6 నెలలు మాత్రమే కనిపించే ముక్త్యాల శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి. ~ దైవదర్శనం

6 నెలలు మాత్రమే కనిపించే ముక్త్యాల శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు, కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మండలం మక్త్యాల గ్రామాల మధ్య కృష్ణానది మధ్యలో ముక్తేశ్వరుడిగా పూజలందుకునే ఆ స్వామి సంవత్సరంలో ఆర్నెల్లపాటు కృష్ణమ్మ ఒడిలో దాగుంటాడు. ఆ సమయంలో స్మామిని దేవతలు ఆరాధిస్తారని ప్రతీతి. కృష్ణమ్మ వరద తగ్గినప్పుడు ఈ ఆలయం భక్తులకు కనిపిస్తుంది. ఇక్కడ మరో విశేషం కూడా వుంది. సాధారణంగా శివయ్యని లింగ రూపంలో చూస్తుంటాం. ఇక్కడ అమ్మవారిని కూడా లింగ రూపంలో అర్చిస్తారు. అంటే, ఇక్కడ రెండు లింగాలు, రెండు నందులు, రెండు ఆలయాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ దక్షిణం వైపు వున్న నందిని తిరుగుడు నందిగా పిలుస్తారు.
స్ధలపురాణం.....
ఈ ముక్తేశ్వరస్వామి బలిచక్రవర్తి ప్రతిష్టగా స్ధలపురాణం చెపుతోంది. పూర్వం నైమిశారణ్యంలో బాణాసురుని తండ్రియైన బలిచక్రవర్తి కైలాసవాసుడైన చంద్రశేఖరునిగూర్చి తపస్సు చేసాడు. అతని తపోజ్వాలలుల ఎల్లలోకాలను దహించివేయసాగాయి. దేవతలందరు భయపడి,పరమేశ్వరుని చేరుకొని రక్షించమని ప్రార్ధించారు. కరుణాహృదయుడైన పశుపతి దేవతల కభయమిచ్చి, తన భక్తుని భక్తికి మెచ్చి బలిచక్రవర్తికి ప్రత్యక్షమయ్యాడు. బలిచక్రవర్తి ప్రత్యక్షమైన పరమేశ్వరుని పలురీతులుగా స్తుతించి ,దేవా! నీవు కాశీక్షేత్రం లో విశ్వేశ్వరుడను పేరుతో వెలసి సమస్త జీవజాలాన్ని కాపాడుతూ ముక్తిని ప్రసాదిస్తున్నావు. అదేవిధంగా దక్షిణకాశి గా పేరొందిన ముక్త్యాల క్షేత్రంలో “ముక్తేశ్వరుడ” ను పేరుతో “శక్తి” తో గూడి భక్తులకు ముక్తిని ప్రసాదించమని ప్రార్ధించగా పరమేశ్వరుడు అందుల కంగీకరించి ముక్తేశ్వరుడుగా ముక్త్యాలలో వెలిశాడు. నదీ గర్భంలో స్వర్ణాలయం ఉందని, దానిని విశ్వకర్మ సృష్ఠించాడని బలిచక్రవర్తి ఈ ఆలయంలో స్పటికలింగాన్ని ప్రతిష్టించి పూజించాడని స్ధలపురాణం.
నదీగర్భంలోని ఈ ఆలయం కాక నదీతీరంలో మరొక భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం కన్పిస్తుంది.ఇది మహామండలేశ్వరులు”,నరసింహవర్ధన” బిరుదాంకితుడైన చాగి పోతరాజు నిర్మాణం.తన విజయ రాజ్యము యొక్క ఆచంద్రతారార్క అభివృద్ధి కొరకు, తన ప్రజల సుఖశాంతుల కోసం చాగి పోతరాజు వేయించిన దానశాసనం శ్రీ భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్ధంభానికి వెనుక గా నున్న నాగశిలపై కన్పిస్తుంది. ఈ శాసనంలో” నరసింహవర్ధన” పోతరాజు చేసిన అనేక పుణ్యకార్యాలు ప్రస్తావించబడ్డాయి.
చాగిపోతరాజు ముక్తేశ్వర మహాదేవరకు ఆలయ నిర్మాణాన్నిచేయించాడు. త్రిపురాంతక కాశ్మీర మల్లేశ్వర విశ్వనాథ చోడనారాయణ దేవరలకు కనకకలశాలను ఎత్తించాడు. సింహాచల నారసింహునకు చాగి సముద్రము అనే చెఱువు ను తవ్వించాడు. శ్రీశైలం లో మల్లిఖార్జునునకు ఎదురుగా నందికేశ్వరుని ప్రతిష్టించి, దేవ భోగములకొరకు, కంభంపాడు, ముచ్చింతాల,బోదపాడు మొదలగు గ్రామాలను దానం చేశాడు. నతవాడి సీమను బెజవాడనుండి పరిపాలించిన రాజనీతిజ్ఞుడీయన. ఈ శాసనం మీద సంవత్సరం ఛిద్రమైంది . కొంత భాగం లభించక శాసనం అసంపూర్తిగా ఉంది.
బలిచక్రవర్తిచే నిర్మింపజేయబడి, విశ్వకర్మసృష్టిగా చెప్పబడుతున్న దేవాలయం నదీగర్భంలో అధికకాలం ఉండిపోయి, సామాన్యప్రజలకు ఉత్తరవాహినిలో శివపూజకు అవకాశం లభించడంలేదనే ప్రజల అభ్యర్ధన మేరకు రెండవపోతరాజు ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు. ఈతని కాలం క్రీ.శ 1230 ప్రాంతం . కుఱుకుర్రు స్వయంభూదేవరకు దానంచేసిన నవాబు పేట శాసనం లో వీని ప్రస్తావన కనబడుతోంది. ఆ శాసనకాలం శా.శ. 1152 గా వ్రాయబడింది. నరసింహవర్ధనపోతరాజు బెజవాడ రాజధాని గా నతవాడి సీమనుపరిపాలించాడు.
ముక్త్యాలదేవాలయంలోనిశాసనంవంటిదేవిజయవాడదుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయంలో కూడ కన్పిస్తోంది. ముక్త్యాలలోని ముక్తేశ్వర ఆలయంలోని కళ్యాణమండపంలో శా.శ.1129 {క్రీ.శ. 1207 } నాటి ,ఈవని కండ్రవాట్యధిపతి కేశవోర్వీపతి వేయించిన శాసనం ఒకటి కన్పిస్తోంది. కేశవోర్వీపతి ముక్తేశ్వర దేవరకు 25 ఆవులను “విమలాఖండ ప్రదీపశ్రీ “{ అఖండ దీపారాధన} నిమిత్తం దానం చేసినట్లు వ్రాయబడింది.
చాగి వంశములోని రెండవపోతరాజు భార్య ముక్తాంబ యని , ఆమె పేరు మీద ముక్త్యాల నిర్మాణం జరిగి ఉండవచ్చని, ముక్తేశ్వర దేవరకు ఈ ముక్తాంబకు మైనా సంబంధముందేమో యోచించాలని సందేహించారు కొందరు విమర్శకులు.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతమ్మతో కలిసి వచ్చినప్పుడు స్వర్ణాలయంలోని ముక్తేశ్వరుని సేవించాడని, ద్వాపరయుగంలో ధర్మరాజు సోదరసమేతుడై ఈ మహాదేవరను పూజించినట్లు, కలియుగంలో విక్రమార్కాది మహారాజులందరో ఈ దేవుని దర్శించి తరించినట్లు తాతంభట్టు గురుమూర్తి శాస్ర్తిగారు” కృష్ణా మహాత్మ్యము” అనే గ్రంధములో వ్రాశారు.
https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List