అశాంతికి మూలం.! ~ దైవదర్శనం

అశాంతికి మూలం.!

ప్రతీ ఆలోచనా ఓ కేంద్రకం నుండి జనిస్తుంది.  అస్పష్టపు బాల్యదశ నుండి ఆలోచనలు బలం పుంజుకునే  క్రమంలో వాటి సరళి సక్రమంగా సాగకపోతే.. చివరకు ఆలోచనల్లో లభించే స్పష్టతలోనూ డొల్లతనమే మిగులుతుంది.  మన ఆలోచనలకు ప్రేరకాలు.. సంఘటనలు, మనుషులూ, సరిగ్గానో, తప్పుగానో మనం బేరీజు వేసుకోగలిగామనుకునే  మనస్థత్వాలూ! ఆలోచన ఏ కేంద్రకం వద్ద మొదలైందో.. ఆ స్థితిలో మన మనఃస్థితి సవ్యంగా లేకపోతే సంఘటలనూ జీర్ణించుకోలేం, మనుషులనూ అర్థం చేసుకోలేం,పరిస్థితులూ మన నియంత్రణలో లేనట్లు కన్పిస్తాయి,  మనం తప్ప మిగిలిన మనస్థత్వాలన్నీ లోపభూయిష్టమైనవిగా గోచరిస్తాయి. ప్రశాంతంగా ఉన్న మనస్సుల్లో ఓ  వ్యర్థపు ఆలోచన జనిస్తే అది సృష్టించే అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఏ కేంద్రకం నుండి ఆ ఆలోచన ఉద్భవించిందో దాన్ని దాటిపోయి అశాంతిలో లేనిపోని చిక్కుముడులన్నింటినీ  ప్రోది చేసుకునే  దిశగా అది విధ్వంసపరుస్తూ పోతుంది. మనకు తెలియకుండా ఏదో అన్యాయం మనకు జరిగిపోతోందనే భ్రమా, సాటి మనిషి మనదైన దాన్ని మనకు కాకుండా చేసేస్తున్నాడన్న అభద్రతాభావం, ఎదుటి వ్యక్తి నిట్టనిలువున ఎదుగుతుంటే మిన్నకుండలేక కనబరిచే దుగ్ధా.. ఇవి చాలు మనల్ని అధఃపాతాళానికి చేర్చడానికి!  పరిస్థితులనూ, మనుషులనూ సరిగ్గా అర్థం చేసుకోపోవడం వల్లనే ఈ మానసిక వైకల్యాలు మనకు తెలియకుండానే అంటుకుపోతాయి. 

చిన్న ఉదాహరణ చెబుతాను. నేను రాసే ఈ పదాలన్నీ చదివేటప్పుడు గతంలో నాపై నిర్మించుకున్న మీ అసమగ్ర అభిప్రాయాలు  అవి మంచివైనా, చెడ్డవైనా నా రాతల్ని మీ మనసుకు చేరకుండా ఒడపోస్తుంటే నా రాతల సారం బదులు నాపై అకారణమైన అభిమానమో, అకారణమైన ద్వేషమో నాటుకుపోతుంది.  ఈ అక్షరాల్ని మనసుకి తీసుకోవడం ఒక్కటే వాస్తవానికి తక్షణావసరం మీకైనా నాకైనా! కానీ మొదటి వాక్యంలోనే నా రాతలోని ప్రతీ మాటనూ, గతంలో ఏదో సందర్భంలో, ఏదో కోణంలో నేను వ్యక్తపరిచిన ధోరణినీ, ఆ ధోరణి కనబరచడం వల్ల నాపై ఆ క్షణం నుండి మీరు ఏర్పరుచుకున్న అభిప్రాయాలతో పోల్చి చూసుకుంటూ "శ్రీధర్ ఇలా కదా.. ఇలా కాదు గదా.." వంటి అసమగ్ర విశ్లేషణలతో బుర్రని నింపుకుంటే ఫలితమేమిటి?

మనం చాలామందిమి మనుషుల్ని మనసుతో స్పృశించము. పరిచయమైన మొదటి క్షణం నుండే అపనమ్మకంతోనూ, మంచో, చెడో ఓ వ్యక్తి పట్ల ఏదో ఒక అభిప్రాయాన్ని  నిర్మించేసుకుని "నేను నిన్ను ఇలా చూస్తున్నానుగా.. నీ పట్ల నాకున్న అభిప్రాయాన్ని నువ్వేమీ తీసేయలేవుగా" అన్న వెక్కిరింపు ధోరణిలో నూ చూస్తుంటాం. అందుకే ఇప్పటి మన ఆలోచనలకు ప్రాతిపదిక దాదాపు యావత్ సమాజం పట్లా అసమగ్ర విశ్లేషణలతో మనం ఏర్పరుచుకునే కుక్కమూతి పిందెల లాంటి అభిప్రాయాలే తప్ప.. ఈ క్షణం మీలో మంచి ఉన్నా నేను స్వీకరించప్రయత్నించను, నాలో మంచి ఉన్నా మీరూ స్వీకరించరు. ఇలా మన ఆలోచనల కేంద్రకం స్పష్టత లేనిదైనప్పుడు, మనం హృదయాలనేమి గెలవగలం? ఒక మనిషినీ, పరిస్థితినీ ఆపాదమస్తకం తడిమిచూడకుండానే ముడుచుకుపోతున్నామంటే ఎంత ఇరుకైన ప్రపంచంలో జీవిస్తున్నామో కదా! మన వాదనాపటిమతో మన ఆలోచనల్లో డొల్లతనమున్నా వాదించి గెలుస్తూ ఆనందిస్తున్నామంటే.. మనం గెలుస్తున్నట్లా.. మనిషిగా ఓడిపోతున్నట్లా?
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List