జ్ఞానము - యోగము ~ దైవదర్శనం

జ్ఞానము - యోగము

జ్ఞానము(knowledge)వివిధ విషయాల గురించి చెపుతుంది. విషయాలగురించి తెలుసుకోవడం అనుభవంఅవదు. దాన్నికేవలం అనుభవించ వలసినదే(practical).సైన్సుపుస్తకములో విషయాలని చదువుతాము. దానివల్ల విషయాలు తెలుస్తాయి గాని పూర్తిగా బోధపడవు. పూర్తిగా అర్థమవ్వాలంటే ఆప్రయోగం చెయ్యాల్సిందే. అలాగే, విషయాన్ని తెలుసుకోకుండా ఉత్తిప్రయోగం చేస్తే కూడా విషయం పూర్తిగాఅర్థమవదు. కాబట్టి మొదట విషయాన్ని తెలుసుకొని, దాన్ని ప్రయోగంచేసి, ఆఅనుభవం ద్వారా విషయాన్ని పూర్తిగా అర్థం చేసు కోవాలి. జ్ఞానము, యోగము విషయంలోకూడా సరిగ్గా అంతే. జ్ఞానముద్వారా తెలుసుకొన్నవిషయాలని, యోగముద్వారా అనుభవించి పూర్తిగాతెలుసు కోవాలి. కొంతమంది జ్ఞానము ఒక్కటేచాలు అనియోగాన్ని వద్దని నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది యోగంఒక్కటే ఆచరిస్తేచాలు, ఇంకేమి అక్కరలేదు అనుకొంటారు. కేవలజ్ఞానం వల్ల అనుభవంరాదు. కేవలం యోగం ఒక్కటే చేసినందువల్ల, దానివల్ల మనం పొందిన దేమిటో అర్థంకాదు. కాబట్టి జ్ఞానాన్ని, యోగాన్ని రెండింటినీ సమన్వయం చేసుకొని ఆఅనుభవం ద్వారా మనలను పక్వానికితెచ్చుకోవాలి. ఇక్కడ మనం ఇంకొకఉదాహరణ చెప్పుకోకతప్పదు. మామిడికాయను చూడండి. అది ఆకుపచ్చగా, గట్టిగా, పులుపుగా వుంటుంది. మామిడిపండైతే, పసుపురంగుతో, కాయ కన్నా కొద్దిగామెత్తగా, ఒకరకమైన సువాసనతో, తీపిగా వుంటుంది. ఈగుణాలన్నీ స్వభావ సిద్ధంగా పండిన పండుకు వుంటాయి. అదే కార్బైడ్ వేసి పండిస్తే, కాయ పసుపురంగులోకి మారుతుంది కాని, ఆపండుకు వాసన, తీపిరుచి వుండవు. తేడా అర్థమయ్యింది కదా! జ్ఞానంతో పక్వానికి వచ్చిన మనస్సు, యోగమనే ప్రక్రియతో, అనుభవమనే రంగు, రుచి, వాసన పొంది పక్వానికివస్తుంది. ఈ రెండిటిలో ఏది లేకపోయినా, ఏది తక్కువైనా, సరిగ్గాపండదు. ఆంటే సరియైన జ్ఞానంతో, తగినటువంటి అనుభవం పొందితేనేగాని, పరబ్రహ్మతత్త్వము అర్థమవ్వదు. కాబట్టి మనకు పరబ్రహ్మతత్త్వము పూర్తిగా అర్ధమవ్వాలంటే జ్ఞానము, యోగము రెండూ కావలసిందే. ఏ ఒక్కటి తనంత తానుగా మోక్షము వైపు మనలను తీసుకొనిపోజాలదు. కాబట్టి ఈవిషయమై, సనాతనులు, ద్రష్టలు, జ్ఞానులు ఏమిచెప్పారో తెలుసుకోందాము. మొదట జ్ఞానానికి యోగానికి గల సంబంధం గురించి తెలుసుకొని, ఆతర్వాత యోగం గురించి తెలుసు కొందాము.

యోగశిఖోపనిషత్:  (శంకరుడు బ్రహ్మతో చెప్పుచున్నాడు):

         పరమపదమైన మోక్షమునకు కొందరు జ్ఞానము కారణమందురు. కాని అది కేవలము సిద్ధినియ్య జాలదు. యోగములేని జ్ఞానము మోక్షము నెట్లిచ్చునయ్యా? యోగముకూడా జ్ఞానము లేకుండా మోక్షము నీయజాలదు. కావున మోక్షముకోరువాడు జ్ఞానమును, యోగమును దృఢముగా అభ్యసింప వలెను. యోగముకొరకే సాధనమైన జ్ఞానముయొక్క స్వరూపమేదో ముందు తెలియవలెను. అజ్ఞానమననేమి? అనికూడా ముముక్షువు తెలిసికోనవలెను. (చూశారా జ్ఞానము యోగము కొరకు ఒక సాధనమని చెప్పారు. జ్ఞానాన్ని బాగా తెలుసుకోమన్నారు. అంతకు ముందు అజ్ఞానాన్నికూడా తెలుసుకోమన్నారు. కాబట్టి మనం ఇంతకు ముందు అదే వరుసలో, మొదట అజ్ఞానంగురించి, తర్వాత జ్ఞానంగురించి తెలుసుకొన్నాము. మోక్షము కోసం జ్ఞానము మరియు యోగము యొక్క ఆవశ్యకత గురించి, ఆతర్వాత యోగం గురించి తెలుసుకుంటున్నాము.) దానితో పరమపదమైన కైవల్యము యొక్క నిజరూపము తెలియును. సర్వదోషములతో చుట్టుకొనబడిన జీవుడు ఆకామక్రోధాది దోషముచే వినిర్ముక్తుడు, జ్ఞానముచే నెట్లగును? (ఇక్కడ అరిషడ్వర్గముచే చుట్టుకొనబడిన జీవుడు జ్ఞానముచే ఎలా విడిపింప బడతాడు? అని అడుగుచున్నారు. దానికి జవాబు కూడ ఇస్తున్నారు.) స్వాత్మరూపము వలె జ్ఞానమునూ పూర్ణమైనది. వ్యాపకమైనదియును. కామక్రోధాది దోషములకు నిజముగా స్వరూపమున బేధము లేదు. దానికి విధి ఏమి? తర్వాత దాని నిషేధమేమి? ఎట్లగును? అనగా, వివేకి ఎప్పుడునూ ముక్తుడే! సంసారభ్రమనుండి తప్పుకున్నవాడే! అది పరిపూర్ణమైనది. సత్యమైనది. పూర్ణము కనుక సకలము, నిష్కళమునదే. కలిచే స్ఫూర్తి పొందినదగుటచే, సంసారభ్రమలలో తిరుగుచున్నది. నిష్కళము, నిర్మలము, సాక్షాత్తు సకలము, ఆకాశమువంటిది. ఉత్పత్తి, స్థితి, సంహారముల యొక్క స్ఫూర్తిజ్ఞానము లేనిది. అట్టిది ఈరూపము పొందినదై ఎట్లు మోహసాగరమున పడుచున్నది? విద్యను వదిలి మాటిమాటికి సంసారమున పడుచున్నది. సంసారులెట్లు సుఖదుఃఖాది మొహములందుందురో, అట్లే జ్ఞాని వాసనావాసితుడై యుండును. వారిద్దరికినీ విశేషములేదు. సంసారభావన ఇద్దరికిని సమమే. ఇట్టి జ్ఞానము తెలియబడినచో, అజ్ఞానమెట్లుండును? జ్ఞాననిష్టుడు, ధర్మజ్ఞుడు, విజితేంద్రియుడు, విరక్తుడునైననూ, దేహముండగా మోక్షము పొందలేడు. దేహధారులు అపక్వులు, పరిపక్వులు అని రెండు విధములు. యోగహీనులు అపక్వులు. యోగము కలవారు పరిపక్వులు.

       యోగాగ్నిచే సర్వదేహము శోకవర్జితమై అజడమగును. దేహము పార్ధివము, జడము, అపక్వము, దుఃఖమిచ్చునది యని తెలియవలెను. ధ్యానస్థుడైననూ అతడు ఇంద్రియములచే స్వాధీనుడగును.  ఆ ఇంద్రియములను గట్టిగా నియమించిననూ, నిగ్రహించిననూ, ఇతరమైనవాటిచే బాధపడును. శీతో ష్ణములు, సుఖదుఃఖాదులు, మానసవ్యాధులు, ఇంకా ఇతరములైన నానావిధజీవములు, శస్త్రములు, అస్త్రములు, జలము, గాలి వీటన్నిటిచేతను, శరీరము బాధింపబడును. దానితో మనస్సు క్షోభ చెందును. అట్లే ప్రాణాపాయ సమయమున వాయువు క్షోభచెందును. అంతట అనేక దుఃఖములతో వ్యాప్తమై చిత్తము క్షోభపడును.(ఇక్కడ మనకు ధ్యానానికి, యోగానికి ఎన్నిరకాల అడ్డంకులు వస్తాయో అన్నీచెప్పారు.)

దేహావసానసమయమున దేహి దేనిని భావించునో ఆయారూపుడే జీవుడగును. (పూర్వము జడభరతుడనే ముని దేహావసాన సమయములో ఒక లేడిని చూడగా, ఆతర్వాత ఆలేడి కడుపునే జన్మించవలసి వచ్చిందట. దీని గురించి "పరమహంస సచ్చిదానందులవారు", విశదీకరిస్తూ "జీవబ్రహ్మైక్య రాజయోగ సారామృతము" అనే గ్రందములో  ఒక ప్రకరణము పెట్టారు. వీలయితే ఒకసారి చదవండి.) ఆ రీతిగా జన్మకారణమున్నది. దేహాంతమున ఆజన్మఎమైనది? దానిని మానవులెరుగరు. కావున జ్ఞానము వైరాగ్యము జీవునకు కేవలము శ్రమయే(యోగములేనప్పుడు) దేహమునంటుకొన్న చీమ ఏదో అలోచించుచూ శరీరమునుండి జారిపడునట్లు తేళ్ళచేదష్టుడై ఈజీవుడు సుఖపడడే, దేహాంతమున ఎట్లుసుఖపడును? కావున మిథ్యాతర్కముచే నిండినవారై ఎరుగరు. ఎవనికైనా అహం కార మెపుడు నశించునో అతనికప్పుడే దేహము కూడా నశించును. కారణము లేకుండా కార్యమెప్పుడూ ఉండదుకదా! అట్లే అహంకారము లేకుండా దేహమందు దుఃఖమెట్లుండును? జనులందరూ దేహముచే జయింపబడినారు. కాని యోగులచే శరీరము జయింపబడినది. కనుక సుఖదుఃఖాది ఫలము వారికెట్లు కలుగును? ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, కామక్రోదాధికమును జయింపబడినవి. వానిచే సర్వము సంహరింపబడినవి. యోగాగ్నిచే మెల్లగా సప్తదాతుయుక్తమైన దేహము దగ్ధమైనది. మనోబలముగల యోగదేహము దేవతలచేత గుర్తింపబడదు (అందువల్లే దేవతలు యోగులను చూసి ఈర్ష్యపడతారు).

    బేధ బంధములు కలది, నానాశక్తి ధరమునైనది పరాత్మదేహము ఆకాశమువలె నుండును. ఆకాశము కన్ననూ నిర్మలము, సూక్ష్మము కన్నసూక్ష్మము, దృశ్యముకన్నా స్థూలము, జడముకన్నా జడము. [ఇక్కడ యోగమార్గము(astral-travel)లో ప్రయాణించు యోగియొక్క ఆత్మ ధరించు, తత్సంబంధ యానకమైన, దేహముగురించి చెప్పినారు.] ఇచ్ఛారూపుడైనవాడు యోగీంద్రుడు. స్వతంత్రుడు, అజరామరుడును, ముల్లోకములందునూ ఎక్కడోనొకచోట క్రీడించుచుండును. అచింత్యశక్తిగల యోగి నానారూపములను ధరించును. విజితేంద్రియుడై స్వేచ్ఛగా వాటిని ఉపసంహరించుకోగలడు. (దీనికి 'ఒక యోగి ఆత్మకధ'లో దృష్టాంతరాలు లభిస్తాయి. శ్రీ పరమహంస యోగానందగారికి, ఒకేసారి రెండు శరీరాలు ధరించే శక్తిగల ఒక యోగి తారసపడతారు. అలాగే మహావతార్ శ్రీబాబాజీగారు, ఒకానొక సందర్భంలో "నేను అప్పటికప్పుడు అక్కడవుండే అణువులను సంయోగపరచి నాకు కావలసిన దేహమును దరించగలను, మరలా ఆశరీరాన్ని అణువులుగా విభజించగలను" అని వివరిస్తారు.)

యోగబలముచే యితడు మరణముబొందడు. యితడు హరునిచే మృతుడు గనుక మృతునికి మరల మరణమెట్లుండును? (ఈ వాక్యము మహావతార్ శ్రీబాబాజీ, శ్రీత్రిలింగస్వామి లాటివారికి సరిపోతుంది.)  అందరికినీ ఎక్కడ మరణమో, అక్కడనతడు జీవించును. మూఢుడెక్కడ జీవించియుండునో, అక్కడతడు మృతుడైయుండును. అతనికి కర్తవ్యమేమియు లేదు. చేసిన దోషవర్జితుడై యుండును. విరక్తులైన కొందరు జ్ఞానులు దేహముచే జయింపబడినారు. మాంసపుముద్దలుగా కల్పితమైన దేహముకల వీరు యోగులతో తుల్యులెట్లు కాగలరు? (జ్ఞానము కలిగి కూడా యోగాభ్యాసము లేని వారి సంగతి ఇక్కడ చెప్పబడినది). (యోగాభ్యాసము లేని) జ్ఞానులచే, దేహాంతమున పుణ్యము వలననూ, పాపమువలననూ ఫలము పొందబడుచున్నది. ఇటువంటి వాడైనవాడు ఆయా కర్మఫలముల ననుభవించి, మరల జ్ఞాని యెట్లుకాగలడు? (యోగాభ్యాసము వలన పక్వముకాని జ్ఞాని, పాప పుణ్యముల ఫలముల ననుభవించుటకుగాను తిరిగి తిరిగి జన్మలెత్త వలసి వచ్చును. అప్పుడు ఇంకనూ పాపపుణ్యములు చేసినచో, ఆ ఫలితములనుభవించుటకే జన్మలు సరిపోవును గాని, మరల జ్ఞానము ఎలా పొందును?) తరువాత పుణ్యముచే సిద్ధునితో(సద్గురువుతో) సాంగత్యము లభించును. అప్పుడు సిద్ధునియెక్క దయచే యోగియగును, లేనిదేకాడు. అంతట సంసారమునశించును. లేనిదేకాదు. (ఒక్కసారి యోగభంగము కలిగితే, మరల యోగికావడము ఎంతదుస్తరమో తెలియజేశారు.) యోగములేకుండా జ్ఞానము మోక్షమునీయదు. అనేకజన్మల జ్ఞానముచే యోగము లభించును. యోగము వలన ఒక్కజన్మలోనే (పరబ్రహ్మ విషయకమైన) జ్ఞానము కలగును.


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List