తామ్రపర్ణి పుష్కరాలు. ~ దైవదర్శనం

తామ్రపర్ణి పుష్కరాలు.

'తామ్రపర్ణి' ... అంటే 'రాగి ఆకు' అని అర్థం .
ఈ నదిలోని ఇసుక ... నీరు రాగి రంగులో ఉంటాయి .
నదీ తీరంలో రాగి రంగు ఆకులు గల వృక్షాలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి .
ఈ కారణంగానే ఈ నదికి 'తామ్రపర్ణి' అనే పేరు వచ్చినట్టు చెబుతారు .
విశిష్ట గుణాలు కలిగిన శంఖాలను ...
అరుదైన ముత్యాలను అందించడం ఈ నది ప్రత్యేకత .

రాగి రంగులో అందంగా కనిపిస్తూ ఆహ్లాదపరిచే ఈ నది, అగస్త్య పర్వతంలో పుట్టి తమిళనాడు - తిరునల్వేలి
జిల్లా మీదుగా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది .
 కైలాస పర్వతంపై శివపార్వతుల కల్యాణం జరిగిన తరువాత, అగస్త్యుడు దక్షిణ భారత దేశ యాత్రలకు బయలుదేరాడు .
ఆ సమయంలో తనకి లభించిన 'పద్మమాల'కు స్త్రీ రూపాన్ని ప్రసాదించి,
'తామ్రపర్ణి' పేరుతో జీవనదిగా ప్రవహిస్తూ జీవుల దాహార్తిని తీర్చమని చెప్పాడు .
దాంతో తామ్రపర్ణి అగస్త్యుడిని అనుసరిస్తూ వుండగా, ఆయన ఆ నదీ తీరం వెంట అనేక పుణ్య తీర్థాలను స్థాపిస్తూ వెళ్లాడు .
అలా ఆయన ఇటు దేవతలు ... అటు మానవులు స్నానమాచరించదగిన 118 పుణ్య తీర్థాలను స్థాపించినట్టు స్థల పురాణం చెబుతోంది .

తామ్రపర్ణి అనేక ప్రవాహాలను తనలో కలుపుకుంటూ అంబ సముద్రానికి కొంత దూరంలోని కొండలపై నుంచి దూకుతుంది .
ఈ జలధారలతో ఏర్పడినదే 'పాపనాశ తీర్థం'.
ఈ జలాలతో స్నానం చేసిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి .
ఈ నదీ తీరంలో కొలువుదీరిన శివ కేశవ క్షేత్రాలను విశేష సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు .
ఈ నది పవిత్రతను గురించి ...
దీనిలో స్నానమాడటం వలన కలిగే పుణ్య ఫలాల గురించిన ప్రస్తావన పురాణాలలో కనిపిస్తుంది .

తామ్రపర్ణి నదికి పుష్కరాలైతే భీమా నదికి అని చెప్పారు..
ఏ నదికి ఈ సారి పుష్కరాలు..💐
పుష్కరమంటే 12ఏళ్ళు .
ప్రతి 12ఏళ్ళకు ఒక నదికి పుష్కరం వస్తుంది .
మనకు 12రాశులున్నాయి .
ఆయా రాశులలో బృహస్పతి సంచరించే కాలంలో ఒక్కో నదికి పుష్కరాన్ని బ్రహ్మ దేవుడు అనుగ్రహించాడు .

బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించిన తొలి 12రోజులు ఒక్కో నదికి పుష్కరమొస్తుంది .
ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తే పుణ్యప్రదం అని నమ్మకం .

ఈ సంవత్సరం భీమా నదికి పుష్కరమని పంచాంగాలలో వ్రాశారు . 
భీమానది మహారాష్ట్రలోని భీమశంకర్ నుంచి కర్నాటక మీదుగా తెలంగాణ వరకు వచ్చి కృష్ణలో కలసిపోతుంది .
ఈ నదికే పుష్కరమని నిర్ణయించేసారు..
కానీ భీమానది కి అసలు పుష్కరమే లేదు .
పుష్కర నిర్ణయం మూలశ్లోకం చూడండి .

"శ్లొ//మేషే గంగా వృషే రేవా మిథునేతు సరస్వతీ
కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మ్రతా
కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ ధటకే స్మ్రతా
వృశ్చికే తామ్రపర్ణీచ చాపే పుష్కర వాహినీ
మకరే తుంగభద్రాచ కుంభే సింధునదీ స్మ్రతా
మీనే ప్రణీతా నదీచ గురోస్సంక్రమణే స్మ్రతా
పుష్కరాఖ్యౌ మునీనాంహి బుధై స్మ్రతా ....."

ఇదీ మూల శ్లోకం .
దీన్ని బట్టి చూస్తే ఈజాబితాలో"భీమానది"లేదు .
తామ్రపర్ణి మాత్రమే ఉంది .
ఈ తామ్రపర్ణి నది ఒకప్పుడు శివునికి రథంగా ఉండడం చేత దీనికి "భీమరథి"అనే పేరు ఉంది .
అంతే కానీ ఇది భీమానది మాత్రం కాదు .

ఈ తామ్రపర్ణి నది తమిళనాడు లోని తిరునల్వేలి ,
తూత్తుకూడి జిల్లాల్లో ప్రవహిస్తుంది .
శాస్త్రప్రకారం 'బాణతీర్థం'లో పుష్కర స్నానం చేయాలి .
బాణతీర్థం దగ్గరలోని రైల్వేస్టేషన్'అంబాసముద్రం'.

కాబట్టి దయచేసి అందరూ గమనించండి .
మనం పుష్కర స్నానం చేయవలసింది తామ్రపర్ణి నదిలో!!!!
అంతే కానీ 'భీమానది'లో కాదు .
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List