకుంటూ వచ్చాను అన్నది అమ్మ. నిన్ను చూడగానే మాట్లాడాలనిపించిందమ్మా! ఇంకొకటి గూడా అనిపిస్తున్నదమ్మా! నీవు దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తున్నావు నేనెవరికీ చెప్పను గాని నీవెవరు? అన్నారు. అప్పుడు అమ్మ అదిసరే గాని మీరు అందరికీ బాలమంత్రం ఇస్తుంటారా? అని అడిగింది. స్వామి ఆమాట పట్టించుకోకుండా నీ రాక చాల గోప్యంగా ఉంచుకుంటానమ్మా! నీతో మాట్లాడినట్లు తెలిస్తే వీరంతా ప్రాణాలు తీస్తారు. నేను మౌనం ప్రత్యేక సాధనగా పెట్టుకోలేదు. కొన్ని అవసరాలు అలా కల్పించినవి అన్నారు. మీరు బాల చెప్పిన వాళ్ళందరికీ నేను ఆజపం చేపుతానన్నది అమ్మ. స్వామీ ఆశ్చర్యపోయి అమ్మను చూస్తూ అక్కడున్న రుద్రాక్షమాలను అటునుండి ఇటూ, ఇటు నుండి అటు త్రిప్పుతూ ధన్యోస్మి అని. అజపమంటే ఏమిటమ్మా? అన్నారు. నోటితో ఉచ్చరించనిది అన్నది అమ్మ. అటువంటి దాన్ని ఎట్లా చెపుతావు? అన్నారు. చెప్పటమంటూ వచ్చినపుడు మాటలు లేకుండా ఎట్లా ఉంటాయి. చెప్పేటప్పుడు మాటలతో చెప్పినా చేసేటప్పుడు మాటలు లేకుండా చేసేది అన్నది అమ్మ. స్వామి ఎవరో వస్తున్న అలికిడికాగానే వెళ్ళమ్మా వెళ్ళు అన్నారు అమ్మను. ఎందుకువెళ్ళటం అన్నది అమ్మ. నా నిష్ఠకు భంగం అన్నారు స్వామి. నిష్ఠ అంటే ఏమిటి స్వామి ? అని అడిగింది అమ్మ. నిష్ఠ అంటే అనుష్టానం అన్నారు స్వామి. ఇంతలో బయట నుండి తలుపులు తట్టటంతో అమ్మ మరొక వైపు నుండి బయటకు వచ్చింది.
.
ఇలా అమ్మకు మౌన స్వామికి మహత్తరమైన సంభాషణ జరిగింది. అమ్మ ఆ చిన్నప్పుడే మన్నవలో రాజ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళినపుడు అమ్మవారి క్రింద వున్న యంత్రం మౌన స్వామి వేశారు అన్నారు. అందుకని అమ్మ మౌన స్వామిని ఆ యంత్రాన్ని గూర్చి ప్రశ్నించింది. తను చెప్పింది సత్యమని ఋజువు చేసింది. ఆ రోజులలో స్వామివారు చీరాల ,బాపట్ల , మన్నవ , రాజమండ్రి ప్రాంతాలలో సంచరించి నట్లు కొన్ని చోట్ల దేవతా ప్రతిష్టలు చేసినట్లు దాఖలాలున్నాయి.
.
కుర్తాళం స్వామి దత్తమఠాన్ని నెలకొల్పారు. స్వామివారు ఎన్నో మహిమలు చూపించారని వారి జీవితచరిత్ర చదివిన వారికి అర్ధమౌతుంది. తమిళనాడు గవర్నరు ఇంగ్లీషు దొర తన సతీమణితో స్వామి దర్శనానికి రాగా రెండు గులాబీ దండలు యాపిలు పండ్లు సృష్టించి ఇచ్చారు. ఇసుక పట్టుకుంటే బంగారుమయ్యే సువర్ణవిద్య స్వామి కరతలామలకం. మౌన స్వామి మహాయోగసిద్ధుడు. 23. 12. 1943 పుష్యశుద్ధ పాడ్యమినాడు సిద్ధిపొందారు. వారి తర్వాత వచ్చిన పీఠాధిపతులలో శ్రీ శివచిదానంద భారతీస్వామి. శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి అమ్మవద్దకు వచ్చిన మహనీయులు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List