ఈతముక్కల శ్రీ జాలమ్మ తల్లి ఆలయం ~ దైవదర్శనం

ఈతముక్కల శ్రీ జాలమ్మ తల్లి ఆలయం


గ్రామప్రజలు తమ ధన,ధాన్య,ప్రాణ రక్షణ కోరుతూ గ్రామదేవతలను పూజించడం,జాతరలను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ విధంగా ప్రసిద్ధి చెందిన గ్రామ శక్తి క్షేత్రాలు దేశవ్యాప్తంగా అనేకం ఉన్నాయి.

వాటిలో ఒకటి ఆంధ్రదేశంలోని ప్రకాశం జిల్లాలో ' ఒంగోలు'పట్టణ సమీపంలో ' రాజుపాలెం 'అనే గ్రామ వనాలలో వెలసిన 'ఈతముక్కలమ్మతల్లి 'దేవాలయం. 


హమాచలప్రదేశ్ లో ఉన్న జ్వాలాముఖి శక్తిపీఠానికి, అనుబంధ ఉపపీఠాలలో ఈతముక్కల ఆలయం గూడా ఉండటం విశేషం. ఈ దేవత స్వయంభువుగా వెలసినదని ప్రతీతి.ఈ ఈతముక్కలమ్మతల్లి క్షేత్ర ప్రాశస్త్యాన్ని గూర్చి అర్చకులు శ్రీ మడనూరు మల్లయ్య పంతులుగారు ఈ విధంగా తెలిపారు.            


స్థల పురాణం..


రామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కును ఈ ప్రదేశంలో కోసినందున, ఇంతి యొక్క ముక్కును ముక్కలు చేసినందున ఇంతిముక్కల అని .. అ పేరు మార్పు చెంది "ఈతముక్కల"గా స్థిరం అయినది అని స్థానిక స్థల పురాణం. సుమారు 400 సంవత్సరాలకు పూర్వం ఈతముక్కల గ్రామంలో నల్లపరెడ్డివారు జమీందార్లుగా ఉండేవారట. వారికి అనంతమైన గోసంపద ఉండేదట. వారి గోవులలో ఒక గోవు ప్రతిరోజు మేత మేసిన పిదప ఇంటి వద్ద పాలెగాళ్ళకు గాని,తన బిడ్డకు గాని పాలు ఇచ్చేది కాదట. పాలెగాళ్ళే గోవు పాలు పిండుకొని తాగుతున్నారని భావించిన యజమాని వారిని నిలదీశాడట. కాని వారు తమకేమీ తెలియదని విన్నవించుకొని దీనికి కారణాన్ని తెలుసుకోవాలని నిర్ణయించారట. మరునాడు ఆ గోవును అనుసరిస్తూ వెళ్ళారట. ఆ గోవు ఆ వనాలలోని పొదల మధ్యఉన్న ఒక చీమలపుట్ట వద్దకు చేరి ఆ పుట్టపై పాలు కార్చడం ప్రారంభించిందట. 


ఆ దృశ్యాన్ని చూసిన పాలెగాళ్ళు ఎవరో దొంగతనంగా గో క్షీరాన్ని త్రాగుతున్నారని భావించి ఆ పుట్టపై గొడ్డలితో ఒక దెబ్బ కొట్టారట. ఆ దెబ్బతోపుట్టలోనున్న ఈతముక్కలమ్మతల్లి ఒక చెంప భాగంపై గాటు పడిందట.వెంటనే ఎరుపెక్కిన ముఖంతో ' ఎవరది?'అని ఆ తల్లి ప్రశ్నించిందట. బదులు పలికిన ఆ ఐదుగురి తలలు నరికి అమ్మ పాదాల చెంత పెట్టుకుందట. ఆ తల్లి ఆవేశంతో ఊగిపోయింది. ఇప్పటికీ పాత విగ్రహంలో ఆమె చెంపపై గొడ్డలి గాటును మనం చూడవచ్చును.  ఆ దగ్గఱలో ఉన్న కొందరు ఇది చూసి జరిగినదంతా నల్లపరెడ్డి వారికి సవివరంగాచెప్పారు. అప్పుడు ఆ యజమాని ఆ తల్లి దరికి చేరి క్షమాభిక్ష కోరాడట. 


ఆ మాత శాంతించి తనకు కోడికూత,రోకలిపోటు వినిపించని ప్రశాంతమైన ప్రదేశంలో అంటే జనసంచారంలేని చోట తనకు గుడి కట్టించమని ఆదేశించిందట. ఆ తల్లి కోరినట్లుగానే ఆయన ఈతముక్కల గ్రామానికి దూరంగా తోటల మధ్య గుడిని కట్టించాడట. (ప్రస్తుతంఈ గుడి వున్న గ్రామాన్ని రాజుపాలెం అని పిలుస్తున్నారు). ఈతముక్కల గ్రామం నుండి ప్రజలు తల్లి దర్శనం కోసం అక్కడికి వెళ్ళేవారు. శబ్దాలు రాని చోట గుడి కట్టడం వలన అమ్మవారు చాలా శక్తివంతమైన రూపం దాల్చిందని ప్రతీతి.

           

అసలు రాజుపాలెం అనే ఊరు కూడా అప్పటికి లేదు. తరువాతి కాలంలో వెంకటగిరి రాజులు తమ పరివారంతో ఒకప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించే సమయంలో దూరాభారం వలన ఈ దేవాలయ  ప్రాంతంలో బస చేసేవారట. రాజులు బస చేసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతం ' రాజుపాలెం 'గా పేరుగాంచినది. పెళ్ళూరి రాజులు ఈ తల్లిని తమ కులదైవంగా భావించి ఈ దేవాలయ ప్రాంతంలో రోజుల తరబడి గడిపేవారట. ఆ విధంగా ' రాజుపాలెం 'గ్రామం ఏర్పడినదని మరి కొందరి విశ్వాసం.

     

ఈతముక్కల చరిత్రకు కొనసాగింపుగా ప్రక్కనే ఉన్న ‘ మడనూరు ‘కు కూడా ఇదే విధమైన గొప్ప చరిత్రఉన్నట్లు సమాచారం. ముక్కు , చెవులు తెగిన శూర్పణఖ ముఖం నుండి కారిన రక్తం ఒక మడుగులా ఏర్పడి‘ మడుగులూరు ‘గా పేరొంది, నేడు మడనూరుగా మారింది అంటారు. ఈతముక్కలమ్మతల్లి చాలా శక్తి గల దేవతయని, ఆమెకు 108 మంది అక్కచెల్లెళ్ళు ఉన్నారని ప్రజల విశ్వాసం. ఆ తల్లి సోదరుడైన ‘ పోతురాజు ‘గుడి కూడా అమ్మ గుడికి ఎదురుగా ఉండడం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పెద్ద వేపచెట్టుకు కూడా ప్రాముఖ్యం ఉందని చెబుతారు. ఈ చెట్టు వేప ఆకు ఇతర వేపచెట్ల ఆకులంత చేదుగా ఉండదని , ఆ తల్లి మహిమతో ఈ చేదు తగ్గిందని భావిస్తారు.

   

ఈ గ్రామం లో పుట్టిన మొదటి సంతానం కు తప్పని సరిగా జ అనే అక్షరం తో మొదటి పెరు పెడతారంట.

జాలమ్మ,జాలిరెడ్డి, అనే పేర్లు. ఊర్లో జరిగే ప్రతీ పెళ్ళికిముందు అమ్మవారు కి జాకెట్,చీర తప్పని సరిగా పెడతారంట.

అలా చేయక అమ్మవారిని నిర్లక్ష్యం చేస్తే 3 రోజు ల లోపు ఒక అశుభము,జరుగుతుందని గ్రామస్థుల విశ్వాసo.


జాలమ్మ చెట్టు :..

గ్రామం నడిబొడ్డున జాలమ్మ చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ రచ్చబండ ఉంది. అక్కడున్న రావి చెట్టును జ్వాలమ్మ చెట్టుగా గ్రామ ప్రజలు కొలుస్తారు. పసుపు, కుంకాలతో పూజిస్తారు. ప్రతి ఆదివారం భజన కార్యక్రమాలు జరుగుతాయి.


మండల కేంద్రమైన కొత్తపట్నం నుండి 9 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఒంగోలు నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List