రామాయణం – ఒక శకున శాస్త్రం. ~ దైవదర్శనం

రామాయణం – ఒక శకున శాస్త్రం.

రామాయణాన్ని పరి పరి విధాల చదువగా పరి పరి విలువైన విషయాలు నేర్పుతుంది. ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా, మానవీయ సంబంధాల కోణంలో, లేక ధర్మాన్ని పట్టుకోవడానికో లేక అధర్మం ఎలా వుంటుందో, లౌల్యం ఎంత పని చేస్తుందో ఇలా ఎన్నో విధాలుగా పరిశీలిస్తే మరెన్నో విలువైన రత్నాల్లాంటి విషయాలను బోధపరుస్తుంది. రామాయణంలో మరొక కోణం 3-4 భాగాలుగా అందించదలచాను. ఆపై శ్రీరాముని దయ. రామాయణంలో కొన్ని ప్రత్యేక ఘట్టాలలో కొన్ని విషయాలు ముందుగా తెలిపేలా కొన్ని శకునాలగురించి చర్చించబడుతుంది. ఆ శకునం యొక్క విశిష్టత వివరింపబడుతూ ఉంటుంది. వాటిలో బాలకాండ, అయోధ్యాకాండలలో ఉన్న శకునాల వివరణ :

1. వివాహమహోత్సవాలు జరిగిన పిమ్మట దశరధుడు రామ,లక్ష్మణ భారత, శత్రుఘ్నులతో కూడి తమ కులగురువైన వశిష్టునితో అయోధ్యకు తిరుగు ప్రయాణం అవ్వగా వారికి దారిలో పక్షులు భయంకరమైన శబ్దములతో ఎగురుతూ ఉండగా భూమిపై సంచరించు మ్రుగములన్నీ ప్రదక్షిణంగా తిరగడం కనిపించి తొట్రుపాటుకు గురై వశిష్టుని ఇది ఏమిటని అడుగగా ఆయన పక్షుల అరుపులు అశుభములను, మృగముల ప్రదక్షిణము శుభాసూచికముగా ఉన్నదని, వస్తున్న అశుభము తొలగి చివరకు ఉపశమనం దొరుకుతుందని ఊరడిస్తాడు. అనుకున్నట్టే పరశురామునితో వాగ్వాదం, చివరకు రాముడు ఆయనలోని వైష్ణవీశక్తిని లాగుకుని ప్రశాంతత ఒనకూర్చడం జరుగుతుంది

2. శ్రీరాముని పట్టాభిషేకం గురించి సభలో ప్రస్తావించేముందు దశరధుడు తనకు ఆకాశమునందు అంతరిక్షమునందు, భూమిపైనా జరుగుతున్న ఉత్పాతములను వివరించి, తనకు కలలో భయంకరమైన అపశకునములు కనబడుతున్నాయని, పిడుగులతో కూడిన ఉల్కలు పగటిపూటే నేల రాలుచున్నాయని, తాను ముసలివాడైనాడని రాముని పట్టిభిషేకానికి నిర్ణయం ప్రకటిస్తాడు. అనుకున్నట్టే శ్రీరామ పట్టాభిషేక నిలుపుదల, అటుపై దశరధుని శరీర త్యాగం జరుగుతుంది.

3. తన మేనమామ గారింట ఉన్న భరతునికి ఒకరోజు హఠాత్తుగా మిక్కిలి చింతాగ్రస్తుడై తనకు వచ్చిన కలను వివరిస్తాడు. కలలో అతడికి తన తండ్రి మలినమైన శరీరంతో, చెదరిన జుట్టుతో పర్వత శిఖరమునుండి కలుషితమైన గోమయంతో కూడిన ప్రదేశంలో పడడం చూశానని, ఆయన పెడలో కప్పలా ఈదుతూ, దోసిలితో నూనె త్రాగుచూ, నువ్వుల అన్నము తింటూ, శరీరం అంతా నూనెతో తలక్రిందులుగా వేలాడి నూనెలో మునకలు వేస్తున్నట్టు, నీరు ఇంకిపోయిన సముద్రము, ఆకాశాముపైనుండి భూమిపై పడుతున్న చంద్రుడు, భాద్రగజము ముక్కలై ఉండడము,  దశరధుడు నల్లని వస్త్రాలు ధరించి ఇనుపపీట పై కూర్చుని యెర్రని దండలతో మైపూలతో ఒప్పుచు, గాడిదలు పూన్చిన రధముపై దక్షిణాభిముఖంగా పయనిస్తున్నాడని, దీన్ని బట్టి ఆయనకో, రామునికో, తనకో మరణం తధ్యం అని చెబుతాడు. అప్పటికే దశరధుడు మరణించి ఎనిమిది రోజులయి  అతడిని తీసుకురావడానికి అయోధ్యనుండి సైనికులు వస్తారు.

4. భరతుడు అయోధ్యకు సమీపించగా అతడికి చెట్లు కళావిహీనంగా కనబడడం, తెల్లని గోడలు  వెలవెలబోయి కనబడడం, శుకపికాలు సవ్వడి చెయ్యకుండా నిర్లిప్తంగా కనబడడం చూసి కలవరపాటుకు గురై కీడును శంకిస్తాడు.

మరిన్ని శకునాలు మున్ముందు భాగాలలో చర్చిస్తాను. కానీ కొంత విశ్లేషణ మనకోసం: అసలు ఈ శకునాలను నమ్మాలా వద్దా? ఈ శకునాలను చూపించి భయపెడుతున్నారా? ఏమిటి ఈ తమాషా అని ఆలోచిస్తే మానవుడు సంఘజీవి. తాను ప్రకృతితో సహా దేవుని సృష్టిలో భాగమే. అతడు ధర్మం తప్పక పాటిస్తే అన్నింటినుండీ సంకేతాలు అందుతాయి. అతడిని పరికిస్తాయి, పలకరిస్తాయి. పశుపక్షాదులే కాదు, చెట్లు, పుట్టలు, గిరులు, లతలు అతడికి ఏవో చెబుతాయి. వాటిని అర్ధం చేసుకునే శక్తి నశించో, లేక ప్రకృతి నియమాలకు దూరమయో మనం ఆ విషయాలను అర్ధం చేసుకోవడం లేదు. నేటికి వర్షం వచ్చే ముందు తూనీగలు తిరగడం, ఎక్కడైనా ఉత్పాతం జరిగే ముందు కుక్కలు ఏడవడం, పక్షులు భయంకరంగా అరవడం, ఎవరికో మీకు దగ్గర వారికి ఏదో అవ్వబోతే కలల్లో కనబడడం ఇతరత్రాలు నేటికీ జరుగుతాయి. పూర్తిగా దైన్యావస్తలోకి జారిపోక, జరిగేది జరగకమానదని నమ్మి, వాటికి సంబంధించిన శాంతులు, హోమాలు చేయించుకుని లాభపడ్డవారు కోకొల్లలు. గుడ్లగూబ ఇంట్లో చేరితే ఒక శాంతి, మరొకటి జరిగితే మరొక దానం ఇతరత్రా నీకోసం చెప్పబడ్డాయి. నమ్మావా లాభపడతావు, హేళన చేసావా జరిగేది అనుభవించడమే. కొన్నింటి మీద నీకు హక్కు ఉండదు, కేవలం జరగబోయేది గమనించడమే. కనీసం మనసు దిటువు చేసుకుని కాగల కార్యక్రమానికి సిద్ధం అవుతావు. ఆ జంతువులకు పని పాట లేక ఎప్పుడూ రానివి నీ ఇంటికి వచ్చో, నీ ఎదురుగా ఏదో విన్యాసమో చెయ్యవలసిన అవసరం ఏమిటి అని గుర్తేరుగు. ఈ శకునాల శాంతి వల్ల నీ చే మరొక ప్రాణికి సహాయం చెయ్యబడుతోంది తప్ప వాటిని తప్పు పట్టి హేళన చేసి వారిని ఎద్దేవా చెయ్యడం వలన మరింత పాపం మూటకట్టుకున్టున్నావు. తస్మాత్ జాగ్రత్త... అలాగని ప్రతీ విషయానికి భయపడి సాధించేది లేదు. నీకు నమ్మకమున్న పురోహితుని సంప్రదించు, నమ్మితే శాంతులు చేయించు, లేదా దానం చెయ్యి. నమ్మకం కొండలను సైతం కదిలిస్తుంది. దేవుడు తలచుకుంటే ఏదైనా తీసేయ్యగలడు. ముందు హెచ్చరిస్తాడు, విని ప్రయత్నం చేస్తే కనీసం నీ ప్రయత్నం నువ్వు చేస్తావు...ఆయనను నమ్ముకుని ముందుకు సాగు. అధైర్యపడకు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List