వరాల తల్లి.. శ్రీ వల్లూరమ్మ ఆలయం ~ దైవదర్శనం

వరాల తల్లి.. శ్రీ వల్లూరమ్మ ఆలయం




ప్రతి గ్రామంలో గ్రామదేవతకి సంబంధించిన ఆలయం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా పూర్వం దుష్ట శక్తిని అంతం చేయడానికి అగ్ని నుండి వల్లూరమ్మ తల్లి వెలిసిందని పురాణం. మరి వల్లూరమ్మ తల్లి ఎలా వెలసింది? ఈ తల్లి వెలసిన ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా లో వల్లూరు అనే గ్రామంలో శ్రీ వల్లూరమ్మ ఆలయం ఉంది. భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ, భూతపిశాచాలను సైతం వణికించి,విఘ్నములు బాపు కల్పవల్లి, సంతతికి కలిగే ఆపదల నుండి గాచు అమృతవల్లిగా, దుష్టశక్తులను అంతం చేయు సర్వశక్తిమయిగా వివిధ రూపాలలో రక్షిస్తుంది.


దుష్టశక్తుల పాలిట సింహస్వప్నమై, శాకినీ, ధాకిని, గాలి దయ్యాలు, పేరు తలచినంతనే హడలునట్లుగా సుమారు ఐదు వందల సంవత్సరాల నాటి చారిత్రక ప్రాధాన్యతను నంతరించుకొన్న దేవాలయం శ్రీ వల్లూరమ్మ దేవస్ధానం.


వల్లూరమ్మ, జ్వాలాముఖి అమ్మవార్లిరువురూ బరూరు నరసింహ యోగీంద్రులనే సిద్ధుడి మంత్రప్రభావంతో హోమగుండం నుంచి 300 సంవత్సరాల క్రితం ఆవిర్భవించారని ఆసక్తిదాయక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 


స్థల పురాణం..


వెంకటగిరి రాజులు, ఒంగోలు మందపాటి రాజుల కలహముల కారణంగా వెలసిన ఉల్కాముఖి అమ్మవారే వల్లూరమ్మ అని, దానికి సంబంధించి ఓ పురాతన కధనం ప్రాచుర్యంలో కలదు. వెంకటగిరి రాజులు, ఒంగోలు మందపాటి రాజుల మధ్య ఉన్న కలహాలలో  వెంకటగిరి రాజుల వలన ప్రమాదాలు జరగకుండా ఉండుటకు  మందపాటి రాజులు అద్దంకి రామచంద్రయ్య ద్వారా శ్రీ యోగీంద్రుల వారి ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించ తలపెట్టారు. అది తెల్సిన వెంకటగిరి రాజులు ఆ యజ్ఞానికి విఘ్నం చేసే తలంపుతో యజ్ఞం జరుపు యోగింధ్రులకి కడుపులో బాధ కల్గునట్లు చేయగా, ఆ యజ్ఞాన్ని నవ్యంగా నిర్వహించమని బహిర్భూమికి శ్రీ యోగింద్రుల వారు వెళ్ళడం జరిగింది.


ఆ సమయంలో అగ్ని జ్వాలల నుండి జల్వలితమయమై, తోజోవంతమైన ఆకారం బయటకు వచ్చింది.

 ఆ మహాశక్తి కనుల నుండి అగ్ని జ్వాలలు ప్రస్పుటమయ్యాయి. అగ్నిజ్వాలల నుండి ఆవిర్భవించిన మహాశక్తికి బలిహారం గాని, పూర్ణాహుతి గాని సమర్పించక, శాంతి కలిగించక నిర్వీర్యులై చూస్తుండిపోయారు.

ఆగ్రహించిన అమ్మవారు ఊరు వీధి గుండా నడక సాగించింది. తదేక దృష్టితో పోతూనే ఉంది. 


అలా బయల్దేరిన అమ్మవారు ఈతముక్కల గ్రామం వీధిలలోకి అడుగిడినది. ఏదో శక్తి అలిగి గ్రామం మీదకి వస్తుందని గమనించిన ఆ వూరి జంగాల వారు భయం వీడి, పాలు అందుకుని అమ్మవారికి అందించారు. 

పాలన్ని త్రాగి, తపన తీరి, కళ్ళ నుండి వస్తున్న అగ్ని జ్వాలలు ఆగగా, ఆ గ్రామ ప్రజల కోరిక మేర ఆ గ్రామ దేవతగా నిలిచి పోయింది. ఆమెయే జ్వాలముఖి అమ్మవారుగా, ఈతముక్కల జాలమ్మగా పేరొందింది.


అక్కడ ఆ యజ్ఞమలాగే జరుగుతూ ఉన్నది. బహిర్భూమికి వెళ్ళిన యోగింద్రుల వారు వచ్చి జరిగినది తెల్సుకొని ఆ యజ్ఞాన్ని ఆపక అలాగే కొనసాగించారు. ఆ యజ్ఞ వాటిక నుండి అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున కెగసి, ఆ జ్వాలల నుండి ఉల్కలు మధ్య మధ్యలో వస్తున్నవి. అగ్నిజ్వాలల నుండి ఉల్కలు ఆకారముగా వెలువడి శక్తి స్వరూపం రూపం దాల్చినది. ఆమెయే ఉల్కాముఖి. ఆమె అలా నడక సాగించి వల్లూరు చెరువు కట్ట క్రింద నిలిచిపోయినది. 

వారి కోర్కెలు తీర్చి గ్రామాన్ని రక్షిస్తానని తనకు పూజలు, పొంగళ్ళు కొలువులు జాతరలు నిర్వహించమని తెలిపిందట. అగ్నిగుండం నుండి స్వయంగా వెలసిన శక్తి స్వరూపయే ఉల్కా ముఖి అమ్మవారు. అమ్మవారికి ముందే వల్లూరు ఏర్పడి ఉండుట చేత వల్లూరమ్మగా వ్యవహరింపబడుచున్నది.


ఇక ఆ తల్లి స్వయంభువుగా వెలసిన తరువాత దుష్టశక్తులు పూర్తిగా అంతం అయినాయి. ఈ తల్లికి అద్దంకి నాంచారమ్మ, ఇతముక్కుల జ్వాలాముఖి అనే అక్కలు ఉన్నట్లుగా చెబుతారు. అందుకే భక్తులు వీరి ముగ్గురిని అక్కచెల్లెళ్లుగా భావించి పూజలు చేస్తుంటారు.


పొంగళ్ల సమర్పణ :

ప్రతి ఆదివారం వల్లూరమ్మ ఆలయంలో భక్తులు పొంగళ్లను, మొక్కుబడులను సమర్పిస్తారు. రైతులు. వ్యాపారులు, సంతానార్థులు, అవివాహితులు తమ కోరికలు నెరవేరేలా చూడమంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. పొర్లుదండాలు పెడతారు. మేళతాళాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.


వాహన పూజలు :

వల్లూరమ్మ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాకు చెందినవారే గాక గుంటూరు, నెల్లూరు జిల్లాల నుండి కూడా భక్తులు కొత్త వాహనాలను ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపిస్తారు. ఆలయం చుట్టూ ఒకసారి వాహనంపై ప్రదక్షిణ చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, ప్రమాదాలు జరగవని విశ్వాసం.


విశేష కార్యక్రమాలు :

వల్లూరమ్మ ఆలయంలో శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తారు.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.


ఈ అమ్మవార్ల పేర్ల మీదుగా వల్లూరమ్మ, వల్లూరయ్య అని, జాలమ్మ, జాలయ్య అనీ ఈ ప్రాంతంలో పిల్లలకు పేర్లు పెట్టడం సంప్రదాయం.  


ఒంగోలుకు 12 కి.మీ.లదూరంలో ఉంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List