కాలి నడకన అధ్భుతమైన యాత్ర... ~ దైవదర్శనం

కాలి నడకన అధ్భుతమైన యాత్ర...


నల్లమల అరణ్యమార్గంలో కాలి నడకన అధ్భుతమైన యాత్ర...
కీకారణ్యంలో గుళ్ళు, గోపురాలు, జలపాతాలలు
నల్లమల అందాలు చూసి తీరాల్సిందే..!!
.
.
ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం.
.
ఆహ్లాదాన్ని... ఆనందాన్ని... పంచే సుందర ప్రదేశాలు... జాలువారే జలపాతాలు... మరచిపోలేని మదురానుభూతులను పంచే ప్రకృతి అందాలు... సుందర ప్రదేశాలు... వన్యప్రాణులతో అలరారే అభయారణ్యాలు... గత చరిత్రను తెలియజెప్పే చారిత్రక కట్టడాలు... నేటి పోటీ ప్రపంచంలో యాంత్రిక జీవనం సాగిస్తూ విశ్రాంతి లేకుండా జీవనం సాగిస్తున్న వారికి మానసిక ప్రశాంతతను కలిగించేందుకు సహజ ప్రకృతి అందాలు స్వాగతం పలుకుతున్నాయి.
.
కాసంత ఆకుపచ్చగా కనిపిస్తే చాలు అప్పటి వరకు పని ఒత్తిడితో బరువుగా ఉన్న మనసు.. మస్తిష్కం కాస్త కుదుటపడుతుంది. అదే ప్రకృతి సౌందర్యం పరుచుకున్నట్టుగా కనిపిస్తే ఇంకేముందు గువ్వలా ఎగిరి గుట్టపై వాలాలనిపిస్తుంది. ఇలాంటి ప్రకృతి అందానికి ఒక్కసారి చూస్తే చాలు ఏడాదికి సరిపడంతా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
.
నల్లమల అడవులు ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతి పరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఈ దట్టమైన అడవిలో గుళ్ళు, గోపురాలు, జలపాతాలకు లెక్కలేదు. రోడ్డు ప్రక్కన ఉన్న ప్రదేశాలకు వెళ్ళవచ్చేమో ... కానీ అడవుల్లో దాగి ఉన్న కొన్ని ప్రదేశాలకు వెళ్లడం అంత సులభం కాదు . అయితే సాహసం చేసి వెళ్లేవారున్నారు.
.
నల్లమల కొండల సరాసరి ఎత్తు 520 మీ. వీటిలో 923 మీ. ఎత్తుతో బైరానీ కొండ మరియు 903 మీ. ఎత్తుతో గుండ్ల బ్రహ్మేశ్వరం కొండ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ అడవుల్లో పులులు అధిక సంఖ్యలో ఉండటం వలన ఈ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు. దట్టమైన ఈ నల్లమల అడవులు.. మధ్యలో జలపాతాల పరవళ్లు.. తీరప్రాంతాల్లో ప్రాచీన ఆలయాలు.. ప్రకృతి అందాలు, పక్షుల కిలకిలరావాలు, రాతికొండల కనువిందులు.. చూసి తీరాల్సిందే.
.
ఎటు చూసినా పచ్చగా పెరుగుతున్న చెట్లు .. చెట్లపై పక్షుల కిలకిలరావాలు.. ఎత్తైన కొండలు .. వాటిపై నుంచి జాలువారే జలపాతాలు.. కొండల మధ్య వొంపులు తిరిగిన సేలయేరు అందాలు.. గుంపులు గుంపులుగా కనిపించే అడవి జంతువులతో ప్రకృతి రమణీయ దృశ్యాలను దాచుకున్నప్రాంతంగా నల్లమల్ల అడవులను చెప్పు కోవచ్చు.
భారతదేశంలోని హిమాలయాల తర్వాత దక్షిణ భారతీయులు అతి పవిత్రంగా భావించే కొండలు నల్లమల కొండలు. నల్లమల అడవులు అంటేనే రమణీయ ప్రకృతి దృశ్యాలకు నిలయమని చెబుతుంటారు.
.
కడప జిల్లాలోని కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రం నుండి కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం ఎగువ శ్రీ అహోబిలం నరసింహ స్వామీ ఆలయం వరకు కాలినడకన సాగే ఈ ప్రాయాణంలో ముందుగా కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రం దేవాలయం వస్తుంది. దట్టమైన నల్లమల అభయారణ్యం ప్రాయాణం సాగిస్తే 6.5 కిలోమీటర్లు వెళ్తే గరుడాద్రి పురాతన ఈ దేవాలయం ఉంది. కొండ చ‌రియ‌ల‌తో చూడ ముచ్చ‌ట‌గా ఉండే ఈ ప్రాంతంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మొక్క‌ల‌, భారీ వృక్షాలు ఉంటాయి. క‌నుక స్వ‌చ్ఛ‌మైన గాలితోపాటు, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం కూడా దొరుకుతుంది. ఇది ఎత్తైన కొండల మధ్య ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి జలపాతాలు వేసవిలో సైతం పారుతుంటాయి. దీంతో ఇక్కడి నీటిని తాగి సాధువులు, వన్యమృగాలు, భక్తులు దాహం తీర్చుకుంటుంటారు. ఇదేదారిలో పాండవుల గుండాలు మనకు కనబడుతాయి. తర్వాత 8 కిలోమీటర్ల దూరంలో పాములేటి నరసింహ స్వామీ ఆలయంకు దారి ఉంటుంది. దట్టమైన వృక్షజాలం, చిన్న చిన్న సెలయేళ్లు.. దాహం తీర్చుకునేందుకు స్వచ్ఛమైన నీటిగుంటలు..ఒక్కటేమిటి ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగుతుంది...
.
కాలినడకన లోయలోకి దిగాల్సి ఉంటుంది. అడవి ప్రాంతం నుండి వచ్చే నీరు ఈ లోయలో పడుతుంది. అన్ని కాలాల్లోనూ పారే ఈ నీరే చెంచులు, వన్యమృగాలకు ఆధారం. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. నడవడానికి ఏలాంటి పట్టూ ఉండదు. అంతా రాళ్లు, చెట్లు, నీటి ధారలు పడుతుండడం వల్ల జారుతూ ఉంటుంది కనుక జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాల ఎత్తు నుండి నీరు ఉధృతంగా కిందకు దూకుతూ చూడడానికి మనోహరంగా ఉంటుంది. ఇక్కడి కొద్ది దూరం ప్రయాణిస్తే మరో జలపాతం కనిపిస్తుంది. ఎండాకాలంలో అంతగా నీరు లేకపోయినా వర్షాకాలంలో జలఉధృతి తీవ్రంగా ఉంటుంది. ఈ ఆలయం అడవి మధ్యన ఉండడం వల్ల ఇక్కడ ఏలాంటి సదుపాయాలూ ఉండవు.
.
ఇక్క‌డి ప‌ర్వ‌తాలు, జ‌ల‌పాతాలు ప‌ర్యాట‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి. ప‌చ్చ‌ని ప్ర‌కృతి క‌ళ్ల‌కు సాక్షాత్క‌రిస్తుంది. ఆస్వాదించే మనసు ఉండాలే కానీ మన చుట్టు ఎన్నో అందాలు...ప్రకృతి లోని అందాలని చూస్తూ పులకరించి పరవశించొచ్చు.. కాలినడకన 2 కిలో మీటర్లు నడిచి లోయలోకి దిగాలి. శంఖాకారంలో ఉన్న లోయలో ఒక చివర ఎత్తైన కొండపై నుండి పడే జలధార ఎంతో ఆకట్టుకుంటుంది. నల్లమల అడవిలో వింతైన దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న జలధారలు, విశాలమైన లోయలు అపురూపంగా చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిని అందమైన చిత్రంగా కనిపిస్తాయి. వర్షాకాలంలో ఇక్కడి అందాలు పచ్చదనంతో రెట్టింపు అవుతాయి.
.
అతి దట్టమైన భయంకరమైన అడవి కాబట్టి చిరుత, తోడేళ్లు, పులులకు ఆవాసం ఈ అటవీ ప్రాంతం. ఇటువంటి భయంకరమైన అడవిలో ఓ సామాన్యమానవుడు సంచరించడం దుర్లభం. నీల్‌గాయ్‌లు, సాంబార్‌లు, కొండగొర్రెలు,ఎలుగు బంట్లు, చిరుజల్లులు కురిసే వేళ నాట్య మయూరిని ఇక్కడ చూడవచ్చు. దుప్పులు, జింకలు గుంపులు గుంపులుగా కనువిందుచేస్తాయి. ఇక్కడ గంగ దరికి శివలింగమే తరలివచ్చిందో లేక శివలింగం దరికి గంగే ఉరికి వచ్చిందో తెలియదుగాని.. ఇక్కడో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
.
కడప జిల్లాలోని కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రం నుండి కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం ఎగువ శ్రీ అహోబిలం నరసింహ స్వామీ ఆలయానికి దట్టమైన నల్లమల అభయారణ్యం గుండా కాలినడకన సుమారు 28 కిలోమీటర్ల యాత్ర సాగి. జ్యోతి క్షేత్రం నుండి కాలినడకన గరుడాద్రి, కాశినాయన త్రిలింగ పిఠం, పాండవుల గుండాలు, బ్రహ్మ,విష్ణు, రుద్ర గుండాలు, కోనేర్ల, అంజనాద్రి, నల్లమల జలపాతాలు, పాములేటి నరసింహ స్వామీ ఆలయం, ఎగువ శ్రీ అహోబిలం నరసింహ స్వామీ ఆలయాలను దర్శంచుకొని తిరుగు ప్రయాణం కాలినడకన కాశినాయన జ్యోతి క్షేత్రానికి చేరుకోని జ్యోతి క్షేత్రం లోని శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన దర్శనంతో యాత్ర ముగిసింది.
.
అరుదైన సంపద :....
ఔషధ మొక్కలు : మారేడు, నేరేడు, ఉసిరి, కరక్కాయ, కుంకుడుకాయ, అశ్వగంధ, పిల్లితీగలు, నేలవాము, నేల ఉసిరి, గన్నేరు గడ్డలు.
అరుదైన వృక్షాలు : శ్రీగంధం, జిట్రేగి, తెల్లమద్ది, సండ్ర
కలపజాతి వృక్షాలు : టేకు, మామిడి, సుబాబుల్‌, మద్ది, వేప, ఎగిస, బండారు, చిరంజి, తపసి, నల్లమద్ది.
ఇతర రకాల వృక్షాలు : రావి, మర్రి, చింత, కానుగ, రేల, బూదగ, ముల్లెంజాతి వెదురు.
జంతువులు : పులులు, అడవి పందులు, దుప్పి, ఎలుగుబంటి, అడవి కుందేలు, నక్కలు, నీలగాయ్‌, సాంబ, చుక్కల జింక, మౌస్‌డీర్‌, కొండ గొర్రె మొదలైన జింకలు, అడవి పిల్లులు, రాచ ఉడతలు, 80 జాతులకు పైగా పక్షులు.
Share:

1 comment:

  1. ఏఏ రోజుల్లో ఎక్కువగా భక్తులు వెళుతూ ఉంటారు కనీసం ఎంత మంది ఉంటే వెళ్ళి రావచ్చు

    ReplyDelete

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List