సజ్జన సాంగత్యం సన్మార్గానికి దీపం. ~ దైవదర్శనం

సజ్జన సాంగత్యం సన్మార్గానికి దీపం.

మహాత్ములు త్రికరణ శుద్ధి కలిగి ఉంటారు. అనగా మనోవాక్కాయ కర్మలలో ఒకే రీతిగా నడుచుకుంటారు. ఇక దురాత్ముల మనసొకటి, మాటొకటి, చేత ఇంకొక దారి. మనసు, నోరు, మాటలు, చేతలు సామరస్యం పొందకుంటే సాధింపదగినది సైతం ప్రాప్తించదు. ‘‘సజ్జనుడితో సజ్జనుడు కలిస్తే చల్లని ప్రసంగాలు సాగుతాయి. గాడిదతో గాడిద కలిస్తే కాలి తన్నులు ఆరంభమవుతాయి’’ అంటాడు కబీర్‌దాస్‌.

 *🌹‘జగన్మృగతృష్ణాతుల్యం, వీక్ష్యదం క్షణభంగురం*
*సుజనైః సంగతి కుర్యాత్‌,*
*ధర్మాయచ సుఖాయచ*

..అని నీతిసారంలో చెబుతోంది. ‘‘ఈ లోకము మృగతృష్ణ వంటిది. క్షణభంగురమైన దీనినిగాంచి భ్రమచెందక, ధర్మము కొరకు, సుఖము కొరకు సజ్జనులతో సహవాసము చేయాలి’’ అని దీని అర్థం. సజ్జన సాంగత్యం సన్మార్గానికి దీపం. అది జ్ఞానభాస్కర తేజమై హృదయంలోని అజ్ఞానాంధకారాన్ని హరిస్తుంది. స్వచ్ఛం, శాంతిప్రదం అయిన సత్వగుణ సాంగత్యమనే గంగలో మునిగినవానికి దానాలు, తీర్థాలు, తపస్సులు, యాగాలతో పనిలేదు. సజ్జనసమాగమమే ఈ జగత్తులో సర్వోత్కృష్టమైన వస్తువు. అది బుద్ధిని వృద్ధి పొందిస్తుంది. అజ్ఞాన వృక్షాన్ని ఛేదిస్తుంది. సాధు సంగమం వల్ల మనోహరము ఉజ్వలం అయిన వివేకమనే పరమదీపం ప్రభవిస్తుంది. ‘పొద్దుటి నీడవలె దుర్జనమైత్రి ఆరంభమున పెద్దదై ఉండి క్రమంగాచిన్నదైపోతుంది. సజ్జన మైత్రి మొదటి చిన్నదిగాఉండి మధ్యాహ్నపు నీడలాగా క్రమముగా పెద్దదిగా పెరుగుతుంది’’ అని భర్తృహరి సుభాషితం చెబుతుంది.

‘‘సజ్జన, దుర్జనులు లోకంలో పక్కపక్కనే ఉన్నా, వారి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. కమలములు, జలగలూ ఒకే నీటిలో పుడతాయి. అమృతం, మధిరరెండూ సముద్రం నుండే కదా ఉద్భవించింది’’ అంటాడు తులసీదాస్‌. అందువల్ల, ప్రయత్నంతో సంసార వ్యాధిని నశింపజేసే సజ్జనసాంగత్యం దివ్యౌషధం అని గ్రహించాలి. చిల్లగింజలతో నీటిలోని కాలుష్యం, యోగంతో మతిలోని మాలిన్యం తొలగినట్లుగా సజ్జనసాంగత్యం వల్ల కలిగే వివేకంతో అవిద్య నశిస్తుంది. సత్పురుషులతోడి సాంగత్యం బహుదుర్లభం. అది గంగవలె పాపాలను పోగొడుతుంది. వెన్నెలవలె సమస్త జనుల మనసులకూ ఆనందం కలిగిస్తుంది. సూర్యుని ప్రభలవలె అజ్ఞాన అంధకారాన్ని నిర్మూలిస్తుంది. చల్లనిచెట్ల నీడవలె తాపాన్ని పోగొడుతుంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List