నదులు ఎక్కడెక్కడ పుట్టినా, అవన్నీ చివరకు సముద్రాన్ని చేరతాయి. ఒకసారి సముద్రంలో కలిసిన తర్వాత అది ఏ నది నుంచి వచ్చిన నీరో చెప్పలేం.
అలాగే అన్ని జీవులూ పరమాత్మ నుంచి పుట్టి, చివరకు ఆ పరమాత్మలో ఐక్యం అవుతాయి. ఆయన అందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నాడు. మనల్ని ‘జీవాత్మలు’ అంటారు. నీలోనూ ఆత్మ ఉంది. పరమాత్మే నీవు. అది సామవేద అంతర్గత చాందోగ్యోపనిషత్ సారమైన ‘తత్వమసి’. పవిత్రమైన ఇరుముడిని శిరస్సున పెట్టుకొని, పావన పదునెట్టాంపడి ఎక్కగానే మనకి భగవంతుడి కన్నా ముందే దర్శనమిచ్చే మహావాక్యం ‘తత్వమసి’. అంటే భక్తితో అయ్యప్పకు నమస్కరించే ముందే, నమస్కారానికి మూలమైన ‘తత్వమసి’ మహావాక్యం మనకు దర్శనమిస్తుంది. అంటే నమస్కరించే ముందు ఎందుకు, ఎవరికి నమస్కరిస్తున్నామో తెలుసుకొని నమస్కరించమని తెలియజేస్తుంది.
‘తత్వమసి’ అనేది సంస్కృత పదం. తత్+త్వం+అసి అను మూడు పదముల కలయికే ‘తత్వమసి’, అంటే తత్=అది, త్వం=నీవై, అసి=ఉన్నావు. ‘అది నీవై ఉన్నావు’ అనునది తత్వమసి వాచకానికి అర్థము.
ఇన్నాళ్లూ మాలధరించి, దీక్షబూని, కొండలు, కోనలు దాటి పావన మూడార్ల మెట్లుదాటి, ఏ పరబ్రహ్మ తత్వమును చూడదలిచి వచ్చావో ‘అది నీవై ఉన్నావు’ ‘నీలో పరమాత్మ అంతర్యామియై ఉన్నాడు’ అని తెలియజేస్తుంది.
అందరికీ అంతర్ముఖంగా పరమాత్మ సాక్షాత్కారం కలిగించే ప్రక్రియయే నీవు. మండల కాల బ్రహ్మచర్య దీక్ష అనే ఆత్మ ప్రబోధను కలిగించి, అందరిలోనూ స్వామి అయ్యప్పను దర్శించేలా మానవాళిని తీసుకెళ్లే సత్ ప్రబోధమే ‘తత్వమసి’. అందుకే పావన పదునెట్టాంపడిపైనున్న సన్నిధానం పైభాగమున అందరికీ కనపడేలా దాన్ని లిఖించారు.
అంచెలంచెలుగా, మెట్టుమెట్టుగా ఒక్కొక్క సంవత్సరం కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాల వంటి పద్దెనిమిది అజ్ఞాన స్థితులను ఛేదించుకుంటూ వెళ్తే.. కొన్నాళ్లకు ‘తత్వమసి’ పరమార్థం ప్రతి వారికీ సాక్షాత్కరిస్తుంది...🙏

.jpg)






No comments:
Post a Comment