దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..






 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..


మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది. గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక దేవాలయం కేరళ లోని తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం. అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు. ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది. గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.


( తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం)

Share:

ఉత్తరద్వార దర్శనం ఎందుకు..?



 * ఉత్తరద్వార దర్శనం ఎందుకు..?


వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మనం ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటీ...


పౌరాణిక గాథ..


పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి. అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. మూడు కోట్ల ఏకాదశులకూ సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదనా లేకపోలేదు. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరూ ఉంది.


ఈరోజున మహావిష్ణువుని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగిందట. ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో, వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులు కోరుకోవడంతో... ఉత్తర ద్వార దర్శనానికి ప్రాసస్త్యం ఏర్పడిందంటారు. ఉత్తర ద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటారట.


గాథ వెనుక తత్వం..


మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాము. అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్నీ సూచిస్తుంది. బహుశా అందుకేనేమో పాతాళం వైపుకి సూచించే దక్షిణపు దిక్కుని మనం యమస్థానం అంటాము. మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తరభాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి, సిద్ధ స్థితిని చేరుకుంటేనే ఆ ఊర్థ్వభాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని అంటారు.


అంటే ఆ హరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి... శాశ్వతమైన శాంతినీ, సత్యమైన జ్ఞానాన్నీ ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం కావచ్చు. అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా... తమలోని భక్తినీ, జ్ఞానాన్నీ వికసింపచేయమనీ వేడుకుంటూ స్వామిని కొలుచుకోవాలి. ఇక ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు... తమ మనసులోనే ఆ వైకుంఠ మూర్తిని దర్శించుకుని తమలోని  అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి.


హైందవ సంప్రదాయం భక్తుని మనసు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది. గాయత్రి మంత్రాన్ని జపించినా, ఉత్తర ద్వార దర్శనంగుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్నా... ఆ భక్తుని మేధస్సు వికసించాలనే కోరుకుంటుంది.

Share:

మీరు విన్నారా.. వినాయకుడి చెవిలో చెబితే కోరిన కోర్కెలు తిర్చేస్తాడుట..!






 * మీరు విన్నారా.. వినాయకుడి చెవిలో చెబితే కోరిన కోర్కెలు తిర్చేస్తాడుట..!


ఇక్కడి ఆలయంలో వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి అగ్రజుడుగా అగ్ర పూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాదిస్తారంటే ఆయన ఎంతటి శక్తి వంతమైన దేవుడనేది అందరికీ తెలుస్తోంది. అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లో ఉంది. ఇక్కడ వెలసిన వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు.


క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాతినట్టుగా ప్రచారంలో ఒక కధ వినిపిస్తుంది. అప్పుడా భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పిఅ ఆలయాన్ని తవ్వించాడట. ఆ తరువాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదనీ చెబుతున్నారు. భూమిలో నుండి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెద్దదయిందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది.


ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది.


ఈ ఆలయం లోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. వీరభద్రుడు, సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రమనయేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. పూజలు, పారాయణాలు, దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువగా తిలకించవచ్చు. ఇక్కడ గణపతి హోమమ చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు. రాజమండ్రి నుంచి గాని, అనపర్తి నుంచి గాని బిక్కవోలుకు చేరుకోవచ్చు.


(తూర్పుగోదావరి జిల్లా, బిక్కవోలు గ్రామం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం)


Share:

భూలోకంలో పెళ్లిళ్లు నిర్ణయించే దేవుడు.. ఇడగుంజి వినాయకుడు.






 * భూలోకంలో పెళ్లిళ్లు నిర్ణయించే దేవుడు.. ఇడగుంజి వినాయకుడు..


అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు. మనదేశపు పశ్చిమతీరాన వెలసిన గణపతి ఆలయాలలో, ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ఒకటి. ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉంది. కర్నాటకలోనే పుట్టి, ఆ రాష్ట్రంలోనే సంగమించే శరావతి అనే నది, ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలోసంగమిస్తుంది. స్థలపురాణం అది ద్వాపరయుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు రుషులంతా వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం వారు శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని రుషులు నిర్ణయించుకున్నారు. కానీ అదేం చిత్రమో! యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఏవో ఒక ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో రుషులకు పాలుపోక నారదుని శరణు వేడారు. అంతట నారదుడు, గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే, ఎటువంటి విఘ్నాలూ లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. సలహాను ఇవ్వడమే కాదు, తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడ్కొని వచ్చాడు. గణేశుడు అక్కడకు రావడంతోనే యాగానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటిదేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగింది. తమ విఘ్నాలన్నీ తొలగించిన గణేశుని రుషులందరూ వేనోళ్లతో స్తుతించారు. వారి భక్తికి మెచ్చిన గణేశుడు, ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోర్కెలను తీరుస్తానని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభువుగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి.


భిన్నమైన రూపం..

ఇక్కడి మూలవిరాట్టైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.


పెళ్లి పెద్ద..

కర్నాటకలోని బంధి అనే జాతివారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే, దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇలా వైభవోపేతమైన స్థలపురాణానికి తోడుగా, చిత్రవిచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు.

Share:

వాతాపి గణపతి.



 * వాతాపి గణపతి..


'వాతాపి గణపతిం భజేహం' అనేది వాతాపి ప్రస్తుతం బాదామ కర్ణాటక పట్టణంలోని వినాయక విగ్రహం మీద సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు గారు చేసిన కీర్తన. ' వాతాపిలోని గణపతిని ( విగ్రహాన్ని) అహం (నేను) భజే( భజిస్తున్నాను)' అని దీని అర్థం.  ఈ గణపతి విగ్రహం వయసు దాదాపు 1460 సంవత్సరాలు.


వాతాపి లేక బాదామి అనేది పశ్చిమ చాళుక్య రాజుల రాజధాని. ఈ గణపతి విగ్రహం బాదామీ గుహాలయాలలో కనిపిస్తుంది. ఇవి హిందూ, జైన, బౌద్ధులకు చెందిన గుహాలయాల సముదాయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్ జిల్లాలోని బాదామి ప్రాంతంలో ఉన్నాయి. ఈ గుహలు భారతీయ శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ గుహాలయాలు బాదామీ చాళుక్య నిర్మాణశైలిలో 6వ శతాబ్దం కాలంనాటివి.


కర్ణాటక సంగీతానికి జన్మస్థలం వాతాపే. అందుకే మొదటి కర్ణాటక సంగీత  విద్వాంసులు అక్కడి వినాయకుడి మీదనే ముందుగా కీర్తనలు కట్టారు. ఈ బాదామి పేరు మీదుగానే పశ్చిమ చాళుక్య రాజులను బాదామి చాళుక్యులు అంటారు.  ఇక్కడ వాతాపి అనే రాక్షసుడిని తిని జీర్ణం చేసుకున్న అగస్త్య మహర్షి విగ్రహం కూడా ఒకటి  ఉంది. రామాయణం లోనూ, విష్ణు పురాణం లోనూ, భాగవతంలోనూ ఈ వాతాపి, ఇల్వలుడు అనే రాక్షస సోదరుల గాథ ఉంది. ఆ కథాక్రమం ఇది.  


ప్రహ్లాదుని తమ్ముడైన హ్లాదుడు, దమని అనే రాక్షస దంపతులకు వాతాపి, ఇల్వలుడు అని ఇద్దరు కుమారులు. (వారు సింహిక, విప్రచిత్తి దంపతుల కుమారులనే కథనం కూడా ఉంది) వారికి  మృత సంజీవనీ విద్య తెలుసట. వాతాపి మేకగా మారితే ఇల్వలుడు దానిని చంపి అగస్త్య మహర్షి కి కూరగా వండి పెడతాడు. అగస్త్య మహర్షి ఆ మాంసం తిన్నాక ఇల్వలుడు మృత సంజీవనీ మంత్రం చదివితే  వాతాపి ఆ ఋషి కడుపు చించుకుని బయటకు వస్తే ఆ రాక్షసులు ఇరువురూ ఆ ఋషి మాంసం తినాలని వాళ్ళ పథకం. అయితే అది కనిపెట్టిన అగస్త్య మహర్షి ఇల్వలుడు వండిపెట్టిన మాంసాన్ని తినగానే పొట్ట సవరించుకుంటూ ' జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ' అంటాడు. దాంతో కడుపులోని వాతాపి కడుపులోనే జీర్ణం అయిపోతాడు. తరువాత అగస్త్యుడు ఇల్వలుడిని తన కంటి చిచ్చుతో భస్మం చేసి  చంపేస్తాడు. మంత్రశక్తులు ఉన్నందువలన అగస్త్యుడిని రాక్షసులు ఎదుటపడి జయించలేరు. అందుకే మోసంతో జయించాలని చూసి కూడా భంగపడ్డారు. చిన్న పిల్లలు  పాలు తాగాక వాళ్ళ పొట్ట మీద రుద్దుతూ ' జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం '  అని తల్లులు అంటారు. అంటే అగస్త్యుడి కడుపులోని వాతాపిలాగే మా అబ్బాయి కడుపులోని పాలు కూడా జీర్ణం కావాలని భావం. వాతాపి ( బాదామి) లో ఈ అగస్త్య మహర్షి విగ్రహం ఉన్నప్పటికీ ఈ గాథ జరిగింది తమిళనాడులోని కొన్నూర్ ( ప్రస్తుత చెన్నై లోని విల్లివాక్కమ్) అని చరిత్రకారులు తేల్చారు. ఇక్కడ అగస్త్య మహర్షి నిర్మించిన ఒక అతి ప్రాచీనమైన ఆలయం ఉంది. ఆత్మరక్షణ కోసమే అయినప్పటికీ ఈ రాక్షస సోదరులను చంపిన పాపం నుంచి విముక్తి పొందటం కోసం శివుడిని గురించి అగస్త్యుడు ఇక్కడ ఘోరతపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై అగస్త్యుడికి పాపవిముక్తి కలిగించాడట. ఇదీ దీని వెనుక గాథ.


ఓం గం గణపతయే నమః 🙏🙏

Share:

కోనేశ్వర ఆలయం.



 * కోనేశ్వర ఆలయం..


అత్యంత అరుదైన దర్శనం శ్రీలంక లోని సముద్రగర్భంలో ఉన్న ఈ మహాదేవుని మనం ఈ జన్మలో దర్శించుకోగలమో లేమో కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఈ అపూర్వమైన దర్శనం. 700 సంవత్సరాల క్రితం శ్రీలంక లోని ట్రిన్కోమలీ సమీపంలోని కోనేశ్వర ఆలయాన్ని పోర్చుగీస్ వారు ధ్వంసం చేసి, ఆలయ సంపదను దోచుకున్నారు.


ఆ సమయంలో వారు ఆలయం లోని విగ్రహాలను ధ్వంసం చేసి, ఆనవాళ్ళు కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతో విగ్రహాలను సముద్ర గర్భంలో పడవేశారు. అయితే 1950 లో ఆలయ ప్రాంగణం ఉండే చోట తవ్వకాలు జరుగుతుండగా, దేవతా మూర్తుల ఆభరణాలు, శిధిలమైన ఆలయం ప్రాకారాలూ దర్శనమిచ్చాయి.


చరిత్ర కారులు ఈ స్థలంలో శివాలయం ఉండేది అని వ్రాసి ఉండడం వలన, ఇంకాస్త లోతుగా తవ్వి చూడగా, మరిన్ని ఆధారాలు లభించాయి. సముద్ర తీరాన కూడా కొన్ని ఆధారాలు కనిపించాయి.. సముద్రంలో కూడా పరిశీలించగా అక్కడ దేవతలా విగ్రహాలు కనిపించాయి. ఇప్పుడు మనం చూస్తున్నది శివుని విగ్రహం.


సుమారు 700 సంవత్సరాలుగా నీటిలో ఉన్నపటికీ శివుని నుదుటిన విభూతి రేఖలు, కుంకుమ బొట్టు ఇపిప్పటికే చెక్కు చెదరకుండా అలానే ఉండడం విశేషం. బహుశా సముద్రుడే శివుడిని తన గర్భంలో ప్రతిష్టించుకుని పుజిస్తున్నాడేమో అనిపిస్తోంది కదూ, సముద్రం లోకి వెళ్ళి దర్శించుకునే యోగం మనకు ఉన్నదో లేదో తెలియదు, కానీ ఇలా అయినా దర్శించుకోవడం మన గత జన్మల పుణ్యఫలమే. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.. 

హర హర మహాదేవ శంభో శంకర...


Share:

ఆంజనేయ స్వామి పంచముఖుడు ఎందుకయ్యాడు..?


* ఆంజనేయ స్వామి పంచముఖుడు ఎందుకయ్యాడు..?


శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.మైరావణ వృత్తాంతం:  రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే!


సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు.


మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా.. అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు.


హనుమంతుని పయనం: రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ... తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు, హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.


మైరావణుని సంహారం: మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం. ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు.


పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి... మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు. పంచముఖాల ప్రాశస్త్యం: అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం.


తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే అ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.

 

Share:

అమితంగా అనుగ్రహించే శ్రీ రంగనాయకి తాయారు సన్నిధి..



 * అమితంగా అనుగ్రహించే శ్రీ రంగనాయకి తాయారు సన్నిధిని..


శ్రీరంగంలోని ఉత్తర వీధిలో ఉత్తర భాగాన నివసిస్తున్న ఒకాయన కూరగాయలు కొనడానికి దక్షిణ భాగం ఉత్తర వీధికి వెళ్ళవలసి వచ్చింది. కాని వీధులన్నీ చుట్టుకుని దక్షిణ భాగం ఉత్తర వీధికి వెళ్ళాలంటే చాలా శ్రమతో కూడిన పని కనుక రంగనాథుని గుడిలోని ఉత్తర ద్వారం గుండా లోపలికి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చి దక్షిణ భాగం ఉత్తర వీధిలో సరుకులు తీసుకుందామని తలిచారంట. అలాగే అనుకున్న విధంగా ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు వచ్చి కావలసిన సరుకులు తీసుకుని మళ్లీ దక్షిణ ద్వారం గుండా కోవెల లోపలికి వచ్చారు.


ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్ళే ముందు ఎడమ వైపు ఉన్న శ్రీ రంగనాయకి తాయారు సన్నిధిని చూసారు. ఆయన అయ్యవారిని కాని అమ్మవారిని కాని సేవించుకోవడానికి రాలేదు. వీధులన్నీ చుట్టుకుని వెళ్తే శ్రమతో కూడిన పని అనే ఒకే కారణంతో గుడిలోకి ప్రవేశించారు. అయినా అమ్మవారికి మర్యాద పూర్వకంగా రెండు చేతులను దగ్గరకు చేర్చి ఒకే ఒక్క సారి రంగనాయకి తాయారుకు నమస్కరించారు. లోపల ఉండే తాయారు చాలా పొంగిపోయింది. వెంటనే తన భర్త రంగనాథుని "ఈ బిడ్డ నన్ను చేతులు ఎత్తి నమస్కరించాడు. ఇతనికి ఏమి ఇద్దాం?" అని అడిగింది. అందుకు రంగనాథుడు " అన్ని సంపదలు నీ వశమే కదా!సకల సంపదలు అనుగ్రహించు" అన్నారు. వెంటనే సకల సంపదలు అనుగ్రహించిందంట ఆ తల్లి. మళ్ళీ ఆలోచనలో పడింది." స్వామి! అతను అంజలి ముద్రతో నన్ను నమస్కరించాడు. దానికి నేను ఇచ్చిన సకల సంపదలు సరితూగదు.


అంతకంటే పెద్దది ఏదైనా ఇవ్వాలని ఉంది." అనగా దానికి స్వామి"అవును! ఈ సంపద సరిపోదు. తరగని సంపదైన ఆత్మ అనుభవం అతనికి ఇచ్చేద్దాం!" అన్నారు. అలాగే అమ్మ అతనికి ఆత్మానుభవం అనే కైవల్య స్థితిని ప్రసాదించింది. కొద్ది సేపటికి తృప్తి చెందక ఆ తల్లి "అతను అంజలి ముద్ర కదా చూపించాడు.


మనం ఒసగిన సంపద ఆత్మానుభవం దానికి సమం కాదు కదా! మీరు ఆ బిడ్డకు ముక్తి ని ప్రసాదించండి" అని ప్రార్థించింది. తన ప్రియ నాయకి కోరిక పై ఆ వ్యక్తి కి వైకుంఠ లోక నివాసం కల్పించారు స్వామి. "ఇప్పుడు తృప్తియేనా" అని అడిగారు స్వామి. "లేదు స్వామి! మన బిడ్డ చూపిన అంజలి ముద్రకు ఏమి ఇచ్చినా సరిపోదు. కాని ఇవ్వడానికి ముక్తి కంటే గొప్పది ఏది మన దగ్గర ఏమి లేదు కదా స్వామి. అందువల్ల సిగ్గుతో తలదించుకుంటున్నాను" అని ఆ తల్లి చాలా బాధ పడిందంట.


పరాశర భట్టర్ అనుగ్రహించిన శ్రీ గుణరత్నకోశం అనే గ్రంథం లోని క్రింది శ్లోకం ఈ కథను వివరిస్తుంది. 


ఐశ్వర్యమ్ అక్షరగతిమ్ పరమమ్ పదమ్ |

వాగస్మైచిత్ అంజలిపరమ్ వహతే విధీర్య ||

అస్మై న కించిత్ ఉచితం కృతం ఇత్యదామ్పత్వం |

లజ్జసే కతయ కోయం ఉదారభావః ||


ఏదో వెళ్తున్న దారిలో అమ్మవారిని చూచి అంజలి ముద్రతో నమస్కరించిన దానికే సకల సంపదలు, ఆత్మానుభవం మరియు వైకుంఠ ప్రాప్తి ఇచ్చి కూడా.. ఇంకా ఇవ్వడానికి ఏమి లేదే అని లజ్జతో తలదించుకునే ఉంది ఆ తల్లి అని ఈ శ్లోకంలో సాధిస్తున్నారు పరాశర భట్టర్. "అలం" అంటే చాలు అని అర్ధం. "అనలః" అంటే చాలు అని తృప్తి చెందనివారు. "అలం" అనుకోకుండా తన్ను ఆశ్రయించినవారికి ఇంకా ఇంకా అనుగ్రహిస్తూ ఉండాలని అనుకోవడం వల్ల శ్రీవారు "అనలః" అని పిలువబడుతున్నారు..

Share:

శ్రీ రాజరాజేశ్వరి ఆలయం.






 * శ్రీ రాజరాజేశ్వరి ఆలయం..


నెల్లూరులోని దర్గామిట్ట ప్రాంతంలో నెలకొన్న రాజరాజేశ్వరదేవి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. 

భక్తజనాలను సంరక్షించే ఈ శక్తి స్వరూపిణిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివితీరదు.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆలయాలకు ప్రసిద్ధి గాంచింది.. అంతేకాదు మన రాష్ట్రంలో ఉన్న చాలా ఆలయాలకు ఎంతో చరిత్రాక నేపథ్యం ఉంది. అలాంటి వాటిలో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దేవ‌స్థానం ఒకటి.  ఇది పురాత‌న ఆల‌యం కాదు. కానీ 70, 80 ద‌శ‌కాల్లో క‌ట్టిన ఆధునిక దేవాల‌యం. నెల్లూరు న‌గ‌రంలోని ద‌ర్గామిట్ట ప్రాంతంలో ఉన్న ఈ ఆల‌యం ఎంతో ప్రాముఖ్యత‌ను సొంతం చేసుకుంది. జిల్లా నుంచి ఎంతోమంది భ‌క్తులు ఈ ఆల‌యాన్ని సంద‌ర్శిస్తుంటారు. ఆల‌యంలో కొలువుదీరిన శ్రీరాజ‌రాజేశ్వరీ అమ్మవారిని క‌న్నులారా ద‌ర్శించుకుంటారు. నిత్య దీప ధూప నైవేద్యాల‌తో, పూజాది కైంక‌ర్యాల‌తో ఈ ఆల‌యం ఆధ్యాత్మిక శోభ‌తో వెలుగులీనుతోంది.


శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని శ్రీ రత్నస్వామి ముదలియార్ నిర్మించిన‌ట్లు చెబుతారు. అమ్మవారి ఆల‌యంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ సుందరేశ్వర స్వామి, గాయత్రీదేవి అమ్మవారు, వినాయ‌కుడు, న‌వ‌గ్రహాలు.. ఈ దేవ‌స్థానంలో ఉపాల‌యాలుగా ఉన్నాయి. ఈ దేవ‌స్థానాన్ని దేవాదాయ శాఖ 1985లో త‌న ఆధీనంలోకి తీసుకుంది. సాధార‌ణంగా ప్రాచీన దేవాల‌యాల‌కు ఎంతో విశిష్టత ఉంటుంది. కానీ ఈ ఆధునిక దేవాల‌యానికి కూడా అంతే విశిష్టత ఉండ‌డం విశేషం.


ప్రాచీన వైభవం లేకపోతేనేం ఎంతో అందంగా నిర్మించారు రాజరాజేశ్వరీ దేవాలయాన్ని ,ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి ఊరట పొందడానికి గుడికి వెళ్తాం. నెల్లూరు రాజరాజేశ్వరీ దేవాలయానికి వెళ్ళడం ద్వారా ప్రయోజనం తప్పకుండా నెరవేరుతుంది. భక్తులు ప్రశాంత చిత్తంతో వెనుదిరిగి వస్తారు.


అమ్మవారు కాత్యాయని, కనకదుర్గాదేవి, రాజరాజేశ్వరీ దేవి, కాళీమాత, మహాగౌరి, మహిషాసురమర్దిని - ఇలా ఏ రూపంలో ఉన్నా మహోన్నతమైనదే. మనల్ని ఊరడిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. అమ్మవారు భక్తజనావళిని సంరక్షించే శక్తి స్వరూపిణి. విశాల‌మైన ప్రాంగ‌ణంలో ఈ ఆల‌యాన్ని నిర్మించారు. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా, ప్రధాన ఆల‌యంలోని అమ్మవారిని, ఆల‌య ప్రాంగ‌ణంలో ఉన్న ఉపాల‌యాల‌ను ద‌ర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఇతర ఏర్పాట్లు చేశారు. 


అమ్మవారిని ద‌ర్శించుకుంటే స‌మ‌స్యలు తీరి, క‌ష్టాలు పోయి మ‌న‌సు ప్రశాంతంగా ఉంటుంద‌ని భ‌క్తుల విశ్వాసం. 

రాహుకాల పూజలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా జరుగుతాయి. గ్రహదోషాలు పోయేందుకు భక్తులు నిమ్మకాయల్లో దీపాలను వెలిగిస్తుంటారు. 


వైభవంగా నవరాత్రులు..! 

రాజ‌రాజేశ్వరీ దేవి దేవ‌స్థానంలో ద‌స‌రా ఉత్సవాలు అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వహిస్తారు.  జిల్లా న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు పెద్దసంఖ్యలో త‌ర‌లి వ‌స్తారు.  ఒక్కో రోజు, ఒక్కో అలంకారంలో అమ్మవారిని తీర్చిదిద్దుతారు. 

చివ‌రిరోజు శ్రీరాజ‌రాజేశ్వరీ దేవి అలంకారంలో కొలువు దీరుస్తారు. అమ్మవారి దివ్యమంగ‌ళ స్వరూపాన్ని చూసేందుకు రెండు క‌నులు చాల‌వు.

 

న‌వ‌రాత్రుల్లో అమ్మవారి భ‌క్తులైతే భ‌వానీ మాల ధ‌రించి ఉపాస‌న చేస్తారు. చివ‌రి రోజు దీక్ష విర‌మిస్తారు. 

శ్రావ‌ణ మాసంలోనూ ఈ ఆల‌యంలో ప్రత్యేక‌ పూజ‌లు జ‌రుగుతాయి. ఇక శుక్రవారాల్లో విశేష పూజ‌లు నిర్వహిస్తారు. నెల్లూరులో శ్రీ రాజ‌రాజేశ్వరీ అమ్మవారు శ‌క్తి స్వరూపిణిగా విజ‌య‌రూపిణిగా ఆశ్రిత రక్ష పోష జననియై... భ‌క్తుల‌ను క‌టాక్షిస్తూ విరాజిల్లుతోంది.


నెల్లూరు రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి నిత్యం జరిపే పూజా కార్యక్రమాలతో బాటు పర్వదినాల్లో విశేష సేవలు, ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు.


దర్శన వేళలు: ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4.30నుంచి రాత్రి 9 గంటల వరకు. 


ఎలావెళ్లాలి: 

నెల్లూరు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ నుంచి లోకల్‌ ఆటోలు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి రాజరాజేశ్వరదేవీ టెంపుల్‌ అని అడిగితే ఎవ్వరైనా తీసుకెళ్తారు.

Share:

బడే హనుమాన్‌జీ మందిర్‌.






 * శయన హనుమంతుడు..!

* బడే హనుమాన్‌జీ మందిర్‌..


ఏ దేవాలయంలో అయినా.. కుడిపక్కకు తిరిగీ లేదా గర్భగుడికి అభిముఖంగా దర్శనమివ్వడం మనందరికీ తెలిసిందే. కానీ, ప్రయాగలోని త్రివేణీ సంగమానికి దగ్గర్లో ఉన్న బడే హనుమాన్‌జీ మందిర్‌లో మాత్రం ఆంజనేయుడు వెల్లకిలా శయన ముద్రలో ఉండి. భక్తుల పూజలు అందుకుంటున్నాడు. దేశంలో ఈ ఒక్క ఆలయంలోనే హనుమంతుడు ఇలా వీరముద్రలో కనిపిస్తాడని అంటారు.


పేరుకు తగినట్లుగానే బడే హనుమాన్‌ జీ మందిరంలోని హనుమంతుడి విగ్రహం ఇరవైఅడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పులో ఉంటుంది. గర్భగుడి కూడా హనుమంతుడు శయనించేందుకు వీలుగా దాదాపు ఎనిమిది అడుగుల లోతుగా ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులెవరైనా స్వామివారిని పైనుంచే చూసి పూజించాల్సి ఉంటుంది. ఈ  రామభక్తుడిని దర్శించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచీ రావడం ఒక విశేషమైతే... స్వామివారికి అభిషేకం చేయడానికి ప్రతిఏటా గంగానదే తరలిరావడం ఇక్కడున్న మరో ప్రత్యేకత. వర్షాకాలంలో నీటి ప్రవాహ ఉద్ధృతి పెరిగినప్పుడు గంగ ఉప్పొంగి.. ఆలయంలోపల ఉన్న హనుమంతుడి విగ్రహం వరకూ వస్తుంది. ఆ సమయంలో గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తరువాత ఆ నీరు ఎక్కడికి పోతుందనేది ఇప్పటివరకూ ఎవరూ గుర్తించలేకపోయారు. అలా గంగాజలం హనుమంతుడిని తాకడం వల్ల దేశంలో సుఖసంతోషాలూ, ప్రశాంతత వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. ఆ వింతను చూసేందుకే భక్తులు వర్షాకాలంలో ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు.


స్థలపురాణం..

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ అనే ఊళ్లో ఓ హనుమంతుడి భక్తుడు ఉండేవాడు. అతడికి సిరిసంపదలు ఉన్నా.. సంతానం లేదట. దాంతో వింధ్యాచల పర్వతాల దగ్గర హనుమంతుడి ఆలయం కట్టించాలని నిర్ణయించుకుని, భారీ ఆంజనేయుడి విగ్రహాన్ని తయారుచేయించాడట. ఆ విగ్రహానికి పలు నదీజలాలతో అభిషేకం చేయించేందుకు సిద్ధమై, ప్రయాగకూ చేరుకున్నాడట. ఆ రాత్రి అతడికి కలలో హనుమంతుడు కనిపించి.. ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి వెళ్తే గనుక కోరికలన్నీ నెరవేరతాయని చెప్పాడట. ఆ భక్తుడు హనుమంతుడు చెప్పినట్లుగానే విగ్రహాన్ని  వదిలేసి వెళ్లిపోయాడట. ఆంజనేయుడు వరమిచ్చినట్లుగానే అతడికో బిడ్డ కలిగాడట. అయితే ఆ భక్తుడు వదిలివెళ్లిన విగ్రహం రోజులు గడిచేకొద్దీ నీళ్లల్లో మునిగి... క్రమంగా ఇసుకలో కూరుకుపోయింది. 


కొన్నాళ్లకు ఓ స్వామిజీ మాఘమాసంలో త్రివేణీ సంగమంలో స్నానం చేయడానికి అక్కడికి చేరుకున్నాడరు. తనతో తెచ్చుకున్న త్రిశూలాన్ని అక్కడున్న ఇసుకలో గుచ్చి... ధుని తయారుచేసుకునే సమయంలో ఆ త్రిశూలానికి రాయి తగిలిన శబ్దం వినిపించడంతో చుట్టూ ఉన్న ఇసుకను తీయడం మొదలుపెట్టారు. చివరకు అతడికి హనుమంతుడి విగ్రహం కనిపించింది. అది తెలిసి స్థానికులూ అక్కడికి చేరుకుని ఆ విగ్రహాన్ని కడిగి.. పైకెత్తి ఎక్కడైనా ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించారట. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని నిలబెట్టలేకపోవడంతో అక్కడే పడుకున్న భంగిమలోనే ఉంచి.. ఆలయం కట్టారు. అదే #బడే #హనుమాన్‌ మందిర్‌ అయ్యింది. 


ఇక్కడ హనుమంతుడి విగ్రహం పెద్దగా ఉండటం వల్లే స్వామివారిని బడే హనుమాన్‌ అని పిలుస్తారు. ఆంజనేయుడి కుడిపాదం దగ్గర రావణుడి విగ్రహం ఉంటుంది. దుర్భుద్ధి ఉన్నవారిని హనుమంతుడు నశింపచేస్తాడనడానికి సంకేతమే ఆ విగ్రహమని భక్తులు విశ్వసిస్తారు. అలాగే మరోపాదం దగ్గర మనోధైర్యానికి నిదర్శనమైన కామద దేవి, నుదుటి దగ్గర రాముడు, లక్ష్మణుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ హనుమాన్‌ జయంతి రోజున విశేషంగా పూజలు జరుగుతాయి. మిగిలిన రోజుల్లో మామూలుగానే భక్తులు వచ్చి... స్వామిని దర్శించుకుని కోరినట్లుగా పూజలు చేయించుకోవచ్చు. ఈ హనుమంతుడిని ప్రయాగ కొత్వాల్‌ అనీ పిలవడం గమనార్హం.


ఎలా చేరుకోవచ్చంటే...

ఇది ప్రయాగలోని త్రివేణీ సంగమానికి దగ్గర్లోనే ఉంటుంది. మార్చి, అక్టోబరు నెలలు ఈ ఆలయాన్ని దర్శించేందుకు అనువైన సమయం.  ప్రయాగ రాజు రైల్వేస్టేషన్‌ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంటుంది. విమానంలో వెళ్లాలనుకునేవారు బామ్‌రువాలీ ఎయిర్‌పోర్టులో దిగి... అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. విమానాశ్రయం నుంచి దాదాపు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం.

Share:

భులింగేశ్వర సోమేశ్వర స్వామి ఆలయం..






 భులింగేశ్వర సోమేశ్వర స్వామి ఆలయం..


దక్షిణ భారతదేశంలో సుదీర్ఘ సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం కలిగిన దేవాలయాలకు నెలవుగా నల్లగొండ జిల్లా  కొలనుపాక గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. జైన, శైవ, వైష్ణవ మతాలకు నిలయంగా చరిత్ర పుటలకెక్కిన కొలనుపాకలో వెలకట్టలేని చారిత్రక సంపద దాగి ఉంది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన శ్రీ శ్వేతాంబర జైన ఆలయంతో పాటు అతి ప్రాచీన స్వయంభూ లింగేశ్వర సోమేశ్వర స్వామి ఆలయం, శ్రీ వీరనారాయణ స్వామి ఆలయం, కాకతీయ ప్రతాపరుద్రుని అతి ప్రాచీన శివాలయం, ప్రాచీన శాసనాలు, శిలలు, విగ్రహాలతో ఏర్పాటైన మ్యూజియంలు కొలనుపాకలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎంతో చారిత్రక ఉన్నతి గల కొలనుపాక దేవాలయాలు నేడు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాధుడు లేకపోవడం శోచనీయం. 


ఈ కొలనుపాకనే పూర్వం దక్షిణకాశి, బింబావతి పట్నం, పంచకోశ నగరంగా పిలిచేవారట. దీనినే కొలియపాక, కొల్లిపాక, కల్లియపాక, కుల్యపాక, కొల్లిపాకేయ మొదలైన పేర్లతో పిలిచే వారట. ఇప్పడు కొలనుపాక, కుల్పాక్ గా వ్యవహరిస్తున్నారు. దక్షిణ కాశీగా పిలవబడే కొలనుపాకలో సోమేశ్వర స్వయంభూ ఆలయం  ఉంది. 

ఈ శివలింగాన్ని పూజిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. చాళుక్య, కాకతీయ రాజుల పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు శిలాశాసనం వెల్లడిస్తుంది. ఇక్కడి శివలింగంపై వెయ్యి లింగాలు చెక్కబడి ఉండటం ఓ ప్రత్యేకత. 

ఈ లింగాన్ని కోటి ఒక్క లింగంగా భక్తులు పూజిస్తుంటారు. అయితే దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జురపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్నచిన్న లింగాలన్నిటినీ కలుపుకుంటే కోటొక్కటి ఉంటాయని చెబుతారు


ఈ స్వయంభూ  సోమేశ్వర లింగం పంచపీఠాలలో మొదటిది, రొండవది ఉజ్జయినిలో శ్రీ సిథ్దేశ్వర స్వామి, మూడవది కెధారినాథ్ లో శ్రీ భీమనాథ్ స్వామి, నాలుగవది శ్రీ శైలంలో మల్లికార్జున స్వామి, ఐదవది కాశీలో విశ్వేశ్వరాలయం. ఈ గర్భగుడిలో శ్రీ సోమేశ్వరుడు స్థావర లింగాకారంలో వెలసి ఉన్నాడు. ఈ లింగం నుంచే జగద్గురువు రేణుకాచార్యులు అవతరించి వీరశైవ ధర్మాన్ని నలు దిశలా వ్యాప్తిచేసినట్లు పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఇక్కడి ప్రధానాలయం చుట్టూ ఎన్నో ప్రాచీన శివలింగాలు, కాకతీయ ప్రతాపరుద్రుడు నిర్మించిన అతిప్రాచీన శివాలయం ఉంది.


ఈ ఆలయంలో మాఘమాసంలో.. కార్తీక మాసంలో.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ. ఏటా ఛైత్ర మాసంలో.. బహుళ తధియ మొదలకుని.. పంచమి వరకూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 


🔆 కొలనుపాక జైన మందిరాలు..


జన మందిరాలు శాంతికి చిహ్నాలుగా కనిపిస్తాయి. నిర్మాణంలో సునిశితత్వంతోపాటు ప్రశాంతమైన వాతావరణం వీటి ప్రత్యేకత. కొలనుపాకలో ఉన్న జైన మందిరం లేత గులాబీరంగు అద్దిన మైనపు బొమ్మలాగ ఉంటుంది. రెండు వేల ఏళ్ల నాటి నిర్మాణం ఇది. రాష్ట్రకూటుల కాలంలో ఇక్కడ జైనం విలసిల్లింది. ప్రపంచ కాలమానం క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకంలోకి ప్రయాణించిన సంధికాలంలో ఇక్కడ జైనం వికసించింది. ఆ వికసిత జైనానకి ప్రతీకలుగా జైన మందిరాల్లో పై కప్పులకు రెక్కలు విచ్చిన పద్మం ఉంటుంది. కొలనుపాక జైన మందిరం శ్వేతాంబర జైనసాధకుల ఆలయం.


ఈ మందిరంలో గోడల మీద మహావీరుడు బోధించిన నీతిసూత్రాలు కూడా ఉంటాయి. వాటిలో సమాజంలో మనుషులంతా సమానమే అని ఉంటుంది. కానీ పర్యాటకులను ప్రధాన ఆలయంలోకి అనుమతించరు. అందులోకి ప్రవేశం శ్వేతాంబర జైనులకు మాత్రమే. ఈ ఆలయంలో ఉన్న ప్రధానమైన మహావీరుని విగ్రహం విలువ కోట్లలోనే ఉంటుందని ప్రచారం. జైన్లు తమ చివరి తీర్థంకరుడైన ఈ మహావీరుని విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తరువాత ఆలయంలో చెప్పుకోదగిన విగ్రహం శ్రీ ఆదేశ్వర విగ్రహం, దీనిని కనుటి రాతితో తయారుచేశారు. అలాగే దగదగ మెరిసే వెండి కిరీటంతో ఆలయంలో ఏర్పాటుచేసిన ఆదినాధ్ విగ్రహం కూడా చూపరులను ఆకర్షిస్తుంది. 


ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి ఆత్మజ్ఞానం, నిర్భయం, మనఃశ్శాంతి, ఆరోగ్యం, ఆధ్యాత్మికశక్తి చేకూరుతాయన్నది భక్తుల నమ్మకం. భరతదేశంలోని జైనాలయాల్లో కొలనుపాక ఏడవది. పదెకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మితమై ఉంది. దేశ, విదేశాలలోని జైన మత గురువులు, జైనమతస్థులు కొలనుపాకను సంవత్సరం పొడవునా సందర్శించి తీర్థంకరుల విగ్రహాలను భక్తిప్రపత్తులతో పూజిస్తారు. ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమినాడు రథోత్సవం నిర్వహిస్తారు. 


ఆలేరు నుంచి సిద్ధిపేట వైపు వెళ్ళే మార్గంలో 6 కి.మీ. దూరంలో కొలనుపాక ఉంది. 

Share:

శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం.


 * శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం..


నింగి నుంచి నేలపైకి వేగంగా దూసుకొస్తున్న గంగను కొప్పులో ఒడిసిపట్టి, మెల్లంగ నేలపైకి జారవిడుస్తాడు శివుడు. లోకాలను రక్షించడం కోసం పరమభయంకరమైన విషాన్ని పాయసంలా తాగుతాడు. అసురుడైన రావణుడి కోరికమేరకు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. లోకకల్యాణం కోసం త్రిపురాసురులను సంహరించినవాడే ఆ పరమాత్ముడు. 


మహాశివుడు కొలువైన ప్రతి క్షేత్రం మహాశివరాత్రి సందర్భంగా భక్తజన సందోహంతో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా వాడపల్లి కృష్ణానదీ తీరంలో ఆవిర్భవించి అగస్త్యేశ్వరుడు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అయితే, ఇక్కడ శివలింగం శిరోభాగం నుంచి అదేపనిగా నీరు వస్తూ ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శైవక్షేత్రాలు చాలానే ఉన్నాయి. వీటిలో మేళ్లచెరువు మండల కేంద్రంలో ఉన్న శంభు లింగేశ్వర స్వామి ఆలయం ప్రశస్తమైనది.


పూర్వమున ఈ ప్రాంతమంతయు మేడి చెట్లమయముగా,  మేడి చెరువుగా పిలువబడి యుండును. మేడికి బహువచనము మేళ్లు కావున  కాలక్రమంగా మేళ్లచెరువుగా ప్రసిద్దమైంది. కాకతీయులు నిర్మించిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శివలింగం తెల్లగా  ఉంటుంది. ఆలయంలోని లింగం పెరుగుతూ వుంటుందని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు.


ఆలయ ప్రత్యేకత :

ఇచ్చట వెలసిన  శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరుడు అపో లింగము. (గంగ శిరమున కలిగిన లింగము) 

పంచ భూత గుణములతో వెలసిన లింగములను పంచభూతేశ్వర లింగములందురు. తమిళనాడు లోని జంబుకేశ్వరుని ఆపోలింగం గా కీర్తిస్తారు. పంచభూతములనగా భూమి,నీరు ,అగ్ని,నీరు ఆకాశము.

శంభులింగేశ్వర లింగము అపోలింగములు. అనగా స్వామి వారి శిరసుపై గంగధార కలదు. ఈ లింగము స్వయంభువు . అనగా తనకు తానుగ భూమినుండి వెలుపలకు వచ్చి ప్రకటితమైన లింగము.


స్థల పురాణం..


అక్కడ చెప్పుకునే కథను బట్టి స్వామి మొదట వరంగల్లు దగ్గర వెలిసారుట. ఒక కోయవాడు చూసి ఆవు కొవ్వుతో దీపం వెలిగించి ఆవుతోలుతో తోరణాలు కట్టి పూజ చేసేవాడు. ఆది నచ్చక స్వామి భూమిలోంచి ఈ మేళ్ళ చెరువు వరకూ ఆకారం పెంచి ఇక్కడ వెలిసారు అంటారు.  ఒక ఆవు నిత్యం ఈ లింగం మీద పాలు ధారగా వదిలేదిట. అది చూసిన పశువుల కాపరి లింగాన్ని తెగ్గొట్టి పారేస్తే మళ్ళీ మొలిచిందని, ఇలా 11 సార్లు జరిగాక, ఒకసారి లింగన్న అనేవాని కలలో స్వామి కనబడి తనజోలికి రాకుండా చూడమని చెప్పారుట. తను వచ్చి లింగం చుట్టూ బాగుచేసి, చిన్న గుడిలా కట్టి పూజ చేసేవాడు. ఈ గుడికట్టేముందు ఈ లింగాన్ని తీసి వేరే చోట ప్రతిష్ట చేదామని ప్రయత్నించారు. 75 అడుగుల లోతున తవ్వినా లింగం మొదలు కనపడక, చివరికి వున్నచోటే గుడిని కట్టించారట. 

ఈ లింగం వరంగల్ నుంచి ఇక్కడవరకూ భూమిలో ఉందని కొందరు అంటారు. ఆతర్వాత గత 72 సంవత్సరాలుగా 12 ఏళ్ళకొక అంగుళం చొప్పున లింగం పెరుగుతూ ఉందని, స్థల పురాణం. ఈ లింగానికి నెత్తిమీద ఒక రంధ్రం ఉంది. అందులోంచి నిరంతరం పాతాళ గంగ ఊరుతూంటుంది. విశేషం ఏమిటంటే రంధ్రందాటి నీరు పొంగదట. 

శ్రీ చిన జియ్యరు స్వామి పరిక్షించి అది సత్యం అని ధృవీకరించారని చెబుతారు. దిన్ని అర్ధ నారీశ్వర లింగంగా భక్తులు కొలుస్తారు. ఎందుకంటే లింగం రెండు భాగాలుగా ఉంటుంది, స్వామి వారికి వెనుక వైపు మూడుపాయలు గా జడ ఉంటుంది. గంగ ఉన్న వెనుక భాగం లోనే ఉంటుంది. అందుకే అభిషేకానంతరం చేసే విభూతిచర్చ, చందన చర్చలను వెనుక భాగానికి తగలకుండా జాగ్రత్త పడటం అభి షేక సమయం లో మనం  గమనించవచ్చు. 

 

ప్రతి రోజు అభిషేకానంతంరం  విశేషాలంకరణ ఛేస్తారు.  లింగం పై అడుగు అడుగు కి కుంకుమ బొట్టును అందం గా దిద్దుతారు. లింగం క్రింది భాగాన చిన్నబొట్టు తో ప్రారంభించి.   పైకి వెళ్లే కొద్ది సైజు పెరుగుతూ. చివరి బొట్టు పెద్దది గా  పెడతారు. అంటే స్వామి వారు పెరుగుతున్నారని చెప్పడానికి  అది సంకేంతం కావచ్చు. ఐదు కుంకుమ చుక్కలు  స్వామి వారిపై మనకు కన్పిస్తాయి. అలంకారం చాల నిష్ట తో, ఓర్పు తో చేస్తారు.  స్వామి వారి కి ఎడమవైపు ఉపాలయం లో శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవి కొలువు తీరి ఉంటుంది.


ప్రత్యేక ఉత్సవాలు :.. 

మహా శివరాత్రి ఈ ఆలయం లో గొప్ప ఉత్సవం.  ఆ  రోజు స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండువు గా జరుగుతుంది. చుట్టుప్రక్కల  జిల్లాలనుంచి కూడ వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలి  రావడం ఒక ప్రత్యేకత.కార్తీకమాసంలో దీపోత్సవం కూడ చాల   వైభవంగా నిర్వహిస్తారు. కాణిపాకం వినాయకుడి ఆకారం జరిగినట్లు.. ఇక్కడ లింగం పెరుగుతోందని భక్తులు విశ్వసిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివలింగం పాణవట్టంతో కలిసి ఉంటుంది. శివలింగం భూమిని ఆనుకొని పాణవట్టంతో ఉంటుంది. శివలింగం ప్రతీ ఆరవై ఏళ్లకోసారి ఒక అంగుళం పెరుగుతుందని భక్తులు చెబుతుంటారు.

 

ఈ క్షేత్రము నల్గొండ జిల్లా కోదాడ నుండి 24 కి.మీ దూరం లోను. హుజూరునగర్ నుండి 10 కి. మీ దూరం లోను, ఖమ్మం నుండి  68 కిమీ దూరంలోను ,నల్గొండ నుండి 91 కి.మీ.దూరంలో ఉంది.

Share:

పంచ బదరీ క్షేత్రాలు.


 * పంచ బదరీ క్షేత్రాలు..


విశాల బద్రి (బదరీనాథ్),

యోగధ్యాన్ బద్రి,

భవిష్య బద్రి,

వృద్ధ బద్రి మరియు

ఆది బద్రి (యోగి బద్రి)


శ్రీమహావిష్ణు స్థానములైన 'పంచబదరీ క్షేత్రముల' గురించి తెలుసుకుందాం...

'విష్ణు భగవానుడు' అయిదు విభిన్న పవిత్ర క్షేత్రములలో 'విశాల బద్రి (బదరీనాథ్), యోగధ్యాన్ బద్రి, భవిష్య బద్రి, వృద్ధ బద్రి మరియు ఆది బద్రి' పేరులతో 'పంచబద్రి క్షేత్రములుగా' భారతదేశము నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షించుచూ.. హిమాలయములలో  'బదరీనాథ్' మరియు జోషీమత్' పరిసర ప్రాంతములలో వెలుగొందుచున్నాడు. ఈ అయిదు క్షేత్రములు 'బదరీనాధ్ పుణ్య క్షేత్రముతో' ప్రారంభమై బదరీనాధ్ నకు ఉత్తరముగా 24 కి.మీ. దూరములో కల 'సతోపంత్ హిమానీనదము' దక్షిణమునందు కల 'నందప్రయాగ' 'బదరీ నారాయణుడు' ఈ అయిదు పుణ్య క్షేత్రములలో అయిదు విభిన్న రూపములతో కొలువబడుచున్నాడు. వేసవి వర్షాకాలములు అనగా జూన్ నెల నుండి అక్టోబరు నెల మాసములు ఈ ఆలయములు సందర్శించుటకు వీలుగా ఉండును.


🌷(1) విశాల్ బద్రి (బద్రీనాథ్)...


బద్రీనాథ్ హిమాలయ పర్వతశ్రేణిలో ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు 'చామోలి' జిల్లానందు 'చార్ ధామ్' పేరుతో ప్రసిద్ధమైన 'కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి మరియు బధ్రీనాథ్' లలో ఒకటిగా నున్న నగర పంచాయితీ. 'బద్రి' నీలకంఠ తదితర పర్వతా రోహణమూలకు ముఖద్వారము వంటిది. 'బద్రి' అనునది ఈ ప్రాంతమునందు పెరుగు ఒక చిన్న, తినుటకు ఉపయోగపడు రుచికరమైన పండు మరియు 'నాథ్' అనగా భగవంతుడు. పూర్వపు రోజులలో బదరీనాథ్ నడచి వెళ్లవలసి వచ్చేది.


అద్వైత తత్వ ప్రతిపాదకులగు వేదాంతాచార్యులు 'జగద్గురు ఆదిశంకరా భగవత్పాదాచార్యులవారు', 7వ శతాబ్దమునందు బదరీనాథ్ ఆలయమును పునః నిర్మించినారు. అటుపిమ్మట అనేకమార్లు విదేశీ దండయాత్రలవలననూ ఈప్రాంతములో తరచూ సంభవించు భూకంపముల వలన ఈ ఆలయము దెబ్బతినుట పిమ్మట అనేకమార్లు తిరిగి నిర్మించుట జరిగియున్నది.


వైశిష్టాద్వైత తత్వవేత్త భగవద్రామానుజాచార్యుల వారు సైతం ఈ క్షేత్రసందర్శనం గావించిరి. శ్రీవైష్ణవ దివ్యధామములలో 'బద్రినారాయణ' ముఖ్యమైనది. బదరీనాధ్ పుణ్యక్షేత్రము సముద్రమట్టమునకు సుమారు 12 వేల అడుగుల ఎత్తున ఉన్నది. ఇచటగల తప్తకుండం మరియు సూర్యకుండం అను రెండు ఉష్ణకుండములవలన ఇచ్చట సమఉష్ణోగ్రత సంవత్సర మంతయు ఉండును.


'స్థలపురాణం' ప్రకారం విష్ణుభగవానుడు నరనారాయణఅవతారము నందు బదరీనాథ్ నందు బహిరంగ ప్రదేశమునందు తపస్సు చేసినాడు. లక్ష్మీ దేవి ఆయనకు వ్యతిరేక వాతావరణ పరిస్థితులు తట్టుకొనుటకుగాను బదరివృక్షము రూపములో  ఆశ్రయము కల్పించినది. నారద మహర్షి “ఓం నమో నారాయణాయ” అనబడు 'అష్టాక్షరీ మంత్రము'  జపించి తపస్సు చేసినాడు. 'మహా విష్ణువు' జీవరాశులన్నిటి క్షేమమును కోరి ఇక్కడ తపస్సు చేయ నారంభించినాడని ప్రతీతి.


🌷(2) యోగధ్యాన్ బద్రి..


'యోగధ్యాన్ బద్రి, కర్ణ ప్రయాగకు 22 కి.మీ. దూరంలోనూ హనుమాన్ చత్తి మరియు గోవింధ్ ఘాట్ నకు దగ్గరలో 'పండుకేశ్వర్' గ్రామమునందు కలదు.


విష్ణు భగవానుడు ధ్యానము నిమిత్తము ఇచట నుండి దీనికి 'యోగధ్యాన్ పండుకేశ్వర్' అని పేరు పెట్టినాడు. ఈ ఆలయము 'గుప్తుల కాలము' నాటిది మరియు సముద్ర మట్టమునకు 6000 అడుగుల ఎత్తున ఉన్నది.


స్థల పురాణము ప్రకారము వేదవ్యాస మహర్షి 'శ్రీమధ్ భాగవతమును' ఇచ్చటనే రచించినాడు. 'జగద్గురు ఆది శంకరాచార్య' ఈ ఆలయములను ప్రపంచవ్యాప్తముగా హిందూమత అభివృద్ధికి అనువైనవిగా ఆమోదించి యున్నారు.


శీతాకాలములో ఆలయము మూసివేయు సందర్భమునందు 'బదరీనాధ్ ఉత్సవమూర్తిని' ఈ ఆలయము నందు ఉంచేదరు. ఈ ప్రదేశమునందు ప్రార్ధనలు చేయనిదే యాత్ర సంపూర్ణము అవదని ప్రజలు నమ్ముతారు.


స్థల పురాణము ప్రకారము పాండురాజు తాను రెండు సంగమములో నున్న లేళ్ళను చంపినందువలన కలిగిన పాపమునుండి విముక్తి పొందుటకు విష్ణుమూర్తిని ప్రార్ధించుటకు తపస్సు చేసినాడు.


'పాండవులు' జన్మించిన పిమ్మట 'పాండురాజు మరణానంతరము' విష్ణుమూర్తి ఇత్తడి విగ్రహము ఇచట ప్రతిష్టించినారు. మరియు కురుక్షేత్ర సంగ్రామమునందు కౌరవులను ఓడించిన పిమ్మట ప్రత్యాత్తాపాన్ని ప్రకటించుటకు ఈచటికి వచ్చినారు.


🌷(3) భవిష్య బద్రి..


జషీమఠ్ నకు 17 కి.మీ. దూరములో తపోవన్ నకు దగ్గరగాకల 'సుభైన్' గ్రామమున దట్టమైన ఆటవీప్రాంతములో ఈభవిష్యబద్రి ఉన్నది.


భవిష్యత్తులో చెడు ప్రబలి నరనారాయణ పర్వతములు మూసుకు పోయి 'బదరీనాధ్ మార్గము' నిరోధించబడినప్పుడు ఈ 'భవిష్యబద్రి' బద్రినాధ్ గా పరిగణింప బడునని తెలుపబడినది.


భవిష్య బద్రి అందమైన మరియు ఆహ్లాదకరమైన దృశ్యములు వీక్షించకలిగిన లోయ మరియు ఆటవీప్రాంతముతో ముఖ్యమైన పర్యాటకప్రదేశము.


సాల్హధార్ వరకు రోడ్డు ప్రయాణము చేసి ఆచటినుండి 6 కి.మీ. పర్వతారోహణముతో 'నరసింహుని విగ్రహము' కుడిగా యున్న బదరీ నారాయణుడు కల ఈ ఆలయము చేరవచ్చును.


🌷(4) వృద్ధబద్రి..


'వృద్ధబద్రి (లేదా) బృధబద్రి' జోషీమఠ్ నకు 7 కి.మీ దూరములో సముద్ర మట్టమునకు 13500 అడుగుల ఎత్తులో అనీమత్ వద్దనున్న  పురాతన దేవాలయము.


స్థలపురాణము ప్రకారము విష్ణు భగవానుడు రూపము వృద్ధ మానవుని రూపములో వెలసినాడు.  అందువలన వృద్ధమానవరూపములో నున్న భగవానుని భక్తులు సంవత్సరామంతయూ కొలిచేదరు.


'బద్రీనాథ్' చార్ ధామ్ నందు ఒక పుణ్య క్షేత్రముగా పరిగణింపబదేవరకు విశ్వకర్మచే సృస్థించబడిన ఈ విగ్రహము అర్చించ బడినది. సంవత్సర కాలమంతయు తెరువబడి యుండేడి ఈ ఆలయము తీర్ధ యాత్ర చేయుటకు వీలుగా యుండును.  


🌷(5) ఆదిబద్రి..


కార్ణప్రయాగకు 17కి.మీ దూరములో పంచబద్రి ఆలయములలో మొదటిదయిన ఈ ఆదిబద్రి ఆలయము ఉన్నది.


శీతాకాలమునందు బద్రినాధ్ ఆలయము మూసివేసినప్పుడు విష్ణుభక్తులు ఇచ్చటనే ప్రార్ధన చేసేదరు. 'ఆదిశంకరాచార్య' ఏడు ఆలయములతో కూడిన ఆలయ సముదాయము ఇచట ప్రారంభించినాడని గుప్తరాజుల కాలములో ఈ ఆలయములు నిర్మించబడినట్లు నమ్మకము.


ఈ ఆలయ సముదాయములో పిరమిడ్ ఆకారములోని వేదికపై  విష్ణు భగవానునికి అంకితం చేయబడిన ప్రధాన ఆలయము నిర్మించిన బడినది.


నల్లరాతితో చెక్క బడిన విష్ణు భగవానుని విగ్రహము చేతులలో కమలము, చక్రము మరియు గద ధరించియుంటుంది.


భవిష్యత్తులో బదరీనాధ్ నకు సమాజములో కల ఉన్నత స్థాయి భవిష్య బద్రినకు కలిగినప్పుడు ఈ ఆలయమును 'యోగిబద్రి' అని పిలిచెదరు...

Share:

స్వామిమలై






 * స్వామిమలై.. 


తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుంభకోణం సమీపంలో స్వామిమలై ప్రసిద్ది చెందిన దేవాలయం. స్వామి మలై అంటే దేవుని పర్వతం అని అర్థం. తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి వారికి ఉన్న ఆరు ముఖ్యమైన క్షేత్రాలలో ఇది నాలుగవది. ఈ ఆలయానికి ఒక గొప్ప విశేషం ఉంది. సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తన కుమారుని తెలివితేటలకు మురిసిపోయి పుత్రోత్సాహం పొందిన స్థలమింది. సుబ్రహ్మణ్వేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్థం చెప్పిన పవిత్ర ప్రదేశమిది. మరి ఇంత అద్వితీయమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం ఒకసారి సృష్టకర్త అయిన బ్రహ్మగారు కైలాసానికి వెళుతూ.. ఆయనకి దోవలో కుమారస్వామి కనబడ్డాడు. కనబడ్డవాడు వూరుకొనక, ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని అడిగాడు. పాపం దేవలకు కూడా తెలియని ప్రశ్నతో బ్రహ్మతో పాటు ఇతర దేవుళ్ళను అయోమయంలో పడేశాడు. 


బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పకపోయే సరికి ఆయన్ని బందీ చేశాడు. సృష్టికే మూలకర్త అయిన బ్రహ్మ దేవుడు బందీ అయ్యే సరికి సృష్టి ఆగిపోయింది. దాంతో దేవతలందరూ ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి పరిస్థితి విన్నవించారు. అందరూ కలసి కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు. అందుకు కుమారస్వామి ఇలా అన్నాడు, బ్రహ్మదేవున్ని ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు. అందుకే బందీని చేశానని సమాధానం చెప్పి, ఇందులో తన తప్పు ఏమి లేదని చెప్పాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు కుమారస్వామిని ఇలా ప్రశ్నించాడు. ఆయనకి తెలియదని బందీని చేశావు సరే మరి నీకు తెలుసా అని అడుగగా నేను చెప్తాను అన్నాడు . అయితే నేను ప్రణవ మంత్రార్థాన్ని బోధిస్తున్నాను కనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రద్దలున్న శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడు.  తర్వాతేముంది కుమారుడు గురువయ్యాడు, తండ్రి శిష్యుడయ్యాడు. తండ్రి అత్యంత భక్తి శ్రద్దలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్థాన్ని విని పులకరించిపోయాడు. 


ఈ క్షేత్రం గురించి మరో పురాణ కథనం కూడా ఉంది. భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు. భృగు మహర్షి ఒకసారి తపస్సు ప్రారంభించడానికి ముందు తన తపస్సుని ఆటంక పరచిన వారికి అంతకు ముందున్న జ్ఝానమంతా నశిస్తుందనే వరం పొంది తీవ్ర తపస్సు ప్రారంభించాడు. ఆ తపోశక్తి ఊర్థ్వలోకాలకి వ్యాపించగా , ఆ వేడిమిని భరించలేని దేవదేవుళ్ళు ఆ పరమేశ్వరుని శరణు కోరారు. అప్పుడు ఈశ్వరుడు ఆతపశ్శక్తి దేవలోకాలకి వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తలమీద అడ్డంగా పెట్టాడు. దాంతో పరమశివునంత వారికి కూడా జ్ఝానం నశించింది. తన పూర్వ జ్ఝానాన్ని తిరిగి పొందటానికి ఆయన జ్ఝాన స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవోపాసన పొందాడు. ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి. ఆ స్వామికి స్వామియై,నాథుడై ఉపదేశించాడు కనుక ఇక్కడ కుమార స్వామికి స్వామి నాథుడనే పేరు వచ్చింది. ఈ స్థలానికి స్వామిమలై అనే పేరు వచ్చింది. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కార్త వీర్యార్జునుడు కట్టించాడు. గర్భగుడి బయట మనం ఆయన విగ్రహాన్ని దర్శించవచ్చు. 


ఈ చిన్న కొండపైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లు అరవై తమిళ సంవత్సరాలకి ప్రతీకలని, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు. ప్రతి మెట్టు దగ్గర గోడపై ఆ సంవత్సరం పేరును తమిళంలో వ్రాసి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కే నడక దారిలో 32 మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూస్తే అక్కడ కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది అలాగే ఈ గుడికి క్రింది భాగంలో శివపార్వతులు మంటపాలున్నాయి.అక్కడ వీరిని మీనాక్షి,సుందరేశ్వర్, మీనాక్షి. పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుండి పుణ్యక్షేత్రమైన తిరువిదైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడు.ఆయన కులదైవమైన మీనాక్షి సుందరేశ్వరుని ఆరాధించడానికి ఈ మంటపాలనేర్పరచాడు ఈ ఆలయంలో ద్వజ స్థంభం వద్ద ఉన్న వినాయకుడి ఆలయం కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమారతరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు ఉన్నాయి. కొంగు ప్రాంతం నుండి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చే సరికి ఆయనికి కన్నులు కనిపించడం వల్ల ఈ వినాయకున్ని నేత్ర వినాయగర్ అని పిలుస్తారు.


పురాణ కథనం ప్రకారం ఈ దేవుని సన్నిధికి వచ్చి నిశ్చల భక్తితో పూజించే వారి పాపాలన్నీ సూర్యుని ముందు పొగమంచులాగా కరిగిపోతాయి, ఈ దేవాలయంలో వివాహం చేసుకన్న వారికి సత్ప్రవర్తన, సత్సంతానం కలుగుతాయంటారు. ఈ స్వామి దర్శనార్థం అనేక మంది భక్తులు సందర్శిస్తుంటారు. దేశ, విదేశాల నుండి కూడా భక్తులు ఆ ఆలయానికి వస్తుంటారు. భక్తులు కోర్కెలు తీరిన తర్వాత స్వామి వారికి పాలకావడి, పూల కావడి వంటి ముడుపులు చెల్లిస్తుంటారు సాయంత్రంలో స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటే ఆ సమయంలో అభిషేకం చేస్తారు. పసుపు అభిషేకం చేసిన తర్వాత స్వామి కన్నులు, ముక్కు, నోరు, తుడుస్తారు. అప్పుడు స్వామి వారి సౌందర్యం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, ఆ అపురూప సౌందర్యం వర్ణించడానికి మాటలు చాలవు. 60అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ వుంటుంది.పండుగలు, ఉత్సవాలు ఈ ఆలయం స్వామిమలై సమీపంలో ఉండటంవలన, కుంబకోణం టౌన్షిప్ కు పెద్ద సంఖ్యలో యాత్రికులు వొస్తున్నారు. అనేక ప్రసిద్ధ పండుగలు స్వామిమలై లో జరుగుతాయి. వాటిలో ఆలయ రథోత్సవం ఏప్రిల్ నెలలో మరియు స్కంద షష్టి పండుగ అక్టోబర్ లో మరియు విసాకం పండుగ మే నెలలో మరియు పండుని ఉత్తిరం పండుగ మార్చ్ నెలలో జరుగుతాయి.


స్వామిమలై ఎలా చేరుకోవాలి ?


రోడ్డు లేదా బస్సు మార్గం :

ట్రిచీ, కుంభకోణం, చెన్నై, మధురై, తంజావూర్ వంటి పట్టణాల నుండి స్వామిమలై కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుపుతుంటారు. రైలు మార్గం : స్వామిమలై కు 8 km ల దూరంలో కుంభకోణం రైల్వే స్టాట్యూన్ కలదు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని ప్రధాన పట్టణాల నుండి కూడా రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ బయట ఆటో రిక్షాల సదుపాయం కలదు.

వాయు మార్గం : 85 km ల దూరంలో ట్రిచి విమానాశ్రయం కలదు. ట్రిచీ నుండి టాక్సీ లేదా క్యాబ్ లలో స్వామిమలై చేరుకోవచ్చు.🙏

Share:

అళగర్‌ కోవిల్‌ - దక్షిణ తిరుపతి.





* అళగర్‌ కోవిల్‌ - దక్షిణ తిరుపతి..


మధురైకి వెళ్లినవారు అక్కడి మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని, ఆ రూపాన్ని మదిలో నింపుకొని తిరుగుముఖం పడతారు. కొద్దిమంది భక్తులు మాత్రం అక్కడికి కాస్త దగ్గరలో ఉన్న అళగర్‌ కోవిల్‌ ఆలయాన్ని చూడకుండా వెనుతిరగరు. అళగర్‌ కోవిల్ అంటే మాటలా! రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది.


మధురైకి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ, ఓ కొండ పక్కన ఉన్న ఆలయమే అళగర్‌ కోవిల్‌. ఇందులోని మూలమూర్తి పేరు తిరుమాళ్. ఆయన చాలా అందంగా ఉంటాడు. కాబట్టి అళగర్‌ (అందమైనవాడు) అన్న పేరుతో పిలుస్తారు. తమిళ సాహిత్యంలో అడుగడుగా ఈ ఆలయం ప్రత్యేకత కనిపిస్తుంది. తమిళ ప్రాచీన గ్రంథం శిలప్పదికారంలో సైతం ఈ ఆలయ వర్ణన వినిపిస్తుంది. ఇక ఆళ్వారులు కూడా ఈ స్వామిని పొగుడుతూ వందకు పైనే పాశరాలు రాసినట్లు తెలుస్తోంది. వైష్ణవ దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాలలలో ఈ క్షేత్రమూ ఒకటి. ఇక్కడి స్వామి రూపం చేతనో, అడుగడుగునా అలరించే ప్రకృతి కారణంగానో.... ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతిగా భావిస్తుంటారు.


అళగర్‌ కోవిల్‌ వెనుక చరిత్ర ఏమిటన్న విషయం మీద పెద్దగా స్పష్టత లేదు. కానీ మధురలోని మీనాక్షి అమ్మవారికి ఈ స్వామిని సోదరునిగా భావిస్తారు. మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో, ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం తరలివెళ్తుంది. ఈ అళగర్‌ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం. మహాభారతకాలంలో ధర్మరాజు, అర్జునులు సైతం ఈయనని దర్శించారని అంటారు. ఇక దక్షిణాది రాజుల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. కృష్ణదేవరాయలు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకు అందరూ ఈ స్వామిని సేవించినవారే.


అళగర్‌ స్వామి మహత్తును నిరూపించేందుకు అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. పాండ్యరాజులలో రెండవవాడైన మలయధ్వజ పాండ్యరాజుకి ఈ స్వామి ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లు చెబుతారు. రామానుజాచార్యుడి ముఖ్యశిష్యుడైన కరుదాళ్వార్‌కు ఈ స్వామి మహిమతోనే కంటిచూపు తిరిగి వచ్చిందట. ఈ ఆలయం పక్కనే కనిపించే కొండ సాక్షాత్తు ఆ నందీశ్వరుని అవతారం అని భక్తుల నమ్మకం.


అళగర్‌ కోవిల్ దగ్గరకి చేరుకోగానే మనం వేరే ప్రపంచానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయం నమ్ముకుని వందల ఏళ్లుగా జీవిస్తున్న గ్రామవాసులు కనిపిస్తారు. ఆలయం చుట్టూ శిధిలమైన కోటగోడలు, దీని రాచరికాన్ని గుర్తుచేస్తాయి. 180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం ఈ ఆలయపు వైభవాన్ని గుర్తుచేస్తాయి. సుందరపాండ్యన్‌ అనే రాజు 13వ శతాబ్దంలో విమానం గోపురం మీద పోయించిన బంగారపు పోత సూర్యకాంతికి మెరిసిపోతుంటుంది.


అళగర్‌ కోవిల్‌ ఆలయం వెలుపల ఉండే కరుప్పుస్వామి సన్నిధి గురించి కూడా చెప్పుకొని తీరాల్సిందే! అళగర్‌ కోవిల్‌లోని ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. ఈ విగ్రహాన్ని దొంగిలించేందుకు ఓసారి 18 మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారట. అలాంటి దాడికి సిద్ధంగా ఉన్న ఆలయ పూజారులు ప్రతిదాడి చేశారు. ఆ పోరులో 18 మంది దొంగలూ మట్టికరిచారు. ఆ సమయంలో వారికి ‘కరుప్పుస్వామి’ అనే కావలి దేవత కనిపించి, ఇక మీదట తాను ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తుంటానని మాట ఇచ్చాడట.


అళగర్‌ కోవిల్‌ వెలుపల ఉన్న కరుప్పుస్వామి సన్నిధి చాలా శక్తిమంతమైనదని చెబుతారు. సామాన్య భక్తులు ఈ స్వామి ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరని అంటారు. అందుకే ఏడాదిలో ఒక్కసారే ఈ ఆలయం తలుపులు తీస్తారు. విచిత్రంగా అలా తలుపులు తీసే సమయంలో పక్షులు, కీటకాలతో సహా చుట్టూ ఉండే అడవులన్నీ ప్రశాంతంగా మారిపోతాయట. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కపోతుందని చెబుతారు.


అళగిరి కోవిల్‌లో తిరుమాళ్‌ స్వామివారితో పాటుగా వారి సతీమణ ‘సుందరవల్లి తాయార్‌’ ఆలయం కూడా చూడవచ్చు. వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ఈమెకు ‘కళ్యాణవల్లి తాయార్‌’ అన్న పేరు కూడా ఉంది. వీటితో పాటుగా నరసింహస్వామి, చక్రత్తాళ్వార్, వినాయకు, ఆండాళ్ దేవతల విగ్రహాలూ దర్శనమిస్తాయి. ఇక ఆలయంలో రథమండపం, కళ్యాణ మండపం, వసంత మండపం, అలంకార మండపం... ఇలా అనేక కట్టడాలు అద్భుతమైన శిల్పాలతో ఆకట్టుకుంటాయి.


అళగిరి ఆలయం సమీపంలోనే నూపుర గంగ అనే తీర్థం ఉంది. విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తినప్పుడు, స్వయంగా ఆ బ్రహ్మదేవుడే ఆయనకు పాదపూజ చేశాడట. ఆ సమయంలో ఆయన పాదాల మీద ఉన్న ఆభరణాలని (నూపురం) తాకిన కొంత నీరు ఇక్కడ పడిందనీ.... అదే ఈనాటి నూపుర గంగ అనీ చెబుతారు. ఆ గంగలోని నీరు తాగితే సర్వరోగాలు హరించిపోతాయని భావిస్తారు.


అళగిరి కోవిల్‌ను దర్శించుకున్న భక్తులు ఇక్కడికి సమీపంలోనే ఉన్న ‘పళమూడిర్చోళై’ అనే ఆలయానికి తప్పక వెళ్తారు. కుమారస్వామికి ఉన్న ఆరు ప్రముఖ ఆలయాలలో ఈ ‘పళమూడిర్చోళై’ ఒకటి. ఇక్కడ వల్లీదేవసేన సమేతంగా ఉన్న కుమారస్వామిని దర్శించుకుని తిరిగి మధురైకు చేరుకుంటారు.

 

Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List