అదృష్టం.. అద్భుతం.. జీవితం ~ దైవదర్శనం

అదృష్టం.. అద్భుతం.. జీవితం

మనం తరచూ వినే పదాలు అదృష్టం, అద్భుతం. ‘‘జీవితంలో ఏది కావాలన్నా అదృష్టం ఉండాలి. ఏదో ఒక అద్భుతం జరగాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. సుఖసంతోషాలతో అలరారుతుంది’’ అని కొందరు అనుకుంటారు. ఇంకొందరు ఈ రెండింటినీ అస్సలు నమ్మరు. ‘నమ్మాలా? వద్దా?’ అని సంశయించే వాళ్లు మరికొందరు. అసలు అదృష్టం అంటే ఏమిటి? ‘‘నైవ దృష్టమిత:పూర్వం తదదృష్టమితీర్యతే’’ అని పురాణవాక్యం. అంటే ఇంతకు మునుపు ఎప్పుడూ చూడబడనిది అదృష్టమని అర్థం. దీన్నే పూర్వమీమాంసా కారుడు జైమిని మహర్షి అపూర్వం అని చెప్పారు. మనం ఏపని చేసినా దానికి ఒక ఫలితం విత్తనంలో చెట్టులాగా అంతర్గతంగా ఉంటుంది. ఆ ఫలితం సరైన సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. లోకానికి కనబడుతుంది. ఆ ఫలితమే అపూర్వం. ఒక వ్యక్తి తను ఎన్నో ఏళ్లుగా సాధించలేనిదాన్ని సాధించడం కోసం తాను మునుపెన్నడూ చేయనంత కఠోర పరిశ్రమను చేయవచ్చు. అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చు. ఆ విజయానికి ఆ వ్యక్తి ఆ ఫలితప్రాప్తికి ప్రస్తుత కఠోరపరిశ్రమతోపాటు.. దానికి సంబంధించి అతని గతానుభవం, కృషి కూడా కారణమే. ఇవి కంటికి కనబడేవి కావు. కనుక వాటికే అదృష్టమని పేరు. అదృష్టం అయిదురకాలుగా అనుభవంలోకి వస్తుంది.

కాల: కర్మ చ విత్తం చ విద్యా దైవమేవ చ
ఏతే పంచ విశేషాస్తు భవన్త్యదృష్ట హేతవ:

అనుకూలమైన కాలం, చేసే పనులు, చేత ఉన్న ధనం, అలవడిన విద్య, దైవం ఇవి వ్యక్తి యొక్క అదృష్టానికి కారణాలట. ఇక్కడ దైవ శబ్దానికి రెండు అర్థాలున్నాయి. ‘పూర్వజన్మకృతం కర్మ దైవమిత్యభిధీయతే’ అని చెప్పిన విధంగా మానవుల మునుపటి కర్మఫలమే దైవమట. ఇక రెండవ అర్థం శివ, కేశవాదులే దైవమని. అలాగే అదృష్టాన్ని నిర్ణయించేవి మరొక మూడు ఉన్నాయి. మునుపు చేసిన కర్మ, ఉపాసన, దేవతానుగ్రహం అని స్త్రపురాణాదులన్నీచెబుతున్న విషయం. ఇలా మన ఇప్పటి సాఫల్యానికి కారణం మనం మునుపు చేసిన కర్మల మొత్తం ఫలమైన అదృష్టమైతే.. ఇప్పటి సాఫల్యం ఒక అద్భుతం. ఈ అదృష్ట, అద్భుతాల కలయికే మనిషి జీవితం. కనుక ప్రతి వ్యక్తీ జీవితసాఫల్యం కోసం కర్మను (తన విద్యుక్తధర్మాన్ని) ఆచరించడం, కర్మలో నిరాటంకమైన సామర్థ్యసిద్ధికోసం ఉపాసనను ఆశ్రయించడం, తద్వారా దేవతానుగ్రహాన్ని సంపాదించడం చేయాలి. ఉపాసనాఫలం, దైవం గురించి తెలుసుకోవడానికి యోగాది జ్ఞానసాధనాలను ఆశ్రయించాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List