పంచలింగాల కోన.. ~ దైవదర్శనం

పంచలింగాల కోన..

* మహా మహిమాన్వితమైన అద్భుత క్షేత్రం పంచలింగాల కోన..
* సప్త అధొలోకాలు కనిపించే పంచలింగాల కోన..
* సహజమైన జలధారలతో అనునిత్యం అభిషేకించబడుతూన్న శివలింగాలు.
* మాల్యావంత పర్వత కొండ గుహల్లో మరేన్నోరహస్యలు..
* శేషాచల అడవుల్లో అరుదైన అందాలు, సాహస యాత్రలు..
.
https://www.facebook.com/media/set/?set=a.10213169330020665.1073741867.1617578507&type=1&l=e5b4a0ff71
.
అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!
.
శేషాచల దట్టమైన అటవీ ప్రాంతం పరుచుకున్న పచ్చదనం.. గలగలపారే సెలయేరు.. నింగికి నిచ్చెన వేసినట్లున్న కొండలు.. కనువిందు చేసే కమనీయ దృశ్యాలు.. జంతువుల ఘీంకారాలు.. మేను పులకరించే ప్రకృతి అందాలు.. ఆస్వాదించడానికి ఈ ప్రకృతి సౌందర్యం.. ఇది అందరికీ ఓ ఆనంద వరం.. వికసించి విరబూసే రంగురంగుల పుష్పాలు.. ఆలపిస్తూ, ఆకృతినిచ్చే అందమైన జలపాతాలు.. ఆనంద గీతికతో, సు-వర్ణ గతితో పరవశింపజేసే పక్షుల గానాలు.. ప్రకృతినే మురిపించే పచ్చని చెట్లు.. శేషచల అడవి సౌందర్యం, మదిలో ఓ ఆనందం... శేషాచల అడవుల్లో ఉన్న పంచలింగాల కోన భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలకు స్వర్గధామం. కొండలు, కోనలు, రాళ్లు రప్పలు దాటుకుని.. పంచలింగాల క్షేత్రం సందర్శించడం నిజంగా థ్రిల్లింగే.
.
చుట్టూ విశాలమైన అడవి.. ఎత్తైన చెట్లు.. ప్రకృతి అందాలు... వన్యప్రాణులు.. ఇది దట్టమైన పోమశిల మల్లెంకొండలో కొలువుతీరిన పంచాలింగాలు. లోతైన లోయలో కొలువుదీరిన శివలింగాలను దర్శించుకోవడానికి .. కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! నడవటం కష్టంగా అనిపించే దారిలో సాగే ఆ యాత్ర నిజంగా ఓ సాహసం.. సౌందర్యం..! ఈ శివాలయం ఎదరుగా దాదాపు మూడువందల అడుగుల ఎత్తు రాతికొండ నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని చెట్ల మధ్య, చల్లటి వాతావరణం లో ప్రకృతి అందాలు తిలకిస్తూ ఎత్తైన కొండలు ఎక్కుతూ, దిగుతూ.. జరిగే ఈ యాత్ర ఆద్యాత్మికత కన్నా సాహసం చేయాలన్న కుతూహలం తోనే.. పంచలింగాల కోనకు వెళ్లాం..
.
ఇందులో నాలుగు కిలోమీటర్లు లోయలోకి దిగాలి. ఒకే ఒక మనిషి నడిచేంత బాటతో కూడిన లోయ అడుగు భాగానికి చేరుకోవడం నిజంగా సాహసమే.! అందుకే ఈ యాత్రను అమర్‌నాథ్‌ యాత్రతో పోలుస్తుంటారు మరి. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే రవాణా సౌకర్యాలు లేవు 9 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్లాసిందే. ఈ అడవిలో క్రూరమృగాల సంఖ్య కూడా ఎక్కువే. వాటి బారిన పడకుండా ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి జంతువులను పారదోలడానికి అందరూ ఒక్కసారిగా దేవుడిని స్మరిస్తూ గట్టిగా అరుస్తు ముందుకు సాగాలి. అధ్బుత సుందర రమణీయ దృశ్యాల మధ్య ఉన్న జలపాతాల అందాలు భక్తులను కనువిందు చేస్తుంటాయి.. ఈ అందాలను తనివితీరా చూసి తరించాలంటే మాల్యావంతపర్వతం పై పరమశివుడు ఐదులింగాలుగా వేలసిన మరో అద్భుతమైన ఆలయం దర్శించాల్సిందే..
.
అంతే కాకుండా శేషాచల అడవులు అరుదైన జంతుజాలానికి నిలయం. ఇప్పటికే వందల రకాల ఔషధ మొక్కలు, వృక్షాలు, జంతువులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే 32 రకాల పాము జాతులు వెలుగులోకి వచ్చాయి. మరో ఆరు కొత్త రకం పాములు ఉన్నట్లు కనుగొన్నారు. శేషాచల అడవుల్లో పరిశోధనలు చేసి అనేక జంతు జాతులను గుర్తించారు. అందులో 2011సంవత్సరం నుంచి ఇప్పటివరకు 214 రకాల పక్షులు, 36 రకాల జంతువులు, 38 రకాల పాములు, 13రకాల కప్పలు, 96రకాల సీతాకోక చిలుకలు వెలుగులోకి వచ్చాయి.
.
నెల్లూరు జిల్లా, అనంతసాగరం మండలం, సోమశిల గ్రామం, సోమశిల ఆనకట్ట ఆనుకొని ఉన్న మాల్యవంతపర్వతం (మల్లెంకొండ) లో "పంచలింగాలకోన" అనే ఆధ్యాత్మిక కేంద్రం ఉంది. ఇక్కడ పరమశివుడు ఐదులింగాలుగా కొలువైనాడు కనుక ఇది పంచలింగాలకోనగా ప్రాచుర్యంపొందింది.
.
లోతైన కొండల్లో లోయలో వెలిసిన పంచలింగాల మహిమాన్విత క్షేత్రం..
ఎతైన కొండ, లోయల మధ్యన పూర్వం నుంచి ఇక్కడ శివుడు పూజలు అందుకుంటున్నాడు. మొదటి నుంచి స్థానికులే ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 35 దశాబ్దాల నుంచి పంచలింగాలకు భక్తులు హాజరవుతున్నారు. ఇక్కడ శివుడు పెద్ద కొండ కింద కేవలం పది ఐదు అడుగు స్థలంలో వెలిశాడు. అనంతమైన ఆధ్యాత్మిక సంపదను ... చెరిగిపోని చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న పుణ్య క్షేత్రం కొండలు ... గుహలు ... జలపాతాలతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ ప్రదేశాన్ని చూడగానే, ఇది మహిమాన్వితమైన క్షేత్రమనే విషయం అర్థమైపోతుంది. సహజమైన జలధారలతో అనునిత్యం అభిషేకించబడుతూ, ఇక్కడ శివుడు పూజలు అందుకుంటున్నాడు. అంతే కాకుండా అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము సప్త అధొలోకాలు పంచలింగాల యాత్రలో చూడవచ్చు.
.
మల్లెంకొండలో పంచలింగాలకు కార్తీకమాసంలో భక్తులు వస్తున్నాం శివయ్య.. పోయివస్తాం శివయ్య అంటూ భక్తిపారవశ్యంతో ముందుకు సాగుతారు. ఈ యాత్ర చేయాలంటే ఓ సహాయం చేసినట్లే. కొండలు, గుట్టలు దాటుతూ ఈ క్షేత్రానికి చేరుకోవాలి. కీకారణ్యం మార్గంలో కాలినడకన చేరుకున్న భక్తులకు సుమారు 300 అడుగులపై నుంచి జారే జలపాతం యాత్రికులను ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం ఎక్కడ నుంచి పారుతుండడంతో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అన్ని కాలాల్లో ఈ నీరు జాలువారుతూనే ఉంటుంది. పంచలింగాల వద్ద జాలువారిన జలపాతం రెండు కొండల మధ్యన సహజసిద్ధంగా ఎప్పడింది, లోయలో ఉండే ఈ ఆలయం చూడటానికి లింగాకారలంలో ఉంటుంది. ఈ లోయలోని పంచలింగాలకు నడిచేపటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

.
సోమశిల నుండి పంచలింగాలకు చేరుకోడానికి 9 కిలొమీటర్ల దూరం నడవాలి. కొండ క్రింది భాగాన ఒక శివలింగ కలదు అక్కడ పూజలు నిర్వహించాలి. అక్కడ నుండి రెండు పొడవైన ఎత్తైన రెండు దట్టమైన అడవి లోయలోనుంచి నడవాలి. దాదాపు 950 మీటర్లు ఎత్తుగల ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలదార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున వున్న గుట్టపైన కిలో మీటరు దూరమ్ నడవాలి. ఇక్కడ మరోక శివలింగం కలదు స్వామికి పూజలు నిర్వహించాల. ఇక గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టాల మధ్య లోయ లోనికి దిగాల ఆ దారిలొ ఎన్నే గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. ఆలయం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం. జలపాతం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే. లోయలోనికి చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్చంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి వున్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. తరువాత క్రింద గుహలోనే ప్రధాన దైవమైన పంచలింగాల స్వామి శివలింగం వున్నది. స్థానిక ప్రజలే ఇక్కడ పూజారులు. అంతే కాకుండా జలపాతం అడుగు భాగాన ఒక శివలింగం, గుండంలో ఒక శివలింగం, ప్రక్క గుహలో శివలింగ వున్నవి.
.
పంచలింగాల ఆలయ చరిత్ర:...
పూర్వం ఇంద్రసభలో దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు కొలువు దీరారు. ఈ సభకు దేవర్షి ఐన వశిష్ఠుడు విచ్చేశాడు. వశిష్ఠుడి రాకను గమనించిన సభలోని అందరూ గౌరవంగా ప్రణమిల్లారు. "మాల్యవంతుడు" అనే గంధర్వుడు పరధ్యానంలో మహర్షి రాకను గమనించకపోగా ఆయనకు నమస్కరించలేదట. దీనికి కోపితుడైన మహర్షి " భూలోకంలో పర్వతాకృతిలో పడివుండు" అని శపించాడట. తప్పు తెలుసుకొన్న గంధర్వుడు తన శాపవిముక్తికి మార్గం శూచించమని శివుణ్ణి వేడుకొన్నాడట. మహర్షి శాపానికి తిరుగులేదని "పర్వతాకృతిలో వున్నా నీ వెన్నంటి వుంటాను" అని గంధర్వుడికి అభయమిచ్చాడట. శివుని రాక కోసం గంధర్వుడు భూలోకంలో మాల్యవంతపర్వాకృతిలో ఎదురుచూస్తూ ఉన్నాడట.
.
ఈ పర్వత ప్రాంతంలో యజ్ఞయాగాదులు చేసుకొంటున్న కొందరు మునిపుంగవులను "సూకరాసురుడు" (పంది ఆకారం కలిగినవాడు) అనే రాక్షసుడు వేధిస్తూ, యజ్ఞాలను ధ్వంసం చేశేవాడట. ఈ అసురుడి బారినుండి కాపాడమని మునులు శివున్ని వేడుకొన్నారట. మునుల మొరాలకించిన శివుడు వేటగాడి రూపంలో వచ్చి సూకరాసురున్ని వెంబడించాడట. శివుని బారినుండి తప్పించుకొనే ప్రయత్నంలో పర్వతంలోని ఓ కోన ప్రాంతానికి చేరుకొన్న రాక్షసుడు కొండదూకి పారిపోయే ప్రయత్నం చేశాడట. దీంతో శివుడు తన త్రిశూలం ప్రయోగించగా ఆ రాక్షసుడి పొట్ట లోనుంచి ఐదు శివలింగాలు చెల్లాచెదురుగా పడ్డాయట. ఇలా శివభక్తుడైన రాక్షసుడికి మోక్షం ప్రసాదించిన శివుడు, గంధర్వునికి ఇచ్చిన మాట ప్రకారం లింగాకారంలో ఇక్కడ వెలిశాడట. కాలక్రమంలో ఆ మాల్యవంతపర్వతమే " మల్లెంకొండగా పిలువబడుతోంది. ఈ పంచలింగాల కోనలో మునులు, సప్త ఋషులు ప్రతి నిత్యం శివలింగాలకు పూజలు నిర్వహిస్తుంటారని, అంతేకాకుండా ప్రతి రోజు తెల్లవారు జూమున ఈ జలపాతం క్రింద దేవ కన్యలు స్నానమాచరించి శివలింగాలకు పూజలు నిర్వహిస్తుంటారని, కిన్నరులు దేవతలలో ఒక తెగవారని. వీరి శరీరము మనుషుల వలె, ముఖము అశ్వము వలె ఉండునని. వీరు పులస్త్యుని పుత్రులని. వీరు ఒక విధమైన దేవ కన్యలని పురాణగాధల ద్వార మనకు తెలుస్తుంది.
.

ప్రతి సంవత్సరము కార్తీకమాసంలో భక్తులు ఈ కోనకు తరలివచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్యలో కొలువు దీరిన శ్రీ పంచలింగాల ఆలయం ఈ కోండకు ప్రత్యేక ఆకర్షణ.. జీవితంలో ఒక్క సారి దర్శించిన చాలు జన్మ ధన్యం అనుకుంటారు భక్తులు. మల్లెంకొండ అడవుల్లో అందచందాలు చూస్తే మంత్రముగ్ధులవ్వాల్సిందే... ఎత్తైన కొండలు, లోయలు... చిన్న చిన్న కాలువ‌లు... వాటి నడుమ సవ్వడులు చేస్తూ... జల జల పారుతున్నచిన్న సెలఏర్లు... భారీ ఎత్తున హోరు చేస్తూ... చాల‌ ఎత్తు నుంచి జాలు వారు తున్న జలపాతాల నడుమ ఉన్న గుహల్లో ... వందల ఏళ్ల క్రితం నల్లమల్ల అడవుల్లో పంచలింగాల స్వామి కొలువైవుండడం... ఒక అధ్భతం... ప్రకృతి ప్రేమికులకు ఇదో చక్కని ప్రదేశం. చాలా ప్రయాసతో కూడిన కోన ప్రయాణాన్ని ఇక్కడికొచ్చే యాత్రికుల భక్తిప్రపత్తులే సుగమం చేస్తుంటాయి. ఇక్కడ వున్న ఏటవాలు జలపాతం ఎంతో అహ్లాదాన్ని కలిగిస్తుంది...అక్కడక్కడ ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఎతైన వృక్షాలు ఇలా ఎన్నో సుందర దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటాయి. అందుకే పరమశివుని సందర్శించటానికి ఇష్టపడుతుంటారు.
.
రచన..
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి .
Don't Copy-Paste This Story
All Copyright Reserved 2017
RB. VENKATA REDDY
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List