చీమకుర్తి శ్రీ రామాంజనేయస్వామి ఆలయం. ~ దైవదర్శనం

చీమకుర్తి శ్రీ రామాంజనేయస్వామి ఆలయం.




ఎక్కడైనా శ్రీరాముడు సీతాలక్ష్మణ హనుమత్సమేతుడై దర్శనమిస్తాడు. అయితే ఆదిశేషువుపై శ్రీరాముడు శయనించిన స్థితిలో ఉన్న విగ్రహాన్ని, విశేషాన్ని చూడాలంటే మాత్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణం కోటకట్ల వారి వీధిలోని శ్రీ శేషశయన శ్రీ రామాంజనేయస్వామి వారి ఆలయానికి రావాల్సిందే. శ్రీరాముడు ఆదిశేషువుపై శయనించినట్లుగా ఉన్న ఆలయం దేశంలో ఇదే ప్రథమమని భక్తులు పేర్కొంటున్నారు.


తాటికొండ రామయోగికి 1972లో ఆంజనేయస్వామివారి దర్శన భాగ్యం లభించింది. అనంతరం ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. ఆలయంలోని ఆంజనేయస్వామి సింగరకొండ ఆంజనేయస్వామి ప్రతిరూపమేనని పలువురి విశ్వాసం. భూతప్రేతపిశాచ గ్రహ బాధలతో బాధపడేవారు ఈ ఆలయంలో 40 రోజులపాటు ప్రదక్షిణలు చేస్తే వారికి స్వస్థత చేకూరుతుందని నిర్వాహకులు చెప్తారు. వారు చెప్పడమే గాక పలువురు భక్తుల ప్రత్యక్ష అనుభవం కూడా. ఆలయంలో గత మూడు దశాబ్దాల నుండి భక్తులు నిత్యం శ్రీరామ నామ జపపారాయణ నిర్వహిస్తున్నారు.


ఆంజనేయస్వామి శ్రీరాముని భక్తుడు కావడంతో 1998 ఫిబ్రవరి 6న శేష శయన శ్రీరాముని విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. శ్రీరాముని పాదాల వద్ద ఆంజనేయస్వామి ముకుళిత హస్తాలతో కూర్చుని ఉన్నట్లుగా విగ్రహాన్ని సుందరంగా మలిచారు. కేరళలోని అనంత పద్మనాభస్వామి వారిని స్ఫురింపచేసేలా శ్రీరాముడు శేషశయనుడిగా దర్శనమిస్తాడు.


ఎక్కడా నయంకాని మానసిక రుగ్మతలతో బాధపడే వారితోపాటు గ్రహ బాధలతో కుంగిపోయేవారికి ఈ ఆలయం సంజీవని వంటిది అంటారు. రోజూ ఎంతోమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. శనివారం గ్రహపీడితులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. సాయంత్రం మూడుగంటల పాటు జరిగే భజన సంకీర్తన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడవలసినదే.


21 దేవతామూర్తులు..

 ఆలయ ఆవరణలో 21 దేవతామూర్తులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆంజనేయస్వామి భజన చేస్తున్న విగ్రహాన్ని సుందరంగా మలిచారు. 

దుర్గాదేవి, 

నృసింహస్వామి,

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి,

వేంకటేశ్వరస్వామి, 

సత్యనారాయణస్వామి, 

వినాయకుడు, 

అష్టలక్ష్ములతోపాటు పలు దేవతామూర్తులకు నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. 


ప్రతి శనివారం సాయంత్రం ఆంజనేయస్వామి సన్నిధిలో భజన సంకీర్తనల ఆలాపన   జరుగుతుంది. 

ప్రముఖ గాయకులు తాటికొండ బాలయోగి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.


చూడదగిన ప్రదేశాలు : 

చీమకుర్తి వచ్చిన భక్తులు శేషశయన రామాలయంతో పాటు హరిహర క్షేత్రం, సాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయం, గుంటిగంగ గంగమ్మ ఆలయం, అగ్రహారం వేంకటేశ్వరస్వామి ఆలయం, గోనుగుంట శివాలయం, రామతీర్థం మోక్ష రామలింగేశ్వరస్వామి ఆలయం, రామతీర్థం జలాశయం, చీమకుర్తి గ్రానైట్‌ క్వారీలను కూడా చూడవచ్చు.


ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే.



ఆలయానికి చేరుకునే మార్గం :

చీమకుర్తి... ఒంగోలు పట్టణానికి 21 కి.మీ.ల దూరంలో ఒంగోలు–మార్కాపురం ప్రధాన రోడ్డుమార్గంలో ఉంది. 

బస్సులు, ఆటోలలో, ప్రైవేట్‌ వాహనాలలో సులభంగా చేరుకోవచ్చు.

 

Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive