లంకసంరక్షణార్ధం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ధరించారని మనందరికీ తెలుసు. తెలియని విషయం ఏమిటంటే ఆ దశావతారాల ఆలయాలు కలిగిన ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరే రాష్ట్రానికి ఆ గౌరవం దక్కలేదంటే అతిశయోక్తి కాదు. కొందరు కేరళలో కూడా దశావతార ఆలయాలు ఉన్నాయి అని అంటారు. కానీ అది సరి కాదు. అక్కడ శ్రీ కల్కి అవతార ఆలయం లేదు.
సహజంగా రామ, కృష్ణ , శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను ఎక్కువగా చూస్తుంటాము. కొంత వరకు అనంతశయన లేక శ్రీ రంగనాయక స్వామి ఆలయాలు కూడా కనపడతాయి. మనరాష్ట్రంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ అవతార ఆలయాలు మన రాష్ట్రం లోని వివిధ జిల్లాలలో ఉన్నాయి. అదే విధంగా అత్యంత అరుదైన వామన లేదా త్రివిక్రమ ఆలయం ఒకటి మన రాష్ట్రంలోని బాపట్ల దగ్గరలోని చెరుకూరు గ్రామంలో కలదు. తమిళనాడులోని కంచి మరియు తిరుక్కోవిలూరు లలో కూడా శ్రీ త్రివిక్రమ ఆలయాలున్నాయి. ఆ రెండు ఆలయాలలో స్వామివారు పాతిక అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో కొలువై ఉంటారు. కేరళలో కూడా వామన మరియు త్రివిక్రమ ఆలయాలున్నాయి. కానీ అక్కడ చతుర్భుజ శ్రీ మహా విష్ణువు రూపంలో పూజలందు కొంటుంటారు. కానీ చెరుకూరులో వెలసిన శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం చాలా ప్రత్యేకతలు కలిగినది.
ఈ భూతలం మీద 7 వామనావతార ఆలయాలు దర్శనమిస్తాయి. కానీ వామన అవతారమునకు స్వయంభూ సాక్ష్యంగా.. మొత్తం వామనావతార సన్నివేశాన్ని ఏకశిలపై దర్శనమిచ్చే అరుదైన నందు వామన ఆలయం కేవలం చెరుకూరు మాత్రమే కలదు. ఇంతటి మహోన్నతమైన స్వామి దర్శనం జీవిత కాలంలో ఏక కాలంలో అయినా చేసుకోవలసిన పుణ్య ధామం మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత ప్రకాశం జిల్లా పరుచూరు మండలం చెరుకూరు పుణ్యక్షేత్రంలో ఉండడం మన అదృష్టం.
గతంలో చెరుకూరుని "ఇక్షు పురి" అని పిలిచేవారు. ఇక్షు అంటే చెఱకు. అదే కాలక్రమంలో చెరుకూరుగా మారింది అని చెబుతారు. ఇక్షు పురిగా, వామన నగరిగా, బలిని చెరబట్టిన ఊరు కాబట్టి చెరయూరు గా.. కాలక్రమేణా చెరుకూరుగా పుణ్యక్షేత్ర మై భాసిల్లుతున్నది
స్థల పురాణం..
బలిని పాతాళానికి తొక్కిన తర్వాత.. దేవతలు వామనుడిని స్తుతించారు. త్రివిక్రమ రూపాన్ని ఎప్పటికీ దర్శించుకునే వరమివ్వమని కోరుకున్నారు. దానికి సమ్మతించిన వామనస్వామి ఇక్కడ వెలిశారని చెబుతారు.
అపురూప శిల్పసంపదతో అలరారు స్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. చోళరాజుల్లో పదోవాడైన విష్ణువర్ధన మహారాజు ఓ సారి ఈ ప్రాంతానికి విహారానికి వచ్చాడట. ఇక్కడి కోనేటిలో తివిక్రమ స్వామి విగ్రహం ఉండటం గమనించి.. చుట్టూ మంటపం నిర్మింపజేశాడట. తర్వాత రాజరాజనరేంద్రుడి కాలంలో ఆలయం, మంటపాలు నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో అడుగడుగునా ఆనాటి కళావైభవం దర్శనమిస్తుంది.
చెరుకూరు లో శ్రీ అగస్త్య మహాముని తన దక్షిణ భారత దేశ పర్యటన సందర్బంగా కొంతకాలం భార్య లోపాముద్ర, శిష్యప్రశిష్య బృందంతో విడిది చేసినట్లుగా స్థల పురాణం తెలుపుతోంది. ఆ సమయంలో ఆయన భార్య కోరిక మేరకు పంచ శివలింగ ప్రతిష్టించినట్లుగా తెలుస్తోంది. అవి చెరుకూరు, ఉప్పుటూరు, కొమ్మూరు, మోటుపల్లి మరియు పంగులూరు. చెరుకూరులో ప్రతిష్టించిన శివాలయం తప్పక సందర్శించవలసినది.
తొమ్మిది అడుగుల ఎత్తుండే స్వామివిగ్రహం గోధుమ వర్ణంలో మెరిసిపోతూ దర్శనమిస్తుంది. మూలవిరాట్టుకు ఉత్తర దిశలో భూదేవి, దక్షిణాన శ్రీదేవి అమ్మవార్ల విగ్రహాలున్నాయి. స్వామి వారు దండం, కమండలం, ఛత్రం శంఖు చక్రాలను, పాదాలకు పావుకోళ్ళను ధరించి నయనమనోహర రూపములో దర్శనమిస్తారు.
శ్రీ త్రివిక్రమ స్వామి వారు 9:30 అడుగులు ఎత్తు లో, భూమి మీద అత్యంత అరుదైన లేత గులాబీ వర్ణంలో, మూడు పాదములతో, బలి చక్రవర్తి మరియు అతని భార్య వింధ్యావళి, తాతగారైన ప్రహ్లాదుడు, గురువుగారైన శుక్రాచార్యుడు, నారద తుంబురులు, బ్రహ్మ దేవుడు తలక్రిందుగా ఊర్ధ్వ పాద మును కడుగుతూ (అదే బ్రహ్మ కడిగిన పాదము అంటే) సూర్య చంద్రులు నిండిన రూపముతో అత్యద్భుతమైన ఏకశిలా వర్ణములో కన్నులపండుగగా స్వామి దర్శనమిస్తారు. ద్వారపాలకుల విగ్రహాలు గంభీరంగా దర్శనమిస్తాయి.
గర్భాలయం వెలుపలి గోడలపై రామాయణ గాథ, భాగవత ఘట్టాలు, దశావతారాలతో పాటు ముఖ్యంగా శ్రీ వినాయకుడి విగ్రహం కూడా ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి. ఆలయ పరిసరాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ప్రశాంతతనూ చేకూరుస్తాయి.
శ్రీకృష్ణాష్టమి, వామన జయంతి, దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ప్రతి శనివారం విష్ణు సహస్రనామార్చన, ఏకాదశి సందర్భంగా అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఎలా వెళ్లాలంటే..?
బాపట్ల పట్టణం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
No comments:
Post a Comment