విభూతియోగము. ~ దైవదర్శనం

విభూతియోగము.



అ||  భగవానుడు అనాదియని యెఱుంగువాడు భక్తితో నాతని నారాధించి సర్వపాప విముక్తుడగునని వచించుచున్నారు -

యో మామజమనాదిం చ
వేత్తి లోకమహేశ్వరమ్ |
అసమ్మూఢస్స మర్త్యేషు
సర్వపాపైః ప్రముచ్యతే ||

తా:- ఎవడు నన్ను పుట్టుకలేనివానిగను, అనాదిరూపునిగను, సమస్తలోకములకును నియామకునిగను తెలిసికొనుచున్నాడో, ఆతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వపాపములనుండి లెస్సగ విడువబడుచున్నాడు.

వ్యాఖ్య:- సమస్తప్రాణికోట్లయందును మానవుడు గొప్పవాడు. ఆ మానవులందును అజ్ఞానములేనివాడే గొప్పవాడు. భగవత్తత్త్వమును చక్కగనెఱుగువాడే గొప్పవాడు. అట్టి భగవత్తత్త్వ విజ్ఞానముచే నాతని పాపములన్నియు తొలగిపోవుచున్నవి - అని యిచట చెప్పబడినది. ప్రపంచములోని సమస్త పదార్థములు పుట్టుక కలవి. ఆది కలవి. కావున జీవులు దేనినాశ్రయించవలెను? నశించువస్తువునా? ఆద్యంతరహితమగు శాశ్వతపదార్థమునా?
 ప్రపంచములో శాశ్వతవస్తువు ఒక్కపరమాత్మ తప్ప అన్యమేదియులేదు. ఆతడు దేశకాలాతీతుడు, సర్వలోకమహేశ్వరుడు, జగన్నియంత , మాయను ఆడించువాడు.

తక్కినవారు మాయాధీనులు. ఇవ్విధముగ భగవత్తత్త్వమునుగూర్చిన వివేకముచే ఆతని యెడల భక్తియుదయింప, ఆతనినే ఆశ్రయించి తద్ద్వారా జీవుడు అనవరత ధ్యానాదులచే భగవత్సాక్షాత్కారము, బంధవిముక్తి, సర్వపాపవిముక్తి బడయగలుగుచున్నాడు. కావున భగవంతుని యథార్థస్వరూపము నెఱుంగుట జీవుల కత్యావశ్యకమైనది.

   ఇట్లు దైవతత్త్వమెఱుంగువాడు అసత్యమును వీడి (దృశ్యముయెడల విరక్తిగలిగి) సత్యము నాశ్రయించినందువలన, అంధకారమును వదలి ప్రకాశమును జేబట్టినందువలన, మనుష్యులలోకెల్ల నాతడే మూఢత్వము (అజ్ఞానము) పోయినవాడై, సర్వశ్రేష్ఠుడై చెన్నొందును. మనుజుడు ఎంత బలవంతుడైనను, ధనవంతుడైనను, అంతమాత్రముచేత ఆతడు మానవులలో గొప్పవాడుకాడు. ఏలయనిన ఆతడింకను మాయకు లోబడియేయున్నాడు.

మాయకు లోబడియున్నవాడు ఎంత గొప్పవాడైనను అల్పుడేయగును; మూఢుడేయగును. భగవత్తత్వమెఱింగి ఆ మూఢత్వమును బోగొట్టుకొనువాడే మానవులలో శ్రేష్ఠుడు - అని భగవానుడు ‘అసమ్మూఢః స మర్త్యేషు’ అను వాక్యముద్వారా స్పష్టపఱచిరి. భగవంతుని దృష్టియందు జనులలో ఎవరు గొప్పవారో యిచట తేలిపోయినది. పరమాత్మయొక్క నిజస్వభావమును అనగా ఆతడు జన్మరహితుడని, అనాదిస్వరూపుడని ఎఱుంగువాడే మనుజులలో గొప్పవాడు - అని గీతాచార్యు లిచట పేర్కొనిరి. కాబట్టి తక్కిన ప్రాపంచికయోగ్యత లున్నను , లేకున్నను దైవతత్త్వవిజ్ఞానము మాత్రము తప్పక కలిగియుండవలెనని దీనిద్వారా స్పష్టమగుచున్నది.

   మఱియు జీవులు అనేక జన్మార్జితములైన పాపసంచయముతో గూడియున్నారు. వారి యా పాపములన్నియు నెట్లు నశించును?
ఏ యుపాయముచే నవి తొలగిపోగలవు?
ఆ యుపాయమును ఈ శ్లోకమున భగవానుడు చెప్పివైచిరి. ఎంతటి గొప్ప కట్టెలసమూహమైనను ఒక నిప్పురవ్వచే భస్మీభూతమగునట్లు, ఎంతటి పాపసంచయమైనను జ్ఞానాగ్నిచే, భగవత్తత్వవివేకవహ్నిచే  దగ్ధమైపోవును. (సర్వ పాపైః ప్రముచ్యతే). కావున దైవతత్త్వమును తప్పక నెరుగవలెను.దేవుడు అనాదియని, జన్మరహితుడని యెరుగవలెను. దానిచే భక్తియేర్పడును. భక్తిచే (దృశ్యమందు విరక్తి గలిగి) దైవమును ధ్యానింపదొడగును. దానిచే పాపవిముక్తి, బంధరాహిత్యము, మోక్షప్రాప్తి సిద్ధించును. ఈ ప్రకారము దైవవిజ్ఞానము మోక్షమునకు దారితీయుచున్నది.
       
ప్ర:- మనుజులందరిలో ఎవడు వివేకవంతుడు?గొప్పవాడు?
ఉ:- భగవంతుని
(1)జన్మరహితునిగను,
(2)అనాదిరూపునిగను,
(3)సర్వలోకమహేశ్వరునిగను ఎఱుంగువాడు. 
ప్ర:- కావున మనుజులలో శ్రేష్ఠత్వమును బడయవలెననిన అనుసరించవలసిన పద్ధతి ఏమి?
ఉ:- భగవంతునియొక్క స్వరూపమును యథార్థముగ తెలిసికొనుటయే.
ప్ర:- సమస్తపాపములనుండి విడివడుటకు ఉపాయమేమి?
ఉ:- భగవత్తత్త్వము నెఱుంగుటయే (అత డనాదియని జన్మరహితుడని - ఈ ప్రకారముగ నెఱుంగుట. దానిచే భక్తి, భక్తిచే ధ్యానము, ధ్యానముచే భగవత్సాక్షాత్కారము, దానిచే సర్వపాపరాహిత్యము, బంధవిముక్తి సిద్ధించుచున్నవి).
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List