ప్రతి రోజూ ఉదయం, సాయంకాలం పండగ రోజుల్లో ఇంకా ఎక్కువ సమయం దర్శనమిచ్చే దేవతా మూర్తులను మనం ప్రతి దేవాలయంలో చూస్తాము. కానీ వారానికొక్క రోజు మాత్రమే భక్తులమీద వరాల జల్లు కురిపించే దైవం ఉంటారా? ఆయనే ప్రకాశం జిల్లా మాలకొండపై వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామి. అంతేకాదు, అలిగిన చెలి అలక తీర్చి దేవేరితో సహా కొండపై కొలువున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మరి ఈ స్వామి గురించి విశేషాలు తెలుసుకుందామా?
స్థలపురాణం..
ఒక రోజు వైకుంఠంలో లక్ష్మీ నారాయణులు ముచ్చటించుకుంటున్న సమయంలో తన దేవేరిని శ్రీమన్నారాయణుడు మనసులో ఏదన్నా కోరిక వుంటే చెప్పమని అడుగుతాడు. దానికి ఆ జగజ్జనని సాక్షాత్తూ లోకారాధ్యుడినే పతిగా పొందిన తనకి వేరే కోరికలేముంటాయనీ, కానీ కలియుగంలో భూలోకంలో వున్న అతి తక్కువ క్షేత్రాలు దర్శించి మోక్షం పొందటానికి తమ బిడ్డలు వ్యయ ప్రయాసలకోర్వ లేకుండా వున్నారని, అందుకని స్వామి దర్శనం తేలిగ్గా పొందటానికి ఒక దివ్య క్షేత్రం సృష్టించమని కోరుతుంది. లకపావని కోరిక మన్నించిన శ్రీ మహావిష్ణువు భూలోకంలో తమ నివాసానికి ఒక అందమైన పర్వతం సృష్టించమని వన దేవతకి చెబుతాడు. వన దేవత పుష్ప మాల ఆకృతిలో సృష్టించింది గనుక ఈ కొండని మాలాద్రి అని కొందరంటారు.
ఈ కొండకి పడమర దిక్కున అహోబిలం, వాయవ్య దిక్కులో శ్రీశైలం, దక్షిణ దిక్కులో వృషాచల క్షేత్రం, తూర్పు దిక్కులో శింగరాయకొండ .. ఇవ్వన్ని మాల ఆకారంలో అమరి వుండటంతో ఈ కొండని మాలాద్రి అని ఇంకొందరంటారు. వనమాల ఆ జగజ్జననీ జనకుల పాద స్పర్శకోసం తానే కొండగా మారిందనీ, అందుకే మాలాద్రి అంటారనీ ఇంకొక కధ.
అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో ఈ కొండపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిని చూసి, ఈ పుణ్య క్షేత్రం తన తపస్సుకు అనువైనదని, ఇక్కడకొచ్చి, స్వామికోసం కఠోర తపస్సు చేశాడు. ఆయనకి ఎర్రని రంగు, ఎర్ర పీతాంబరాలు, ఎర్రని ఆభరణాలతో, స్వామి సాక్షాత్కరించాడు. అగస్త్య మహామునికి ఎర్రని కాంతితో జ్వాలా రూపంలో సాక్షాత్కరించాడు గనుకు ఆయనకి జ్వాలా నరసింహస్వామి అనే పేరు వచ్చింది.
అగస్త్య మహర్షి అక్కడే జ్వాలా నరసింహరూపంలో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరాడు. అగస్త్యుడు స్వామిని ఇంకొక కోరిక కూడా కోరాడు...తనబోటి మునులు, యక్షులు, కిన్నెరలు, దేవతలు వగైరావారికి స్వామి దర్శనం లభించటంకోసం వారంలో ఒక్క రోజు, శనివారం మాత్రం మానవులకి కేటాయించి మిగతా ఆరు రోజులు ఋషి పూజలు అంగీకరించమని, అలా చేస్తే అటు దేవతలు, మునిగణాలకు ఆయన దర్శనంభాగం లభిస్తుందనీ, ఇటు మానవులుకూడా స్వామిని సేవించి తరిస్తారనీ వేడుకున్నాడు.
భక్తుని కోరికను మన్నించిన శ్రీ నరసింహస్వామి అక్కడ జ్వాలా నరసింహస్వామిగా వెలిశాడు. అప్పటినుంచీ యుగ యుగాలుగా కోట్లాది భక్తులు ఆ కొండ ఎక్కి ప్రతి శనివారము శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరిస్తున్నారు. మిగతా ఆరు రోజులూ ఇక్కడ స్వామిని సేవించటానికి దేవ, మునిగణాలు వస్తాయని అంటారు.
శ్రీ మహలక్ష్మీ ఆలయం..
దేవతలకు కూడా అలకలూ, ఈర్ష్యాసూయలూ వుంటాయా? ఏమో! వున్నాయని చెప్పే కధలు మాత్రం అక్కడక్కడా వున్నాయి. పూర్వం స్వామితో వున్న లక్ష్మీదేవి ఒకసారి స్వామి మీద అలిగి కొండపైకి వెళ్ళిందట. వెళ్ళేదోవలో పెద్ద బండరాయి అడ్డుగా వున్నది. దేవి ఆగ్రహానికి ఆ బండ పగిలి, పెద్ద చీలికలా ఏర్పడి, అమ్మవారు కొండమీదకి వెళ్ళటానికి త్రోవ ఇచ్చిందిట. ఇప్పటికీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించాలంటే ఆ త్రోవలో కొండపైకి దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే. బండ చీలికలా ఏర్పడితే వచ్చిన త్రోవగనుక కొంత ఇరుకుగా వుంటుంది. ఆ త్రోవను చూస్తే స్ధూలకాయులు వెళ్ళలేరనిపిస్తుందిగానీ, వారుకూడా ఏ ఇబ్బందీ లేకుండా తేలికగా నడచి వెళ్ళగలిగే విధముగా ఉంటుంది. ఇది భక్తులకు అద్భుతంగా తోస్తుంటుంది.
మల్యాద్రిలో ఏడు తీర్థాలు ఉన్నాయి. నరసింహ, వరుణ తీర్దమ్, కపిల తీర్దమ్, అగస్త్య తీర్దమ్, శంకర తీర్దమ్, జోతి తీర్దమ్, ఇంద్ర తీర్దమ్. నృసింహస్వామికి ఎరుపురంగంటే ఇష్టం. అందుకే ఎరుపు రంగు బట్టలను ధరించి, కుంకుమతో చేసిన అక్షతలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. తులసిమాలలతో ఆయనను అలంకరించి, వడపప్పు పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సు దక్కి తీరుతుంది. ఇక ఈ రోజున లక్ష్మీనరసింహకరావలంబ స్తోత్రం, నరసింహ అష్టోత్తరం, నరసింహాష్టకం, నరసింహ సహస్రనామాలను పఠిస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది.
ప్రతిసంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దసి నాడు నరసింహజయంతి, కార్తీకమాసం, శ్రావణ మాసములలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు వరంలో ఒక్కరోజే ఆలయం తెరిచి ఉండడంతో ప్రతిశనివారం వేలాది భక్తులతో ఆలయం కళకళలాడుతుంటుంది.
మార్గం :..
ఈ క్షేత్రానికి వెళ్ళేందుకు బస్సు ద్వారా ఒంగోలు నుండి 80 కి. మీ., కందుకూరు నుండి 35 కి. మీ., సింగరాయకొండ రేల్వే స్టేషన్ నుండి 40 కి. మీల లో ఉన్నది.
No comments:
Post a Comment